Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 32

 

    పాశుపతమ్ము నిచ్చుచు సపారకృపా పరిపూర్ణ మానసుం
    దా శశి శేఖరుండు "విజయా! విజయోస్తు! సమస్తవిద్విష
    న్నాశన మాచరింపు "మని నాఁడని నాఁడు గదా! వృధావ్యధా
    వేశపరుండవై తుడిచివేయుడు వెట్లు మహేశ్వరాజ్జలన్?

    కట్టిడి వైరిరాచతలకాయలు గొట్టక, గాండీవమ్ముతో
    పిట్టలు గొట్టుకొండువె! అభేధ్యకిరీటము రాజు నొద్ద తా
    కట్టిడి పొట్టనింపుకొనఁగా తల పెట్టితో! రాజయోగివై
    చెట్టుల పుట్టలం జపము సేయుచు నీ బ్రతుకీడ్వనెంతువో!

    నెగ్గితివో స్వరాజ్యరమ నీ శిరముం గయిసేయు జాళువా
    నిగ్గులుచిందు రత్నరమణీయకిరీటముతో; రణావనిన్
    మ్రగ్గితివో యశోరమ సురమ్య సుమంగళ పుష్పమాలతో
    సిగ్గులు చిందిపోవఁ గయిసేయును నీ యురమున్ పరంతపా!

    రాజ్యము వీరభోజ్యము; పరాక్రమశాలియే భారతీయ సా
    మ్రాజ్యము నేలఁజాలు; రణరంగమునందున సత్యవీర్య సా
    యుజ్యము గల్గె; కల్గ దిక ఓటమి; నల్పు మఖండయాజ్జమున్!
    పూజ్యము క్షాత్రమున్ విడువఁబోకుము; పోకుము పాఱుబోతువై!

    పాంచాలీ పరిషత్పరాభవ మహాపాపౌఘమేఘమ్ము గ
    ర్జించెన్ నీ ప్రతిపక్ష శీర్షములపై; శీఘ్రమ్ము లే లెమ్ము! నీ
    చంచద్గాండివ నిర్విముక్త విశిఖాసారమ్ముతో పాటు వ
    ర్షించుంగావుత రక్తవర్షము ప్రహర్షీభూతమ్ముగన్!

    "శ్రీమద్బారతభాగ్యరేఖ, "విజయశ్రీ" విశ్వవీరుండు, వీఁ
    డా మావాఁ"డని హర్షవిస్పురిత సర్వాంగీణగర్వోల్లసత్
    ప్రేమావేశుఁడు పాండురాజు దివిషద్ బృందాలతో శ్లిష్ట సం
    గ్రామున్ నిన్ గనులార జూచుకొనుఁగాకన్ నాకలోకస్తుఁడై.

    "చంచచ్చండగదభిఘాతముల యుష్మద్దువక్షస్థలుల్
    సంచూర్ణించి, కదుష్టరక్తలహరీ సంసిక్తహస్తుండనై
    పాంచాలీ పరికీర్ణ కేశభరమున్ బంధింతురా!" యంచు గ
    ర్ణించెన్ భీముఁడు దుస్ససేనుఁ గని; యా సింహంబు నిద్రాణమే!

    గాంధేభమ్ములపై మృగేంద్రమువలెన్ గర్జించుచున్ , కౌరవ
    స్కంధావారము మీఁద వాయుజుఁడు దూకంబోవుచుండెన్ భుజ
    స్కంధమ్మందు గదాయుధమ్మిడి; ప్రతిజ్ఞాధర్మబంధాలలో
    బంధీంపంబడే నింతకాల; మిపు డాపంజాల రెవ్వారలున్!

    వాడిమి పెంపు రాచ మగవారికి సొంపులు నింపు నగ్గికిన్
    వేడిమివోలె; పౌరుషము వీడుట జాలిగ మాటలాడుటల్
    పోడిమి గూర్చునయ్య నినుబోటికి? మంచి ధనంజయుండవే!
    బూడిద మాడ్కి తన్నుకొని పోదురు దుర్బలులన్ బలాధికుల్!

    అగుటలేదు గుఱ్ఱములు, - హస్తములన్ బిగబట్టి పగ్గముల్
    లాగుడు నెంతదాక! రణలగ్నము డాయుచునుండే; దుందుభుల్
    మ్రోగుకముందే లెమ్ము! గుణముల బిగియించి స్వరాజ్యలక్ష్మికిన్
    స్వాగతమిమ్ము! గాండివశరాసన! చంద్రకులైకభూషణా!
    
    జన్యము సేయ వస్త్రములు శస్త్రములుం గొని, దేశదేశ రా
    జన్యులు వచ్చియుండిరి నిజధ్వజరాజివిరాజమానులై;
    దైన్యము నంది నీవిటు స్వధర్మము దక్కిన, ధారరాష్ట్ర దౌ
    ర్జన్య దవాగ్ను లా నిరపరాధుల నిల్వున గాల్చివేయవో!
    
    పరధనముల్ హరించి, పరభామినులన్ జేరపట్టి , ధర్మ త
    త్పరు లగు వారి బానిసలభంగి నొనర్చేడి దుండగీంద్రపై
    కరుణవహించి జాలిపడఁగాఁదగునయ్య! నిరంకుశత్వ మ
    ర్మర మనుజాధిపాధములు మానవజాతికి ఘోరశత్రువుల్!

    నేనుంటిన్ రధమున్ గదల్చుటకు; సంధింతున్ సమస్తమ్ము నే
    నే; నీ వుండు నిమిత్తమాత్రముగ; సందేహమ్ము పోనాడి నా
    పై నర్పింపుము భారమంతయును; గెల్వంబో దధర్మంబు; మం
    దేనోయీ విజయమ్ము ముద్దులమరందీ! నమ్ము ముమ్మాటికిన్!

    కర్తన్ నేను సమస్త భూతములకున్, కొంతేయ! సర్వమ్ములో
    వర్తింతున్; అవతార ధర్మమును నిర్వర్తింతు; భూభారమున్
    దీర్తున్; నీవు నిమిత్తమాత్ర మగు మంతె! క్లైబ్య మింకేం? నీ
    కర్తవ్యమ్మును గుర్తెరింగి విజయా! గైకొమ్ము గాండీవమున్!

    శుద్దాంతమ్మును రచ్చకీడ్చిన నికృష్టుల్ నష్టమైపోవుటే
    సిద్దాంతమ్ము , ధనుంజయా! విజయలక్ష్మీ శాంతి సంక్రాంతమై
    యుద్దాంతమ్మున వీరభారతము విశ్వోత్మృష్టమౌ - చాలు నీ
    రాద్దాంతమ్ములు - కార్యసిద్దికయి లేరా! నారి సారింపరా!

    గాండీవమ్ము ధరించి వైరిబలమున్ ఖండించి, యుష్మద్భుజా
    పాండిత్యమ్మును జూప కీ క్రియ భయభ్రాంతుండవై క్రుంగి కూ
    ర్చుండన్ , పాశువతమ్ము మైలపడిపోదో; పాండుభూభృధ్యశో
    డిండీరమ్ముల పాండిమమ్మున కిరీటీ! లోటు వాటిల్లదో!

    వనవాసమ్ములు తీరిపోయే; చనె దుర్వారమ్ము లజ్ఞాత వా
    న నిరాశామయ వానరమ్ము; లిఁక యుష్మద్దేవదత్తస్వతం
    త్ర నినాదమ్ముల వేళయయ్యె; చిరనిద్రా మూడ గాడాంధ యా
    మిను లల్లల్లన తెల్లవారెను; నమున్మీలించే ప్రాగ్బాగ్యముల్!

    ఉత్తర దిక్కునన్ కురుచమూత్కరముం గని గుండెబ్రద్దలై
    తత్తరపాటుతో దిగి రధమ్ము; పధమ్మున పర్వులేత్తు న
    య్యుత్తరు నొత్తిపట్టి, దిగు లూడిచి, ధైర్యము చెప్పి, తేరిపై
    కెత్తిన వీరహస్తము లటే; దిగజార్చెను గాండీవ మ్మిటుల్!

    "యంత ' 'నియంత" యై; విజయ నంతటి వానికి క్షాత్రధర్మసి
    ద్దాంత ముపన్యసించు టుచితంబును ధర్మము కాదు గాని, కొం
    డంత ధనుర్దరుండు సమయంబున చల్లంగ జాఱిపోయి ది
    గ్భ్రాంతి వహించు టెంతయు నపక్రమ మౌట నుపక్రమించితిన్!

    తమ్ముల పొంగుతో నెదిరి తమ్ము నెఱుంగఁడు రాజు; కర్ణు మీ
    సమ్ములు, దుస్ససేనుని భుజమ్ములు, మామ కనుంబొమల్, మదిన్
    నమ్మి రణమ్ము నెత్తి కొనినాఁడు - మెడల్ పడి క్రుంగి శృంగ భం
    గమ్మగు, ఱేనికిన్ దురధికార మదాంధత గెల్పు నిల్పునే!

    ఈ గర్వాంధుల రూపుమాపుటకై గానీ! జీతమా బత్తేమా
    నీ గుఱ్ఱమ్ములు దోలునంత పనికిన్ నేనెల? మాయింటిలో
    నే గుఱ్ఱాలను దోలలేనో! నిజమింతే ధర్మరక్షార్ధమై
    యోగ మ్మూనీతి; పార్ధ సారధి మహోద్యోగమ్ము సాగించితిన్! 

 Previous Page Next Page