Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -6 పేజి 32


    అతడు హీనస్వరంతోనూ అతి నమ్రంగానూ 'కమ్మరిపని' అని జవాబుచెప్పాడు.
    కాలూ క్షణం ఆగి "అయితే నీవు కమ్మరివి అని అర్ధం" అన్నాడు.
    "అవును వట్టి కమ్మరిని. చదువూ సంధ్యారాని కమ్మరిని. మాది తూర్పుబెంగాల్. మధుమతీ నది మా ఊరి పక్కనుంచే ప్రవహిస్తుంది" అని తిరిగి నిరాశాస్వరంతో "వట్టి కమ్మరిని" అన్నాడు.
    "ఎందుకంత హీనంగా చూసుకుమ్తావ్. నిప్పులో కాల్చి ఇనుమును వంచడం పెద్దపెద్దవాళ్ళు చేసేపనికంటే తక్కువ అయిందని ఎందుకనుకోవాలి. నీ చేతిలో పనితనం ఉన్నందుకూ, విశేషజ్ఞానం ఉన్నందుకూ తలెత్తుకొని తిరగాలి" అతని ధ్వనిలో కమ్మరి గర్వం ఉట్టిపడుతూ ఉండగా "కమ్మరి కంటే మంచివాడు లేడు. నేను చెప్పేది నిజం. వాస్తవం అంటే నమ్ము" అన్నాడు.
    ముసలివాడు వింతగా చూచాడు. కాలూ నవ్వాడు.
    "నీకు తిండికావాల్సి ఉండగా నేను మాటల్తో పొట్టనింపుతున్నా గుళ్ళో ఉంటావా? నీకు అలవాటైన పనికాకున్నా ఏదో ఒకపని చూపిస్తా. గుడిచుట్టూ బోలెడు స్థలం ఉంది. కూరగాయలు పండించవచ్చు. పచ్చని గడ్డి మొలిపించవచ్చు." ఆ ఆలోచన అతనికి ఆహ్లాదం కలిగించింది. అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి. "కూరగాయలు. పచ్చిక. బలిష్టమైన చేతులు నేలను పెల్లగిస్తాయి. పచ్చికను కత్తిరిస్తాయి"
    వృద్దుడైన ఆగంతకుని మీదిభారం దిగిపోయినట్లుగా కళ్ళల్లోంచి నీళ్ళువచ్చాయి. గుండె సంతోషంతో నిండటాన నోటమాట పెకల్లేదు.
    కాలూ తనకూతుర్ను అతనికి పరిచయంచేసి లేఖ వైపు తిరిగి "చంద్రలేఖా! ఇతడు నీకు దైవమిచ్చిన మామ. తూర్పు బెంగాల్ కమ్మరి. మధుమతి వారి ఊరి ప్రక్కనుంచే ప్రవహిస్తుంది. ఆయన పాదాలంటి నమస్కరించు." అన్నాడు.
    లేఖకు తండ్రిమీద గౌరవం పెరిగింది. అతన్ని గౌరవదృష్టితో చూచి ముసలివాని కాళ్ళు పట్టుకుంది.
    వృద్ధుడు కాళ్ళు వెనక్కు లాక్కున్నాడు.
    "వద్దు. వద్దుతల్లీ వద్దు. బ్రాహ్మణ బిడ్డవు. నేను చూస్తున్నదంతా అసలు నిజమేనా? కలకాదుకదా?"
    "చిన్నలు పెద్దలముందు మోకరించాలి" అన్నాడు కాలూ.
    "రా మామా రా. మా ఇల్లు ఈ రోడ్డుపక్కనే ఉంది" అని అతని చేతులు పట్టుకొని తీసికెళ్ళింది.
    వృద్ధుడు భోజనానికి కూర్చున్నాడు. ఇత్తడి పళ్ళెంలో పళ్ళవైపూ చిలకగిన్నెలో ఉన్న పాలవైపు చేతులు సాగిస్తూ ఉండగా కాలూ అతనిమీదప్రశ్నలవర్షం కురిపించాడు.
    "మీ ఊళ్ళో బొగ్గులు ఏంధరకు దొరుకుతాయి? నీకు సంవత్సరం పాటు మొక్కపోకుండా ఉండే గుఱ్ఱపునాడెలు చేయొచ్చా? నీవు టంకం ఏ పాళ్ళలో పెడ్తావు? అంతా ఆ పాళ్ళమీదనే ఆధారపడి ఉంటుంది."
    ఇత్తడిగిన్నెతో పాలుతాగుతూ ఉంటే ముసలివాని తెల్లని మీసాలకొనలు పాలలో మునిగాయి. వాటిని చప్పరిస్తూ "మీకు మా పనిని గురించి ఇంతగా తెలియడం ఆశ్చర్యం! నా పనిలో చాకచక్యం చూపనా?" అన్నాడు, అప్పటి తనస్థితినీ, తనమాటవింటున్నవారి హోదానూ మరిచి.
    కాలూ కండ్లు చిన్నవిచేసుకొని అతనివైపు చూశాడు. ఆ చూపులో 'నా చేతిలో ఉన్నపని చూపడమంటే నాకూ ఇష్టమే' అని చెప్పాలనే ఆసక్తి ఉన్నట్లు లేఖ కనిపెట్టేసింది.
    ఆ ముసలివాడు - అతనిపేరు విశ్వనాథ్- శివాలయంలో తోటమాలి అయిపోయాడు. కాలూకు అతని విషయంలో ఆనాడు కలిగిన గౌరవం మాయం అయింది. "కాస్త మాలీనుంచి దూరంగా ఉండు. వాడిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి" అన్నాడు తండ్రి లేఖతో.
    'నన్ను ఆయన పాదాలాంటి మొక్కమన్నావు. అతన్ని మామా అని పిలువమన్నావు. ఇంతలోనే నేను ఇంత చంచలబుద్ధిని ఎలా అయ్యేది' అన్న లేఖ జవాబు తండ్రిని కాటువేసింది.
    అతడు బెదిరి దూరంగా చూశాడు.
    "మనం శిఖరాగ్రాన నిల్చి ఉన్నాం. కాలుజారి క్రిందపడ్తే నవ్వాలని వేలకండ్లు వేచి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అధములతో కలిసి ఉండకూడదు. తెలిసిందా?"
    "తెలిసింది."
    మళ్ళీ ఆమె అనుమానం మొదలైంది. తండ్రిలో బ్రాహ్మణత్వం పాతుకొని పోవడంలేదుకదా? విశ్వనాధునినుంచి దూరంగా ఉంటే మాత్రం పెద్దవారు తమమీద దయ తలుస్తారా? ఒక్కొక్కసారి విశ్వనాథుడు నమస్కరించినా కాలూ ఖాతరు చేసే వాడుకాదు. ఈ కరకుదనం వల్ల అతనికి గౌరవం పెరుగుతున్నదా? తను రోజూ అనేకమంది బ్రహ్మణులను చూస్తుంది. వారిలో చాలామంది మెత్తనివారే. దయగలవారు కూడా.
    అయితే చెల్లనిరూపాయికి మెరుపు ఎక్కువగా ఉండాలి కావాఁలు.
    
                                       12
    
    జనపవ్యాపారంలో అనేకమంది ప్రముఖులు ఉన్నారు. అది కాలూ ప్రశ్నకు లభించిన సమాధానం. వ్యాపారులు, మధ్యదళారులు అనేకమంది జనుంపొలంనుంచి ఫ్యాక్టరీకి వచ్చేదాకా అనేకసార్లు కొనడం అమ్మడం చేస్తారు. గంగానదీతీరాన ఉన్న డజన్లకొద్ది ఫ్యాక్టరీలు నారను గోనెసంచులుగా మారుస్తాయి. స్టీమర్లవాళ్ళు వాటిని విదేశాలకు పంపుతారు. ఈ మహావ్యాపారంలో వేలకొద్దిటన్నులు ముందుకుముందే కొని ముందుకుముందే అమ్మేసట్టా వ్యాపారులు ఉంటారు.
    జనవ్యాపారం ఇన్నిశాఖోప శాఖలు కలిగివుంది. మరి ఇన్నింటిలోనూ ఆ రాత్రి రూపాకు వచ్చిన ప్రముఖ జనప వ్యాపారి ఎవరు? ఎవరైనా కావచ్చు. అంతమందిలోనూ లేఖ ఏ యువతి అయినా కావచ్చు.
    జోగీష్ మిత్రా ఎవరైనా అతనికి అట్టేభేదంలేదు.  కాలూ పోరాడుతున్నది వ్యక్తులతో కాదు, వారికి అవకాశం కలిగించిన విధానంతో. ఆ విధానంలో పెరిగినవారినందరినీ అధోగతి పాల్జేయడమే అతని ధ్యేయం. ఆ మహానగరంలో ఒక్క బూటకపు శివునిగుడి ఏంచాలుతుంది? ఇంకా అనేకం కొత్తవి ఏర్పడాలి. వాటిఛాయలో పాతవి అడుగంటాలి.
    పూజాపురస్కారాల ఆడంబరం మీదనే దేవాలయశోభ ఆధారపడి ఉంటుంది. ఆ మహానగర సమాజంలో అతనికి కొన్నిరుధ్యాలు గోచరించాయి. ఒకవైపు కరువువల్ల ఆకలికి అలమటించి జనం మలమలమాది చస్తున్నారు. ఇంకొకవైపు జనపుమృత కళేబరాల్లోంచి సంపదలు దొర్లుతున్నాయి. ఒకవైపు మానవునిలోని దయాదాక్షిణ్యాలు క్షీణిస్తూ ఉంటే ఇంకొకవైపు జనం మతంమీద బెల్లంమీద ఈగల్లా వాలుతున్నారు. ఇదీ సమాజపు బాహ్యస్వరూపం. మంత్రాల ఆడంబరంగల ఈ మతంలోపల ఉన్నది ఒట్టిగుల్ల మాత్రమే.
    తనదేవాలయంలో మంత్రాలుచదవడానికిగ్గాను అయిదుగురు బ్రాహ్మలను అద్దెకు తెచ్చాడు. వారు శివసంహిత చదువుతూంటే దేవాలయం మారుమ్రోగుతూ ఉంది. గర్భగుడి సంతతం సాంబ్రాణి పొగలతో నిండి ఉంటూ ఉంది. ఉదయమూ, రాత్రీ మ్రోగేగుడిగంటలు అరమైలుదూరంలో వున్నఆకలీపురపు రోడ్డుమీద కార్లలో ప్రయాణం చేసేవారికి సహితం వినవస్తున్నాయి.
    ప్రత్యక్షంగా పూజించడానికి సమయం దొరకని సంపన్నులు పూజాద్రవ్యాలు సమర్పించి పుణ్యం ఆర్జించుకుంటున్నారు. ఒక బంగారు వర్తకుడు దేవాలయంలో ఉన్న ఇత్తడి అయిదు కళికల హారతిచూచి బంగారు హారతి చేయించి ఇచ్చాడు. అతడే కర్రపిడి ఉన్న చామరానికి వెండిపిడి వేయించాడు. ఒక మహారాజా స్వామి పవళింపునకుగాను చక్కని చందనపుచెక్క మంచం చేయించి ఇచ్చాడు. ధర్మకర్తలకు మిత్రులైన కొందరు ధాన్యవర్తకులు కొన్నినెలలు ముందుగానే భోగాలకు సామాగ్రి ఇస్తున్నారు. దేవునికిసహితం మనిషి తీర్చగల మానవావసరాలే కల్పించబడ్డాయి!
    కొన్ని ప్రధానమైన పర్వదినాల్లో యజ్ఞాలు చేయబడ్తాయి. యజ్ఞకుండాలచుట్టూ కూర్చున్న బ్రాహ్మలు సమంత్రకంగా కుండాల్లో నెయ్యి పోస్తూ వుంటారు. నివేదించుకోవడానికి ఇచ్చగలవారంతా గిన్నెడు గిన్నెడు నెయ్యి ఇస్తే అందరికీ పుణ్యం సంక్రమిస్తుందని చెప్పి దాతల పేర్లూ తేదీలూ వున్న పట్టిక తయారుచేశాడు కాలూ. ఆ పట్టిక అంతా నగరంలోని ప్రముఖుల పేర్లతో నిండిపోయింది. వర్తక ప్రముఖులే కాక, డాక్టర్లు, లాయర్లు, ఇతర వృత్తుల్లోని ప్రముఖుల పేర్లుకూడా ఆ పట్టికలో ఉన్నాయి.
    శివునికి పాల అభిషేకాన్ని గురించికూడా కాలూ దగ్గర ఒక పట్టిక ఉంది. చాల సంవత్సరాలక్రితం కాలూ ఒకసారి కాశీ వెళ్ళాడు. ఆ దేవాలయంలో రాత్రిపూట పాల అభిషేకం జరుగుతూ ఉండగా చూశాడు. అయిదుగురు వ్యక్తులు గదలూ, ఇతర లాంఛనాలూ పట్టుకొని ముందు నడుస్తూ ఉండగా 'శివశివా' అని ముక్త కంఠంతో కేకలువేస్తూ దాత ఇంటినుంచి పాలు తేబడ్తాయి. ఆ ధ్వని విని దారిననడిచేవారు వారికి దారి ఇస్తూ ఉంటారు. పుణ్యకాములకు ఈ విధానం బాగనిపించింది. కాబట్టి ఆ జాబితాకూడా దాతల పేర్లతో నిండిపోయింది. మిలిటరీకి పాలు అవసరం అయినందుకు పాలఖరీదు బాగా పెరగడమేకాక అవి దొరకడమే కష్టం అయింది. అయినా కాలూకు వచ్చిన బాధేమీలేదు. దాతలు ధనాన్నీ పలుకుబడినీ వినియోగించి పాలు సంపాదిస్తూ ఉంటారు.

 Previous Page Next Page