"ఈ అమ్మాయి ముక్కులో ఉంది అందం..." మనసులో అనుకున్నాడు శక్తి.
"ఛైర్మెన్ గారి ఛేంబర్లో ఏం చేస్తుంటారు మీరు..." ఆ ప్రశ్న మళ్ళీ వేస్తుందనుకోలేదు శక్తి.
ఒక్కక్షణం, తటపటాయించాడు. ఎటో చూస్తున్నట్లుగా, ఆ మాట వినిపించనట్లుగా, సీలింగ్ ఫాన్ వేపు చూసాడు.
"మిమ్మల్నే- ఏం చేస్తుంటారు-" మరలా అడిగింది మహిత.
భగవాన్ ఆల్ రడీ ఒక పక్క తయారై చంపేస్తుంటే, ఆ రెండో పక్క ఆ భగవాన్ గాడి కజిన్ లా ఈవిడ తయారయింది. ఛైర్మెన్ ఛాంబర్లో ఏం చేస్తే వీళ్ళందరీ కెందుకంట ఇప్పుడు, అర్జంటుగా ఆ రహస్యం తెలుసుకోవాలా?
"ఛైర్మెన్ గారి ఛాంబర్లో గోడకి, గంటకి అరడజన్లు సార్లు నెత్తి బాదుకోవడం నా పనన్న మాట." కసిగా మనసులో అనుకుని- ఇక లాభం లేదు. తన నిజరూపం చెప్పడానికి సమయాసన్నమైందని నిర్ణయించుకుని.
"మీ ఛైర్మెన్ వెంకటనారాయణ మా మేనమామ- ఇన్ని కంపెనీలు ఇంత ఎస్టేటు చూసుకోవడం కష్టంగా ఉందంటే, హెల్ప్ చెయ్యడాని కొచ్చాను" అని ఠీవిగా చెప్పి, రియాక్షన్ కోసం ఆవిడ ముఖంలోకి చూసాడు.
తను చెప్పిన రహస్యం వినగానే మహిత ఢామ్మని, పడిపోతుందని అనుకున్నాడు శక్తి. ఆమె ఒక్కసారి బిత్తరపోయింది. తానేం విన్నదో తనకే అర్థంకాక అయోమయంగా శక్తివేపు చూసింది.
"అందుకేనా- మీరంటే, అ భగవాన్- అంత భక్తి చూపిస్తున్నాడు" అందామె పెద్దగా నవ్వేస్తూ.
"ఏం- మీరు నమ్మడం లేదా-" అనుమానంగా అడిగాడు శక్తి.
"ఎందుకు నమ్మను, నమ్ముతాను. మా ఛైర్మెన్ పర్సనల్ పాలసీ ప్రకారం, ఛైర్మెన్ ఫామిలీ మెంబర్స్ గానీ, రెలెటివ్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ ఎవరు ఈ ఆఫీసులో పనిచెయ్యడం అయన కిష్టం లేదట. అంతెందుకు ఛైర్మెన్ గారి ఫ్రెండ్ కూతుర్ని నన్ను జాబ్ లోకి తీసుకోడానికీ ఆయనకు మూణ్ణెళ్ళు పట్టింది. ఆఖరికీ మా డాడీ ప్రెజర్ తట్టుకోలేక ఫ్రెండ్ షిప్ ను వదులుకోక నాకు జాబ్ ఇచ్చాడాయన వెరీ డిసిప్లిన్ పర్సన్ లేకపోతే ఇంత ఎంపైర్ ని ఎలా డెవలప్ చేస్తాడాయన" ఎడ్మైరింగ్ గా అంది మహిత.
ఆ మాటతో ఒకింత ఉలిక్కిపడ్డాడు శక్తి.
అంటే తన డిసిప్లయిన్ డ్ మేనమామ తనకు అస్సలు జాబ్ ఇవ్వడా? ఇదో కొత్త బాంబా? అలా అయితే అమ్మ ఎందుకు పంపిస్తుంది?
ఎందుకివ్వడు? ఇవ్వకపోతే అమ్మకు ఎక్స్ ప్రెస్ టెలిగ్రామ్ కొట్టి తీసుకొచ్చి గట్టిగా రికమండేషన్ చేయించడూ?
"ఏంటాలోచిస్తున్నారు?" అలా అడుగుతున్న మహిత చెంపలవేపు చూసాడు శక్తి.
ఆ చెక్కిళ్ళు సంపెగపు రేకుల్లా వున్నాయి.
"ఈ అమ్మాయికి అందం చెక్కిళ్ళల్లో వుంది..." మనసులోనే మళ్ళీ అనుకున్నాడు.
"ఏం లేదండీ. నాదో డౌటు- ఇంత డిసిప్లయిన్ డ్ పర్సన్ కదా, మీ ఛైర్మెన్... తన స్వంత కూతురికి ఎందుకీ ఆఫీసులో జాబ్ ఇచ్చారు. ఆ అమ్మాయి నీకు తెల్సే వుంటుంది కదా? చెప్పండి" అడిగాడు శక్తి తనలో రేగుతున్న ఆతృతని అణుచుకుంటూ.
"ఛైర్మెన్ గారి స్వంత కూతురు ఈ ఆఫీసులో పని చేస్తోందా... ఈజిట్ ట్రూ?!" ఆశ్చర్యపోతూ అన్నది మహిత.
"మీకు తెలీదా?" అంతకంటే ఆశ్చర్యపోతూ అడిగాడు శక్తి.
"ఛైర్మెన్ గారికో కూతురుందన్న విషయం తెల్సు. ఆవిడ అమెరికాలో కదా వుండేది. ఈ కంపెనీలో ఆవిడెందుకు జాబ్ చేస్తుంది- అంత అవసరం ఏంటి? ఆమెదేగా?!"
"భలేగుంది మీరెన్నాళ్ళుగా చేస్తున్నారిక్కడ. మీకంటే నేనే నయంలా ఉన్నాను... ఇంపార్టెంట్ సెక్షన్ లో పని చేస్తున్నారు కాబట్టి, అందులోనూ లేడీస్ కాబట్టి తెలుస్తుందనుకున్నాను... జనరల్ నాలెడ్జిలో మీరు పూరన్న మాట" చనువుగా అన్నాడు శక్తి.
"హై పొజీషన్ లో వున్న లేడీ ఆఫీసర్స్ నాకు తెలుసు. నాకు తెలిసి, ఛైర్మెన్ డాటర్ ఇక్కడ పని చెయ్యడం లేదు. ఎంత దాచాలన్నా ఛైర్మెన్ కూతురు కదా ఆ సీక్రెట్ ఎలా దాస్తారండీ బాబూ" అని కొద్ది క్షణాలాగి-
"ఛైర్మెన్ గారు మీ మేనమావంటున్నారు, మీ మేనమామ కూతురు గురించి మీకు తెలీదా..." ఖాళీ బాటిల్ ను పక్కన పెడుతూ అంది మహిత.
చచ్చింది గొర్రె మనసులోనే అనుకున్నాడు శక్తి. తన ప్లాష్ బాక్ ఈవిడికి కూడా చెప్పాలి గావాల. భగవాన్ గాడితో చెప్పిందే, ఈవిడతో చెప్పేస్తే పోలే. ఒకసారి అబద్ధం చెప్తే వరుసగా అదే అబద్ధాన్ని చెప్పమన్నారు పెద్దలు.
"మా మేనమామ కూతురు నాకెందుకు తెలీదు. జ్ఞాపకం లేదంతే. చిన్నప్పుడు... జ్ఞాపకం ఉంచుకుందామన్నా, ఉంచుకోలేని వయసులో అన్నప్పుడన్న మాట. చూడండి... దేవదాసు సినిమాలో చిన్న పార్వతి, చిన్న దేవదాసులాగన్న మాట- నేను స్కూల్లెగ్గొట్టి, ఊరు చివర తోటలోకి వెళ్ళిపోయే వాడిని. అది రెండు పిలకలు వేసుకుని ఉండేది. అదంటే మా మేనమామ కూతురన్న మాట. దాన్ని బేబీ అని పిల్చేవాడ్ని అప్పుడు. నాకోసం జంతికలు, చెగోడీలు, బర్ఫీలు పట్టుకొని వచ్చేది బావా బావా అనుకుంటూ. సన్నగా ఉండేది. నేను బాగా అల్లరి చేసేవాడ్ని. నా చేతిలో అదెన్ని దెబ్బలు తినేదో పాపం. మా బేబీ ఇప్పుడు నన్ను చూడగానే ఎగిరి గంతెయ్యడం... అసలు మా బేబీ..." శక్తి మాటలకు అడ్డొచ్చింది మహిత.
"బేబీకి పేరేం లేదా?" అడిగింది.
"ఎందుకు లేదూ... చెప్పాను కదా! ముద్దు పేరని, దాని పేరు చాలా పెద్ద పేరండీ. అన్ని దేవతల పేర్లూ కలిపి పెట్టాడు మా మేనమామ. ప్రస్తుతం- ఏ పేరుతో ఉందో తెలీదు. అదేగదా- అసలు చిక్కు-"
"ఆవిడ అమెరికాలోనో, ఎక్కడో ఎమ్.బి.ఏ. చదివారని విన్నాను-"
"మీక్కూడా ఈ ఇన్ ఫర్ మేషన్ తెల్సన్న మాట. మేనల్లుడినయి ఉండి నాకా ఇన్ ఫర్ మేషన్ లన్నీ ఎందుకు తెలీదని మీకు డౌటు రావచ్చు. తెలుగు సినిమాల్లో మాదిరిగా చాలా ఏళ్ళతర్వాత, మా అమ్మ ఓ లెటరిచ్చి మా మామ దగ్గరికి పంపిందండి. అందుచేత నాకీ విషయాలు తెలీవన్న మాట..." కొంతలో కొంత నిజం చెప్పాడు శక్తి.
చేతిని బుగ్గ కానించుకుని వింటోంది మహిత.
ఆ యాంగిల్ నచ్చింది శక్తిధర్ కి.
ఆ అమ్మాయి అందమంతా, ఇలాంటి యాంగిల్ లోనే ఉందన్న మాట మరోసారి అనుకున్నాడు శక్తి.
"ఇంతకీ ఛైర్మెన్ గారినైనా కలిసారా మీరు?" ఆ ప్రశ్నకు పెద్ద పైనాఫిల్ పండు నోటికి అడ్డం పడినట్టయి ఉక్కిరిబిక్కిరయ్యాడు శక్తి.