Previous Page Next Page 
ఆనందం పరమానందం పేజి 32

గుమ్మంలో శారద నిలబడి వుంది.
శారదను చూడంగానే సత్యమూర్తి - ఓడిపోయిన మనిషల్లే తల దించుకున్నాడు.
శారద గంభీరంగా అన్నాది -
"జరిగిందంతా విన్నాను."
"ఎవరు చెప్పేరు?"
"మా నాన్న"
సత్యమూర్తి గుమ్మం నుంచి గదిలోకి చూస్తూ అంటున్నాడు-
"మన పెళ్లి చాలా అనర్ధాలకు దారి తీస్తుందేమోనని నా భయం!"
"మా రేవతి పెళ్లి, ఆ పెళ్లికి మనం తీసుకెళ్లే బహుమతులు -ఇవేగా అనర్ధాలు?"
"శారదా?"
"కష్టమైనా సుఖాల కంటే, ఇష్టమైన ఇబ్బందులు రుచిగా వుంటాయి అవునా?"
"శారదా!"
"సుఖం కేవలం డబ్బులోనే లేదండీ! నన్ను చూస్తున్నారుగా! కార్లుండి కూడా నేను కాలి నడకనే ఎంచుకున్నాను. ఇప్పుడు చెప్పండి? కారు సుఖమా, కాలి నడక సుఖమా?"
"శారదా! నేనెటూ చెప్పలేకపోతున్నాను. నీ ఓదార్చు నాకు కొండంత బలాన్నిస్తోంది! మీ  నాన్నని తలుచుకుంటే భయమేస్తోంది!"
శారద నవ్వింది. ఆ నవ్వు నిబ్బరంగా వుంది.
"మా నాన్న గొప్ప లౌక్యుడని నాకివాళే తెలిసింది. నా పెళ్లి  నా ఇష్టప్రకారమే చేస్తానని నాతో చెప్పి, నన్ను పెళ్లాడే మీకు విషాద గాథలు వినిపించి భయపెడుతున్నాడు."
"అంతే నంటావా?"
"ఇంక ఎక్కువగా ఆలోచించకండి! రేపు మళ్లీ మా ఇంటికి రండి! మా నాన్నకి దైర్యంగా సమాధానం చెప్పండి!"
గుప్పిట బిగించేడు సత్యమూర్తి!
                                          *        *        *
గోవిందం మేడ!
ఆ గదిలో గోవిందం, సత్యమూర్తి ఇద్దరే వున్నారు. అంతవరకూ ఆవేశంగా మాటాడిన సత్యమూర్తి ఆలిసిపోయేడు.
గోవిందం గంభీరంగా అన్నాడు
"గంజి నీళ్లక్కూడా గతిలేని బతుకుని ఆనందంగా ఆహ్వానించగల మనోదైర్యం మీ ఇద్దరికీ వుంటే, నేను చెప్పేదేముంది? ఆల్రైట్, శారదని తీసుకెళ్లు!"
"అయిదు లక్షలా?"
"అవును. రూపాయిలు అయిదు లక్షల రూపాయలు."
"అంత డబ్బు నా దగ్గిర లేదు!"
"ఆర్నెల్లు  గడువు కూడా ఇస్తున్నాను. ప్రయత్నించు!"
"అంత డబ్బు...."
"ఆర్నెల్లలో."
"ఎట్లా తెచ్చేది?"
"అది కూడా నేనే చెప్పాలా? 'జయమ్ము నిశ్చయమ్మురా' అని  పాడుకుంటో రిక్షా  తొక్కు మూటలు మోయి. బూట్లు పాలిష్ చెయ్యి. అప్పు చెయ్యి లేదా తప్పు చెయ్యి!"
తప్పు చేయనా?"
శారదను సొంతం చేసుకోవాలనే తప్పుడు ఆలోచన నీకున్నప్పుడు -తప్పు చేసి లక్షలు సంపాయించడం తప్పుకాదు!"
"చేస్తా! తప్పు చేస్తా! చెప్పండి!"
"అయిదంటే అయిదు నిమిషాల్లో అయిదు లక్షలు సంపాయించే మార్గం  ఒక్కటే ఒక్కటుంది."
"ఏమిటది?"
"బేంకు దోపిడీ! బొమ్మలు చూస్తావా?"
"చూపించండి!" అన్నాడు సత్యమూర్తి దైర్యంగా.  
                                          *        *        *
టీ.వీ.లో బొమ్మలు నడుస్తున్నాయి. సత్యమూర్తి శ్రద్ధగా చూస్తున్నాడు.
అదొక బేంకు. రద్దీగా వుంది. సిబ్బంది యావన్మందీ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా  వున్నారు.
సత్యమూర్తి బందిపోటు దొంగల్లే ముక్కూ , మూథీ కనిపించకుండా నల్లగుడ్డ కట్టుకున్నాడు. కళ్లకి గాగుల్స్ పెట్టుకున్నాడు. ఒకచేతిలో రాలతో అతను బేంకులోకి ప్రవేశించేడు.
ట్రంకు పెట్టె కింద పెట్టి పిస్తోలు గాల్లో పేల్చేడు. ఆ శబ్దానికి అందరూ భయపడి అతని వేపు చూసేరు.
సత్యమూర్తి వికృతంగా నవ్వాలని ప్రయత్నించేడు. కుదరలేదు అంచేత కఠినంగా  అంటున్నాడు -
"అందరూ లేచి నించోండి!"
నించున్నారు.
"చేతులు నెత్తిపైన పెట్టుకోండి!"
పెట్టుకున్నారు.
"పిచ్చి పిచ్చి వేషాలు వేసేరో ప్రాణాలు దక్కవు. జాగ్రత్త!" అని అందరినీ హెచ్చరించి కేషియర్ని వెతుక్కుని అతని దగ్గరికి వెళ్ళి అన్నాడు.
"ఊఁ....అయిదు లక్షలు! ఎక్కువా వద్దు! తక్కువా వద్దు! అయిదు లక్షలు మాత్రమే చాలు! ఆ ట్రంకు పెట్టెలో పెట్టు!"
కేషియర్  వెర్రి చూపులు చూస్తున్నాడు.
"ఊఁ...టైం లేదు. చెప్పింది చెయ్యి! క్విక్!" అని చెబుతూనే అటూ ఇటూ కదుల్తూ అందర్నీ గమనిస్తున్నాడు సత్యమూర్తి ఆ ఖంగార్లో సత్యమూర్తి కాలికేదో తగలడం వల్ల బోర్లా పడ్డాడు!
అదే అదనుగా ఒక లావుపాటి గుమాస్తా కింద పడ్డ  సత్యమూర్తి మీద కూచుని పిస్తోలు లాక్కున్నాడు.
ఇప్పుడు టీ.వీ.లో కోర్టు హాలు కనిపిస్తోంది!
సత్యమూర్తి బోనులో నిలబడి వున్నాడు. విజిటర్స్  గాలరీలో శారద కన్నీళ్లతో కూచుని వుంది. ఆమె  పక్కన గోవిందం కులాసాగా కాళ్లూపుకుంటో కూచున్నాడు.
జడ్జిగారు జడ్జిమెంటు చదువుతున్నారు-
"సత్యమూర్తి అనబడే  ఈ ముద్దాయి, తన వ్యక్తిగత అవసరాలకు బేంకు దోపిడీకి ప్రయత్నించినట్లు ఆరోపించిన నేరాన్ని ముద్దాయి చేసిన  మొదటి నేరమే అయినా , దేశంలో చదువుకున్న  యువకులు ముద్దాయిని అనుకరించే ప్రమాదాన్ని గుర్తించి, యువకులందరికీ హెచ్చరికగా   యువకుడైనా ఈ ముద్దాయికి ఉరిశిక్ష విధించడమైనది!"
గాలరీలో కూచున్న శారద "నో!" అంటూ అరిచి స్పృహ తప్పిపడిపోయింది.
ఇప్పుడు సత్యమూర్తిని ఉరికంబం దగ్గరికి తీసుకెడుతున్నారు.
అక్కడికి చేరుకోగానే అతని మొహాన నల్లగుడ్డ తోడిగేరు. ఆ తర్వాత పక్కనున్న గేరు లాంటి పరికరాన్ని లాగేరు అంతే!
సత్యమూర్తి శరీరం గాల్లో వేలాడుతోంది.
                                           *        *        *
గోవిందం గారి గదిలో -
మొహాన్ని చేతుల్తో కప్పుకుని  సత్యమూర్తి కుళ్లి కుళ్లి ఏడుస్తున్నాడు. సత్యమూర్తితో గోవిందం అంటున్నాడు -
"ఉరిశిక్ష అతిశయోక్తి అనుకుంటే, కనీసం యావజీవ కారాగార వాస శిక్షయినా పడుతుంది. నీలాంటి అల్పజీవికి  రెంటిలో ఏ శిక్షపడిన ఒక్కటే! ఆలోచించు!"
సత్యమూర్తి లేచేడు.
"ఎందుకు లేచేవు?" అడిగేడు గోవిందం.
"సెలవు చిత్తగించగలరు. ఇక మీక్కనిపించకు. ఆమె భవిష్యత్తు తో ఆటలాడకు. నువ్వే గనక నిజమైన ప్రేమికుడివైతే . అమ్మాయి సుఖం కోసం ఏవైనా చేయాలి!"
"ఏం చేయాలి?"
"అది  నీ ఇష్టం. నువ్వు బతుకుంటే, ఈ విధంగా ణా ఇంటికి వచ్చి పోతుంటావ్. నీ రాక పోకల్తో -ఆశ నిరాశల అడకత్తెరలో పోక చెక్క మాదిరి అల్లాడిపోతుంది అమ్మాయి."
"పోలికలోద్దు. శారద. సుఖం కోసం నేను ఆత్మహత్య చేసుకుంటాను సరేనా? అప్పటికైనా ఆనందిస్తారా?"
"అయిదు లక్షలకంటే ఆత్మహత్య చవగ్గా  వుందని నువ్వు భావిస్తే నిన్నెందుకు కాదంటాను? ఆత్మహత్య చేసుకుంటే నిన్ను  మనసారా అభినందిస్తాను."  

 Previous Page Next Page