కత్తుల గ్రుచ్చినన్, శరముఖమ్ముల వ్రచ్చిన , కార్ముకమ్ములన్
మొత్తిన , నెత్తిపై గదల మోదిన, నెత్తురు పీల్వసాగినన్
కుత్తుక నొక్కి పైన బడి కొట్టిన తిట్టిన, శాంతితోడ నో
రేత్తక మిన్నకుండు! నెవ రెది యొనర్చిన చూచుచుండెదన్!
శ్రీకృష్ణుఁడు
కొంచెపు మాటలాడెదు, జుగుప్స, అశోచ్యుల కోస మేల శో
కించు? "టనార్యజుష్ట" మపకీర్తికర, మ్మపవిత్రమైన దీ
చంచలబుద్ది, కశ్మలత చాలు, మహా ప్రళయమ్ముగా నివే
ముంచుకవచ్చుచుండె నలుమూలలనుండి విరోధివాహినుల్!
పెంటితనమ్ముమై మనసు పెదరికమ్మున కోడి, మేటి రా
బంటుతనమ్ము పోవిడిచి పల్చని పల్కులు పల్కి తెట్లు? ము
క్కంటిని నిల్వరించిన మగంటిమి యెక్కడవోయే? నేఁ డిటుల్
గంటిని కన్ను లెప్పుడును గాంచని చేష్టలు చిద్విలాసముల్!
రక్తపుకూడుగాక మన రాజులకున్ ఘృతసూపయుక్తమౌ
భుక్తి లభించునే? విడిచిపుత్తువే ధర్మువు? కర్మసూత్ర సం
సక్తము సృష్టి యేల్ల; సహజమ్ములు తప్పవు చావు పుట్టుకల్;
ప్రాక్తనాపుణ్యపాపములు ప్రాణులకున్ సుఖదుఃఖ హేతువుల్!
చంపుటో చచ్చిపోవుటయొ క్షాత్రము ; విస్తృతవిద్విషచ్చమూ
సంపదఁగాంచి గుండె దిగజారి, అకారణవిస్మయస్మయో
త్కంపము చెల్లునయ్య! కులధర్మము వీడుట పాడియయ్య! మీ
కొంపలు గాల్చు దుండగపు గుంపులపై ననుకంప యేటికిన్?
మ్రుక్కుడి కౌరవాధములు మోసము సేసి దురోదరమ్ములోఁ
ద్రోక్కిరి యుక్కు పాదములలో మిము, ద్వేష రుషా విషార్చులన్
గ్రక్కిరి; లక్కయిండ్ల నిడి కాల్చిరి; బండుగు ; లన్నదమ్ములం
చక్కటికమ్ము గైకొనేద గైకొనేద వక్కట! యక్కుటిలాత్ములందునన్!
హింస యొనర్పనంటివి సరే! మిము హింసల పా లొనర్చు వి
ధ్వంసక శక్తులందు దయదాల్చుట ధార్మికహింసకాదె? మా
కంసుని జంపి లోకముల కష్టము దీర్పనే; చెల్లునే యసృ
ణ్మాంసము లెండి తిండికయి మాడుట రాచకొలమ్ము వారికిన్?
లెమ్ము ధనునంజయా ! విధి బలీయము! న్యాయము గెల్చు; నిల్చు స
త్యము; నశించు స్వార్ధము ; సదా యుగధర్మ మిదే గదోయి! క
న్గో మ్మిక నంత్యకాలమున సూర్యుడు బిడ్డల తండ్రికైనా పిం
డ మ్మిడు దిక్కు గల్గ చకటా! గ్రహచారము తప్పివచ్చినన్!
'అర్ధింపన్ విజయమ్ము, భోగముల నభ్యర్ధింప, రాజ్యార్దినై
ప్రార్ధింపన్ సిరు" లంచు ధర్మములు ప్రారంభించినా వేమిటో!
పార్దా! చాలును కట్టిపెట్టుము వచఃప్రాగల్బ్యముల్; చాలురా
స్వార్ధత్యాగము; తల్లి పిల్పు వినరా! శంఖమ్ము పూరింపరా!
శంకాసంకుచితాంతరంగులు; వృధాసందేహమందేహులున్
కింకర్తవ్యవిమూడచిత్తులు కురుక్షేత్రమ్ములో నిల్వరా;
దింకన్ మార్గము లేదు; వింట విశిఖమ్మే లాగెదో, కానిచో
"పంకా లాగెదో' రాజరాజునకు బావా! రెండు హస్తాలతో!
ధర్మక్షేత్రము క్షాత్రామండల పవిత్రమ్మౌ "కురుక్షేత్ర" మన్
కర్మక్షోణి స్వధర్మనిర్వహణదీక్షం దాల్చి, విద్రోహులన్
నిర్మూలించి "స్వతంత్ర భారతభవానీ వీరసంతానమై"
మార్మోగింపుము దిగ్దిగంతముల యుష్మద్దేవదత్తధ్వనుల్!
అంగ్రత్రాణకృపాణబాణధారులై యంగమ్ము లుప్పొంగ, దు
స్సంగస్వార్ధమదేభ కుంభములపై సంగ్రామరంగమ్మునన్
సింగమ్ముల్ వలె దూకి, కర్కశ ఖరాసిన్ చించిచెండాడ కీ
భంగిన్ వీరులు భీరులై చనుట దౌర్భాగ్యమ్మురా జాతికిన్!
నిద్రాణ మ్మగు జాతికిన్ నవనవోన్మేషమ్ము చేకూర్చి , ని
ర్ణిద్ర స్ఫూర్తి స్వతంత్రభారత పునర్నిర్మాణముల జేయుటే
భద్రా! భద్రము క్షాత్రనందనుల; కీ భంగిన్ నిరుత్సాహివై
యుద్రేకమ్ము దొరంగి చల్లబడి నిట్టుర్వంగ నీ కొప్పునే?
జెండా జాతికి జీవగఱ్ఱ; సమతా చిహ్నమ్ము; సర్వస్వ; మీ
జెండా వంపు సహింపఁజాలని శిరశ్చేదమ్ము; లే లెమ్మికన్
జెండాడన్ వలె శాంతి ఘాతుకుల; జేజే లెల్ల జేజేలతోఁ
గొండాడన్ విశ్వవిశ్రుత భవత్ కోదండ పాండిత్యముల్!
నీ దైన్యమ్మిఁక చాలు! గుండెగలదేనిన్ గొమ్ము కోదండమున్!
లేదా పోదము రమ్ము ద్వారకకు ; వేఱే వారు వీ రేల నే
నైదూళ్ళీత్తును బావ లైదుగుర; కత్యంత ప్రశాంతమ్ముగా
వేదాంతార్ధము ముచ్చటించుకొనుఁ; డన్వేషింపుఁడీ బ్రహ్మమున్!
"వీఁడే భారతవీరుఁ డర్జునుఁడు! దోర్వీర్యస్పురాసంగర
క్రీడానిర్జితశూలి, నిర్జరగణక్షేమంకరుం, డల్లదే
వాఁ" డంచున్ వినువీధి గుంపులయి గీర్వాణుల్ విమానాలపై
జూడన్ వచ్చిరి; గుట్టు రట్టయిన నిల్చుండన్ గతుల్ గల్గునే?
"ఫెళఫెళ" మ్రోగెరా విజయభేరి; ధణంధణ నిస్వన మ్మదే
పిలుచుచునుండేరా భరతవీరుల వీరవిహారయాత్రకై!
ప్రళయ మహాశ్మశాన నటరాజ జటానట దభ్రవాహినిన్
దళతళ;లాడురా! విజయతాండవ పాండవచంద్రహాసముల్!
ఔదాసీన్యము నుజ్జగింపుము వయస్యా! కర్మవీరుండవై
పాద మ్ముంచుము యుద్ధరంగమున; నీ స్వాతంత్ర్య శంఖధ్వనుల్
వేదవ్యాస "జయ" ప్రబంధ కవితావేశమ్ములో మ్రోగు; ని
న్నాదర్శమ్ముగఁ జెప్పుకొందురు భవిష్యద్బారతీయ ప్రజల్!
భవదీయ స్తవనీయబాహుబల మోర్వంజాలు వాఁడేడి? వ
ర్యవసానమ్మది నేనెఱుంగుదు; విదగ్దాఖండ లాఖండ ఖాం
డవుఁడౌ పాండవమధ్యముండు కడకంటన్ గెంపు రేకెత్త గాం
డివమున్ గైకొని నిల్చినన్ పగఱగుండెల్ క్రుంగికూలారనే!!
అన్న కర "మ్మనంతవిజయమ్ము" న కస్పదమైన ; దింక నీ
కున్నది "దేవదత్తము" మహోజ్జ్వలసత్వము; సవ్యసాచి కీ
విన్నదనమ్ము మున్నెపుడు విన్నది కన్నది కాదు; దుర్జయ
మ్మన్నది లేదు విశ్వవిజయా! విజయా! నరుఁ డుద్యమించినన్.
అతఁ డజాతశత్రుఁడు; మహాత్ముఁడు; శాంతతపస్వి; విశ్వవి
ఖ్యాతుఁడు; ధర్మారా; జతని యాత్మికశక్తికి లే వసాధ్యముల్!
తాతలవంటివారయున తప్పదు లోఁబడిపోదురోయి! ధ
ర్మేతరశక్తు లెట్లు తలయేత్తును ధర్మబలమ్ము సన్నిధిన్?
సస్యశ్యామల! రత్నగర్బ! మమతాసంపన్న! మీ తల్లి దీ
నాస్యచ్చాయ లుధమ్ము గ్రమ్ముకోన నిద్రాహార సన్యస్తయై
దాస్యం బీడ్చుచునుండే శాత్రవగ్రుహద్వారమ్ములన్; చాలు నా
లస్యం బో కురుసింహ! శృంఖలము లుల్లంఘించి లంఘింపుమా!
అమ్మ పరాయి'పంచఁబడి, అశ్రువు లోడ్చుచునుండ బిడ్డ చి
త్తమ్మది చూచి యోర్వగలదా! బ్రతుకుం బలిపెట్టి తల్లి దా
న్యమ్మును దీర్ప కిట్లనదవై పడియుందువె చేతకాని ద
ద్దమ్మ విధాన! మున్నల "బృహన్నల' యన్ నుడి సార్ధకంబుగన్.
"విజయశ్రీ గోనితెత్తు వీ " వనుచు నువ్విళ్ళూరుచున్నారురా
విజయా! సోదరు లెల్ల; నీ విటుల నిర్వీర్యుండ వైనన్ కపి
ధ్వజ మర్యాదయు, గాండీవమ్ము పరువున్ ధ్వంసంబుగా నవ్వవే
త్రిజగంబుల్! తలయేత్తుకోఁగలదె కుంతీదేవి చుట్టాలలో!
శుభామో' నీదు పధమ్ము! లెమ్ము ప్రభవిష్ణూ! జైత్రయాత్రా మహా
ప్రభ సాగింపుము దిక్కులందు! నికట ప్రాప్తవ్యమౌ దివ్య భ
వ్య భవిష్యత్తుకు దారి తీయుము! స్వతంత్రానందభాష్పాలతో
నభిషేకింపుమురా భవజ్జనని పాదాంభోజముల్ ఫల్గునా!
నరుఁ డేకైక ధనుర్ధరుం డయి; యఖండత్యాగదీక్షాధురం
ధరుఁడై నిల్చిన ముజ్జగమ్ముల నసాధ్యమ్మన్నదే లేదు; డ
గ్గరలే వెట్టి నిరోధశక్తులున్, సంగ్రామావనిన్ నేఁ డిటుల్
నరనారాయణు లొక్కటై నిలిచిరన్నన్ జెప్పనేమున్నదో!
రధియై గాండివమూని ఫల్గునుఁడు పోరాటమ్ము సాగింప, సా
రధియై పగ్గము లూని శౌరి రధసారధ్యమ్ము గావింపఁగా
ప్రధనమ్మం దేదిరించి నిల్వ గలఁడే ఫాలాక్షుఁడైనన్? వృధా
వ్యధ నీకేలర? వీర భారతకుమారా? విల్లు చేపట్టారా!
కృతహస్తుండవు, సాంయుగీనుఁడవు, సాక్షీభూతభూతెశ్వర
స్తుతిపాత్రం, బతిమాత్రమైనది భవద్దోర్దండ విక్రాంతి; వి
స్మృతిపాల్గకుము! వర్తమాన మరుదెంచెన్! ధూర్తకౌరవ్యదు
ష్మ్రృతికిన్ నిష్కృతి నేఁడు క్రీడిసమరక్రీడాసమారంభముల్!