Previous Page Next Page 
వ్యూహం పేజి 31


    "ఛైర్మెన్ గారంటే నాకు కన్ ఫ్యూజనయ్యా. అడ్రస్ తీసుకున్నాను వెళ్ళాలి కదా. రమ్మన్నాక వెళ్ళకపోతే బాగుండదు కదా" ఒక్కొక్క మాట నెమ్మదిగా అన్నాడు శక్తి.

 

    "బాగుండదేవిటండీ బాబూ... వచ్చిందందుకే కదండీ. మీ మేనమామ గార్ని కలవాలి. మాట్లాడాలి. వాళ్ళ అమ్మాయిగార్ని కలవాలి... కబుర్లాడు కోవాలి... రేపు మీరు... ఛైర్మెన్ గారి కార్లోనే వస్తారనుకుంటాను"

 

    అబద్ధం ఆడకుండా వుండాల్సింది. వీడు బంకలా వదలడం లేదు అనుకున్నాడు శక్తి.

 

    "ఏంటాలోచిస్తున్నారు! రేపు మీరు ఛైర్మెన్ గారి కార్లో వస్తారా. మీ బేబీగారి మారుతీ కారులో వస్తారా?"

 

    ఫస్ట్ ఫేజ్ లోని పిచ్చివాడిలా చూసాడు భగవాన్ వేపు శక్తి.

 

    గబుక్కున లేచి, ఎటో పారిపోవాలని వుంది. భగవాన్ జుత్తు పట్టుకుని చెంపల్ని వాయించెయ్యాలని ఉంది.

 

    "చూడు... భగవాన్లూ మనిషి బతుకు బుద్భుదం ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనచేతిలో ఏం లేదు. మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా అన్నివేళలా జరగవు." సాధ్యమైనంత, శాంతంగా మొహం పెట్టి అన్నాడు శక్తి.

 

    "అదేమిటి సార్... సడన్ గా స్వాముల వార్లా మారిపోయారు. ఏమయింది సార్... మీరు చెప్పింది అర్ధమయింది సార్... కానీ, బుద్బుదం.. అన్నదే అర్థం కాలేదు సార్... బుద్భుదం అంటే ఏంటి సార్..."

 

    "బుద్బుదం అంటే... అంటే... నాకూ తెలీదు. మా అమ్మ అప్పుడప్పుడు అంటుంటే విన్న మాటన్నమాట... ఈసారి... మా అమ్మకు ఉత్తరం రాసినప్పుడు దానర్థం తెలుసుకుని చెప్తాలే."

 

    "ఇక్కడే కూర్చోండి మా హెడ్ ని బుట్టలో వేసి, పర్మిషన్ పెట్టి వస్తాను-" లేచి గబగబా కేంటిన్లోంచి ఆఫీసుకేసి నడిచాడు భగవాన్లు.

 

                                       *    *    *    *

 

    సరిగ్గా పదినిమిషాలైంది.

 

    పరుగు, పరుగున ఒగర్చుకుంటూ కేంటిన్లో కొచ్చాడు భగవాన్.   

 

    "శక్తిగారు శక్తిగారూ మీరంత అదృష్టవంతుడు ప్రపంచంలో ఎవడూ ఉండడు సర్... రండి... లేవండి అర్జంటుగా నాతో రండి..." అంత మొహం చేసుకుని అన్నాడు భగవాన్.

 

    "ఏమైంది... ఏంటసలు- ఆ జనరల్ మేనేజర్ రమ్మన్నాడా?"

 

    "జనరల్ మేనేజర్ ఎవడు సార్- మధ్యలో- మహితగారు- మహితగారు మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారు సర్."

 

    "మహిత అంటే?"

 

    "అదే సార్- డిజైనర్ కమ్ ఫోటోగ్రాఫర్- ఆవిడ- ఆవిడ."

 

    "ఆవిడ నన్నెందుకు పిలవడం... నాతో ఏంటి పని?" ఆశ్చర్యపోతూ అడిగాడు శక్తి.

 

    "క్వశ్చన్లొద్దు- రండి.... ఛైర్మెన్ గారి మేనల్లుడని తెలుసుంటుంది. మాట్లాడడానికేమో... ముందులెగు బాసూ... ఆవిడ గురించి నీకు తెలీదు కానీ... లే బాసూ..." చెయ్యిపట్టి లాగేడు భగవాన్.

 

    ముందు పరుగులాంటి నడకతో, భగవాన్ నడవగా, ఆ వెనుక అంతే స్పీడుతో శక్తి నడిచాడు.

 

    మెయిన్ హాల్లో కొచ్చారిద్దరూ.

 

    అక్కడ... స్టన్నింగ్ బ్యూటీ....

 

    ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతోంది మహిత.

 

    ఏడురంగుల హరివిల్లు లాంటి చీరలో, నిజంగా హరివిల్లులా ఉంది మహిత, నవ్వుతూ లోనికొస్తున్న శక్తిని చూసింది.

 

    "మహితగారూ... ఈయనే... మీరడిగారు కదా... పేరు శక్తి మనఛై..." ఏదో చెప్పబోయి, మహిత "ఆయనకు మాటలు రావా-?" అన్న మాటతో, భగవాన్ తను అనాల్సిన మాటల్ని టప్పున మింగేశాడు. శక్తి చెయ్యి నొక్కాడు మాట్లాడమని.

 

    "తమక్యూ... ఈయనతో చిన్నపనుంది... మీరు సెక్షన్లోకి వెళుతున్నట్టున్నారు..." భగవాన్ వేపు చూసి అందావిడ.

 

    భగవాన్ కి అక్కడే, ఆవిడవేపు, దగ్గరగా చూస్తూ, ఆవిడ మాటల్ని దగ్గరగా వింటూ, కాలక్షేపం చెయ్యాలని ఉంది. భగవాన్ విషయం, మహితకి చూచాయగా తెలుసు. అందుకే కట్ చేసేసింది.

 

    "ఓ.కే- మేడమ్... ఓకే... శక్తిగారూ... నాకు చాలా అర్జంటు పనుంది. వెళతాను... మరి..." అయిష్టంగా అక్కడ నుంచి కదిలాడు భగవాన్.

 

    "శక్తిగారూ... మీతో ఓ పదినిమిషాలు మాట్లాడాలి... కేంటిన్ కి వెళదామా..." నెమ్మదిగా అంది మహిత.

 

    మేడమ్ అనాలో... మహిత గారూ అనాలో... ఏవనాలో తెలీక- "రెండ్రోజుల్నుంచి, నేను మిమ్మల్ని, ఆఫీసులో చూస్తున్నాను... కొత్తగా చేరారా" లాన్ లో నడుస్తూ అడిగింది మహిత.

 

    ఏం చెప్పాలో అర్థం కాలేదు శక్తికి. వాళ్ళిద్దరూ పక్క పక్కన నడవడం చాలామంది ప్రత్యేకంగా చూస్తున్నారు. అలా చూడడం గర్వంగా ఉంది శక్తికి... స్టన్నింగ్ బ్యూటీకదా.

 

    ఒక ఆడపిల్ల, అందులోనూ, అందమయిన ఆడపిల్ల పక్కన నడవటం నిజంగా జీవితంలో మొదటిసారి.

 

    "మీదే సెక్షన్" కేంటిన్ లో అడుగు పెడుతూ మళ్ళీ అడిగింది మహిత.

 

    "ఛైర్మెన్ గారి సెక్షనా...?" ఆశ్చర్యపోతూ, విశాలమయిన కళ్ళతో విచిత్రంగా చూస్తూ అంది మహిత.

 

    రెండే రెండు గులాబీ పెదాలు. ఆ పెదాలు కట్ చేసి పెట్టినట్లుగా ఉన్నాయి ఆ అమ్మాయి పెదాలు. ఆ పెదాలు వేపు చూసి.

 

    "ఈ అమ్మాయి పెదాల్లోనే ఉంది ఆకర్షణ" మనసులో అనుకున్నాడు శక్తి.

 

    "అదే... ఛాంబర్" గొణిగాడు శక్తి.

 

    "టేక్ యువర్ సీట్- ప్లీజ్... షల్ ఉయ్ హేవ్... కూల్ డ్రింక్."

 

    అని లేచి, కౌంటర్ దగ్గరకెళ్ళి, తనే స్వయంగా రెండు మజా బాటిల్స్ ని పట్టుకుని వచ్చి టేబిల్ మీద పెట్టింది మహిత.

 

    "తీసుకోండి... నేనెందుకు పిలిచానని ఆశ్చర్యపోతున్నారు కదూ నా పేరు మహిత... మార్కెటింగ్ డివిజన్లో, ఎడ్వర్టేజ్ మెంట్ సెక్షన్లో, ఫోటోగ్రాఫర్ కమ్ డిజైనర్ని కమ్ విజువలైజర్ని."

 

    అలా అంటున్నప్పుడు, అలవోగ్గా మహిత ముక్కువేపు చూసాడు శక్తి. ఆ ముక్కు సన్నంగా పొడవుగా, పున్నాగ పువ్వులా ఉంది.

 Previous Page Next Page