"అమ్మాయి చెప్పిన హీరోని నువ్వే కదూ?" అడిగేడు గోవిందం.
సత్యమూర్తి తల వూపేడు అవునన్నట్టు.
"ఏమిటో అనుకున్నా! అమ్మాయి చెప్పినట్టు అందగాడివే!"
సత్యమూర్తి సిగ్గుపడ్డాడు.
"ఆస్తిపాస్తుల్లేవని చెప్పింది."
"అవునండీ! చిన్న ఉద్యోగముంది. అంతే!"
"అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఆ చిన్న ఉద్యోగంతోనే కాలక్షేపం చేయాలి. నా పరపతిని అడ్డం పెట్టుకుని పెద్ద ఉద్యోగం సంపాయించవచ్చనే ఆశ వుంటే - ఆ ఆశని వెంటనే తుంచేయ్!"
"నాకు అల్లాంటి ఆశలు లేవండి."
"వెరీగుడ్! ఒక్కనొక్క కూతురు. అమ్మాయితో పాటు ఆస్తి కూడా వస్తుందనే ఆశ....."
"నెవ్వర్! నాకు అల్లాంటి ఆశలు లేవండి."
"రెండుసార్లూ నువ్వు ఆశల్లేవని ఒకే సమాధానం చెప్పినందుకు సంతోషంగా వుంది. ఇప్పుడు ఆ సోఫాలో కూచో! కూచోవయ్యా! ఆశ లేమీ లేవన్నావు కదా! నిబ్బరంగా కూచో!"
సత్యమూర్తి వినయంగా కూచున్నాడు.
"వెరీగుడ్ ఏం తీసుకుంటావ్?" అడిగేడు గోవిందం.
"శారద" పరాకుగా అన్నాడు సత్యమూర్తి.
తానుచేసిన తప్పు తెలుసుకుని సత్యమూర్తి అన్నాడు-
"ఐ మీన్! అంటే....నా ఉద్దేశం...."
"అర్ధమైంది. పెద్దవాళ్ల ముందు బుద్దిమంతుడు ఖంగారు పడటం సహజం. అది మామూలే" అంటూ గోవిందం ఆ గదిలో ఉన్నటీ. వీ సెట్టు వైపు కదిలేడు. ఆ సెట్టు పక్కనే నిలబడి అన్నాడు.
"మీ పెళ్లయింది."
"ఎప్పుడు సార్?" ఖంగారుగా అడిగేడు సత్యమూర్తి.
"అనుకోవయ్యా!"
"తప్పకుండా అనుకుంటానండీ!"
"అయ్యిందా? నీ కొచ్చే జీతం రాళ్లతో బంగళాలో ఎల్లాగూ వుండలేవు. మా అమ్మాయికి కూడా తనకి బంగళాలు అక్కర్లేదని నీకు చెప్పే వుంటుంది. అంచేత ఎక్కడో ఊరికి దూరంగా చిన్నగది అద్దెకు తీసుకుంటారు. ఇప్పుడు టీ.విలో మీ భవిషత్తు నడుస్తుంది. చూడు!"
"టీ.వీ.లో మా భవిష్యత్తా?" ఆశ్చర్యంగా అడిగేడు సత్యమూర్తి.
తాపీగా సమాధాన మిచ్చేడు గోవిందం -
"అంటే, నేను చెబుతుంటాను. నేను చెబుతున్నదంతా నీకు టీ.వీలో బొమ్మల్తో సహా కనిపిస్తుందన్నమాట! చూస్తావా?"
"చూస్తాను" అన్నాడు నసుగుతూ సత్యమూర్తి.
గోవిందం చెబుతున్నాడు. ఆ ప్రకారం టీ.వీ.లో కథ నడుస్తోంది.
* * *
మురికివాడలో అదొక మురికి ఇల్లు.
ఆ మురికి ఇంట్లో అదొక మురికి వాటా.
సత్యమూర్తి బాగా అలిసిపోయి ఇంటికోచ్చేడు. కాళ్లకి నీళ్లిచ్చింది శారద. అతను కాళ్లు కడుక్కున వెంటనే అన్నది-
"రేపు ఉదయమే రేవతి పెళ్లి!"
"అలాగా! గుడ్ న్యూస్!" అన్నాడు సత్యమూర్తి.
"మనం పెళ్లికి వెళ్లాలి!" అన్నదామె.
"తప్పకుండా వెడదాం" అన్నాడు సత్యమూర్తి.
"ఆ పెళ్లికి మా నాన్న కూడా వస్తాడు."
""రానివ్వు! వస్తే మనకేమిటి అభ్యంతరం?"
"పదివేలో పదిహేనువేలో పోసి కొనుక్కోచ్చిన బహుమతిని ఎంతో గర్వంగా పెళ్లికూతురికి ప్రెజంట్ చేస్తాడు."
"మంచిదేగా!"
"మనం కూడా కొనాలి గదా!"
"కొందాం."
"ఏం కొందాం?"
"ఏదో ఒకటి - మన తాహతుకి తగ్గట్టు - వంద రూపాయలు మించకుండా మంచి బహుమతే కొందాం!" అన్నాడు సత్యమూర్తి.
"వందా? నా బొంద!" అన్నది శారద నిరసనగా.
"శారదా?"
"వంద రూపాయలు! ఆ డబ్బుకి దండలు కూడా దొరకవు?"
"అయితే ఏమంటావ్?"
"నేను కోటీశ్వరుడి కూతుర్నండి. మా నాన్న పదీపదిహేను వేలు ఖర్చు పెడితే నేను పాతికవేలు ఖర్చుపెట్టలేనా?"
"పాతికవేలా?" అని భయంగా అన్నాడు సత్యమూర్తి.
"అంటే ఏమిటి మీ ఉద్దేశం?" నిగ్గదీసి అడిగింది శారద.
"అంత ఖర్చు పెట్టగల ఆర్ధిక స్తోమతు నాకు లేదు, శారదా! మన -పెళ్లికి ముందే నీతో నా స్ధితిగతులు సమస్తం చెప్పేను. మరిచిపోయేవా?"
"లేదు బాగా గుర్తు పెట్టుకున్నాను. అందుకే అక్కడి ఐశ్వర్యమంతా వదిలేసి, ఈ ముష్టి మురికివాడలో ఈ ముష్టి ఇంటో ముష్టి కాపరం చేస్తున్నాను."
"శారదా!"
"అయినా సంతోషంగానే వున్నానండి! దైవసాక్షిగా సంతోషంగా వున్నాను. నా కోసం నేను మిమ్మల్ని అడగడం లేదు. ఇక ముందు కూడా అడగను. కావాలని మిమ్మల్ని పెళ్ళాడేను. కష్టాలకు భయపడనండీ! కానీ, అది నా స్నేహితురాలు! ప్రాణ స్నేహితురాలు. దాని మెళ్లో దండేసి చేతులు దులుపుకొడం నా వల్ల కాదు. మా స్నేహం విలువ ముష్టి వంద రూపాయలు మాత్రమేనని రేవతిని అవమానించలేను!"
"అది కాదు శారదా!"
"వద్దండీ! మీరు నాకేం చెప్పద్దు! ఆ పెళ్లికి వెళ్లాను. వెళ్లి దాన్ని దండల్తో అవమానించను."
"శారదా!"
"దానికి శాశ్వతంగా దూరమైపోతా! ఆ దండేదో నా ఫోటోకి తగిలించండి!" అని వేగంగా వంట గదిలోకి వెళ్లిపోయి తలుపులు మూసింది.
"శారదా....!శారదా!" అంటూ తలుపు కొడుతున్నాడు సత్యమూర్తి.
వంట గదిలో భగ్గున మంటలు లేచేయి. ఆ మంటల్లో శారద కాలిపోతోంది. శారదా! అని అల్లాడిపోతున్నాడు సత్యమూర్తి.
"ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం" - అనే కార్డు టీ.వీ.లో కనిపించింది!
సత్యమూర్తి లేచి నిలబడ్డాడు.
"గోవిందం సత్యమూర్తి దగ్గరకొచ్చి అన్నాడు-
"కూచో!"
""నో! నా మనసు చెడిపోయింది. స్తిమితంగా కూచోలేను!"
"ఊహించేను. అయినా సరే, నీ నిర్ణయ మేమిటో చెప్పాలి గదా? శారదని పెళ్లాడుతావా? పెళ్లాడిన నెలరోజుల్లోనే శారదని అగ్నికి ఆహుతి చేస్తావా? ప్రేమంటే కిరసనాయిలు చావేనా? చెప్పు, సత్యమూర్తి!"
సత్యమూర్తి సమాధానం చెప్పలేదు. అతను బెదిరిపోతున్నాడు. అతని ధోరణిగమనించి, అతని భుజమ్మీద చేయి వేసి లాలిస్తూ అన్నాడు గోవిందు.
"నువ్వు మంచివాడివేనయ్యా! ఒక నీతికీ, నిజాయితికీ కట్టుబడిన మనిషివి. చిన్నప్పట్నుంచీ పేదరికంలో బతికేవు. అంచేత ఎంత దరిద్రంలోనైనా బతగ్గలవు. మా అమ్మాయి విషయం వేరు. సిరిసంపదల్లో పుట్టి పెరుగుతోంది. అకస్మాత్తుగా దాని బతుకు కష్టాల్లో పడితే తట్టుకోలేదు. ఎన్ని కష్టాలొచ్చినా నా కిష్టమేనని నీతో చెప్పి వుండవచ్చు. అదంతా ప్రేమ పవరు! సంసారం రొటీన్లో పడ్డ తర్వాత ఆ పవరు తగ్గిపోతుంది. అప్పుడు...."
"ఫ్లీజ్! నాకేం చెప్పకండి సార్! నాకు ఏడుపోస్తోంది. నేను ఏమైపోయినా పర్లేదు. శారద సుఖమే నాక్కావాలి!"
"మంచి మాటన్నావు!"
"నా లాంటి దరిద్రుణ్ని కట్టుకుని ఆమె కష్టాలు పడటం నా కిష్టం లేదు."
"అమ్మాయి క్కూడా ఇష్టం వుండదు. అయితే ఆ మాట ఇప్పుడు చెప్పదు. కష్టాలు ప్రారంభమయ్యేక...."
"మీకు చేతులెత్తి నమస్కరిస్తాను. ఇంక చెప్పకండి!"
"అయితే ఒక పని చెయ్యి!"
"చెప్పండి సార్!"
"శారదను మరిచిపో!"
"అది ఈ జన్మకి జరగని పని!"
"సత్యమూర్తీ!"
"కానీ! ఆమెకు దూరంగా వెళ్లిపోతా! అమెక్కనిపించనంత దూరంగా వెళ్లిపోతా!" ఆవేశంగా అన్నాడు సత్యమూర్తి.
"మంచిది! వెళ్లిరా! చాలా దూరం వెళ్లాలి కాబోలు!" తాపీగా అన్నాడు గోవిందం.
సత్యమూర్తి గది నుంచి బయటపడ్డాడు.
చాలా వేగంగా ఆ భవంతి మంచి కూడా బయటపడ్డాడు. అంతే వేగంతో పెద్ద పెద్ద అంగలు వేసుకుంటో వెళ్లిపోతున్నాడు.
పిచ్చివాడిలా చేతులూపుకుంటో వెళ్లిపోతున్న సత్యమూర్తిని శారద మేడమీంచి చూసింది. గబగబా మేడ దిగుతోంది.
* * *
అద్దె గదిలో సత్యమూర్తి సామాన్లు సర్దుకుంటున్నాడు. బయటి మంచి తలుపెవరో తుడుతున్న శబ్ధమైంది. సర్దే పని ఆపి తలుపు తెరిచేడు.