Previous Page Next Page 
వ్యూహం పేజి 30


    "మీరు చెయ్యగలరు సార్. మీ సింప్లిసిటీని చూడగానే, నాకా విషయం అర్థమైపోయింది సర్. ఛైర్మెన్ కి కాబోయే సన్... ఇన్... లా అయ్యుండి కూడా మీరిలా, నాలా ఉన్నారంటే అర్థమైపోతుంది సర్" భగవాన్ మాటకి తనవేపు ఒకసారి చూసుకున్నాడు శక్తి. వాడు వెక్కిరిస్తున్నాడో, పొగుడుతున్నాడో అర్థం కాలేదు. అనుమానంగా వాడివేపు చూసాడు. తన డ్రెస్ వేపు చూసుకున్నాడు.

 

    నందిగామలో తిరిగినప్పటి పాతబడిన డ్రెస్.

 

    ఉద్యోగంలోకి చేరిన మర్నాడే మంచి డ్రెస్సులు తీసుకోవాలి. బట్టలు కుట్టించుకోవాలంటే ఓ పదివేలు వెంకట నారాయణ ఇవ్వడా? ఎందుకివ్వడు- చచ్చినట్టు ఇస్తాడు.

 

    "విష్ యూ ఆల్ ద బెస్ట్ సర్- మీ పనయిపోయాక కేంటిన్ లోకి రండి" అంటూ కేంటిన్ వేపు వెళ్ళాడు భగవాన్.

 

                            *    *    *    *

 

    తలెత్తి కళ్ళద్దాల్లోంచి ఎదురుగా నుంచున్న ఆకారం వేపు ఒకసారి చూసాడు ధర్మారావు.

 

    "సీట్లోకొచ్చి ఐదే ఐదు నిమిషాలయిందయ్యా-"

 

    "వచ్చేసావా? అవును... రామబ్రహ్మంగారి రికమండేషన్ కేండిడేట్ ని కదా. చూడు బాబూ... నిన్ననే నీ ఫైలుని...పెద్దాయనకు పంపించాను.

 

    ఇంకా రిప్లయ్ రాలేదు. వస్తుంది. ఆ పెద్దాయన దగ్గర, నీ ఫైలొక్కటే ఉంటుందనుకున్నావా? టంచన్ గా పది గంటలకల్లా, నా మీదెక్కేసావ్...చూడు... రేపో... ఎల్లుండో రా, అర్థమైందా?" శక్తి మొహం వేపు చూడ్డానికి ఇష్టంలేని వాడిలా, గోడకున్న కేలండర్ వేపు చూస్తూ అన్నాడాయన.

 

    హతాశుడయ్యాడు శక్తి. నోట మాట రాలేదు.

 

    రెండు నిమిషాలు నిలబడి....

 

    "ఇవాళ నా విషయం తేలదా?" మెల్లిగా అడిగాడు.

 

    "చెప్పాను కదయ్యా... తేలదని... మరీ ఎక్కువసేపు ఇక్కడ తత్తరించావనుకో మునిగిపోద్ది. ముందు వెళ్ళిపో... నాకసలే చిరాకు. వెళ్ళిపో" కసురుకున్నట్లుగా అన్నాడాయన.

 

    వెంటనే రామబ్రహ్మం దగ్గరకు వెళ్దామనుకున్నాడు శక్తి. అక్కడ కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయితే?

 

    వెనక్కి తిరిగిపోయాడు. లిఫ్ట్ వేపు వెళ్ళబోయి, మనస్కరించక మెట్లు దిగడం ప్రారంభించాడు. మరో కల కరిగిపోయింది కళ్ళముందే.

 

    అక్కడే అప్పుడే ఒక గమ్మత్తు జరిగింది. లిఫ్ట్ దగ్గరకెళితే, శక్తి ఛైర్మెన్ వెంకట నారాయణని చూసి వుండేవాడు. అప్పుడే లిఫ్ట్ లో ఆయన పైకొస్తున్నాడు. అప్పుడు శక్తి కథ మరోరకంగా వుండేదేమో- అదృష్టానికి, దురదృష్టానికి మధ్య వెంట్రుకవాసి తేడా... నెమ్మదిగా ఆలోచించుకుంటూ మెట్లు దిగుతున్నాడు శక్తి. ఇప్పుడు భగవాన్ గాడు ఏమయిందని అడిగితే ఏం చెపుతాడు తను... ఏం చెప్పాలి? తను బయట పడిపోకూడదు. తను డీలా పడిపోయినట్లు కనిపించకూడదంతే...   

 

    మెట్లు దిగి కాళ్ళీడ్చుకుంటూ కేంటీన్ వేపు నడిచాడు. కేంటీన్ లో నాలుగువేపులా చూసాడు. అక్కడే ఎవరితోనో బాతాఖానీ కొడుతున్నాడు భగవాన్.

 

    శక్తిని చూడగానే పరుగు పరుగున వచ్చాడు.

 

    "వాట్ బాస్... ఫ్రూటా? కాయా?"

 

    "వాళ్ళెవరో డెలిగేట్స్ ఉన్నార్ట కదా... వాళ్ళతో మీటింగ్ లో వున్నాడు మా మావయ్య. సాయంత్రం ఇంటికి రమ్మన్నాడు. ఇంటి దగ్గర తీరుబడిగా మాట్లాడతానన్నాడు" మొఖమ్మీదకు నవ్వు పులుముకుంటూ అనేసి కుర్చీలో కూలబడ్డాడు శక్తి.

 

    "అంటే... పనయిపోయినట్టే లెక్క. మీ మావయ్యగారు ఇంటికి రమ్మన్నారంటే మీకు గొప్ప పోస్టు ఖాయం. చూసారా... ఎంత ఛైర్మెన్ అయినా స్వంతవాళ్ళు అనేసరికి రూల్స్ అన్నీ పక్కకు వెళ్ళిపోతాయి"

 

    "ఏం రూల్సు?" శక్తి అడిగాడు.

 

    "మీకు తెలీదు కదూ- ఆఫీసుకు సంబంధించిన పనులేవీ ఆయన ఇంటి దగ్గర చెయ్యరు. అలాగే- ఎంత గొప్ప ఎగ్జిక్యూటివ్ అయినా ఇంటికి ఫోన్ చెయ్యడానికి వీల్లేదు... కొంపలు మునిగిపోతున్నా, టంచన్ గా తొమ్మిది గంటలకు బెడ్ రూంలో కెళ్ళిపోతాడాయన. మిమ్మల్ని ఆయన రమ్మన్నారంటే దానర్థం ఏంటంట... రూల్స్, రెగ్యులేషన్ లూ అందరికీ కాదని... ఏవంటారు."

 

    "నా దగ్గర మా మావయ్యకు రూల్సేంటి" అబద్ధాలకు, ఆత్మవంచన ముసుగేసేసాడు శక్తి లోలోపల రగిలిపోతూ.

 

    "అదే కదండీ... నేనూ అనేది... బైదిబై... ఒన్ బై టూ కాఫీ తాగితే ఎలా ఉంటుందంటారు."

 

    "ఆలస్యమెందుకూ వెళ్ళు" ఆ మాటతో భగవాన్ పరుగెత్తాడు. రెండు నిమిషాల్లో కప్పులతో వచ్చాడు.

 

    కాఫీ తాగుతూ అడిగాడు శక్తి.

 

    "భగవాన్... నువ్వెప్పుడూ కేంటిన్ లో తప్ప సెక్షన్ లో వుండవా?"

 

    "సెక్షన్ లో ఎలా ఉండమంటావు బాసూ... అదో ఎడారి... ఏ ఆఫీసులో నయినా చూడు, ఏ సెక్షన్ లు అయినా చూడు అమ్మాయిలతో కళ కళ్ళాడి పోతుందా లేదా. మా సెక్షనా మచ్చుకంటే మచ్చుకి ఒక్క పిల్లలేదు. యాభైమంది- అందరూ జెండకొయ్యలాంటి మగ వెధవలే... వర్కేం సాగుతుంది? అదే మార్కెటింగ్ సెక్షన్ చూడండి. ఒకరా- ఇద్దరా- పాతికమంది అమ్మాయిలు. ఒక్కొక్కమ్మాయీ ఎలా ఉంటుందో చూసారా. సంగీతా బిజ్ లానీ, మనీషా కొయిరాలని కలిపి తయారు చేసినట్లుగా ఉంటారు. అక్కడ అమ్మాయిలేమో ఆటాంబాంబుల్లా వుంటే... వాళ్ళ సెక్షన్ హెడ్ లందరూ ముసలివాళ్ళే వున్నారు. అందువల్ల, అందుచేత నాలాంటి వాళ్ళందరూ కేంటిన్ లో పడి ఏడుస్తుంటారన్న మాట. కావలిస్తే చూడండి ఈ కేంటిన్ లో వున్న వాళ్ళలో సగంమంది మా ఎకౌంట్స్ డిపార్ట్ మెంట్ వాళ్ళే-" గబగబా చెప్పేసి, గబగబా కాఫీ తాగేసాడు భగవాన్.

 

    "ఒకసారి మా హెడ్ కి ముఖం చూపించొస్తాను. మీరేం చేస్తారు- రూమ్ కి వెళ్తారా?" అడిగాడు భగవాన్.

 

    "అదే ఆలోచిస్తున్నాను."

 

    "వీలయితే మధ్యాహ్నం పర్మిషన్ పెడతాను. గెలాక్సీలో మంచి సినిమా వచ్చింది. సినిమా అయిపోయాక... మీరు ఛైర్మెన్ గారింటికి వెళ్ళాలి కదా."

 

    "ఛైర్మెన్ గారింటికా- ఎందుకు?" భగవాన్ తో చెప్పిన మాటలు మర్చిపోయి అనేసాడు శక్తి.

 

    "అదేనండి... మీ మావయ్యగారింటికి-" అదోలా మొహం పెట్టి అన్నాడు భగవాన్.

 Previous Page Next Page