Previous Page Next Page 
ఆనందం పరమానందం పేజి 30

"ఏంట్రా? ఎక్కిన రిక్షా దిగేసి - ఇంకో రిక్షాలో వెళ్లాలా? నేను నీ మాట వినాల్సిందే గాని - నువ్వు డ్యూటీలో ఉన్న పోలీసోడి ఆర్డరు వినిపించుకోవు! అంతేగా? చెబ్తా! తియ్.... రిక్షా లైసెన్స్ తియ్!" అని తిక్క తిక్కగా అరుస్తున్నాడు.
"రిక్షా తొక్కడానికి కూడా లైసెన్సుండాలా, సార్?" అని అనుమానంగా అడిగేడు కైలాసం.
"ఎంట్రోయ్! ఏం తెలీనట్టు అడుగుతున్నావే?"
"నిజంగా నాకు తెలీదు, సార్!"
"తింటా నోరేయ్!"
"అసలు నేను రిక్షా పుల్లర్ని కాదు సార్!"
"మరి? యస్సైగారి బావమరిదివా?"
"నాపేరు కైలాసం! ఊరికే రిక్షావాడి వేషం కట్టేను."
వేషం అనే మాట వినగానే పోలీసు ఎగతాళిగా అడిగేడు -
"అట్టాగా? వేషం కట్టేవా? ఎందుకురా వేషం? ఫోటో గాని దిగుతావా?"
"కాదు, సార్, ఈ వేషంలో ఒక జంటను ఫాలో కమ్మని మా బాస్ ఆర్డర్ వేసేడు."
"ఎంటెంటి? సినిమా కతలు ఇనిపిస్తున్నావా? ఒరే! వేషం కట్టడం ఫాలో అవడం, పట్టుకొడం - ఇయ్యన్నీ మా డ్యూటీలు! పోలీసు డ్యూటీ లన్నమాట! అట్టాంటిది మా డ్యూటి నువ్వు చేస్తున్నావంటే - నాకేంటెంటోడవుట్లోచ్చేస్తున్నాయ్! ముందు నువ్వు రిక్షా ఎక్కు!"
కైలాసాన్ని రిక్షా ఎక్కించి, పోలీసు రిక్షా తోకకుతున్నాడు!
"దిగి పారిపోయేవో, నీ శావాన్ని స్టేషన్ కి తీసుకెడతా!" అని పోలీసు ప్రతిజ్ఞ కూడా చేసేడు.
రిక్షాలో కైలాసం కళ్లు తేలేసేడు. రిక్షా నడుస్తూనే వుంది.
                                                             *        *        *
ఒక హొటల్లో -
సత్యమూర్తి శారదలు  కాఫీ తాగుతున్నారు.
"ఇంత శుభవార్త చెప్పినా, మొహం మాడ్చుకుని కాఫీ తాగుతారే? కులాసాగా తాగండి!" అన్నది శారద.
"నాకు కులాసాగా తాగడం చేత కాదు. అవునూ, మన ప్రేమ గురించి మీ నాన్నగారికి అంత దైర్యంగా ఎట్లా చెప్పగలిగేవు?" అడిగేడు సత్యమూర్తి.
"నిజమైన ప్రేమ దేనికీ భయపడకూడదు" అని చిలిపిగా హెచ్చరించింది శారద.
 ఏమనుకున్నాడో ఏమో, సత్యమూర్తి అకస్మాత్తుగా లేచి నిలబడ్డాడు. అతని వరస అర్ధం గాక శారద  కూడా లేచింది.
"ఈ సాయంత్రం మీ నాన్నగార్ని మీ ఇంటో తప్పకుండా కలుస్తాను" అన్నాడు సత్యమూర్తి నిబ్బరంగా.
                             *        *        *
గోవిందం ఇంటి హాల్లో -
కుక్కలు రెండూ మొరుగుతున్నాయి. గోవిందం శ్రద్దగా విని ఆన్నాడు.
"ఊ.... ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని వెళ్ళిపోయేరు. అంతేగా?" అని కుక్కల్ని అడిగేడు గోవిందం.
కుక్కలు అవునన్నట్లు తోక లూపేయి.
"అయితే ఈ సాయంత్రం ఆ ఫకీరు వెధవ ఈ ఇంటో తప్పని సరిగా అడుగు పెడతాడు. చూస్తా"  అని గొణుకున్నాడు.
కుక్కల్ని రెస్టు తీసుకొమన్నట్లు సైగ చేసేడు. కుక్కలు వెళ్లిపోయేయి.
సత్యమూర్తికి ఎల్లాంటి ట్రీట్ మెంటివ్వాలో గోవిందం ఆలోచిస్తున్నాడు.         
                                                                                  32
సత్యమూర్తి చాలా వేగంగా నడుస్తున్నాడు. అట్లా నడుస్తూనే ఆటోలను పిలుస్తున్నాడు. అవి ఆగడం లేదు. వాచీ  చూసుకున్నాడు. అప్పటికే అయిదయ్యింది. గోవిందం గారిల్లు ఇంకా చాలా దూరంలో వుంది.
అంచేత సత్యమూర్తి నడకవేగం మరింత పెంచేడు.
కొంత దూరం నడిచేక, నడకతో పని కాదని పరుగెత్తడం ప్రారంభించేడు. ఒకచోట -
డ్రైనేజి గుంటకి మూత లేదు. మూత లేని కారణంగా అందుతో ఒక వ్యక్తి ఎప్పుడు  పడ్డాడో గాని, పైకి వచ్చేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. కానీ, పట్టు దొరక్క మళ్ళా గోతిలో పడిపోతున్నాడు. ఈ విధంగా విఫల ప్రయత్నం చేస్తున్నా ఆవ్యక్తికి - పరుగెత్తుకుంటో వస్తున్న సత్యమూర్తి కనిపించేడు.
గోతిలోంచి రెండు చేతులూ సత్యమూర్తికి కనిపించేలా  ఎత్తి, జండాల మాదిరి ఊపుతూ "ఏవండోయ్! మిమ్మల్నే ...." అని పిలిచేడు.
ఆ పిలుపు విని సత్యమూర్తి ఆగిపోయేడు. డ్రైనేజి గోతిలో పడ్డ మనిషిని చూచేడు. అక్కడికి  వెళ్లి -
"అయ్యయ్యో పాపం! పడ్డారా?" అని పరామర్శించేడు.
ఆ వ్యక్తి తల ఊపి ఆడిగేడు -
"ప్లీజ్ ... కాస్త చెయ్యిచ్చి సాయం చేయండి!"
" సత్యమూర్తి  డ్రైనేజిలో పడ్డ  వ్యక్తి యొక్క బాగోగులు  పరీక్షించేడు అతన్ని లేవదీ ప్రయత్నం చేస్తే తాను  బురద పులుంకోడం తప్పదని గ్రహించి అన్నాడు -
"అత్యవసర పని మీద వెడుతున్నాను. టైం లేదు. కొంచెం ఓపిక పట్టండి! మళ్లీ వస్తా!" అని హామీ ఇచ్చి మళ్లా పరుగు ప్రారంభించేడు సత్యమూర్తి.
డ్రైనేజి గోతిలో ఉన్న మనిషి అనుకుంటున్నాడు -
"గోతిలో పడి రెండు గంటలైంది! ఓపిక పట్టాలిట? ఎవడన్నా పేపరు విసిరినా బావుండు! వార్తలనీ చదువుకుంటో కాలక్షేపం చేయవచ్చు!"  
                                                    *        *        *
గోవిందంగారి భవనంలోకి భారంగా అడుగు పెడుతున్నాడుకైలాసం.
అతని దుస్తులు చిరిగి వున్నాయి. ఒళ్లు హూనమై వుంది. 'పోలీసులచేత ఉతకబడెను' అనే బోర్డు అతని మెళ్లో కట్టకపోయినా, ఆ దెబ్బలు ఆ బాపతు వని చాలా సులువుగా చెప్పచ్చు.
అంచేత కైలాసాన్ని ఆ అవతారంలో చూడగానే గోవిందం తాపీగా అడిగేడు.
"పోలీసులు  కొట్టేరా?"
"చిత్తం! మేధావులు! బాగా కనిపెట్టేరు" అన్నాడు కైలాసం.
"నస వద్దు. జరిగింది చెప్పు" అన్నాడు గోవిందం.
"చిత్తం! అమ్మాయి గారిని  వెంబడించే పని మీద రిక్షాపుల్లర్ వేషంలో వున్నానండీ! ఒక పోలీసాయనకి నా మీద అనుమానం వచ్చిందని స్టేషన్ కి తీసుకెళ్లేడు. అక్కడనన్ను - కాశ్మీర్ నుంచి వచ్చేవా అని ఉతికేరు . పాకిస్తాన్ తో నీకేమిటి సంబంధమని చితగ్గోట్టేరు. చైనా వారికి ఏం చెప్పేవని పాతరవేసేరు. జుట్టుపీకేరు. కడుపులో గద్దేరు. ఏవని చెప్పను? చిత్రహింస! చితక పాడిచేరంటే నమ్మండి! అయినా, అందరికీ మారువేషాలు అచ్చిరావండి! నా మాట మీరు నమ్మాలి!" అన్నాడు కైలాసం బాధగా.
"నీ కన్నా కుక్కలు నయం!" అన్నాడు గోవిందం.
"చిత్తం!"
"ఏ పని చెప్పినా పరుగెత్తుకొచ్చి రిజల్టు చెబుతాయి!"
"చిత్తం! కాశ్మీర్, పాకిస్తాన్. చైనా లాంటి ప్రదేశాల నుంచి కుక్కలు రావని పోలీసులకి బాగా తెలుసండి!" అని కైలాసం ఏదో చెబుతుండగా -
జాకీ అర్జంటుగా వచ్చి గబగబా మొరిగింది. అదంతా విని గోవిందం కైలాసంతో అంటున్నాడు-
"ఆ కుర్రాడు వస్తున్నాట్ట! అదుగో .... ఆ గదిలో వుంటా. అతణ్ని అక్కడికి పంపించు!" అని గదిలోకి వెళ్లిపోయేడు గోవిందం.
అప్పుడు సత్యమూర్తి వచ్చేడు. వచ్చీరాంగానే "అయ్యగారున్నారా?" అని కైలాసాన్ని అడిగేడు.
కైలాసం కొంచెం నిష్టూరంగా  సమాధాన మిచ్చేడు-
"ఉన్నారు! నేను ఈ అవతారంలో మీకు  కనిపిస్తున్నాను. నన్ను  మీరు గుర్తుపట్టలేదు. కానీ మీరు నాకు  తెలుసు!"
"తెలుసా? ఎట్లా తెలుసు?" అని కూతూహలంగా అడిగేడు సత్యమూర్తి.
ఎట్లా తెలుసో వివరంగా చెబుదామనుకున్నాడు కైలాసం. ఏదో  అనుమానం  రాగా అతను కుక్కల వైపు చూసేడు. కుక్కలు తలలు పక్కకి  తిప్పుకున్నాయి. కైలాసం మనసు మార్చుకుని సత్యమూర్తితో అన్నాడు -
"అవన్నీ తర్వాత  చెప్పుకుందాం. ఆ గదిలో  అయ్యాగారు మీ గురించే ఎదురు చూస్తున్నారు. వెళ్లిరండి!"
సత్యమూర్తి ఆ గది వైపు నడుస్తున్నాడు.
కైలాసం గాల్లో దణ్ణాలు  పెట్టుకుంటున్నాడు.
గదిలోకి అడుగు పెట్టేడు సత్యమూర్తి గోవిందం కిటికీ దగ్గిర  నిలబడి బయట వాతావరణాన్ని పరికిస్తున్నాడు.
"నమస్కారం!" అన్నాడు సత్యమూర్తి.
గోవిందం సత్యమూర్తిని చూసేడు.
"నా పేరు సత్యమూర్తి!" అన్నాడు సత్యమూర్తి వినయంగా.

 Previous Page Next Page