Previous Page Next Page 
సినీ బేతాళం పేజి 30

                                 


                                 ఒక 'శతదినోత్సవ చిత్రం' కథ

 

                               

    వరహాల్రావ్ చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మతో ఓ సినిమా శతదినోత్సవానికెళ్ళాడు. సినిమా ఇంటర్వెల్ లో అందులో నటించిన నాగేశ్వర్రావ్, సావిత్రి, రేలంగి, సూర్యకాంతం ఇంకా చాలా మంది నటీనటులు కనిపించారు. వాళ్ళంతా మైకు ముందు నిలబడి మాట్లాడారు. ప్రేక్షకులను నవ్వించారు. తాము నవ్వారు. ఆ తరువాత ఆ చిత్ర నిర్మాత మాట్లాడాడు. తనకూ, నాగేశ్వర్రావ్ కీ ఎప్పటినుంచో స్నేహం ఉందన్నాడు. అలాగే మిగతా నటీనటులకూ, తనకూ మధ్య వ్యాపారమే కాకుండా ఎంతో స్నేహం, అభిమానం ఉన్నాయన్నాడు. ఆ మాటకొస్తే తామందరు ఇక ఇంట్లో మనుషుల్లా ఉంటామన్నాడు. తనక్కూడా అలా సినిమా నటీనటులతో స్నేహం ఏర్పడితే ఎంతబావుంటుంది అనుకున్నాడు వరహాల్రావ్- సినిమా అయాక ఇంటికొస్తూ.
    మర్నాడు అతని మనసులోని కోరికలన్నీ విన్న అతని ప్రాణమిత్రుడు నూకల్రావ్ ఆ మాట నిజమేనన్నాడు. అందుకే తనూ సినిమాల్లోకి వెళ్ళిపోతున్నానన్నాడు. యస్సల్సీ పాసవగానే ఓసినిమా డైరెక్టు చేయదల్చుకున్నాననీ, అప్పుడు వరహాల్రావ్ వస్తే మద్రాస్ లో అతను నిర్మాత అయిపోవడం ఏమంత కష్టం కాదనీ, ఆ విషయం తనకొదిలేయమనీ చెప్పాడు. చెప్పి యస్సల్సీ పాసవకుండానే ఇంట్లో నుంచి పారిపోయి మద్రాస్ చేరుకుని సినిమాల్లో చేరిపోయాడు. అతనలా పారిపోయినందుకు అతని తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు. ఇంకా ముందే పారిపోయి వుంటే అంతకాలం స్కూలుకి కట్టిన ఫీజు మిగిలిపోయేది కదా అని విచారించారు. ఆ తరువాత కొన్నాళ్ళకు అతని సంగతి పూర్తిగా మర్చిపోయారు. కానీ వరహాల్రావ్ మాత్రం మర్చిపోలేదు. ప్రతి సినిమా టైటిల్స్ లోనూ నూకల్రావ్ పేరుకోసం వెదకసాగాడు. అలా అయిదేళ్ళు వెతికాక ఓ సినిమాలో స్టంట్ పార్టీ పేర్లలో అతని పేరు కనిపించింది.
    "దర్శకుడవుతాడని స్టంట్ పార్టీలో ఎందుకు చేరాడా" అని ఆశ్చర్యపోయాడు వరహాల్రావ్. మరికొద్ది రోజులకు అతని పేరు దుస్తులు- సహాయకుడు దగ్గర కనిపించింది. ఇంకొన్ని రోజులు పోయాక ఓ సినిమాలో పదిమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ లో ఒకడిగా నూకల్రావ్ పేరుంది. అలా కొన్ని సినిమాలలో కనిపించి కనిపించి చివరకు ఓ శుభముహూర్తాన అసోసియేట్ అయిపోయి ఆ తరువాత దర్శకుడయి వెలిగిపోసాగాడు. అలా వెలిగి వెలిగి ఓ సినిమా పెద్ద ఫ్లాప్ అవడంతో ఆరిపోయాడు.
    సరిగ్గా ఈ సమయంలోనే వరహాల్రావ్ అమ్మమ్మ పాతికలక్షల ఆస్తి అతని పేర రాసి హరీమంది. వెంటనే ఆ పాతిక లక్షలు తీసుకుని మద్రాస్ పాండీబజారు చేరుకుని నూకల్రావ్ ఇంటికోసం వెతకసాగాడు వరహాల్రావ్. అలా వెతుకుతోంటే అతని కాలికి ఓ తీగ తగిలింది. ఏమిటా అని అది చేతిలోకి తీస్కుని చూస్తుంటే......
    "అరె! ఏమిటది? నువ్వు వెదకబోయిన తీగేనా?" అనడిగాడు నూకల్రావ్ ఎదురొచ్చి....
    "అవును!" అంటూ జరిగిందంతా చెప్పాడు వరహాల్రావ్.
    "మరి మన సినిమా తప్పకుండా శతదినోత్సవం చేసుకోవాలి. శతదినోత్సవంలో నేను మాట్లాడాలి. నాకూ, నా సినిమాలోని నటీనటులకూ మధ్య ఎంతో స్నేహం వుందని ప్రేక్షకులకు చెప్పాలి. ఆ మాట కొస్తే మేమంతా ఒక ఇంట్లోనే వుంటున్నామని కూడా చెప్పాలి" అన్నాడు వరహాల్రావ్ ఆనందంలో మునిగిపోతూ.
    "పిచ్చివాడా! శతదినోత్సవం సినిమా తీయడం ఏమంత కష్టమనీ? అయిదువారాల్లో తీయవచ్చు" అన్నాడు నూకల్రావ్ తేలిగ్గా.
    "అదంత తేలికయితే మరి చాలా సినిమాలు ఎందుకు శతదినోత్సవం చేసుకోవడం లేదు?" ఆశ్చర్యంగా అడిగాడు వరహాల్రావ్.
    "వాళ్ళు పిచ్చివాళ్ళు కనుక! అదివరకు అంటే చాల రోజుల క్రితం శతదినోత్సవాలు చేసుకున్న సినిమాల్నే మళ్ళీతీస్తే తప్పక శతదినోత్సవాలు చేసుకుంటాయి. కావాలంటే ఈ మధ్య శతదినోత్సవం చేసుకున్న ఏ సినిమానయినా చూడు! పాత సినిమాల బాపతే అన్నీనూ! అయితే ఏపాత సినిమానీ ఉన్నదున్నట్లు తీయకూడదు. కొంచెం మార్చాలి. అలా మార్చేస్తే చాలు- శతదినోత్సవం గ్యారంటీ."
    "పోనీ కనీసం నా డబ్బు నాకు తిరిగి వస్తుందంటావా?" ఇంకా అనుమానంగానే అడిగాడు వరహాల్రావ్.
    "రాదు!"
    "ఆ! నా డబ్బు నాకు రాదా?" ఏడుపుమొహంతో అడిగాడు వరహాల్రావ్.
    "పిచ్చివాడా! నీడబ్బు నీకెలా వస్తుంది? అలా వచ్చేట్లయితే సినిమా ఎందుకు తీయటం? నీ డబ్బుకి డబుల్ వస్తుంది. లేదా మూడొంతులొస్తుంది..."
    వరహాల్రావ్ ఆనందంతో నూకల్రావ్ ని కౌగలించుకున్నాడు.
    భారీ తారాగణంతో, పాతకాలంలో భారీగా ఆడిన చిత్రరాజాన్ని మార్చి మూడు వారాల్లో సినిమా తీయడం పూర్తి చేశారు వాళ్ళు. వరహాల్రావు పొలం పనులు చూసుకోడానికి వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు.
    సినిమా వ్యవహారమంతా నూకల్రావు చేతిలోనే వదిలేశాడాతను.
    సినిమా రిలీజయింది. వారం రోజులు గడిచింది. అన్ని పేపర్లలోనూ తన సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ చూసేసరికి వరహాల్రావుకి ఆనందం పొంగిపొరలింది. ఏ పేపరులో చూసినా "ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్స్! తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇంతవరకూ మరే చిత్రానికీ లభించని ఆదరణ" అంటూ మొదటివారం కలెక్షన్ ఎంత మొత్తం వసూలు చేసిందో సంఖ్య వేసి ఉంది. వరహాల్రావు మరీ పొంగిపోయాడు. ఆ సినిమా శతదినోత్సవ వేడుకలు అతని కళ్ళకు కట్టినట్లు కనబడసాగాయి. సినిమా నటీనటులతో తాను ఊరూరా తిరగడం, వాళ్ళందరితో పాటు మైకులో మాట్లాడడం, జనం తప్పట్లు కొట్టడం... "రెండో వారంకూడా మళ్ళీ రికార్డు కలెక్షన్స్" అంటూ తన సినిమా చేసిన వసూళ్ళ సంఖ్య వేశారు.
    అయితే అరు వారాలయినా నూకల్రావు నుంచి ఎలాంటి ఉత్తరం రాకపోవడం చూసి చిరాకు పడ్డాడతను. తనే ఓ ఉత్తరం రాశాడు. మన సినిమా రికార్డు కలెక్షన్స్ తో ఆడుతోంది, కాబట్టి శతదినోత్సవాలు తప్పక జరిపించాలనీ, తనకు ఆ శతదినోత్సవాల వివరాలు రాస్తే ఆ సమయానికి మద్రాస్ చేరుకుంటాననీ రాశాడందులో. వెంటనే నూకల్రావు జవాబు రాశాడు.
    "ప్రియమిత్రమా! మన సినిమా పరమఘోరంగా ఫ్లాప్ అయిందని తెలియజేయడానికి చింతిస్తున్నాను. మనం... అంటే... నువ్వు పెట్టిన పెట్టుబడిలో 25వ వంతు కూడా తిరిగి రావడం కష్టం అని పెద్దలు అంటున్నారు. ఇట్లు నీ ప్రాణమిత్రుడు నూకల్రావ్" అని ఉందందులో.
    వరహాల్రావు ఆశ్చర్యపోయాడు. అతనికేమీ అర్ధంకాలేదు. ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్లు చేసిన చిత్రం.... ప్రస్తుతం పద్నాలుగో వారం ఆడుతున్న చిత్రం ఫ్లాప్ ఎట్లా అవుతుంది? ఈ కేసేదో అనుమానంగా వుంది. అందరూ కలసి తన డబ్బు కాజేయడానికి ప్లాన్ వేస్తున్నారు. అనుకుని మద్రాస్ బండెక్కాడు.
    తీరా మద్రాస్ చేరుకునేసరికి అన్ని పేపర్లలోనూ తమ చిత్రం తాలూకు శతదినోత్సవాల ప్రకటన కనిపించింది.
    "పధ్నాలుగు కేంద్రాల్లో శతదినోత్సవం. మద్రాస్ లోని ఫలానా హోటల్లో శతదినోత్సవ వేడుకలు" అంటూ ఉందందులో. వరహాల్రావుకి వళ్ళు మండిపోయింది. "నూకల్రావు తనను ఎంత ఫూల్ ని చేస్తున్నాడు" అనుకున్నాడతను.
    "తను ఇలా ఇవాళ మద్రాస్ రాకపోయినట్లయితే ఈ శతదినోత్సవం ఫంక్షన్ లో పాల్గొనడానికి వీలయేది కాదు కదా! తను రాసి బట్టీపట్టిన ఉపన్యాసం వృధా అయేదికదా" అనుకుని టైమ్ చూసుకున్నాడు. ఫంక్షన్ ప్రారంభం కావడానికి ఇంకో పావుగంట మాత్రమే టైముంది. వెంటనే రిక్షాలో ఆ హోటల్ కి బయల్దేరాడు. తీరా ఆ హోటల్ చేరుకునేసరికి అక్కడ ఎవరూ కనిపించలేదు. అసలలాంటి ఏర్పాటే లేదని చెప్పారు హోటల్ వాళ్ళు.
    .... ఇంతవరకూ చెప్పి సెన్సార్ ఇలా అంది.
    "నిర్మాతా! వరహాల్రావు సినిమా నిజంగా ఫ్లాప్ అయిందా? నిజంగా ఫ్లాప్ అయినట్లయితే పధ్నాలుగు కేంద్రాల్లో శతదినోత్సవం ఎలా చేసుకుంది? మద్రాస్ హోటల్లో శతదినోత్సవం వేడుకలు జరుగుతున్నట్లు పేపర్లో ప్రకటించినా ఆ వేడుకలు ఎందుకు జరగలేదు? వరహాల్రావుకి శతదినోత్సవం వేడుకల్లో నటీనటులతో పాటు పాల్గొనాలన్న కోరిక ఉందని తెలిసి కూడా నూకల్రావు ఆ ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? ఈ ప్రశ్నలకు...."
    "నీ అరిగిపోయిన రికార్డు ఆపు! సమాధానాలు చెప్తున్నాను. వరహాల్రావ్ సినిమా మట్టికొట్టుకుపోయిన మాట నిజమే! ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్ అంటూ వారం వారం వసూళ్ళ సంఖ్య వేయడం, పధ్నాలుగు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుందని ప్రకటించడం మద్రాసులో శతదినోత్సవ వేడుకలు అని పబ్లిసిటీ చేయడం.... ఇదంతా వ్యాపార టెక్నిక్! ఇతర భాషల నిర్మాతలు ఈ మధ్య తెలుగు సినిమాలు హిందీలోనూ, అరవంలోనూ నిర్మించడం మనం చూస్తూనే ఉన్నాం! ఆ నిర్మాతలు ఇలాంటి ప్రకటనలు చూసి ఆ సినిమా అద్భుతంగా శతదినోత్సవాలు చేసుకున్న చిత్రం అని నమ్మి మోసపోయి వేరే భాషల్లో నిర్మించడం కోసం ఎక్కువధర పెట్టి కొనుక్కోవడం జరుగుతుంది. ఈవిధంగా దేనికీ పనికిరాని చిత్రాన్ని ఎక్కువ ధరకు అమ్మి వచ్చిన నష్టాన్ని కొంత పూడ్చుకోవడం కోసం నూకల్రావ్ అలా చేయించాడు. ఈ విషయం తెలీని వరహాల్రావ్ తన సినిమా నిజంగానే వంద రోజుల చిత్రం అని నమ్మి మద్రాస్ హోటల్ కెళ్ళాడు. ఆ ప్రకటన బోగస్ ప్రకటన కనుక ఆ ఫంక్షన్ కూడా బోగస్ అన్న విషయం అతనికి తెలీదు"
    ఈవిధంగా నిర్మాతకు మౌనభంగం కాగానే సెన్సార్ బాక్స్ తో సహా తన ఆఫీస్ వేపు ఎగిరిపోయింది.
    
                                                * * *

 Previous Page Next Page