నగ్ననృత్యాల కథ
పట్టువిడువని నిర్మాత తిరిగి అర్దరాత్రి కాగానే సెన్సార్ ఆఫీసు చేరుకుని ఫిలిమ్ బాక్స్ భుజాన వేసుకుని ఊరివేపు నడువసాగాడు. అప్పుడు బాక్స్ లోని సెన్సార్ ఇలా అంది.
"గురూ! నీ అవస్థ చూస్తుంటే-ఇలాగే నెంబర్ వన్ స్థానం కోసం మొండిగా పోటీలు పడ్డ అక్కాచెల్లెళ్ళ అవస్థల కథ గుర్తుకొస్తోంది. టైటిల్స్ లేకుండా కథ ప్ర్రారంభించేస్తున్నాను. విను! ఆంధ్రదేశంలో మోతిలక్ష్మి, నాతిలక్ష్మి అనే ఇద్దరు అక్కా, చెల్లెళ్ళు ఉండేవారు. వాళ్ళమ్మ విజయవాడలో రికార్డ్ డాన్స్ చేసేది. వాళ్ళ పెద్దమ్మ కాబరే డాన్స్ లు చేసేది. వాళ్ళ చిన్నమ్మ ఎక్కడ నాలుగు రోడ్ల సెంటర్ కనబడితే అక్కడ స్ట్రీట్ డాన్స్ చేసిపారేసేది. ఇంకో చిన్నమ్మ ఇంకేదో రకం బెల్లీ డాన్స్ లు చేసేది. ఇలా కుటుంబం మొత్తం ఎక్కడ పడితే అక్కడ డాన్స్ లు చేసేయడం చూసి మోతిలక్ష్మి, నాతిలక్ష్మి తాము కూడా సినిమాల్లో చేరి, నృత్యాలు చేసి తెలుగు ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ మాట విని వాళ్ళమ్మ మురిసిపోయింది. వెంటనే ఓ డాన్స్ మాష్టారుని పిలిచి చవగ్గా బేరమాడి మోతిలక్ష్మికి, నాతిలక్ష్మికి భరతనాట్యం నేర్పించసాగింది. అయితే ఆ డాన్స్ టీచర్ రెండు నెలలు ప్రయత్నించి, మూడోనెలలో వాళ్ళమ్మకో నమస్కారం పెట్టి "అమ్మాయిలకు కథాకళి నేర్పిస్తే బావుంటుంది. వాళ్ళు చేసే కదలికలన్నీ దానికి ఖచ్చితంగా సరిపోతాయ్" అన్జెప్పి తప్పుకున్నాడు. వెంటనే ఆమె కథాకళి మాష్టారుని పిలిపించింది. ఆయన కొంత కాలం నానా తిప్పలూ పడి "వీళ్ళకి ఒడిస్సీ అయితే బాగా వంటపడుతుంది. ఒరిస్సా నుంచి డాన్స్ మాష్టారిని పిలిపించండి" అంటూ అడ్రసిచ్చి పారిపోయాడు. ఒడిస్సీ డాన్స్ మాస్టారు ఓ సంవత్సరం కుస్తీలు పట్టి "అబ్బే... వీళ్ళకు కూచిపూడే సరయిన స్థానం! వాళ్ళ స్టెప్స్ చూస్తూంటేనే తెలిసిపోతోందా విషయం" అనేసి అర్జంటుగా ఒడిస్సీ చేస్కుంటూ వెళ్ళిపోయాడు. వెంటనే వాళ్ళమ్మ ఇద్దరినీ టాక్సీలో వేసుకుని కూచిపూడి తీసుకెళ్ళింది. చేర్పించి రెన్నెలయినా అవకముందే ఆ స్కూలు వాళ్ళు ఆ యిద్దర్నీ తీసుకొచ్చి "మీ అమ్మాయిలకు డిస్కోస్టెప్స్ పడుతున్నాయ్. డిస్కోడాన్స్ లు నేర్పించారంటే తారాజువ్వల్లా పైకిపోతారు" అన్జెప్పి వాళ్ళదారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
ఇదీ బాగానే ఉందనుకుని ఇద్దరు ఆంగ్లో ఇండియన్ పిల్లల్ని ఇంగ్లీష్ డాన్స్ లు నేర్పించడానికి పెట్టిందామె. వాళ్ళు ఆర్నెల్లు జీతం తీసుకుని ఏడోనెల "వీళ్ళు అసలు డాన్స్ ఫ్రూఫ్! ఏ డాన్సూరాదు" అన్జెప్పి వెళ్ళిపోయారు.
ఏంచేయాలో తెలీక వాళ్ళిద్దరినీ వెంబడేసుకుని మద్రాసు చేరుకుని అక్కడ ఎంతో కాలం నుంచీ చిల్లర డాన్స్ లు చేస్తూ జీవితం గడుపుతున్న తన స్నేహితురాలింట్లో దిగింది.
అప్పుడే స్నేహితురాలింటికి ఓ ప్రొడ్యూసర్ వచ్చి "సినిమాల్లో డాన్స్ చేయడం ఎలా?" అన్న పుస్తకం చదువుతూ కూర్చున్న మోతిలక్ష్మి, నాతిలక్ష్మిలను చూచి ముచ్చట "హలో హౌ యూడూ?" అన్నాడు ఇంగ్లీషులో.
అన్నదే తడవుగా "వుయ్ డూ ఇన్ మెనీ వేస్ అండీ! అన్ని రకాల డాన్స్ లూ నేర్చుకున్నాం! కూచిపూడి, మంగినపూడి, కథాకళి, గిధాకళి, భరతనాట్యం, శతృఘ్ననాట్యం, డిస్కోడాన్స్ లు, రిస్క్ డాన్సులూ, హస్క్ డాన్సులూ అన్నీ వచ్చు! కావాలంటే చూడండి" అంటూ ఠకీమని డాన్స్ మొదలెట్టారు.
వాళ్ళ వళ్ళు విరుపులు చూసి ప్రొడ్యూసర్ కి మతి పోయినట్లయింది. అలాంటి డాన్స్ ఇంతవరకూ ఎక్కడా చూడలేదతను. అలాంటి కొత్త తరహా వళ్ళు విరుపులుంటే సినిమా తప్పక శతదినోత్సవం చేసుకుంటుందనిపించి అప్పటికప్పుడు ఎగ్రిమెంటు మీద సంతకాలు పెట్టించుకుని ఆనందంగా వెళ్ళిపోయాడు.
వాళ్ళిద్దరూ కలసి ఆరు నిముషాలపాటు డాన్స్ చేసిన సినిమా రిలీజయింది. వాళ్ళు చేసింది ఏం డాన్సో ఎవరికీ ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు. కొంతమంది నృత్యదర్శకులు ఆ డాన్స్ చూచి ఆత్మహత్య చేసుకున్నారు. ఏదేమయినా ఆ సినిమా కేవలం ఆ డాన్స్ వల్లే యాభయ్ రోజులు ఆడిందని అందరూ ఒప్పుకున్నారు.
"అదంతా నా ప్రతిభ అంటే నా ప్రతిభ" అని మోతిలక్ష్మి, నాతిలక్ష్మి దెబ్బలాడుకుని విడిపోయారు. దాంతో ప్రేక్షకులు కూడా "మోతిలక్ష్మి అభిమానసంఘం, నాతిలక్ష్మి అభిమాన సంఘం" అని రెండుగా చీలిపోయారు. వాళ్ళిద్దరికీ మధ్య తీవ్రమయిన పోటీ ఏర్పడింది.
సినిమాఫీల్డులో నెంబర్ వన్ గా రాణించాలన్నా, బతికి బట్టకట్టాలన్నా బట్టలూడదీయడమే పరమ మార్గమని తెలుసుకున్న మోతులక్ష్మి తన నెక్స్ట్ పిక్చర్ లో గుండెలు సగం కనబడే లోనెక్ జాకెట్ వేసుకుని డాన్స్ చేసింది. ఆ సినిమా అమాంతం యాభయ్ రోజులాడింది. ఆ యాభయ్ రోజులు కూడా ప్రేక్షకులు కేవలం ఆ డాన్స్ టైముకి హాల్లోకొచ్చి డాన్స్ అవగానే ఇళ్ళకెళ్ళి పోతుండేవాళ్ళు. ఇజ్జూసి ప్రొడ్యూసర్లందరూ మోతిలక్ష్మి ఇంటిముందు "క్యూ" కట్టారు.
దీంతో నాతిలక్ష్మికి వళ్ళు మండిపోయింది. తను వెంటనే ఓ సినిమాలో తొడలు నగ్నంగా చూపుతూ డాన్స్ చేసింది. దాంతో తొడలను అభిమానించే ప్రేక్షకులందరూ చందాలేసుకుని ఆ సినిమాని డెబ్బై రోజులు లాగించేరు. ఈ సంగత్తెల్సి ప్రొడ్యూసర్ల లైనులైనంతా నాతిలక్ష్మి ఇంటివేపు జరిగింది. ఈ విషయం విని మోతిలక్ష్మి రెండురోజులు ఏం చేయాలా అని ఆలోచించి తన తరువాతి సినిమాలో ఛాతీకింద నుంచీ బొడ్డు కిందివరకూ, బొడ్డు స్పష్టంగా నగ్నంగా కనబడేట్లు బట్టలు లేకుండా డాన్స్ చేసింది. బొడ్డు అభిమానుల సంఖ్య విపరీతంగా ఉండడంతో ఆ సినిమా తెలుగు దేశమంతా వందరోజులాడి వీరవిహారం చేసేసింది. దాంతో ప్రొడ్యూసర్ల "క్యూ" మళ్ళీ మోల్తిలక్ష్మి ఇంటివేపు జరిగింది. ఇదిచూసి నాతిలక్ష్మికి పూనకం వచ్చినట్లయింది.
"ఓహో బొడ్డుకిందకు బట్ట కడుతుందేం? సరే! అదింతటి స్థితికి దిగజారితే నేను ఇంకా కిందకు దిగజారగలను" అనుకుని పైన జాకెట్ తీసి విసరవతల పారేసి ఓ సన్నని బ్రాసరీ మాత్రం వుంచుకుని, నడుముకి జానెడు పొడుగున్న లంగా కట్టుకుని డాన్స్ చేసింది. దాంతో జనం ఆ డాన్స్ కి బ్రహ్మరథం పట్టి ఆ సినిమాని రెండువందలరోజులు చూశారు. ప్రొడ్యూసర్ల లైను మామూలుగానే ఇటు జరిగింది.
మోతిలక్ష్మి ఉక్రోషం పట్టలేక వెంటనే నెక్స్ట్ పిక్చర్ లో బ్రాసరీ కూడా తీసి అవతల పారేసింది.
నాతిలక్ష్మి ఇలాక్కాదని మొత్తం బట్టలన్నీ తీసవతల పారేసి సెన్సార్ వాళ్ళ కోసమని రెండు డారాలు పైన ఒకటి కింద ఒకటీ కట్టుకుని డాన్స్ చేసింది. ఈ విషయం తెలిసి తనూ అలాగే డాన్స్ చేసింది మోతిలక్ష్మి. కాని ఈ రెండు సినిమాలు రెండోరోజునే ఎత్తేయాల్సి వచ్చింది. ఆ తరువాత అలా డాన్స్ చేసిన సినిమాలన్నీ కూడా మట్టికొట్టుకుపోయాయ్"
ఇంతవరకూ చెప్పిన సెన్సార్ ఇలా అంది. "నిర్మాతా! బట్టలూడదీయటాన్ని ప్రోత్సహించి ఆదరించిన ప్రేక్షకులే, పూర్తిగా బట్టలు విప్పేసరికి చిత్రాలు ఎందుకు తిరస్కరించారు. ఆ తర్వాత వాళ్ళిద్దరిగతి ఏమయింది? ఈ ప్రశ్నలకు తెలిసీ సమాధానం..."
"సమాధానం చెప్తున్నాలే-అరిగిపోయిన రికార్డ్ వేయకు! మాంచి వంపు సొంపులున్న మోతిలక్ష్మి, నాతిలక్ష్మిల సౌందర్యం చూడాలని ప్రేక్షకులు ఉవ్విళ్ళూరడం సహజమే. అందుకే వారి నగ్న విన్యాసాల్ని ప్రోత్సహించి ఆదరించారు. కానీ ఇక్కడో రూలుంది.
గుప్పిట మూసి ఉంచినంత కాలమే లోపల ఏముందోనన్న కుతూహలం అందరికీ ఉంటుంది. ఓసారి తెరుస్తే ఇంకెవరూ కన్నెత్తి చూడరు.
మోతిలక్ష్మి, నాతిలక్ష్మిల కథ కూడా ఇంతే అయింది. కనబడీ కనబడకుండా వంపు సొంపుల్ని ప్రదర్శించి, ఊరించినంత కాలం వారిని ప్రేక్షకులు వెర్రిగా ఆదరించారు. ఆరాధించారు. కానీ వారు పూర్తిగా నగ్నమయేసరికి "ఓశ్ ఇంతేకదా" అన్నభావం ఏర్పడి ఇక చూడడం మానేశారు. అంచేత ఆ తరువాత వారికిక మళ్ళీ సినిమాల్లో అవకాశాలు రావడం కల్ల- వారికి మిగిలిన మార్గం ఒక్కటే- వాళ్ళ సొంతూరు విజయవాడ చేరుకుని రికార్డ్ డాన్స్ లు చేయడమే!"
ఈవిధంగా నిర్మాతకు మౌనభంగం కాగానే సెన్సార్ బాక్స్ తో సహా సెన్సార్ ఆఫీస్ వేపు ఎగిరిపోయింది.
* * *