బూతు సినిమా కథ
పట్టువిడువని నిర్మాత తిరిగి సెన్సార్ ఆఫీసు చేరుకుని ఫిలింబాక్స్ భుజాన వేసుకుని నడక ప్రారంభించేసరికి బాక్స్ లోని సెన్సార్ కథ ప్రారంభించేసింది.
"అనగనగా తిరునాళ్ళు అనే ఊళ్ళో పెరుమాళ్ళు అనే వ్యాపారస్తుడున్నాడు. అతగాడు చిన్నప్పటి నుంచీ కల్తీ పదార్దాలే తిని పెరిగాడు. అంచేత ఎప్పుడూ "ధనమేరా అన్నిటికీ మూలం- సంపాదనకు కల్తీయేరా తేలిక మార్గం" అని పాడుతూండేవాడు. అలా పాడుతూ ఆడుతూ కల్తీ వ్యాపారాలు ప్ర్రారంభించేశాడు.
బియ్యంలో రాళ్ళు, సెనగ పిండిలో నలుగుపిండి, సిమెంటులో బూడిద, బూడిదలో పన్నీరు, పన్నీట్లో చన్నీళ్ళు ఇలా ఝుమ్మని బిజినెస్ లు చేసి కొంత డబ్బు సంపాదించాడు గానీ ఆ సంపాదన అతనికి సంతృప్తి కలిగించలేదు. ఇలా ఇన్ని రకాల కల్తీ వ్యాపారాలు చేసి కొంత డబ్బు సంపాదించడం కంటే ఒకే ఒక్క కల్తీ సినిమా వ్యాపారం చేస్తే కోటీశ్వరుడు కావొచ్చని అతని స్నేహితులు సలహా ఇచ్చేరు. వెంటనే కల్తీ కిర్సనాయిలు టాక్సీ ఒకటి మాట్లాడుకుని మద్రాసు చేరుకున్నాడు. అక్కడ పాండీ బజార్లో ఓ కల్తీ దైరెక్టరుని కొనుక్కుని హోటల్ రూమ్ కి తీసుకెళ్ళాడు.
"మనం మాంచి కల్తీ సినిమా తీయాలి! కల్తీ సినిమా అంటే కథా, నటీనటులు, ఇతర టెక్నికల్ విషయాల మీద ఆధారపడకుండా కేవలం సెక్స్ ని సినిమాలోకి కల్తీ చేసేసి కోట్లు సంపాయించాలి!" అన్నాడు డైరెక్టరుతో.
"ఓశ్! ఇంతేనా! అదెంతపని! వారంరోజుల్లో సినిమా పూర్తి చేసి మీ చేతికిస్తాను. టైటిల్ కూడా నా దగ్గర రడీగా వుంది. కావాలంటే రాసుకోండి- 'రేప్ నీదే'. అందులో మొదటి నుంచీ చివరి వరకూ రేప్ సీన్లే! ముందు హీరో వాళ్ళ పనిమనిషిని రేప్ చేస్తాడు. పనిమనిషి అన్నయ్యకీ విషయం తెలిసి ప్రతీకారంగా హీరో మేనత్తను రేప్ చేస్తాడు. ఆ మేనత్తకు వళ్ళుమండి తనింట్లో అద్దెకున్న నలుగురు కాలేజి కుర్రాళ్ళను రేప్ చేస్తుంది. ఈలోగా విలన్ హీరోయిన్ నిరేప్ చేస్తాడు. ఇలా ఎవరు ఎవరిని రేప్ చేస్తున్నారో తెలీక ప్రేక్షకులకి పిచ్చెక్కిపోయే సమయంలో మనం 'శుభం' అన్న అక్షరాలు వేస్తామన్నమాట. ఆ అక్షరాలు వేయడం కూడా వెరయిటీ. 'శు' అనే అక్షరం 'భం' అనే అక్షరాన్ని రేప్ చేస్తున్నట్లు డిజైను చేయిస్తామన్నమాట" అన్నాడు డైరక్టర్ అల్లుకుపోతూ.
అంతమంది డైరెక్టర్ దొరికినందుకు పెరుమాళ్ళు ఆనందం పట్టలేక అతనిని కౌగలించుకుని భోరున ఏడ్చాడు.
వారం రోజుల్లో షూటింగు మొదలయిపోయింది.
విలన్ హీరోయిన్ ని రేప్ చేసే శీను అయిదారు టేక్ లు తీసినా పెరుమాళ్ళకు తృప్తి కలుగలేదు.
"ఇంకా సెక్సీగా, సహజంగా రాహలహ" అన్నాడు కల్తీ వక్కపొడి నముల్తూ.
మళ్ళీ ఓ టేక్ తీశాడు డైరెక్టరు.
"ఉహు! ఇంకా నేచురాలిటీ రాహలహ" అన్నాడు పెరుమాళ్ళు.
దర్శకుడు ఆలోచించి యాక్షన్ లో మరింత సహజత్వం కనబడేట్లు మార్పులు చెప్పి మళ్ళీ టేక్ ప్ర్రారంభించాడు.
హీరోయిన్ ని భల్లూకంలా కౌగలించుకున్నాడు విలన్. హీరోయిన్ కీచు పిట్టలా కెవ్వు కెవ్వున అరుస్తూ విలన్ ని గట్టిగా సినిమా గోళ్ళతో రక్కుతూ, కొడుతూ తప్పించుకోడాన్జికి ప్రయత్నించసాగింది. అయినాగాని, పట్టువదలకుండా ఆమె చీర లాగిపారేసి, జాకెట్ ముక్కలు చేసి పారేశాడు విలన్. ఇద్దరూ మంచం మీదపడ్డారు. అక్కడ కాసేపు పెనుగులాడాక నేలమీద పడి మంచం కిందకు దొర్లాడు. కెమెరామెన్ కూడా కింద పడుకుని కెమెరా తన చేత్తో పట్టుకుని ఆ దృశ్యం చిత్రీకరిస్తున్నాడు.
విలన్ ముఖం నిండా గాట్లుపడి రక్తం చిమ్మసాగింది. హీరోయిన్ మరీ గట్టిగా "రక్షించండి-రక్షించండి" అని అరవసాగింది. అతని నుంచి తప్పించుకోడానికి గిలగిలకొట్టుకుంటూ విశ్వప్రయత్నం చేయసాగింది. చివరకు అరచి అరచి అలసిపోయి తలవాల్చేసింది.
"కట్" అని అరిచాడు డైరెక్టరు.
"వండర్ ఫుల్ షాట్" అన్నాడు పెరుమాళ్ళు.
విలన్ హీరోయిన్ ని వదిలివేశాడు. హీరోయిన్ ఒగారుస్తూ నీరసంగా లేచి బట్టలు సరిచేసుకుని కూర్చుంది.
"బ్రహ్మాండంగా నటించారు? సూపర్బ్!" అన్నాడు పెరుమాళ్ళు ఆమెతో.
"నటనా-వల్లకాడా! ఆ రాస్కెల్ నన్ను నిజంగానే చెరిచాడు. రక్షించమంటూ నేను ఎన్నికేకలేసినా మీరు ఒక్కరేనా సాయానికొచ్చి అఘోరించలేదుకదా" అంది హీరోయిన్ కోపంతో మండిపడుతూ.
అంతా నివ్వెరపోయారు. విలన్ తప్పు చేసినట్లు తలవంచుకున్నాడు.
"నిజంగా రేప్ చేశాడా?" అడిగాడు పెరుమాళ్ళు ఆనందం పట్టలేక.
"లేపోతే నేనెందుకలా పిచ్చెక్కినట్లు అరుస్తున్నాననుకున్నారు? ఏది నిజం రేపో, ఏది అబద్దం రేపో తెలీని ఇడియట్స్ దొరికారందరూ" అందామె అగ్గిమీద గుగ్గిలంలా ఇంకా మండిపడుతూ.
"అబ్బ! ఎంత అదృష్టం! అయితే సినిమా శతదినోత్సవం చేసుకోవడం ఖాయమన్నమాట!" అన్నాడు పెరుమాళ్ళు ఆనందంగా.
"అదెలా? ఈ దృశ్యాన్ని సెన్సార్ వాళ్ళు ఊచకోత కోస్తారు" అన్నాడు డైరెక్టర్.
"వాళ్ళని బోల్తా కొట్టించడం ఎంతలోకి? వాళ్ళకి చూపించే ప్రింట్ లో ఈ శీను ఉండదు. కానీ- రిలీజ్ చేసే ప్రింట్ లో ఉంటుంది. అప్పుడింకేం చేస్తారు వాళ్ళు?" అన్నాడు పెరుమాళ్ళు. అలాగే సినిమా రిలీజయింది.
ఎంతోకాలం నుంచి తిండిలేనివాడికి హఠాత్తుగా పంచభక్ష పరమాన్నాలు కనుపించినట్లు ఆ నిజం రేప్ సీన్ చూడ్డానికి జనం ఎగబడిపోయారు. బ్లాకులో ఒకోటికెట్టుకి యాభైరూపాయలు రేటు పలికింది.
ఓ పెద్దమనిషి బ్లాకులో టిక్కెట్లు కొని సినిమా చూసి మూర్చబోయాడు. ఇలాంటి సెక్స్ సినిమాలు చూసిన తరువాతే తన ముద్దుల కూతురు మరాఠీ కుర్రాడితో లేచిపోయిందన్న విషయం గుర్తుకొచ్చి వెంటనే ఎర్రసిరాతో సినిమా మీద చడామడా రాసి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ, కేంద్రమంత్రులకూ, కామన్వెల్తు దేశ అధిపతులకూ, మన సెన్సార్ బోర్డ్ వారికి తలో కాపీ పంపించాడు.
వెంటనే సెన్సార్ వాళ్ళు ఆ సినిమా కెళ్ళి అందులో నిజం రేప్ సీన్ ఉండడం చూసి ఆశ్చర్యంతో స్పృహ తప్పారు. కాసేపయిన తర్వాత మళ్ళీ స్పృహ తెచ్చుకుని ఆ ఫిలిం ప్రింటుని పోలీసుల సహాయంతో తమ ఆఫీసుకు తీసుకుపోయి దాని పొడుగు కొలచి చూచారు. సరిగ్గా ఆ రేప్ సీనంత మేరకు పొడుగు ఎక్కువ కనిపించింది. దాంతో వాళ్ళ ఒళ్ళుమండి ఆ సినిమా తాలూకు ప్రింటన్నీ లాక్కుని వాళ్ళ గోడౌన్ లో పారేశారు. అయితే అప్పటికే పెరుమాళ్ళుకి బోలెడు లాభాలు వచ్చేసినయ్. అంచేత ఆ లాభాలు పెట్టి మళ్ళీ ఇంకో సినిమా ప్ర్రారంభించాడు. ఆ సినిమాలో ఒక సీన్లో అంతకు ముందెన్నడూ ఏ సినిమాలోనూ లేనంతటి సెక్స్ జొప్పించేశాడు. అతనూహించినట్లే సెన్సార్ వాళ్ళు ఆ దృశ్యం కట్ చేసి విసిరవతల పారేశారు.
"థాంక్యూసర్" అన్నాడు పెరుమాళ్ళు.
సినిమా రిలీజయింది.
అందులోకూడా సెన్సార్ కట్ చేసిన దృశ్యం కంటే దారుణమయిన దదృశ్యం మరోటి ఉండడం చేత దాని టికెట్లకు బ్లాకులో వంద రూపాయల రేటు పలకసాగింది.
అదివరకటి పెద్దమనిషే మళ్ళీ ఈ సినిమా కూడా చూసి, ఈసారి బెంగాలీ కుర్రాడితో లేచిపోయిన తన భార్యను గుర్తు తెచ్చుకుని మళ్ళీ ఆ సినిమా మీద కొన్ని వేల పితూరీలు తయారుచేసి సెన్సార్ వాళ్ళకి పార్శిల్ చేసి పంపించాడు.
సెన్సార్ బోర్డు మెంబర్లు మళ్ళీ సినిమా చూసి ప్రింటు లాక్కుపోయి పొడుగు కొలిచారు. ఈసారి పొడుగు సరిగ్గా సరిపోయేసరికి వాళ్ళకి మతిపోయినట్లయింది. అంటే పెరుమాళ్ళు తాము కట్ చేసిన దృశ్యాన్ని తిరిగి అతికించలేదన్నమాట. అయితే మరి ఇంత దారుణమయిన దృశ్యాన్ని తాము ఎలా అంగీకరించనట్లు? ఏమీ తోచలేదు వాళ్ళకు!"
ఇంతవరకూ చెప్పి సెన్సార్ ఇలా అంది.
"నిర్మాతా! ఈ సినిమాకు పెరుమాళ్ళు చేసిన ట్రిక్ ఏమిటి? అతను కొత్త బూతు దృశ్యం సెన్సారయ్యాక అతికించాడా? ఒకవేళ అతికించినట్లయితే మరి ఆ ఫిలిం పొడుగు ఎట్లా సరిపోయింది! ఒకవేళ ఆ దృశ్యాన్ని అంతకుముందు సెన్సారింగ్ కి వచ్చినప్పుడు సెన్సార్ అంగీకరించిందా? అంగీకరించకపోయినట్లయితే ఇప్పుడు సెన్సార్ చేయగలిగిందేమిటి? ఈ ప్రశ్నలకు...."
"ష్" అడ్డు తగులుతూ అన్నాడు నిర్మాత.
"సమాధానం నాకు తెల్సులే! పెరుమాళ్ళు ఈసారి చాలా తెలివిగల పనిచేశాడు. కట్ చేసిన దృశ్యం మళ్ళా అతికిస్తే పొడుగు తేడా వస్తుందని అతనికి తెలిసిపోయింది. అందుకని ఒకటే నిడివిగల బూతు దృశ్యాలు రెండు చిత్రీకరించి అందులో ఒకటి సెన్సారుకి చూపాడు. వాళ్ళు అది కట్ చేసేరు. అప్పుడు రెండో దృశ్యానికి సమానమయిన నిడివిగల మరో సాదా దృశ్యాన్ని తొలగించి దాని స్థానంలో ఆ రెండో బూతు దృశ్యం పెట్టాడు. కనుక సెన్సారు వాళ్ళకు నిడివిలో తేడా కనుపించలేదు. కానీ ఆ దృశ్యం కొత్తగా కనిపించి అదివరకు తామెలా అంగీకరించామా అన్న కలవరం కలుగజేసింది. ఏదేమయినా సెన్సార్ అప్పుడు చేయగలిగింది ఏమీలేదు. ఆ దృశ్యం కట్ చేసి మళ్ళీ రిలీజ్ చేసుకోమని సలహా ఇవ్వడం- లేదా మొత్తం ప్రింట్సు అన్నీ సీజ్ చేసుకుని గోడౌన్ లో పడేసేయడం. ఏం చేసినా గాని పెరుమాళ్ళుకి మాత్రం ఏమీ నష్టంలేదు. ఎందుకంటే అప్పటికే అతనికి ఆ ఒక్క దృశ్యం వల్ల బోల్డంత లాభం వచ్చి ఉంటుంది!"
ఈవిధంగా నిర్మాతకు మౌనభంగం కాగానే సెన్సార్ బాక్స్ తో సహా ఎగిరిపోయింది.
* * *