మొదటినుంచి సభ్యసమాజానికి దూరంగా పెరిగిన గౌరికి కృత్రిమ మర్యాదలూ, నాగరికతా తెలియవు. అందువల్లనే ఆమెకు ప్రకాశంను ప్రకాశం అనీ, చంద్రాన్ని చంద్రం అని పిలవటానికి అట్టేకాలం పట్టలేదు. ప్రకాశం దగ్గర గౌరికి మరీ చనువు. కాని చంద్రం అంటే ఆమెకు ఓ విధమైన భయం. గౌరికి తనంటే ఇష్టమనీ, ఆ ఇష్టం ఇంకేరూపాన్నయినా దరించగలదనీ తెలుసుకున్న చంద్రం గౌరితో అంత చనువుగా వుండటం మంచిది కాదని ముభావంగా వుండేవాడు.
ఆ రోజు ప్రకాశం ఊరికి వెళ్ళడానికి తయారవుతున్నాడు. గౌరి ప్రకాశం బట్టలూ, సామానులూ సూటుకేసులూ సర్దుతూంది. అప్పుడే షికారుకు వెళ్ళిన చంద్రం తిరిగి వచ్చాడు.
"చంద్రం! నేనొక అర్జంటు పనిమీద తెనాలి వెళ్ళుతున్నాను. ఎల్లుండికి వచ్చేస్తాను" అన్నాడు ప్రకాశం అద్దంముందు నిల్చొని తలదువ్వుకుంటూ.
"నేను కూడా రేపు వెళ్ళిపోతున్నాను. ఆ విషయం నీకెలా చెప్పటమా అని ఆలోచిస్తూ వున్నాను" అన్నాడు చంద్రం ఉదాసీనంగా.
ప్రకాశం ఓ క్షణకాలంపాటు చంద్రం ముఖంలోకి విస్తుబోయి చూశాడు.
"నువ్వు వెళ్ళిపోతావా? ఎక్కడకు?"
"విధి ఎక్కడుకు తీసుకెళితే అక్కడకే! నేను వచ్చిన పని అయిపోయింది."
"ఏమిటాపని?" కొంచెం మందలిస్తున్నట్లున్న స్వరంతో అడిగాడు ప్రకాశం.
"కేవలం నిన్నూ, నాన్నను చూడాలనీ, మా అన్నయ్యకు నేను దొంగిలించానని భావించిన డబ్బు తిరిగి ఇచ్చేయాలనీ వచ్చాను. అనుకోకుండా అయినవాళ్ళంతా దగ్గరయి, మళ్ళీ ఇట్టే దూరం అయ్యారు. నాన్నను చూడలేకపోయాను. నిన్ను చూశాను."
సామాను సర్దుతున్న గౌరి చేతులు పని మానేశాయి. ఆదుర్దాగా చంద్రం ముఖంవైపు చూస్తూ వుండిపోయింది. అది గమనించిన చంద్రం "పిచ్చిపిల్ల! ఏమిటో ఈ అనుబంధం?" అనుకున్నాడు మనసులోనే.
ప్రకాశం మాట్లాడలేదు. అతని మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నాడు చంద్రం. మనసు ఎందుకో చివుక్కుమంది.
"ప్రకాశం! నీ రుణం నేను ఇంకా నాలుగు జన్మలెత్తినా తీర్చుకోలేనిది. కాని, ఒకటి చేశాను నీ అనుమతి లేకుండా."
"ఏమిటి?" ప్రకాశం గొంతులోని తీవ్రతకు గౌరి పెద్ద కళ్ళు ఇంకొంచెం పెద్దవయ్యాయి. ప్రకాశం ముఖంలోకి ఆందోళనగా చూసింది.
"నా పేరున ఢిల్లీ బ్యాంకులో ఉన్న పదివేల రూపాయలు ఇక్కడ బ్యాంకుకు ట్రాన్సుఫర్ చేయించాను. అవి నీ పేరున వేశాను."
"మహా గొప్పపని చేశావు. మా అప్పును చక్రవడ్డీకట్టి తీర్చినట్టున్నావు!" ఉబికి వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు ప్రకాశం.
"నన్ను అపార్థం చేసుకోకు ప్రకాశం! మానవుడు ఎప్పుడూ ఆత్మసంతృప్తికోసం, ఆనందంకోసం పాకులాడుతాడు. చిన్నప్పటినుంచీ నేను అన్ని ఆనందాలకూ దూరంగానే పెరిగాను. మానవుడు 'నా' అనే వ్యక్తులకోసం బతుకుతాడు. తన సంపాదనతో, తను చేసేపనులతో తనవారిని ఆనందపరచి తను ఆనందపడాలని తాపత్రయపడతాడు. నాకు నీకంటే ఎవరూ లేరు. నాకాడబ్బు ఒక సత్కార్యానికి లభించింది. దాన్ని నేను వాడుకోవటంలో నాకు ఆనందం వుండదు. నావాళ్ళకు దాన్ని ఇవ్వగలిగితేనే నాకు ఆనందం - కాదనకు ప్రకాశ్!" అంటూ చంద్రం ప్రాధేయపూర్వకంగా యాచించాడు.
"పోనియ్, ఆ డబ్బుతో గౌరిని చదివించు. ఆమెకోసం ఖర్చు చెయ్యి."
ప్రకాశం ఆలోచిస్తూ కూర్చున్నాడు.
"ఇంకొక విషయం. నా ఆస్తినంతా నీ పేరనే వ్రాశాను. ఇవాళ్ళే రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఆ డబ్బుతో గౌరిలాంటి కొందరు అనాధల్ని ఉద్ధరించు. సత్కార్యానికి వుపయోగించు. ఈ విశాల ప్రపంచంలో నేను బతకగలను. నాకివన్నీ అక్కరలేదు." ప్రశాంతంగా చెప్పుకు పోతున్నాడు చంద్రం.
ప్రకాశం ఒక్కసారిగా చంద్రాన్ని తన రెండు బాహువుల్లో బిగించాడు. ఉద్రేకం, ఉదారత్వం - రెండూ ఒకదాన్ని ఒకటి పెనవేసుకున్నాయి.
ప్రకాశం తనను తాను సంబాళించుకొని వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. చంద్రం, ప్రకాశం ముఖంలోకి అతని జవాబుకోసం ఆదుర్దాగా చూడసాగాడు.
ప్రకాశం ముఖంలో ఏదో నిర్ణయం కనిపించింది చంద్రానికి.
"నువ్వంత ఇదిగా ఇస్తున్న దేన్నీ నేను కాదనలేను. ఆ దస్తావేజులు ఎక్కడ?" చిరునవ్వుతో ఉత్సాహంగా అడిగాడు ప్రకాశం.
చంద్రం సంతోషంగా లోపలకు వెళ్ళి తన పెట్టెలో వున్న దస్తావేజులున్న కవరు తెచ్చి ప్రకాశంకు అందించాడు. అందుకోబోయిన ప్రకాశం చెయ్యి చటుక్కున వెనక్కుపోయింది. చంద్రం ప్రశ్నార్థకంగా చూశాడు.
"నాకు నువ్వొక మాట యివ్వాలి. అప్పుడే దీన్ని తీసుకుంటాను" అన్నాడు ప్రకాశం.
"ఏమిటది?" సందేహిస్తూ అన్నాడు చంద్రం.
"ముందు చేస్తానని మాటయిస్తేనే చెబుతాను."
"అలాగే, చంపక చెబుదూ?"
"అలాగే అంటేకాదు. నా చేతిలో చెయ్యివేసి ప్రమాణం చెయ్యి."
చంద్రం ఫక్కున నవ్వాడు. ప్రకాశం తెల్లబోయాడు. అయితే, ఇదంతా చంద్రం తమాషాగా చేసిందేనా? ఎందుకు చేశాడు? తనకు డబ్బు మీద ఆశ వుందో లేదోనని పరీక్షించటానికా? ప్రకాశం ముఖం చిన్నబోయింది.
"ఏంరా ప్రకాశం! మొన్న నేను విధి, కర్మ అన్నానని ఇంత పెద్ద ఉపన్యాసం దంచావే. మరి ఇప్పుడు నన్ను చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చెయ్యమంటున్నావు! అసలు కిటుకు అందులోనే వుంది. మనం ఎంత విజ్ఞానాన్ని ఆర్జించుకున్నా, ఆధునిక భావాలను అలవరచుకున్నా, పాశ్చాత్య భావప్రభావం ఎంత తన మీదపడినా, ఇలాంటి నమ్మకాలు మనకు తెలియకుండానే మన రక్తంలో జీర్ణించుకుని వుంటాయి. లేకపోతే నీలాంటివాడికి ఒట్టుమీద నమ్మకం ఏమిటోయ్, మనిషి మాటమీద వుండాలిగాని!"
ప్రకాశం వాదనలో దిగే మూడ్ లో లేడు. "ఏడిచావు లేరా! మరి నేను చెప్పినట్లు చేస్తావా?"
చంద్రం, ప్రకాశం చేతిని తన చేతిలోకి తీసుకుంటూ "నీవేం చెప్పినా చేస్తాను" అన్నాడు.
"అయితే, నువ్వు ఇక్కడ నుంచి ఎక్కడకూ వెళ్ళకూడదు. నువ్వు ఈ ఊరు వదలటంలోనే నీ క్షేమం వుందని నేను అనుకున్ననాడు నేనే నిన్ను పంపిస్తాను. ఇక నుంచి నీవు నా రక్షణలో వుంటావు - సరేనా?"
ప్రకాశం మాటలకు చంద్రం జవాబు ఇవ్వలేకపోయాడు. తల వంచుకుని మౌనంగా కూర్చున్నాడు.
అంతవరకూ ఊపిరి బిగపట్టి స్నేహితులిద్దరి మాటలు శ్రద్ధగా వింటున్న గౌరికి చంద్రం ప్రస్తుతం ఎక్కడకూ వెళ్ళటం లేదని మాత్రం అర్థమయింది. తేలికగా గాలి పీల్చుకుంది. అప్పుడు కాని ఆమెకు వంటింట్లోకి పొయ్యిమీద మాడిపోతున్న కూర వాసన రాలేదు. గబగబా లేచి వంటింటిలోకి వెళ్ళిపోయింది.
"ఏమిటిరా ఆ మౌనం? నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో" అన్నాడు ప్రకాశం విసుగ్గా.
"చాలా పెద్ద శిక్షే విధించావు ప్రకాశ్!" అన్నాడు చంద్రం నీరసంగా.
"మరి నువ్వు నాకు చేసిన అన్యాయం చిన్నదనుకుంటున్నావా? దానికి తగిన శిక్ష ఇదే. కాగితాలూ ఇలా ఇవ్వు" అంటూ చంద్రం చేతులలో కవరు అందుకున్నాడు ప్రకాశం. తర్వాత -
"ఏరా చంద్రం! మళ్ళీ ఒకసారయినా హేమను చూట్టానికి వెళ్ళావా?"చంద్రం మనస్సును అర్థం చేసుకున్న ప్రకాశం ప్రశ్నించాడు.
హేమ పేరు వినగానే చంద్రం కళ్ళల్లో కదిలిన కాంతి రేఖలను గమనించాడు ప్రకాశం.
"ఏ ముఖం పెట్టుకొని హేమ దగ్గరకు వెళ్ళమంటావ్?" అన్నాడు చంద్రం చిన్నబుచ్చుకున్న ముఖంతో.
"నీకు అసలు వున్నదే ఒక ముఖం! అసలు వచ్చిన చిక్కే అది, ఏం చేస్తాం? అదే పెట్టుకొని వెళ్ళు. లోకంలో చాలామందికి ఒక ముఖంకంటె ఎక్కువే వుంటాయి ఎప్పుడు ఏది అవసరమో దాన్ని ధరిస్తూ వుంటారు. అలాంటివారే ప్రపంచంలో బ్రతకగలరు. వాళ్ళనే లౌక్యం తెలిసినవాళ్ళు అంటారు. అయినా నువ్వు తప్పేం చేశావని? అసలు విషయం చెప్పు. హేమ అంత అర్థం చేసుకోలేని మూర్ఖురాలని నేను అనుకోను" అన్నాడు ప్రకాశం.
ప్రకాశం ప్రోత్సాహంతో చంద్రం హృదయంలో ఆశలపందిరి వెల్లివిరిసింది.
"నాకు బండికి టైమవుతూంది. నువ్వెళ్ళి కాళ్ళూచేతులూ కడుక్కుని బట్టలు మార్చుకో, భోజనం చేసేద్దాం" అన్నాడు ప్రకాశం చంద్రం వీపుమీద చరుస్తూ.
"ఉండరా బాబూ!" అంటూ వీపు తడుముకుంటూ నవ్వుతూ బాత్ రూమ్ కు వెళ్ళాడు చంద్రం. టవల్ తో ముఖం తుడుచుకుంటూ లోపలకు వస్తున్న చంద్రానికి కాగితాలు కాలిన వాసన వచ్చి, వంటింటి గడపలో నిల్చొని లోపలకు చూశాడు. ప్రకాశం కుంపటిదగ్గర కూర్చొని వున్నాడు. కుంపట్లో కాగితాలు కాలుతున్నాయి. పక్కన తను అంతక్రితం దస్తావేజులు పెట్టి ఇచ్చిన కవరు పడివుంది!