Previous Page Next Page 
డా || వాసిరెడ్డి సీతాదేవి రచనలు - 4 పేజి 31


                                         16

 

    ఆ రోజు కృష్ణారావు ఇంటిలో జరిగిన సంఘటన హేమ అభిమానాన్నీ, అహంభావాన్నీ, అభిజాత్యాన్నీ, గాయపరచింది. చంద్రంమీద ఒక విధమైన ద్వేషభావం మొలకెత్తింది ఆమెలో. కాని చంద్రం అంటే ఆమెలో ఏర్పడిన బలీయమైన ప్రేమ కొత్తగా ఉద్భవించిన ద్వేషభావం మీద అధికారం ప్రారంభించింది. ప్రేమ -ద్వేషం పోరాటం ప్రారంభమయింది ఆమెలో. ప్రేమిస్తున్న వ్యక్తిని ద్వేషిస్తున్నప్పుడు ఆ హృదయం నరకయాతననే అనుభవిస్తుందేమో! గంభీరంగా, ప్రశాంతంగా వుండే హేమ ముఖంలో ధైన్యమూ, చికాకూ, ఆవేదనా కనిపించసాగాయి. ఎప్పుడూ ఆలోచిస్తూ పరధ్యానంగా వుంటున్న హేమను చూసి ప్రసాదరావు లోలోపల కుమిలిపోసాగాడు.   

 

    ఆదివారం ప్రసాదరావు ఏదో పనిమీద బయటకు వెళ్ళిపోయాడు. హేమకు ఆ రోజు మరీ మనస్సు బాగాలేదు. ఉండి ఉండి ఆమె ఆలోచనలు చంద్రం వైపు పరుగెత్తసాగాయి. లైబ్రరీ గదిలో అటూ ఇటూ తిరగసాగింది. అంతకుముందు హేమకు ఆ గదికి వెళ్తే మళ్ళీ బయట ప్రపంచం గుర్తే వుండేది కాదు. కాని ఈమధ్య బొత్తిగా ఒక పుస్తకం కూడా చదవలేకపోతూంది.  

 

    ఏం చేసినా ఎంతకూ సమయం గడవని హేమ ఒక పుస్తకం తీసుకొనివచ్చి వసారాలో కూర్చుంది. గడియారం ఐదు కొట్టింది. నాన్న వచ్చే సమయం అయింది అనుకుంది. చేతిలోని పుస్తకం పట్టుదలగా చదవసాగింది. పేజీలు  తిరుగుతున్నాయి. కాని ఆమేమి చదవుతుందో ఆమెకే బోధపడటం లేదు.  

 

    ఆ రోజు ఆమె శరీరంలోని ప్రతి అణువు చంద్రం కోసం తపిస్తున్నట్లనిపిస్తూంది. చంద్రం మళ్ళీ తిరిగి తన జీవితంలో ప్రవేశించకుండా వున్నా బాగుండేది. మళ్ళీ తిరిగివచ్చి ప్రశాంత సరోవరంలా వున్న తన మనస్సులోకి రాయి విసిరాడు. ఎంత నాటకం! ఎన్ని అబద్ధాలు! ఆ కొద్ది క్షణాలల్లోనే తనను ఆశాసౌధాలకు ఎక్కించాడు. పుట్టుకతో పుట్టిన బుద్ధిని మార్చటం ఎవరితరం? చిన్నతనంలోనే దొంగతనం చేసి ఇల్లు విడిచి పారిపోయిన ఒక అల్పుణ్ణి తను ఆదర్శమూర్తిగా చిత్రించుకొని పూజించింది. తను చిన్నతనం నుంచీ హృదయ మాధుర్యాన్నంతా చిలకరించి ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న ప్రేమ వల్లరి, తెలివితక్కువగా కళ్ళుమూసుకొని నడవటంవల్ల, అది తన కాళ్ళకే చుట్టుకుంది. దాన్ని నిర్దయగా తెంచుకొని ముందుకుపోక తప్పదా?  

 

    హేమ ఆలోచనలు గౌరి వైపుకు మళ్ళాయి. మనస్సంతా జుగుప్సతో నిండిపోయింది. అడవిమల్లె - అట - అడవిమల్లె! ఎంత మొరటుగా వుంది? ఆ బజారు పిల్లను తనతో పోలుస్తాడా? తను ఇంతకాలం ఎదురు చూసింది ఇంత అతి సాధారణమైన అభిరుచులుగల మగవాడి కోసమా? అందరి ముందూ సిగ్గన్నా లేకుండా ఆ పిల్ల రెక్క పట్టుకొని ఎలా బర బర ఈడ్చుకుపోయాడు! ఎలాంటి సంబంధం లేకపోతే ఆ పిల్లమీద అతనికి అంత అధికారం వస్తుంది? హేమకు దుఃఖం పొర్లుకొచ్చింది.

 

    ఇక తను అతని ముఖం కూడా చూడదు. చంద్రం అంటే తనకు పరమ అసహ్యం.

 

    నిజంగా చంద్రాన్ని చూడకుండా తను వుండగలదా? అయితే ఎందుకీ అశాంతి? చంద్రం నిజంగా తనను ప్రేమించటం లేదా? అతను ఈ నెల రోజుల నుంచి ఒకసారైనా వచ్చాడా? నిజంగా చంద్రం వస్తే తనలో అతన్ని వెళ్ళిపొమ్మని చెప్పగల శక్తివుందా? హేమ ఆలోచనలు బలసిన గుర్రాలలా పరుగెత్తసాగాయి.  

 

    బయట అడుగుల చప్పుడుకు తలఎత్తి చూసింది. హేమ. ఎదురుగా చంద్రం! గోధుమ వన్నె టెర్లిన్ షర్టు, నల్లటి ట్వీడ్ పాంటు లోపలకు వేసుకున్నాడు. పైజమా - లాల్చీలో కంటే సొగసుగా అందంగా వున్నాడనుకుంది హేమ. చంద్రాన్ని చూడగానే హేమ ముఖం వెలిగిపోయింది సంతోషంతో. అంతవరకూ వున్న ఆలోచనలన్నీ ఒక్కసారి ఎక్కడికో పారిపోయాయి. తనలో వుబికి వస్తున్న ఆనందాన్ని అతికష్టంమీద అణచుకుంది. ముభావంగా, తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో అంది -

 

    "కూర్చో చంద్రం!"

 

    చంద్రం అపరాధిలా హేమకు ఎదురుగా వున్న కుర్చీలో మౌనంగా కూర్చున్నాడు. ఇద్దరి మధ్యా భరించరాని మౌనం. ఇంతలో వంటమనిషి హేమ కోసం కాఫీ తెచ్చింది. మరోకప్పు తెమ్మని చెప్పి తన చేతిలో కప్పును చంద్రానికి అందిస్తూ "కాఫీ తీసుకో చంద్రం!" అంది.

 

    కాఫీ కప్పును అందుకుంటూ చంద్రం హేమ ముఖంలోకి చూశాడు. నిర్వికారంగా వున్న హేమ ముఖం చంద్రానికి ఒక సమస్యగా మారింది. ఆనాటి సంఘటన ఆమెమీద ఎలాంటి ప్రభావాన్నీ కలిగించలేదా? ఏమీ జరగనట్లే వుంది!

 

    "మరి నీకో?" అంటూ కాఫీ కప్పును అందుకున్నాడు చంద్రం, ఆలోచనల నుంచి బయటపడుతూ.

 

    "ఇదుగో, నాకూ వచ్చింది" అంటూ వంట మనిషి తెచ్చిన కాఫీ కప్పును అందుకుంది.

 

    మళ్ళీ ఇద్దరి మధ్యా మౌనం. చంద్రం అసలు విషయాన్ని చెప్పటానికి ఇదే తరుణం అనుకొని ప్రారంభించాడు.

 

    "హేమా! ఒక విషయం చెబుతాను, నన్ను - అపార్థం చేసుకోవు గదూ?"

 

    హేమ మాట్లాడలేదు. ఏమిటన్నట్లు అతని ముఖంలోకి చూసింది.

 

    "ఆ రోజు ఆ అమ్మాయి...." హేమ ముఖంలో మార్పును గమనించిన చంద్రం గొంతులో పచ్చి వెలక్కాయపడ్డట్లు అయింది. హేమ అదోలా నవ్వింది. ఆ నవ్వుల్లో నిర్లక్ష్యం, నువ్వు ఏ అమ్మాయితో తిరిగితే నాకేం కావాలనే భావం స్ఫురించింది చంద్రానికి. చంద్రం మనస్సు చివుక్కుమంది. అంతకంటే హేమ తనను నిందిస్తే, తిడితే బాగుండేది అనుకున్నాడు.

 

    "చంద్రం! ఉదాత్తమైన ప్రేమను ఇతివృత్తంగా తీసుకొని ఒక మంచి నవల రాయకూడదూ?" అంది హేమ ధోరణి మారుస్తూ. హేమ గౌరిని గురించి చర్చించటం కూడా తనకు అవమానంగానే భావించింది.

 

    "ఒక నవల సగం రాశాను - మిగతా సగం పూర్తి చెయ్యాలి" అన్నాడు చంద్రం కూడా తెచ్చిపెట్టుకున్న నిర్లక్ష్యంతో.

 

    హేమ, చంద్రం ఇక్కడనుంచి వెళ్ళిపోయాక జరిగిన విషయాలు తెలుసుకోవటానికి ప్రశ్నలు వేసింది. చంద్రం గురుకుల్, కాంగడీలో విద్యార్థి జీవితం ఎలా వుంటుందో వివరించి చెప్పాడు.

 

    ప్రసాదరావు రాకతో వారి సంభాషణకు అంతరాయం కలిగింది. తనను చూసి ప్రసాదరావు ముఖం చిట్లించుకోవటం చంద్రం చూడకపోలేదు.

 

    "నమస్కారమండీ!" అన్నాడు చంద్రం.

 

    "నమస్కారం. ఎంత సేపయింది వచ్చి చంద్రం!" అన్నాడు ప్రసాదరావు, లేని వుత్సాహం తెచ్చిపెట్టుకుంటూ.

 

    "ఓ గంట అయింది."

 

    "ఇన్ని రోజులకా కనిపించటం? ఏమిటో అంత తీరని పనులు?" అన్నాడు ప్రసాదరావు నిష్ఠురంగా.

 

    "రోజూ రావాలనుకుంటూనే రాలేకపోయాను" అన్నాడు చంద్రం.

 

    ఐదు నిముషాలపాటు మౌనంగా అందరూ వారి వారి ఆలోచనల్లో పడిపోయారు.

 

    "చూడు చంద్రం! నీవు నా బిడ్డలాంటివాడివి. నన్ను అపార్థంచేసుకోకు."

 

    ప్రసాదరావు ఉపోద్ఘాతం దేన్ని గురించో అర్థం చేసుకున్న చంద్రం మౌనంగా వినసాగాడు.

 

    "నిన్ను అభిమానించి, ప్రేమించేవాళ్ళలో నే నొకణ్ణి, కనుక ఇదంతా చెబుతున్నాను"

 

    "మీరు నాకు తండ్రిలాంటివారు. నిరభ్యంతరంగా అడగండి." ఈ విధంగానన్నా తను చెప్పదలచుకున్నది చెప్పటానికి అవకాశం లభిస్తుందని సంతోషంగా అన్నాడు చంద్రం.

 

    "చూడు చంద్రం! మన అంతస్థులనూ, అభిరుచులనూ, సంస్కృతినీ తెలియజేసేవి మనచుట్టూ వుండే స్నేహితులూ, మనం నివసించే ప్రదేశాలూను. నువ్వు ఆ అలగా జనంతోవుంటూ, నిన్ను నీవు క్రిందకు దించేసుకుంటున్నావు. నీతి నియమాలంటే ఏమిటో, సభ్యతా సంస్కృతులంటే ఏమిటో తెలియని ఆ జనంతో నీవు నివసించటం అంత మంచిది కాదు. ఆ రోజు ఆ పిల్ల చూడు ఎలా ప్రవర్తించిందో? అంతమందిలో అలా నిన్ను బయటపడేసిందా లేదా? మాంసం తింటే మాత్రం ఎముకల్ని మెడలో వేసుకొని తిరుగుతామా?"

 

    అంటే - గౌరితో ఎలాంటి సంబంధమైనా వుండవచ్చు. దాన్ని అందరూ తెలుసుకోనంతవరకూ అభ్యంతరం లేదన్నమాట! ప్రసాదరావు దృష్టిలో సంఘంలో అంతస్థులేని వాళ్ళంతా అవినీతిపరులేనా? సంస్కారానికి ప్రతిరూపంగా కనిపించే ప్రసాదరావేనా యిలా మాట్లాడుతుంది? భావుకుడైన చంద్రం ఆవేశం పెల్లుబికింది.

 Previous Page Next Page