Previous Page Next Page 
డా || వాసిరెడ్డి సీతాదేవి రచనలు - 4 పేజి 29


    "ఇలారా గౌరీ! చూడు, ఈ చీరా జాకెట్ బాగున్నాయా?" టేబిల్ మీద పెట్టివున్న కాగితం పొట్లం విప్పింది సూపర్నెంటు.

 

    పసుపుపచ్చ నైలాన్ చీర, అదే రంగు జాకెట్టు. గౌరి కళ్ళు సంతోషంతో మెరిసిపోయాయి. అంతలోనే ఏదో అనుమానం ఆ సంతోషాన్ని వెనక్కు నెట్టివేసింది.

 

    "పిచ్చిపిల్లా! ఎందుకు భయపడతావు? ఇవి నీ కోసం తెచ్చాను? చూడు బాగున్నాయేమో?"

 

    గౌరి సంతోషంతో ముందుకు వెళ్ళి ఆ చీరను చేత్తో తాకి చూసింది. ఆ స్పర్శ ఆమెను ఏదో లోకానికి లాక్కుపోయింది. ఇంత మంచి చీర తనకే? అవును - తనకే... అనుకుంది.

 

    "వెళ్ళి త్వరగా తలకుపోసుకో, ఈ బట్టలు వేసుకుందువుగాని ఇవ్వాళ నీ పుట్టినరోజు" అంది సూపర్నెంటు.

 

    ఇవ్వాళ తను పుట్టిన రోజా? అంటే? అయితే? ఇంతకు ముందు తనకు పుట్టిన రోజు రాలేదేం మరి? సరిగ్గా ఎన్ని ఏళ్ళో, ఏ రోజు పుట్టిందో ఈమె కెలా తెలుసు? గౌరి అమాయకపు బుర్ర ఆలోచించలేక ఆ విషయాన్ని వదిలేసింది.

 

    ఆ కమలకీ, సుందరికీ బలేగర్వంలే! సూపర్నెంటు ఎప్పుడూ వాళ్ళనే ప్రేమగా చూస్తుంది, మంచి బట్టలు కూడా తెచ్చి ఇస్తుంది వాళ్ళకు. కాని ఈ రోజు, తన కోసం తెచ్చిన చీరంత మంచి చీర ఇంతవరకు ఇక్కడ ఎవరూ కట్టలేదు. గౌరి కళ్ళు మూసుకొని తలంటి పోసుకుంటూంటే ఆ మూసిన కళ్ళలో పచ్చనైలాన్ చీరనుంచి అలలు లేచి లేచి పడుతున్నాయి.   

 

    కొత్త బట్టలు ధరించి గౌరి ఆ రోజంతా కొత్తగా రెక్కలు వచ్చిన పక్షిపిల్లలా గెంతుతూ తిరిగింది. కమలా, సుందరీ, ఇంకా కొంతమంది పెద్దపిల్లలు గౌరిని చూసి అదోలా నవ్వారు. వారి కళ్ళలో కనుపించిన అసూయకు జవాబుగా గౌరి గర్వంగా చిరునవ్వులు విసిరింది.  

 

    సూపర్నెంటు ఆరు గంటలకు గౌరికి కబురు పంపించింది. గౌరి ఉత్సాహంగా ఆమె గదికి వెళ్ళింది.

 

    "ఎంత అందంగా వున్నావో తెలుసా? ఇవ్వాళ నీవు సినిమాకు వెళతావా?" అంది సూపర్నెంటు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ.

 

    పెద్దమ్మగారి ఆప్యాయతను చూరగొన్న పెద్ద పిల్లలు అప్పుడప్పుడు సినిమాలకు వెళుతుండటం తెలుసు గౌరికి. సంతోషంతో తల గిరగిర ఆడించింది గౌరి. అయితే తనకు ఇకనుంచి సినిమాలూ.... మంచి మంచి చీరలూ.... సెంట్లూ... పౌడర్లూ.... అబ్బో ఎన్నో ఎన్నో.... గౌరి గాలిలో తేలిపోతున్నట్లు అనుభూతిని పొందింది. 

 

    మేట్రన్ తో రిక్షాలో కూర్చున్న గౌరి కళ్ళు ఇంతంత చేసుకొని రోడ్డుమీద నడిచే జనాన్ని, రోడ్డుపక్క కొట్లనూ చూస్తూ తన్మయత్వం పొందసాగింది.

 

    రిక్షా ఒక పెద్ద హోటల్ ముందు ఆగింది. మేట్రన్ దిగి గౌరిని దిగమన్నది.

 

    "ఇది సినిమా హాలా?" అంది గౌరి ఆశ్చర్యంగా - సినిమాకు అనిచెప్పి హోటల్ కు ఎందుకు తీసుకొని వచ్చిందో అర్థంకాక.

 

    "సినిమాకు వెళదాంలే, తొందరేమీ లేదు. ముందు కాఫీ తాగుదాం పద" అంది మేట్రన్.

 

    గౌరి మేట్రన్ వెనకే హోటలు మేడమీదకు దిక్కులు చూస్తూ నడిచింది. మేట్రన్ తో ఒక గదిలో ప్రవేశించిన గౌరి అమాయకపు బుర్ర అయోమయంలో పడింది.

 

    ఆ గదిలో పొద్దుట తమ శరణాలయం తనిఖీకి వచ్చిన ఆఫీసరు వున్నాడు. ఆ ఆఫీసరు చిరునవ్వుతో లేచి గౌరిని సమీపించాడు. గౌరి గాబరాగా వెనక్కు తిరిగింది మేట్రన్ కోసం. అప్పటికే అక్కడ నుంచి మేట్రన్ తప్పుకుంది. తలుపుకూడా బయట నుంచి వేసింది. అంత పెద్ద ఆఫీసరు ముందుకు రాగానే కలిగిన గాబరాలో గౌరి ఇదేమీ గమనించలేదు. ఆ ఆఫీసరు గౌరి రెక్కపట్టుకొని అనునయంగా కూర్చోబెట్టబోయాడు. తనకు ఏదో జరగరాని అన్యాయం జరగబోతుందని మాత్రం అర్థం అయింది గౌరికి. గౌరి ఆ ఆఫీసరుతో పెనుగులాటలో పక్కనే వున్న గాజు కూజాను నేలమీద కొట్టింది. తత్తరపాటుతో వేసిన కాల్లో గాజుపెంకులు గుచ్చుకొని ఆఫీసరు తలుపు తియ్యమని కేకపెట్టాడు. తలుపు తెరుచుకుంది. గౌరి మెరుపులా పరిగెత్తింది.   

 

    శరణాలయం చేరుకున్న గౌరి, పిల్లి నోటికి చిక్కి గాయపడ్డ పక్షిలా వణికిపోతూ - సూపర్నెంటు గదిలోకి వెళ్ళింది. గౌరి వాలకం చూసిన సూపర్నెంటు గాబరా పడింది. గౌరి ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది. మరో క్షణంలో సూపర్నెంటు గౌరి జుట్టు పట్టుకొని వంచి కక్షగా వీపుమీద బాదింది. ఒక గదిలో పెట్టి తాళం వేసింది. ఆ రాత్రి భోజనం లేదు. చీకటి గదిలో, ఆకలి కడుపుతో ఏడుస్తూ కూర్చున్న గౌరికి ఇక తను ఆ శరణాలయంలో వుండటం అంత మంచిది కాదని తోచింది. తెల్లవారుఝామున గౌరి స్నేహితురాలు తలుపు తీసింది. గౌరి పారిపోవటానికి ఆ అమ్మాయే సహాయం చేసింది.

 

    ఆ తరువాత కథ చంద్రానికీ, ప్రకాశానికీ తెలిసిందే. చంద్రానికి గౌరి అంటే జాలి కలిగింది. తను ఆమెయెడల చూపిన నిరాదరణను తలచుకుని బాధ పడ్డాడు.

 

    "అయితే గౌరీ! ఆ రోజు నేను ఆ ఇంట్లో వున్నట్లు నీకెలా తెలిసింది?" చంద్రం ప్రశ్నించాడు.

 

    "శరణాలయంనుంచి నేను పారిపోయాను. కాని చాటుచాటుగా నిన్ను వెంబడిస్తూనే వున్నాను. నువ్వు ఇంటికి వెళ్ళగానే నా పెట్టె తీసుకొని వెళ్ళిపోవాలనుకున్నాను. నువ్వు పొగాకు కంపెనీనుంచి ఎవరిదో కార్లో వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళావో తెలియక బిక్కమొహంతో నిల్చున్నాను. ఇంతలో నాగేంద్రంవచ్చి తనతోవస్తే నిన్ను చూపిస్తానన్నాడు."

 

    "నాగేంద్రం నీకు అంతకుముందే తెలుసా?" చంద్రం విస్తుపోతూ ప్రశ్నించాడు.

 

    "తెలుసు. ముందు నన్ను నాగేంద్రం, ఆదెమ్మా పెంచారు" అంటూ గౌరి ఆ నాటిరాత్రి తను విన్న విషయం అంతా చెప్పింది. కాని గౌరి తను ఒక అబ్బాయిని కట్లు విడిపించానన్న విషయంమాత్రం చెప్పలేదు.

 

    "అయితే, ఆ డబ్బు నాగేంద్రం తీశాడన్నమాట!" అన్నాడు ప్రకాశం.     

 

    "నాకు మొదటినుంచీ వాడిమీదే అనుమానం" అన్నాడు చంద్రం.

 

    "గౌరికూడా ఏ పెద్దయింటి బిడ్డో అయివుండొచ్చు" అన్నాడు ప్రకాశం సాలోచనగా. చంద్రం ఆలోచిస్తూ, కూర్చుండిపోయాడు. ఆ డబ్బు విషయం ముందుగానే వీళ్ళకెలా తెలిసిందో అనుకుంది గౌరి. తెలుసు కాబోలు అని ఏ సరిపెట్టుకుంది - అంతకంటే ఆలోచనరాని గౌరి.

 

                                                                                     15

 

    ప్రకాశం స్థలంలోనే ఒక చిన్న నిట్టాడి గుడిసెలో వుంటున్న రాజవ్వ దగ్గిర గౌరిని పెట్టాడు ప్రకాశం. వయస్సులోవున్న ఆడపిల్ల పెద్దవాళ్ళెవరూ లేకుండా తనతో నివసించడం ఆ అమ్మాయి భవిష్యత్తుకు మంచిదికాదని ఆలోచించిన ప్రకాశం ఈ ఏర్పాటు చేశాడు. భోజనం వగైరా అంతా ప్రకాశం ఇంటిలోనే. రాజవ్వ వంటా అది చేసిపెట్టి, పొగాకు కంపెనీకి పనికి వెళుతుంది. గౌరి రాజవ్వకు పనిసాయం చేస్తూంటుంది. పగలంతా ఇల్లు సర్దటం, సాయంకాలం వంటచెయ్యటం గౌరి వంతు. ప్రకాశం ఎప్పుడూ ఎవరితోనో బయట తిరుగుతూనే వుంటాడు. చంద్రం మాత్రం ఎక్కువ ఇంటిలోనే వుంటాడు. కాని మౌనంగా ఏవేవో పుస్తకాలు చదువుకుంటూ వుంటాడు. గౌరితో ఎక్కువగా మాట్లాడడు. గౌరికి కూడా చిన్న చిన్న పుస్తకాలు తెచ్చి ఇచ్చి చదువుకోమని చెబుతూండేవాడు. గౌరికి చంద్రంతో మాట్లాడటం ఇష్టం.

 

    ఆ వాతావరణంలో గౌరికి అంతకుముందు తనకు తెలియని విషయాలు తెలుస్తున్నట్లు అనిపించసాగింది. గౌరి త్వరలోనే ఆ గూడెం వాళ్ళందరికీ ప్రియపాత్రురాలయింది. లీడరన్నకు కావాల్సినవాళ్ళంతా ఆ గూడెంవాళ్ళ గుండెలలో ప్రాణంలాంటివారే. సాయంత్రం అయేటప్పటికి ఆ గూడెం పిల్లలంతా గౌరిచుట్టూ చేర్తారు. గౌరి వాళ్ళతో ఆడుకుంటూ వాళ్ళకు కథలు చెబుతూ వుంటుంది. గౌరి ఆనందం చూసి ప్రకాశం సంతృప్తిగా నిట్టూర్చేవాడు.    

 

    మరో రెండు నెలలుపోతే ట్యుటోరియల్ కాలేజీలో చేర్పించి గౌరికి చదువు చెప్పించటానికి నిర్ణయించుకున్నాడు ప్రకాశం. ఆ నిర్ణయం విని చంద్రం ఎంతో సంతోషించాడు. ఆ రెండు నెలలూ గౌరికి చదువు చెప్పమని చంద్రానికి చెప్పాడు ప్రకాశం.  

 

    ప్రకాశం గౌరిని వివాహం చేసుకుంటే బావుణ్ణు అనుకున్నాడు చంద్రం.

 

    ఆ సాయంత్రమే చంద్రం గౌరికోసం మంచి మంచి చీరెలు కొని తెచ్చాడు. తన ప్రకాశం భార్యగా వూహించుకున్న గౌరిని శరణాలయం బట్టలలో చూట్టం ఇష్టంలేక పోయింది చంద్రానికి. ఈ విధంగానన్నా ప్రకాశం ఓ ఇంటివాడైతే తనకు అంతకంటే సంతోషం కలిగించేది మరోటి లేదు.    

 

    ప్రకాశం మరోలా వూహించుకొని ఆనందించాడు. చంద్రం ఈ విధంగానన్నా సుఖపడితే అదేచాలు ననుకున్నాడు. గౌరికి చంద్రం అంటే చాలా ఇష్టం అన్న విషయాన్ని ప్రకాశం ఏనాడో గ్రహించాడు. కాని చంద్రం మనస్సే అర్థంకాలేదు ప్రకాశానికి.

 Previous Page Next Page