బ్రష్ చేసుకుని పనమ్మాయి తెచ్చిన కాఫీ త్రాగి స్నానానికి వెళుతుంటే ఒక పట్టాన ఆ దుస్తులు విప్పబుద్ధికాలేదు. అవి రాజా స్పర్శతో నిండిపోయి ఒంటినిండా ఏదో సుఖం కలిగిస్తున్నట్లు అనిర్వచనీయమైన అనుభూతి.
"అమ్మగారు పిలుస్తున్నారు" అంది పనమ్మాయి, ఆమె స్నానంచేసి ఇవతలకు వచ్చాక.
ఆమె పదినిముషాల్లో తెమిలి మెట్లు దిగి అక్కగదిలోకి అడుగుపెట్టింది.
సత్య మంచంమీద ఆమె రాకకోసం ఎదురుచూస్తూ పడుకుంది. శోక పూరితమైన ఆమె శుష్కవదనంలో విశాలనేత్రాలు వింతనీలాల్లా మెరుస్తున్నాయి.
మాధవికి రాత్రి జరిగిన సంఘటనలు జ్ఞప్తికొచ్చాయి. "అక్కయ్యా! నీకో పెద్ద జోక్ చెప్పనా? బావ మళ్ళీ పెళ్లి చేసుకుంటాడట" అంది దగ్గరకు వెళుతూ.
"అది జోక్ కాదు, నిజమే! ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారు" అంది సత్య గంభీరంగా చెల్లెలి ముఖంలోకి చూస్తూ.
మాధవి నిర్ఘాంతపోయినట్లు మధ్యలోనే ఆగిపోయింది.
"ఎవర్నో కాదు. నిన్నే మధూ! ఆయన పెళ్లి చేసుకోబోయేది నిన్నే!"
12
క్షణంసేపు మాధవికి ఊపిరాడనట్లయింది. ఏమిటి తను వింటున్నది? నిజమేనా? లేకపోతే వీళ్లందరికీ మతులు భ్రమించాయా?
ఆమె ఆలోచనలు గ్రహించినట్లు సత్య "ఒక్కరోజు ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు ఇది. కొన్ని నెలల సంఘర్షణ తరువాత చేసుకున్న తీర్మానం" అంది.
"ఎందుకని? ఎందుకిలా జరిగింది?" అనడిగింది మాధవి ఆవేశంగా.
"ఎందుకనంటే...సంవత్సరాల తరబడి నా ఆరోగ్యం క్షీణించింది. ఆయనకు నావల్ల ఏమీ సుఖం లేదు."
"సుఖం లేకపోతే ఇంకోదాన్నెవర్నైనా కట్టుకొమ్మను. లేకపోతే ఉంచుకొమ్మను. అదీ చేతకాకపోతే డబ్బులు పారేసి ఊరిమీద ఊరేగమను. కానీ నా జీవితంతో ఆటలాడటం దేనికి?"
"ఎందుకంటే....ఈ సమస్య కుటుంబ సమస్యగానే వుండిపోయి మన మధ్యనే ఇరుక్కుని వుండేందుకు. మనం బజార్న పడకుండా వుండేందుకు..."
"ఇలా మాట్లాడటానికి నీకు సిగ్గులేదూ?"
లేదు. తాను సిగ్గు కొన్ని నెలలక్రితమే మరిచిపోయింది. మొదట్లో తన భర్త ఈ కోరిక ప్రకటించినప్పుడు నిర్ఘాంతపోయింది. ప్రతిఘటించింది. ప్రాధేయపడింది. ఇలాంటిది జరగటానికి వీల్లేదని భీష్మించింది. ఫలితంగా చిత్రహింసలపాలయింది. మానసికంగా, శారీరకంగా నరకమనుభవించింది.
చివరికి తనకు లొంగిపోక తప్పలేదు.
అంతేకాదు. అతనింకో ఆంక్ష విధించాడు. చెల్లెలికి ఈ విషయం ఆమే నూరిపొయ్యాలిట. ఇష్టపడేటట్లు ఆమే చెయ్యాలిట.
"మధూ! నాకు సిగ్గులేదే. అందుకనే నిన్ను కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడుతున్నాను. నా మాటకు ఒప్పుకోవే!"
"ఒప్పుకోను!"
"ఎందుకని?"
"నీ కోరికలో ఔచిత్యం లేదుకనుక. బావను ఆ దృష్టితో ఎప్పుడూ చూడలేదు గనుక. చూడలేను గనుక. అసలు అవసరంలేదు గనుక. ఇదంతా ఓ అసహ్యం గనుక."
"నువ్వు ఒప్పుకోకపోతే నా చావు చూసినదానివవుతావు."
"ఒక్క నీ చావుకాదు, ఎంతమంది చావులు చూసినాసరే! అక్కయ్యా! ఇంకెప్పుడూ ఈ ప్రసక్తి నా ముందు తీసుకురాకు. అది నీకూ నాకూ ఇద్దరికీ మంచిది కాదు" అని మాధవి ఇహ అక్కడ ఒక్క క్షణమైనా వుండకుండా పైకి వెళ్ళిపోయింది.
ఎందుకిలా జరిగింది? తాను చిన్నపిల్లలా వున్న దశనుంచీ అతనికి తెలుసు. అతన్ని బావగా, కుటుంబ యజమానిగా, ఓ సంరక్షకునిలా చూసిందే తప్ప పొరపాటునకూడా ఇలాంటి భావమెప్పుడూ రాలేదు. రాత్రి జరిగిన సంఘటనలు గుర్తుకొచ్చినాయి. ఆ సంభాషణలు గుర్తుకొచ్చింది. ఆమే ఒళ్ళంతా తేళ్ళూ, జర్రులూ ప్రాకినట్లయింది.
ప్రపంచమింత విషమయమని ఎప్పుడూ అనుకోలేదు.
తాను వారిమీద ఆధారపడివుంటే వుండవచ్చు. అందుకని ఇంత అఘాయిత్యమా? తన జీవితంలో నిప్పులు పోసే హక్కు ఎవరిచ్చారు వాళ్ళకు?
మంచంమీద పడుకుని అలా ఆలోచిస్తూనే వుంది. అలా ఎంతసేపు గడిచిందో తెలీదు.
"అమ్మాయిగారూ! మీకు ఉత్తరం" అంటూ పనమ్మాయి ఒక కవరు తెచ్చి యిచ్చి వెళ్ళిపోయింది.
అనాసక్తంగా కవరు చిమ్పింది. వెంటనే ఉలికిపడింది.
"మాధవీ!
నువ్వు వెళ్ళిపోయాక ఆ చీకట్లో ఒంటరిగా ఎంతోసేపు కూర్చుండి పోయాను. ఏం చెయ్యాలో తెలియలేదు. ఎవరూ లేని చోట, ఏదీ కనిపించని చోట నిన్ను పోగొట్టుకుని, నువ్వు లేకుండా ఆ శూన్యంలో, ఎప్పటికీ వుండిపోయేలా గోచరించే ఆ శూన్యంలో కూర్చునివుంటే జీవితంలో మొట్ట మొదటిసారి భయంవేసింది.
నువ్వు పరిచయం కాకముందు ఆకతాయిగా తిరిగినవాణ్ణి. ఎవర్నీ లక్ష పెట్టకుండా తిరిగే దుడుకు స్వభావం కలవాణ్ణి.
అప్పుడు నాకు అనుభూతి అంటే తెలీదు. బాధంటే తెలియదు. ఒంటరి తనమంటే తెలియదు. ఒక మనిషిని పొందటమంటే తెలియదు. పోగొట్టు కోవటమంటే తెలియదు.
ఇప్పుడన్నీ తెలిశాయి.
ఇంకా...జీవితమెంత మధురమైన విషాదమో తెలిసింది. ఉండలేక పోతున్నాను.
ఏం చెయ్యను? మీ ఇంటికి రెక్కలుకట్టుకుని వచ్చేయనా? ఎగిరి నీ గదిలోకి సరాసరి వచ్చేయనా?
రాగలను. కానీ రాను....ఎందుకంటే నీ స్వభావం నాకు తెలుసు. నీ కఠినత్వం నాకు తెలుసు. అలాంటి నీకు ఇంకా కోపం తెప్పించలేను. ఎందుకంటే నీలో కాఠిన్యం కరిగి మృదుత్వం వెల్లివిరిసే రోజుకోసం ఎన్ని సంవత్సరాలయినా వేచి వుండగలను కాబట్టి.
మాధవీ! ఎందుకంత కఠినంగా వుంటావు? నేను ఓడిపోయాను. అయితే ఇంత పెద్ద శిక్షా?
నేనెట్లా కాలేజీకి రాను? నీకంత దగ్గరలో మసులుతూ దూరం చేసుకుంటూ ఎట్లా బ్రతకను?