నాలికకొరుక్కుని "నా చీరెలేవున్నాయి. మరి అవే సరిపెట్టుకోవాలి" అంది.
"కానియ్యి."
"వాడ్రోబ్ తెరిచి ఒక్కొక్క చీరే పట్టిపట్టి చూస్తోంది."
"ఏమిటి సంశయిస్తున్నావు?"
"కాస్త దళసరిగా వుండే చీరేదైనా దొరుకుతుందేమోనని చూస్తున్నాను. అన్నీ పలుచగానే వున్నాయి."
"ఉంటే వున్నాయి, ఇయ్యి"
"అది కాదండీ, మరీ అంత పల్చగా వుంటే ఏం బాగుంటుంది?"
"ఏం ఫర్వాలేదులే!" అని ఆమె చేతిలోంచి ఒక చీర లాక్కుని గబగబ లుంగీలా చుట్టుకున్నాడు.
ఆమె కిలకిలా నవ్వసాగింది.
"ఏం, బాగాలేనా?"
"అది కాదండీ, మొగాళ్ళు చూస్తే మోహించేటట్లున్నారు."
ఫలహారం పూర్తయింది.
"నాకు నిద్ర...వస్తోంది!" అన్నాడు కళ్ళు మూతలు పడుతుండగా.
"సారీ! మంచం ఒక్కటే వుంది."
"అది చాలదా ఏమిటి?" అంటూ మంచంమీదకు చేరి పడుకుని "ఇలా నా ప్రక్కకి వచ్చి పడుకో, ఏం భయంలేదు" అన్నాడు.
"భయమా! దేనికి?"
"తెలియకపోతే మరీ మంచిది" అంటూ చెయ్యి చాపాడు. ఆమె ఆ చేతిని అందుకుని ప్రక్కకు వచ్చి చేరింది. నెమ్మదిగా మేను వాల్చింది.
"కొంచెం అటు జరుగు"
"ఏం?"
"మరీ అంత దగ్గరగా పడుకుంటే ఏం బాగుంటుందమ్మా?"
అతను జరిగాడు.
"ఇటు కాదు అటు"
"అతను మరికొంచెం జరిగాడు."
"అరె! చెబుతుంటే నీక్కాదు? అయ్యయ్యో మరీ అంత దగ్గరగానా?"
"ఎంత దగ్గరగా?"
ఆమెకు చెప్పటం చేతకాలేదు. కానీ ఎంత దగ్గరగా అంటే ఇద్దరూ కలిసి ఒకే చీర కట్టుకున్నంత దగ్గరగా....
* * *
తలుపుమీద చప్పుడయితే కళ్ళు తెరచిచూసింది. తెల్లవారి చాలాసేపయి వుంటుంది. తలుపెవరో తడుతున్నారు.
ఒక్క ఉదుటున లేచి, తలుపు తెరిచి-అడ్డుగా నిల్చుంది.
"మీకు ఫోనమ్మగారూ!" అంటోంది పనమ్మాయి.
"ఎక్కడినుంచి?"
"తెలియదమ్మగారూ! బయటూరినుంచి అనుకుంటాను"
"సరే పద" అంటూ ఆమె వెనుకే క్రిందకు దిగివచ్చింది.
"హలో!" అంది రిసీవర్ చేతిలోకి తీసుకుని.
"మాధవీ! నేను" అంది అవతలినుంచి కళ్యాణి గొంతు.
ఆమె ఆనందాశ్చర్యాలకు అవధులు లేవు "హేయ్! ఎక్కడినుంచి?"
"ఏలూరునుంచే!"
"ఏలూరెప్పుడొచ్చావు? మీ పేరెంట్స్ తో ఎక్కడికో వెళతానన్నావుగా?"
"వెళ్ళి వచ్చేశాను రాత్రే. అవునూ మీ పందేలేమయినాయి? రాజా కనిపించాడా?"
ఆమె ఆతృతకు మాధవికి నవ్వొచ్చింది. "రాజా వచ్చాడు. మూడో పరీక్ష కూడా పూర్తయిపోయింది."
"ఏమయింది? రాజా గెలిచాడా?"
చిన్నపిల్లలా ఆమె అడుగుతున్న తీరుకు ఇంకా నవ్వొచ్చింది "ఆ గెలిచాడు అంది ఆమెను ఏడిపిద్దామని.
"గెలిచాడా? అయితే నీ పని అయిపోయింది"
"ఏమిటయిపోయింది?"
"నిన్ను ఎత్తుకెళ్ళిపోతాడు. ప్రపంచంలో అతన్ని ఎవరూ వాదించలేరు."
"నా ఇష్టంలేకుండానా?"
"నీ ఇష్టాఇష్టాలతో యిహ నిమిత్తంలేదు."
"అలాగా? కానీ బహుశా అంత పని జరగదులే!"
"ఏం?"
"రాజాయే ఓడిపోయాడు గనుక."
"అరె?" అంది కళ్యాణి బాధగా, నిరాశగా.
"కానీ....." అంది మాధవి ఆమెను ఓదారుస్తున్నట్లు, ఒక రకంగా అతనే గెలిచాడు.'
"ఎలా?"
"ఓడిపోయి."
"అంటే?"
"అంటే, అతను ఓడిపోకపోతే నన్ను గెలవగలిగేవాడు కాదు. ప్రపంచం తల క్రిందులైనా..."
కళ్యాణికి అర్థంకాలేదు "పోన్లే...ఏదో ఒక విధంగా...చివరకు గెలిచాడు కదా!" అంది కొంత సంతృప్తితో.
"నీకు ఇంకో విచిత్ర వార్త. రాజా ఇప్పుడు ఇక్కడే వున్నాడు."
"అక్కడా?"
"అవును. పైన నా గదిలో."
"అదెలా సాధ్యం?"
"ఎలాగో చెబుతాను సాయంత్రంలోగా ఓసారి రా. మా ఇంటి ఎడ్రెస్ రాసిచ్చానుగా!"
"తప్పకుండా వస్తాను"
"బై బై" అని ఫోన్ పెట్టేసింది.
మెట్లు ఎక్కి పైకి వెళుతుంటే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంది. ఏమిటలా మాట్లాడింది. రాజా పైన తన గదిలో వుండటమేమిటి? నిద్రలోంచి హఠాత్తుగా మేలుకొని కలల పారవశ్యంలోంచి ఇవతలకు వచ్చి ఇంకా పూర్తిగా సెటిల్ కాకపోవటం వల్ల అలా మాట్లాడిందా? కళ్యాణి ఏమనుకుంటుంది? ఆమెకు నవ్వొచ్చింది. తాను హఠాత్తుగా ఎంత వెర్రిదైపోయింది?
పైకి వచ్చి గదిలోకి అడుగుపెట్టింది. ఖాళీగా వున్న మంచం వెక్కిరించింది. ఆమెకు బాధ కలుగలేదు. సంతోషంగా వుంది. ఎంత తియ్యని కల!