Previous Page Next Page 
ఊగవే ఉయ్యాల పేజి 31


    కాలేజికి రాకపోతే, నువ్వుసలు కనిపించకపోతే ఎట్లా బ్రతకను?

 

    నాకేం అర్థం కావటంలేదు. ఒకప్పుడు ఎంతో అల్లరి చిల్లరిగా తిరిగేవాణ్ణి. హఠాత్తుగా ఇంత విషాదం అలుముకున్నదేమిటిప్పుడు?

 

    మాధవీ! నువ్వెప్పుటికి కరుగుతావు?

 

    చెప్పవూ?

 

    ఓ హాలులో కూర్చుని ఈ ఉత్తరం రాస్తున్నాను. ఇప్పుడే పోస్టుచేసి ఇక్కడినుంచి వెళ్ళిపోతున్నాను.

                                                                                          'నా' అనుకునే
                                                                                            'నీ' రాజా."

 

    ఆమె కళ్ళవెంట జలజలమని నీళ్ళు కారుతున్నాయి. "రాజా! నా మనసులో ఏమున్నదో నీకెట్లా తెలుస్తుంది? నేను కఠినాత్మురాలిని కాను రాజా!" అనుకుంది మూగగా.

 

    భుజంమీద చెయ్యి పడేసరికి ఉలికిపడి తల త్రిప్పి చూసింది. వెంటనే "హాయ్! ఎప్పుడొచ్చావు?" అన్నది సంభ్రమంగా లేచి కూర్చుంటూ.

 

    "నా కళ్ళను నమ్మవచ్చా? నీ కళ్ళలోనా కన్నీళ్ళు?" అంది కళ్యాణి ఆమె ప్రక్కనే కూర్చుంటూ.

 

    "శిల కరిగింది" అంది మాధవి కళ్ళు తుడుచుకుని నవ్వుతూ.

 

    కళ్యాణి గది నలువైపులా కలియజూసి "ఏడీ కథానాయకుడు?" అనడిగింది.

 

    "పారిపోయాడు"

 

    "ఎక్కడినుంచి?"

 

    "కలల్లోంచి"

 

    "అంటే?"

 

    "కల యదార్థమనుకుని నీకు చెప్పాను కళ్యాణీ!" అంటూ జరిగిన సంగతి వివరించింది.

 

    విని కళ్యాణి నవ్వాపుకోలేకపోయింది.

 

    "పడిపోయానే!" అంది మాధవి.

 

    "ఎక్కడ?"

 

    "ఎక్కడేమిటి, నీ మొహం! ఉచ్చులో. అవునూ, ఎవరిదారిన వారిని బ్రతకనియ్యకుండా ఈ ఎంక్రోచ్ మెంట్ ఏమిటే ఒకరిమీద ఒకరు. హాయిగా బ్రతుకుదామనుకున్నాను."

 

    "కష్టాల్లో పడిపోయావు."

 

    "మరీ తొందరగా."

 

    "పోన్లే. మరీ లేతగా కాకుండా లేత వయసులో ఒక రకంగా మంచిదే.

 

    "ఎం మంచిదే నా తలకాయ! ముందు ముందు బోలెడు ఎడ్యుకేషన్ వుంది. డిగ్రీలు పుచ్చుకోవాలి" అంది మాధవి ఆలోచిస్తూ.

 

    "అసలేం జరిగిందో చెప్పు నిన్న?"

 

    మాధవి జరిగిందంతా చెప్పింది. రాజా రాసిన ఉత్తరం కూడా చూపించింది.

 

    "పాపం!" అంది కళ్యాణి నిట్టూరుస్తూ.

 

    "ఏం అంత జాలి?"

 

    "చీకట్లో ఒక్కడూ అంత దూరం వెళ్ళిపోయాడా?"

 

    "వెళ్లకుండా వుంటే బాగుండును" అంది మాధవి స్వగతంగా.

 

    ఇద్దరూ చాలాసేపు కబుర్లతో గడిపేశారు. పన్నెండుదాటాక క్రిందకి డైనింగ్ రూమ్ లోకి వెళ్ళి భోజనం చేసివచ్చారు. కళ్యాణికి తన అక్కయ్యను పరిచయం చెయ్యలేదు. అసలామెగురించి పట్టించుకోలేదు.

 

    సాయంత్రం అయిదింటికి యిహ వెళతానని లేచింది కళ్యాణి.

 

    వీధిలోకి వెళ్ళి రిక్షా ఎక్కించి వచ్చింది మాధవి.

 

    "మధూ!" అని పిలిచింది సత్య గదిలోంచి.

 

    వెళ్ళనామాననా అని క్షణం పాటు సంశయించి, చివరకు లోపలకు వెళ్ళింది.

 

    "ఏం నిర్ణయించుకున్నావు?"

 

    "ఈ ఇంట్లోంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను."

 

    "మధూ?" అంది సత్య మ్లానవదనంతో.

 

    "అవును. కలుషితమైన ఈ ఇంటి వాతావరణంలో నాకింక స్థానం లేదని తెలుసుకున్నాను. నీ మొగుడు నాతో ఇన్నాళ్లూ ప్రవర్తించిన పద్ధతికి కొత్త అర్థాలు తెలిశాయి. అతను నాకు దగ్గరగా మసిలేటప్పుడు ఆ కళ్ళు ఇప్పుడు నాకు గుర్తుకువస్తున్నాయి. మైగాడ్! నేను మంచంమీద పడుకున్నప్పుడు నా ప్రక్కనే కూర్చుని మాట్లాడేవాడు-మధ్య మధ్య నా శరీరం నిమురుతూ... అప్పుడు తెలియలేదు...అబ్బ! ఎంత రోత స్పర్శ....సత్యా! అవును. ఇప్పుడు నిన్ను అక్కయ్యా అని పిలవాలనిపించటం లేదు. అతని ముందే పౌడరేసుకుని, అతని ముందే జుట్టు చిక్కు తీసుకుని నా మూమెంట్సుతో ఎంత అమాయకంగా అతని కళ్ళ దాహాన్ని తీర్చానో ఇప్పుడర్థమౌతోంది. అబ్బ! తలుచుకుంటే ఎంత జుగుప్స! ఇహ ఈ ఇంట్లో క్షణం ఉండలేను."

 

    "ఎక్కడకు వెళతావే?"

 

    "ఎక్కడికన్నా వెళతాను. ఇక్కడ మాత్రం వుండను" అని బయటకు వచ్చి మేడమీద తన గదిలోకి వెళ్ళిపోయి మంచంమీద వాలిపోయింది. అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. తెలివి తెచ్చుకునేసరికి చీకటి పడిపోయింది. లేచి లైటు వేసింది.

 

    "అవును. ఎక్కడకు వెళతాను?"

 

    "రాజా దగ్గరకు."

 

    "అవును. నా రాజా దగ్గరకు."

 

    "నా....నా....నా....రాజా దగ్గరకు."

 

    "రాజా! వస్తున్నాను."

 

    బట్టలు సర్డుకోలేదు. చేతిలో రూపాయయినా వున్నదో లేదో చూసుకోలేదు. ఏదో ఆవహించినదానిలా బయటకు పరుగెత్తబోయింది. సరిగ్గా గది గుమ్మం దగ్గరకురాగానే తలుపులు తెరుచుకున్నాయి. బయట ప్రతాప్ నిలబడివున్నాడు.

 

    "ఎక్కడికి?" అన్నాడు కటువుగా.

 

    "నా ఇష్టమొచ్చిన చోటుకు."

 

    "అలాగా?" అంటూ విసురుగా ఆమెను లోపలకు త్రోశాడు. ఈ పరిణామం ఆమె ఎదురుచూడలేదు. నిలద్రొక్కుకోలేక వెనక్కు తూలింది. అతనూ లోపలికి అడుగుపెట్టి తలుపు గడియవేశాడు. అసలే ఎర్రగా వుండే ఆ కళ్ళు మరింత ఎర్రబడి వున్నాయి. ఆల్కహాల్ వాసన.

 Previous Page Next Page