"చిన్నప్పుడంటే, ఎన్నేళ్ళక్రితం..."
"నువ్వు భలే బాగున్నావయ్యా భగవాన్..." హి భగవాన్... ఈ భగవాన్ నుంచి రక్షించవా అని మనసులో అనుకున్నాడు.
"చిన్నప్పుడయ్యా... అంటే వినిపించుకోవేం... బాగా చిన్నప్పుడయ్యా అసలు చిన్నప్పుడు మనకేం జరిగిందో, మనకెలా తెలుస్తుందయ్యా చెప్పు" కన్ ఫ్యూజ్ చేసి పారేసాడు భగవాన్ ని.
"నిజమేనండి... చిన్నప్పుడు మనకు తెలీదుకదా... సినిమాల్లో అయితే, పాలపీక తాగిందగ్గర్నుంచీ తెలుస్తుంది... మనకు పెద్దయ్యాక కూడా తెలీదు... అంతేలెండి... ఇంతకీ మీ మేనమామ కూతురు పేరు బేబీ అంటారా... బుజ్జిముండంటారా?" అమాయకంగా అడిగాడు భగవాన్.
"చిన్నప్పుడు" అంటూ ఆగిపోయాడు శక్తి. అతని చూపులు కేంటిన్ బయట...
దట్టమైన బూడిద రంగు చీర- నీలాకాశం రంగు జాకెట్టు చక్కగా అల్లుకున్న జడలో... తురుముకున్న రెండు సంపెంగలు... ముక్కుపుడకతో లోని కొస్తున్న స్టన్నింగ్ బ్యూటీ మీద నిలిచాయి.
శక్తి చూస్తున్న వేపు చూసాడు భగవాన్.
"నిన్న చూసిన అమ్మాయేకదండి... మహిత... నిన్న ఆల్ట్రామోడర్న్ గా వచ్చిందా- ఇవాళ పల్లెటూరమ్మాయిలా వచ్చింది... రేపు బెంగాలీ కుర్తా. పైజమాలో వస్తుంది... డిజైనర్... విజువలైజర్ కెమేరా ఉమెన్ కదా..."
"ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడదా" అడిగాడు శక్తి.
"ఎందుకు మాట్లాడదు... వాళ్ళ సెక్షన్ లో వాళ్ళందరితోనూ మాట్లాడుతుంది..."
"నీతో ఎప్పుడూ మాట్లాడలేదా."
"నాతోనా...? సాలరీడే అప్పుడే మా సెక్షన్ లో కొస్తుంది. నెమ్మదిగా సాలరీ తీసుకొని వెళ్ళిపోతుంది. చాలాసార్లు విష్ చేశాను. నవ్వేసింది. అంతే... చాలా రిజర్వుడు... ఏం... ఆ అమ్మాయి గురించి ఎంక్వయిరీ చేస్తున్నారు?" అడిగాడు భగవాన్.
"స్టన్నింగ్ బ్యూటీ కదా... గ్లిట్టరింగ్ ఫేస్ కదా అని" దూరంగా కూర్చున్న ఆ అమ్మాయి వేపు కళ్ళార్పకుండా చూస్తున్నాడు శక్తి.
"ఈ ఆఫీసులో ఇలాంటి స్టన్నింగ్ అండ్ గ్లిట్టరింగ్ బ్యూటీస్ చాలామంది ఉన్నారండి. ముందు ముందు మీకే తెలుస్తుంది కదా.... పదండి... ఇవాళ మీరు మా రూంకి రావాలి."
వస్తానన్నట్లుగా తలూపినా, శక్తి చూపులు మహితమీదే వున్నాయి. క్యాంటీన్ లోంచి వచ్చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి పక్కనుంచి వచ్చాడు శక్తి.
ఆ అమ్మాయి అతన్ని పట్టించుకోలేదు.
* * * *
"శక్తిగారూ... శక్తిగారూ" పిలుపు వినబడితే, కళ్ళిప్పి చూసాడు శక్తి.
ఎక్కడున్నాడు తను... బచ్చా భగవాన్ రూమ్ లో... అన్న విషయం జ్ఞాపకం రాగానే ఎలర్టయ్యాడు శక్తి.
ఎదురుగా నోట్లో బ్రష్ తో నిలబడి శక్తి వేపే చూస్తున్నాడు భగవాన్.
"అమెరికన్ డాలర్స్... బర్డ్ డాగింగ్... ఏవేవో మాట్లాడుతున్నారు సర్... మీరు... అమెరికన్ స్టయిల్లో ఇంగ్లీషు పాటలు దంచేస్తున్నారు. పీడకలేమైనా వచ్చిందా సర్" అడిగాడు భగవాన్.
"పీడకల కాదయ్యా... బచ్చా భగవాన్... డబ్బు కల" లేచి కూర్చుంటూ అన్నాడు శక్తి.
క్రితంరోజు సాయంత్రం భగవాన్, బలవంతమ్మీద హోటల్ రూమ్ ఖాళీచేసి సూట్ కేస్ తో భగవాన్ రూంకి వచ్చాడు. ఛైర్మన్ గారి మేనల్లుడు, రేపో ఎల్లుండో కాబోయే మేనేజింగ్ డైరెక్టర్ కాబట్టి, అతి వినయంగా రాత్రి హోటల్ కి తీసికెళ్ళి. భోజన, భాజనాల ఖర్చులన్నీ తనే భరించి, ముందుగనే గౌరవం ప్రకటించుకున్నాడు భగవాన్.
తన మామ తనకెలాగూ మేనేజింగ్ డైరెక్టర్ పోస్టుకు తక్కువ లేని పోస్టునిస్తాడు. నో డౌట్... అందుచేత ఇలాంటి తక్కువ రకం ఉద్యోగులతో సత్సంబంధాలు తనకు అవసరం... ఇవాళ కాకపోతే, వచ్చే ఏడాదికయినా, వి.వి.ఎన్. ఎస్టేట్స్ కి తను అధిపతి కావడం ఖాయం. ఇప్పట్నుంచీ అందరితో మంచిగా ఉండాలి. క్రింద వారితో మెలుగుతూ వచ్చినవాడే పైస్థాయిలో చెక్కు చెదరకుండా నిలబడతాడట.
"కాఫీ ఎలాగున్నా తాగేయండి సర్... తప్పదు... మీ గౌరవం కోసం... మొట్టమొదటిసారి కాఫీ కాచాను సర్" భగవాన్ భక్తిగా కాఫీ కప్పు తెచ్చి శక్తికి అందించాడు.
"అదేంటోయ్ భగవాన్! అలా ఫీలవ్వకు. కాఫీదేం వుంది. నాపట్ల నీకున్న రెస్పెక్ట్ కి ఈ కాఫీ నిదర్శనం" అందుకుని నోటిదగ్గర పెట్టుకున్నాడు శక్తి.
* * * *
శక్తి, భగవాన్ ఇద్దరూ ఆఫీసు గేట్లోంచి లోనికి నడుస్తున్నప్పుడు...
"సర్! ఇవాళ మీరు నాకు పార్టీ ఇవ్వాలి. ఇస్తానని ప్రామిస్ చెయ్యండి సర్" అన్నాడు భగవాన్.
"ఇస్తాను గానీ ఎందుకో చెప్పు."
"ఎందుకో మీకు తెలీదా సర్. నాకు సిక్త్స్ సెన్స్ మీద నమ్మకం ఎక్కువ సర్. మీరు ఏసీ ఛాంబర్లో ఎమ్.డి. సీట్లో కూర్చున్నట్టు, స్టెనోగ్రాఫర్ కి లెటర్ డిక్టేటు చేస్తున్నట్లు అనిపిస్తోంది సర్. అదీ కాకుండా ఎడం కన్ను కూడా రెండున్నర నిమిషాల కొకసారి అదురుతోంది సర్...
వీటి రిజల్ట్ ఏంటంటే ఈవేళ మీ మాంగారు అదే ఛైర్మన్ గారు ఎమ్.డి. పోస్టు ఇవ్వడం ఖాయం సర్."
ఎక్సైయిట్ అయిపోతూ చెప్పాడు భగవాన్.
"నాక్కూడా ఆ విషయం తెలుసు బచ్చా భగవాన్. చిన్న చిన్న విషయాలకు మనం ఎక్సైయిట్ అయిపోగూడదు. ఇవాళ ఎమ్.డి. కావడం, రేపు ఛైర్మెన్ కావడం... ఇవన్నీ జరుగుతాయి. నేను మా పల్లెటూరు నుంచి, ఈ బెంగుళూరు వచ్చింది... వెర్రి వెంగళప్పలా మొహం వేలాడేసుకుని నీతో తిరగడానికి అనుకున్నావా- నో... నాటెటాల్- ఇంకా నేను చెయ్యాల్సిన పనులు చాలా వున్నాయి. ఈ వి.వి.ఎన్. ఎస్టేట్ కి ఛెయిర్మెన్ అయ్యాక, నా స్వంత కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. నా ఎంపయిర్ ని నేను క్రియేట్ చెయ్యాలి- అదీ నా డ్రీమ్... అర్థమైందా" సంతోషంగా చెప్పుకుపోతున్నాడు శక్తి.