Previous Page Next Page 
ముగ్ధ పేజి 30

   

    అబద్దం ఆడుతున్నప్పుడు పిల్లలు ఇలాగే ప్రవర్తిస్తారని ఇదివరలో చెప్పుకున్నాం కదా ఇదే పెద్దవాళ్ళల్లో ఆలోచిస్తే ఈ అభినయం పిల్లలంత స్పష్టంగా కాకుండా పాలిష్ డ్ గా వుంటుంది. ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏమిటంటే, చేతులతో కళ్ళు, నోరు, చెవుల్ని మూసుకునే ఒక్క భావ వక్తీకరణ ద్వారా మాత్రమే వ్యక్తుల్ని అంచనా వేయడం సాధ్యం కాదు. దాంతోపాటు ఆ వ్యక్తి ఇతర స్థితుల్ని కూడా మనం గమనించాలి.
    
    అప్పుకోసం వెళ్ళే వ్యక్తి ఎలాగయినా ఆ అప్పుని సంపాదించాలన్న ఉద్దేశంతో ఒక అబద్దాన్ని కల్పించి చెప్తాడు. అప్పుడు అతను చేసే భావ వ్యక్తీకరణ వేరు. ఆఫీసుకు ఆలస్యంగా వెళ్ళే ఒక వ్యక్తి, ఒక అకారణ అబద్దాన్ని సృష్టించి బాస్ నుంచి రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అతను చేసే భావ వ్యక్తీకరణ వేరు రోగుల్లో మానసిక ప్రశాంతతను నింపడం కోసం, ధైర్యాన్ని నూరిపోయడం కోసం, ఆరోగ్యం బాగా లేకపోయినా మీ అనారోగ్యం తగ్గిపోతుందని నర్సులు ఆడే అబద్దాల వెనక భావ వ్యక్తీకరణ వేరు.
    
    పరిస్థితుల్ని బట్టి వ్యక్తి అబద్దం ఆడుతున్నాడా, మోసం చేస్తున్నాడా? సందేహిస్తున్నాడా? అనే విషయాల్ని తెలుసుకోవడానికి సున్నితమైన అతని ముఖ, చేతి కవళికలు, కదలికలు కారణమవుతాయి. గాఢమయిన పరిశీలన వుంటేనే కాని ఈ క్లిష్టమయిన కదలికలకు అర్ధం చెప్పలేం.
    
    ఒక వ్యక్తి తన అరచేత్తో మూతిని మూసుకున్నాడనుకోండి. అతని బొటనవేలు, ఆ సమయంలో బుగ్గను నొక్కుతోందనుకోండి. అతనేదో, కూర్చుని ఆలోచిస్తున్నాడని సాధారణంగా అందరూ అనుకుంటారు. కాని అలా వున్న ఆ  భంగిమ వెనక అంతరాంతరాల్లో అతని మనసులో జరుగుతున్న మధనం ఏమిటో తెలుసా?
    
    తను చెప్పిన అసత్యాన్ని కానీ, తను చేసిన అకృత్యాన్ని కాని కప్పి పుచ్చుకునే పరిష్కారం గురించి అతను తీవ్రంగా ఆలోచిస్తున్నాడని అర్ధం.
    
    ఇంకొక ఆసక్తి విషయం.
    
    అప్పుడప్పుడు మనం, దగ్గు రాకుండానే కొన్ని పరిస్థితుల్లో దగ్గుతూ మాట్లాడుతుంటాం. ఆ పరిస్థితులు ఎలాంటివో ఒక్కసారి మనం ఆలోచిస్తే చాలా తెలుస్తాయి. మన ప్రమేయం లేకుండా జరిగిన ఒక తప్పుని కవర్ చేసుకోవడానికి మామూలు వ్యక్తులు దొంగ దగ్గుని ఆశ్రయించి మాట్లాడితే, హార్డ్ కోర్ క్రిమినల్స్ సైతం పోలీసులతో మాట్లాడేటప్పుడు, కోర్టుల్లో తమ తప్పుల్ని ఒప్పుకునే పరిస్థితులు ఎదురయినప్పుడు ఈ దొంగదగ్గుని ఆశ్రయిస్తారు. అలాగే రాజకీయ నాయకులు, ప్రతిపక్ష పార్టీ వ్యక్తుల్ని దొంగ డెబ్బ తీయడానికి చేసే చర్చల్లో, అండర్ వరల్డ్ గాంగ్ లీడర్లు, తమ కార్యకలాపాల గురించి సోదర గాంగ్ లీడర్లతో చర్చలు చేసేటపుడు ఈ దొంగదగ్గుని ఆశ్రయిస్తారు.
    
    కొంతమంది వేళ్ళతో ముక్కుని తరుచు రాసుకుంటుంటారు. ఇది ఎక్కువగా ఆడపిల్లల్లో మనకు కనిపిస్తుంది. టీనేజ్ అమ్మాయిల హేండ్ కర్చీఫ్ లు చూడండి వాళ్ళ మనసుల్లాగే చిన్న హేండ్ కర్చీఫ్ లు అవి. అభిమానించే అబ్బాయిలెవరయినా వాళ్ళతో మాట్లాడుతున్నారనుకోండి హేండ్ కర్చీఫ్ తో వాళ్ళు ముక్కును తరుచూ రుద్దుకుంటూ మాట్లాడుతుంటారు. ఇది నూటికి ఎనభై శాతం మందికి అలవాటు.
    
    కొత్తగా పెళ్ళయి, అత్తవారింటికెళ్ళే అమ్మాయిల్ని చూడండి ఎ పని చేస్తే తప్పో ఎ పని చేస్తే ఒప్పో తెలీదు. ఎవరయినా ఏమంటారేమోననే భయం. ఇంటికేవరయినా కొత్తవాళ్ళొస్తే వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీని జంకు. దీనికి ఆ అమ్మాయిచ్చే ఏకైక ఎక్స్ ప్రెషన్, పైటకొంగుతోనో చూపుడు వేలుతోనో ముక్కుని రుద్దుకోవడం.
    
    ఇదే అలవాటు మగవాళ్ళల్లో ఇంకో రకంగా ఉంటుంది. మొత్తం అరచేత్తో ముక్కుని అదిమిపట్టి, ముఖాన్ని తుడుచుకుంటారు. వయోభేదం బట్టి ఆ అరచేతి వత్తిడి ముఖమ్మీద, ముక్కుమీద వుంటుందన్న విషయం ఇక్కడ గమనించాలి.
    
    అతిగా మేకప్ చేసుకునే ఆడవాళ్ళు, సినీస్టార్స్, మోడలింగ్ చేసేవాళ్ళు, ఉపన్యాసకులు, కాలేజీ లెక్చరర్లు, కవులు, కథకులు తరుచు ముక్కుని వేళ్ళతో రాసుకుంటారు.
    
    కొందఱు అందరికీ కన్పించేటట్టు ఆ వ్యక్తీకరణను చేస్తే, మరి కొందరు కని, కన్పించనట్టు చేస్తారు. తెలుగు సిన్మానటి లక్ష్మి, హిందీ నటుడు శత్రుఘ్నసిన్హా భావ ప్రకటనలో ఈ అలవాటు మనకు స్పష్టంగా కన్పిస్తే, ఇందిరాగాంధీ, కన్నడ రాజకుమార్, అటల్ బిహార్ వాజపేయిల్లో అస్పష్టంగా మనకు కన్పిస్తుంది.
    
    అలాగే మరికొంతమంది కళ్ళు రుద్దుకుంటారు. ఒక మగవ్యక్తి తనొక పెద్ద తప్పు చేసానని భావిస్తున్నపుడు, గట్టిగా కళ్ళను రుద్దుకుని నేలవేపు చూపుల్ని తిప్పుకుంటాడు. ఆడవాళ్ళు మాత్రం మెల్లగా రుద్దుకుంటారు. ఇందులో భాగమే నేలవేపు చూపులు చూడడం, నీళ్ళు నమలడం, సీలింగ్ ఫేన్ వేపో, ఆకాశంవేపో చూడండి.
    
    కొంతమంది చేసే పళ్ళతో ఇకిలింపు కూడా న్యూనతా భావానికి నిదర్శనం.
    
    అందరూ తెల్సుకోవాల్సి ఇంకొక గొప్ప విషయం.
    
    సినిమా తెరమీద నటులు, నటీమణులు చేసే, నటనలో అప్పుడప్పుడు ఆయా నటుల సహజమయిన ఫీలింగ్స్ మనకు కనిపిస్తాయి. ఆ ఫీలింగ్స్ ని గనుక మనం స్పష్టంగా పట్టుకోగలిగితే, ఆయా నటులు నిజంగా నటిస్తున్నారా లేక ఏదో మూడ్ లో ఉంది డ్యూటీలా చేసుకుపోతున్నారా అనే విషయం మనకు తెలుస్తుంది.
    
    అలాగే చెవుల్ని రుద్దుకోవడం గురించి.
    
    ఒక మనిషి బొటన వేలుతోనూ, చూపుడు వేలుతోను చెవిని పట్టుకొని, ముఖాన్ని ప్రసన్నంగా పెట్టేడనుకోండి, అతను అంతవరకూ ఎదుటివ్యక్తి చెప్పింది పూర్తిగా విన్నాడని, అతను అడిగిన దానికి తను చెప్పడానికి సంసిద్దుడుగా వున్నాడని అర్ధం.
    
    ఒక వ్యక్తి దవడ చివరభాగాన చెవి కలిసినచోట చూపుడువేలుని పెట్టుకున్నాడనుకోండి. అవతలివ్యక్తి చెప్పినదానికి తను సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడని అర్ధం.
    
    కొంతమంది తమ షర్టు కాలర్ ను లాక్కుంటూ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. తను అబద్దం చెప్పినట్టుగా ఎదుటివ్యక్తి గుర్తించాడని తెలియగానే కొంతమంది ఈ భావ ప్రకటనను చేస్తారు.
    
    ఆ సమయంలో చిరుచెమట కంఠభాగాన పడుతుంది కూడా. ఈ భావ ప్రకటనను చేస్తూ వాళ్ళు చెమటను తుడుచుకునే రహస్య ప్రయత్నం చేస్తారు.
    
    ఇంకొంతమంది తాము కోపంగా ఉన్నప్పుడు, అపజయాన్ని భరించలేని స్థితిలో వున్నప్పుడు కాలర్ ని లాక్కుంటారు.
    
    కొంతమంది చిటికెన వేలుని నోట్లో పెట్టుకుని గోళ్ళు కొరుక్కుంటూ ఆలోచిస్తుంటారు. తాము చేస్తున్న ఒక ప్రయత్నం సఫలం అవుతుందనే నమ్మకం దృఢంగా కలిగినపుడు మనిషి ఈ రకంగా ప్రవర్తిస్తాదు.
    
    అలాగే బుగ్గలు, చుబుకం గురించికూడా-
    
    క్లాస్ లోని విద్యార్ధులకు క్లాస్ వర్క్ ఇచ్చిన టీచర్ గాని, లెక్చరర్ గాని ఒక అభినయాన్ని అభ్యాసం చెయ్యమని నాట్యాచారుడు శిష్యులకు చెప్పి మఠం వేసుకుని కూర్చున్నా, ఆఫీసు టైమయిపోయినా ఇంకా ఇంటికిరాని భర్తకోసం, టి.వి. చూస్తూ సోఫాలో కూర్చున్న భార్య, పార్కులో లవర్ కోసం ప్రియుదు ఎదురుచూసేటపుడు, ఒకడ్ని ఓడించే ముందు ఇంకొకవ్యక్తి తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు, ఒక నిర్ణయం తీసుకునేముందు, ఆడయినా, మగయినా బుగ్గమీద, చుబుకంమీద చేతులుంచుకుని ఆలోచిస్తారు."

 Previous Page Next Page