Previous Page Next Page 
ముగ్ధ పేజి 31

   

     చెప్పడం ఆపింది ముగ్ధ.
    
    "అద్భుతంగా వుంది" చప్పట్లు చరుస్తూ అంది సురభి. అదే సమయంలో అక్కడకొచ్చిన నీలిమను చూస్తూ ముగ్గురమ్మాయిలు ఆశ్చర్యపోయారు.
    
    "చీరలో వెళ్ళినదానివి షర్టూ, ఫ్యాంటులో వచ్చావేమే. జరగరాని ఘోరం జరిగిపోయిందేటే అమ్మడు?" పాతకాలపు ముత్తయిదువులా అభినయిస్తూ అంది అలక.
    
    "నీకెప్పుడూ అదేగోల. ముందు స్నానం చేస్తాను. తర్వాత మాటలు" అంటూ గబగబా లోనికి నడిచింది నీలిమ.
    
                                       *    *    *    *    *
    
    రాత్రి తొమ్మిది గంటలయింది.
    
    నలుగురు అమ్మాయిలు డిన్నర్ ముగించుకొని వచ్చి కూర్చున్నారు.
    
    "మైడియర్ ఫ్రెండ్స్, మనమంతా కల్సివుండేది ఈ రాత్రి ఒక్కటే. ఎన్నోరోజులు పడుతుందనుకున్న కుర్రాళ్ళ ఎంపిక అనుకోకుండా రెండురోజుల్లోనే పూర్తికావడం యాదృచ్చికమో లేక అదృష్టమో నేను చెప్పలేనుకానీ, నా గురించి నేను చెప్పుకుంటే చీటీలో వచ్చినట్టుగా నాకు కన్పించిన రాజేంద్రప్రసాద్ ని నేను ఎంచుకున్నాను. అన్ని క్వాలిఫికేషన్స్ వున్నా కూడా తన అమాయకత్వం కారణంగా, పిరికితనం కారణంగా, ధైర్యం లేకపోవడం వల్ల అతను తన బతుకు మీద విశ్వాసాన్ని కోల్పోయిన పరిస్థితిలో నాకు కన్పించాడు. మనం కల్పించుకున్న సూత్రాలకు బద్దురాలినయి నేను అతన్ని ఒక మనిషిగా సమాజం గుర్తించే విధంగా తయారుచేస్తానని హామీ ఇస్తున్నాను. మీకు తారసిల్లిన అబ్బాయిల గురించి మీరేం అనుకుంటున్నారో చెప్పండి"
    
    "నాకు చీటీలో ఏం రాసుందో అలాంటి యువకుడే నాకు దొరికాడు. నేను జయాధ్యక్షను ఇష్టపడుతున్నాను. ఒక లక్ష్యం లేకుండా తిరుగుతున్న అతన్ని నేను ప్రపంచం ఆశ్చర్యపోయేట్టుగా మలుస్తాను. అతని మీద నాకు ఎన్నో సందేహాలువున్నా ఫర్వాలేదు. ఐ కెన్ బేర్ హామ్. ఐ ఎ ష్యూర్ యూ దట్, ఐ కెన్ మేడ్ హిమ్ ఎ రియల్ మేన్."
    
    "మరి నువ్వో" నీలిమని అడిగింది ముగ్ధ.
    
    "నాకు చీటీలో వచ్చినట్లుగా అరవింద్ ఉద్రేక స్వభావి. చదువుకున్నవాడు. ఈ సొసైటీ లోని యాంటీ ఎలిమెంట్స్ ని తొలగించడానికి కంకణం కట్టుకున్నాడు. అతనితో పూర్తిగా నేను ఏకీభవించకపోయినా అతన్ని నిజంగా నెఉ అభిమానిస్తున్నాను. అతనిలో కల్సివుండి, అతని వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్ధంచేసుకొని, సమాజం గౌరవించేస్థితికి, గుర్తింపు నిచ్చేస్థితికి అతన్ని నేను తీసుకొస్తానని మీ ముగ్గురిసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను" అంది నీలిమ స్థిరంగా.
    
    "మీ అందరికంటే అన్ని విషయాల్లో ఎప్పుడు ఫాస్టుగా వుండే నేను ఇప్పుడూ ఫాస్టుగానే వున్నాను. శ్రీధర్ నాతోకల్సి జీవించడానికి ఒప్పుకున్నాడు. ఈ వారంరోజుల్లోపునే మేం కల్సి జీవిస్తాం" చెప్పింది సురభి.
    
    "పెళ్ళి చేసుకుంటానన్నాడా" ఆసక్తిగా అడిగింది అలక.
    
    "ఆయన రెడీగానే వున్నాడు. కానీ నేనే ఇంకా నిర్ణయించుకోలేదు. పరిస్థితులన్నింటిని గమనించాకే పెళ్ళి రాజేంద్రప్రసాద్, జయాధ్యక్ష అరవింద్ లకంటే ముందు మా శ్రీధరే అందరి ఎదుటా గుర్తింపు పొందుతాడు. శ్రీధర్ కు నోబుల్ బహుమతి రావడం ఖాయం. డిసెంబర్ నాటికి అతన్ని నోబుల్ ప్రైజ్ విన్నర్ ని చెయ్యకపోతే నా పేరు సురభి కాదు."
    
    "నువ్వేకాదు మేమూ సాధిస్తాం" వెక్కిరిస్తూ అంది నీలిమ.
    
    "అందుకేగదా ఇది మళ్ళీ గొడవెందుకు" అంది అలక.
    
    "మైడియర్ ఫ్రెండ్స్ ఈ జనవరి ఒకటోతేదీ మన జీవితాల్లో అద్భుతమయిన మలుపుకు కారణమవుతోంది. సెన్షేషన్ కావాలని మనమీపని చేయడంలేదు. మనకు సెన్షేషన్ అక్కరలేదు. ఎట్టి పరిస్థితుల్లోను ఈ ప్రయోగం పూర్తయ్యేవరకు మన పేర్లే బయటకు రాగూడదు. రాకుండా జాగ్రత్త పడదాం. అసలిది ఒక ప్రయోగమనికూడా ఎవరికీ తెలియకూడదు. ఆఖరికి మన ఇన్ స్ట్రుమెంట్స్ కి కూడా."
    
    "ఇన్ స్ట్రు మెంట్సా? అవేమిటి?" అడిగింది సురభి.
    
    "మన ఇన్ స్ట్రుమెంట్స్ మన నలుగురు కుర్రాళ్ళు" నవ్వుతూ చెప్పింది ముగ్ధ.
    
    "భలేపేర్లు పెడతావే నువ్వు" అందరూ నవ్వుకున్నారు.
    
    "మరోసారి మనం జ్ఞాపకముంచుకోవాల్సిన ఏకైక విషయం మన ప్రయోగంలో ఎన్ని కష్టాలెదురయినా భరించండి. మన ఆల్టిమేట్ గోల్ మన ప్రయోగాన్ని సక్సెస్ చెయ్యడం.
    
    మనం మనసార కోరుకుంటున్నదాన్ని పొందడమే జీవితంలోని విజయానికి కిటుకు. నువ్వు ఏపని చేస్తున్నా చేయవలసింది పూర్తిచెయ్యి శక్తివంచన లేకుండా ఉద్యమించు, జీవితాన్ని ధారపోసేవారిని జీవితం మోసం చెయ్యదు. కానీ చాలామంది అది ఆచరించరు. అలాగే సంస్కృతంలో ఒక శ్లోకంవుంది మన యువతరం ఈ శ్లోకాన్ని ప్రతిరోజు తలచుకోవాల్సిన అవసరం వుంది.
    
    ఉద్యమేనహి సిద్ద్యంతి కార్యాణి సమనోరదైహి
    నహి సుప్తస్య సింహస్య ప్రవేశంతి ముఖేమృగాహః
    
    మనసులో అనుకోవడంవల్ల పనులు పూర్తికావు. ఆ పనిని సఫలం చేసుకోవడంకోసం పూనుకోవాలి. ఆకలిగావున్న సింహం నోటిదగ్గరకు ఆహారంగా మృగం రాదుకదా, సింహమే అక్కడకు వెళ్ళాలని అర్ధం ఈనాటి మన ప్రయోగం రేపు విజయవంతమయితే ఆపైన దేశంలోని ప్రతి స్త్రీకి మనం ఇన్ స్పిరేషన్ అవుతామని మర్చిపోకండి.
    
    అమెరికాలో ఉంటున్న కూతురు ఇండియాలోవున్న తల్లితో ఫోన్ లో మాట్లాడినప్పుడు - ఈ రోజేం కూర వండావమ్మా అని తల్లి అడుగుతుంది. వంకాయ కూరని కూతురు చెబుతుంది. అది మన స్త్రీల స్థాయి? ఎవరో పర్నేష్ విమర్శించాడంటే ఏం చేస్తాడు?
    
    ఫోన్ లు చేసుకొని కూరలగురించి, వంటలగురించి, బంగారపు బిస్కట్స్ దా గురించి మాత్రమే మాట్లాడుకొనే దౌర్భాగ్యపుస్థాయిలోనే మన స్త్రీజాతి ఉండటం దురదృష్టకరం కాదా? తల ఓంపులయ్యే విషయం కాదా!
    
    ఒక పుస్తకం చదవరు-పత్రిక చదవరు-పేపరు చదవరు-మరెలా వాళ్ళబుద్ది వికసించేది?
    
    కొన్ని కోట్ల పనిగంటలు సోమరిపోతులయిన స్త్రీల మూలంగా మన దేశం కోల్పోతోందని జపాన్ ఎకనమిస్టుల సర్వే-
    
    క్రింద తరగతి స్త్రీలే నయం - మగవాడితోపాటు సమానంగా కూలిపని చేస్తారు. అటుపైకెళితే వ్యాపారాల్లోకి, రాజకీయాల్లోకి స్త్రీలు దూసుకుని వెళ్ళిపోతున్నారు. ఎటూగాని తరగతికి చెందిన స్త్రీలే ఎటూ కాకుండా పోతూ స్త్రీ జాతికి తల వంపులు తెస్తున్నారు.
    
    కనీసం చీరకు ఫాల్ కుట్టుకోవటానికి కూడా బద్దకమే- నాలుగు మొక్కలు పెంచుకోడానికి ఒళ్ళు వంగదు.
    
    నో రీడింగ్...నో గార్డెనింగ్-నో హోప్ డెకొరేషన్-నథింగ్ జస్ట్ షోపీసెస్.

 Previous Page Next Page