"కాఫీయా! వద్దంది" మోహమాటంగా అన్నాడు రాజేంద్రప్రసాద్.
"బిల్లు మీరు ఇవ్వొద్దులెండి" నవ్వుతూ అంది ముగ్ధ.
"బిల్లు కోసంకదండి. నేను కాఫీ, టీ ముట్టనండి" మెల్లగా అన్నాడు అతడు.
"మా ముగ్ధకు ఇలాంటి వాళ్ళంటేనే ఇష్టం" ఆ మాట అనేసి నాలిక్కరుచుకుంది అలక.
ఆ మాటకు ఎలా రియాక్టు అవ్వాలో తెలీలేదు అతనికి.
"పోనీ బటర్ మిల్క్ తాగుదురు కాని."
"ఈ టైమ్ లో బటర్ మిల్క్ తాగితే....ఎవరయినా చూస్తే ఏమనుకుంటారండి?"
"ఒకరేదో అనుకుంటారని మన దాహాన్ని మన ఆకల్ని చంపుకుంటామా? పదండి పదండి."
నలుగురు రెస్టారెంట్ కి వచ్చారు.
మరో అరగంటలో అందులోంచి బయటపడ్డారు.
"నే వెళతానండి. మళ్ళీ కలుస్తాను" రాజేంద్ర మాట్లాడుతున్నప్పుడు కాలర్ ని చేత్తో పట్టుకోవడం అలవాటు. అలా పట్టుకున్నప్పుడు కుడి చెయ్యి నాలుగువేళ్ళూ లోనకు మూసుకుని, బొటనవేలు మాత్రం కన్పిస్తుంటుంది. ఆ అలవాటుని స్పష్టంగా గమనించింది సురభి.
"మళ్ళెప్పుడు?" అడిగింది ముగ్ధ.
"మళ్ళీ రేపు అదే పార్కులో యధాప్రకారం" అంటూ నవ్వాడు రాజేంద్ర.
"ఎల్లుండి నుంచి మీరా పార్కులో వుండరు" అంది ముగ్ధ.
ఆ మాట వెనుక భావమేమీ అర్ధంకాలేదు రాజేంద్రకు.
"సీయూ" అందరివేపు చూస్తూ ముందుకు నడిచాడు.
"నీలిమ ఇంకా రాలేదేమిటి?"
"వస్తుందిలె కంగారెందుకు?"
"అదికాదు కానీ ముగ్దా! నీ బాయ్ ఫ్రెండ్ పుట్టుకతో వృద్దుడు. మాటమాటికి కాలర్ ని చేత్తో పట్టుకుంటాడు. బొటన వేలొక్కటే కనిపిస్తుంటుంది గమనించావా? బాడీ లాంగ్వేజీలో దానర్ధం ఏమిటే?" అడిగింది సురభి.
"ముందు పుట్టుకతో వృద్దుడన్న నిక్ నేమ్ మానెయ్. శుభ్రంగా రాజేంద్ర అని రిఫర్ చెయ్యి అర్ధమైందా?" ఒకింత కోపంగా అంది ముగ్ధ.
"అలాగే లేవే! ముందు ఆ బొటనవేలు గురించి చెప్పు."
"వేళ్ళల్లో అతి ముఖ్యమయినవి బొటనవేలు, చూపుడు వేలు ఒక మనిషి ఇంకో మనిషికి కమ్యూనికేట్ చెయ్యడానికి ఈ రెండు వేళ్ళే ఉపయోగిస్తుంటాడు. ఎవరయినా తమ ఆనందాన్ని వ్యక్తం చేసినప్పుడు బొటనవేలు చూపించి ప్రకటించడం మనకు తెలుసు. అలాగే చూపుడువేలు కోపంతో హెచ్చరిస్తున్నప్పుడు, ప్రేమతో ప్రియుడు, ప్రియురాలిని పిలిచినప్పుడు యంగ్ స్టర్స్ ఈ వేళ్ళను ఉపయోగిస్తే, చిన్న పిల్లలు ఆడుకుంటున్న సమయంలో తోటి స్నేహితున్ని కళ్ళల్లో పొడుస్తాను జాగ్రత్త అని ఈ చూపుడు వేలుని చూపిస్తుంటారు. మనం బాగా పిల్లల్ని పరిశీలిస్తే అర్ధమవుతుంది.
ఈ వేళ్ళల్లో ముఖ్యంగా బొటనవేలు గురించి చెప్పుకుంటే, బాడీ లాంగ్వేజ్ లో ఈ బొటనవేలు కదలికల వ్యవహారాన్ని ధంబ్ డిస్ ప్లే అంటారు. ఈ బొటనవేలుద్వారా వ్యక్తమయ్యే సంకేతాలు సమాచారం అంతా సాధారణంగా అనుకూలంగానే వుంటుంది.
చాలామందికి ఫ్యాషన్స్ అంటే మోజు లేటెస్టు ఫ్యాషన్స్ అంటే పడి చచ్చిపోతారు. ఫ్రాన్స్ లో చూస్తే ప్రతి గంటకో కొత్త ఫ్యాషన్ పుట్టుకొస్తుంది. తమ దుస్తులు, తమ అలంకరణ, తమ హావభావ విన్యాసాలద్వారా ఎంతటి వాళ్ళనయినా ఆకర్షించగలమన్న నమ్మకం వున్న వ్యక్తులందరూ బొటనవేలు ద్వారా అప్రయత్నంగా తమ భావాన్ని వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తారు.
ఎలిజిబెత్ టేలర్, లేడీ డయానా, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పామెల్లా బోర్డన్, రేఖ, ఎన్టీరామారావు, గోవా పాప్ సింగర్ రెమో ఇలా ఎంతో మందిని మనం ఉదాహరణలుగా తీసుకోవచ్చు.
అలాగే అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావుల మధ్య వ్యత్యాసాన్ని మనం ఈ వేళ్ళ కదలికల ద్వారా గమనించవచ్చు. అక్కినేని తన భావాన్ని వ్యక్తం చేయడానికి తరచూ చూపుడువేలుని ఎందుకు ఉపయోగిస్తారు? ఎన్టీ రామారావు బొటనవేలునే ఎందుకు ఉపయోగిస్తారు? ఇద్దరి వ్యక్తిత్వాలమధ్య తేడా వాళ్ళిద్దర్నీ ఎరిగిన అందరకూ తెల్సిందే కదా!
కాగా బొటనవేలు కదలిక అనుకూలతకు సంకేతం అయినా ఇందులో సుపీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువగా కన్పిస్తుంటుంది-అది ఎన్టీ ఆర్ లో వుంది.
కోటు వేసుకొని వెళ్తున్న వ్యక్తిని మీ రెప్పుదయినా గమనించండి- ఎక్కడో ఒకచోట అతను ఆగుతాడు. ఆగినప్పుడు సహజంగా అతని రెండు చేతులూ కోటు జేబుల్లో వుంటాయి. కానీ ఆ ఫోజులో అతని బొటనవేళ్ళు మాత్రం బయటికి కన్పిస్తుంటాయి. అలాగే కాలి బొటనవేళ్ళు కూడా కలి బొటనవేళ్ళమీదే ఎక్కువ ప్రెజర్ ఇస్తూ కొంతమంది నడుస్తుంటారు. వాళ్ళది కూడా ఇదే వ్యక్తిత్వం.
కోర్టులో వాదిస్తున్న ఒక లాయరుని తీసుకోండి-ఇన్ మై హంబుల్ ఒపీనియన్ - లేడీస్ అండ్ జంటిల్ మన్ ఆఫ్ ది జ్యూరీ. అని అనే ఆ లాయర్ హావభావాల్లో అతని తల వెనక్కి వంగి, చూపులు అతని ముక్కుమీద ఉన్నాయనుకోండి. ఆ సమయంలో అతను చేయి కాలర్ కు కొంచెం కింద వుంటుంది. అప్పుడు అతని బొటనవేలు పొజిషన్ స్పష్టంగా అందరికీ కన్పిస్తూనే వుంటుంది. అతను డాంబికమైన వ్యక్తి అని, చేసేదొకటి, చెప్పిందొకటీ చేస్తాడని దానికి అర్ధం. ఇంకొంతమంది తరచూ తమ చేతుల్ని ఫాంటు వెనక భాగంలో పెట్టుకుని నడుస్తుంటారు. దీనర్ధం తమ డామినేట్ పర్సనాలిటీని బయటకు కనబడకుండా వాళ్ళు నిత్యం జాగ్రత్తలు తీసుకుంటారని అర్ధం అలాగే ఒకమ్మాయి ఫాంటూ, వాళ్ళు నిత్యం జాగ్ర్రత్తలు తీసుకుంటారని అర్ధం అలాగే ఒకమ్మాయి ఫాంటూ, షర్టూ వేసుకుని, ముందు జేబుల్లో చేతులు పెట్టుకుని నిల్చుందనుకోండి. దీనర్ధం ఆ అమ్మాయికి వుద్రేక స్వభావం ఎక్కువని అలాగే కొంతమంది బొటన వేలితోనో, చూపుడు వేలితోనో ముక్కుని రాసుకోవడం అలవాటు వీళ్ళు కూడా ఇదే బాపతు.
ఒక వ్యక్తి గుండెలమీద రెండు చేతులూ, బొటనవేలు కన్పించేటట్లుగా పెట్టుకున్నాడనుకోండి. ఒక ఉద్రేకాన్నుంచి తననితాను రక్షించుకోడానికి ప్రయత్నిస్తున్నాడని అనుకోవచ్చు. కొంతమంది మగవాళ్ళుకాని, ఆడవాళ్ళు గాని ఎదుటి వ్యక్తి గురించి చెప్పడానికి ప్రారంభించినపుడు బొటనవేలుని ఒక పక్కకు చూపుతూ విషయాన్ని ప్రారంభిస్తారు. ఆ సమయంలో ఆ బొటనవేలు స్టిఫ్ నెస్ బట్టి ఆయా వ్యక్తుల గురించి వాళ్ళు నెగిటివ్ గా చెప్పబోతున్నారా, పాజిటివ్ గా చెప్పబోతున్నారా అనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది.
అలాగే ముఖంలో కళ్ళు, ముక్కు, చెవులు, పెదాలు మనం వ్యక్తం చేసే భావాలకు స్పందనలకు ప్రతిస్పందిస్తాయి. అలాగే చేతులు కూడా...కానీ కొన్ని భావాల విషయంలో ముఖం, ముఖంలోని భాగాలు చేతులు కలిసి ఉమ్మడిగా తమ కమ్యూనికేషన్ ను అందజేస్తాయి.
ఇందుకు మనకు అర్ధమయ్యే ఒక ఉదాహరణ :
చెడు వినకు - చెడు కనకు - చెడు మాట్లాడకు - అని సూచించే మూడు కోతుల చిత్రం ఆ చిత్రం లో కోతులు ముఖంతోనూ, చేతులతోనూ చేసే భావప్రకటన చూస్తూ మనిషి కూడా అదే మాదిరిగా చేస్తాడనే విషయం మనకు స్పష్టంగా అర్ధమవుతుంది.
ఒక వ్యక్తి అబద్దం చెపుతున్నాడని మనకెలా తెలుస్తుంది? మనమే అబద్దం చెపుతున్నామనుకోండి ఆసమయంలో మనం చేసే హావభావాలు ఖచ్చితంగా మూడుకోతుల ప్రకటన పద్ధతిలోనే ఉంటాయి. మనం సాధ్యమైనంత వరకు, కళ్ళుగాని, నోరుగానీ, చెవుల్నిగానీ మూసుకుంటాం. ఒక అబద్దాన్ని చెప్పేటప్పుడు ఎలా మన భావం ఉంటుందో, అలాగే ఒక అబద్దాన్ని విన్నప్పుడు కూడా అలాంటి ప్రకటనే వుంటుందనే విషయం గమనించాలి.