Read more!
 Previous Page Next Page 
వెన్నెల్లో గోదారి పేజి 3

   
    
    కొందరయితే నా ఉద్దేశ్యంలో తిడతారు. మరీ గారాబం చేసే వాళ్ళయితే 'తప్పమ్మా అలా చేయకూడదు' అని మందలిస్తారు. మరీ కోపిష్టులైతే చావబాదుతారు. నేనా మూడూ చెయ్యలేదు.
    
    సాహితిని నిలబెట్టాను. "చూడు, తప్పుచేస్తే నేను ఊరుకోనని నీకు తెలుసు. నీకు బుద్ది వచ్చిందని చెప్పినాసరే -పనిష్మెంట్ తప్పదు. నీకు నేను చెయ్యగలిగే సాయం ఏమిటంటే- ఏ పనిష్మెంట్ కావాలో నీవే చెప్పు".
    
    అది మాట్లాడలేదు.
    
    "కొట్టనా" అని అడిగాను.
    
    అది తలూపినట్టు కనిపించింది.
    
    మా పెరట్లో జామచెట్టు వుంది. దాని కొమ్మవిరిచి, రెండు చేతులమీద పదేసి దెబ్బలు కొట్టాను. చివరిదెబ్బ కొడుతూ వుండగా ఆయన వచ్చారు. కూతుర్ని పట్టుకుని పక్కకిలాగి, "నువ్వు మనిషివా? రాక్షసివా?" అని అరిచారు. అప్పటికే దాని చేతులమీద తట్లు తేలాయి.
    
    చేతిలో బెత్తం పడేస్తూ, "రాక్షసిని కాదు మనిషినే. మీ కూతుర్ని మనిషిని చేద్దామనే నా ప్రయత్నం" అన్నాను. ఆయన సాహితిని తీసుకుని అక్కన్నుంచి వెళ్ళిపోయారు.
    
    ఆ రాత్రి ఆయన్ని నిలదీశాను. "నన్ను రాక్షసి అన్నారు. కానీ చెప్పండి. మన కూతురొక దొంగవటం మీకిష్టమేనా? పదమూడేళ్ళ వయస్సులో అది దొంగతనం చేసిందంటే ఎంత తలవంపులు...ఈ విషయం బయటపడితే ఎలా ఉంటుందో మీరాలోచించారా?" ఆయన తల తిప్పుకున్నారు.
    
    "చూశారా? మీరు చెప్పరు. చెప్పలేరు! మీరు చెయ్యరు. నన్ను చెయ్యనివ్వరు".
    
    "నువ్వు కొడితే అది మానేస్తుందా?"
    
    "కనీసం మళ్ళీ ఇంకొకసారి చేసేటప్పుడు భయం ఉంటుంది".
    
    "నెమ్మదిగా చెపితే అది విని ఉండేది".
    
    "మనుష్యుల మంచితనం మీద మీకున్న నమ్మకం నాకు లేదు" వెటకారంగా అన్నాను.
    
    "చేసిన ప్రతి నేరానికి శిక్ష పడాలనుకుంటే ఈ మనుష్యులందరూ ఎప్పుడో నశించిపోయి ఉండేవారు". నిర్లిప్తంగా అన్నారాయన.
    
    "చాల్లెండి సినిమా డైలాగులు".
    
    అంతలో పక్క గదిలోంచి మూలుగు వినిపించింది. అక్కడికి వెళ్ళాను.....సాహితి....పక్కమీద నిద్రలో మూలుగుతోంది.
    
    తలమీద చెయ్యి వేయబోయి ఆగిపోయాను. ఉహు, ఇప్పుడు ఏ మాత్రం కనికరం చూపినా మధ్యాహ్నం వేసిన శిక్ష తాలూకు ఫలితం ఏమీ ఉండదు. ఆడపిల్లయి ఉండీ ఈ వయస్సులో దొంగతనంగా డబ్బు కొట్టేసినందుకు అసలీ శిక్ష కూడా చాలదు. అక్కన్నుంచి శబ్దం చెయ్యకుండా వచ్చెయ్యబోయాను.
    
    సాహితి అప్పుడే కళ్ళు తెరిచింది. మేం ఇద్దరం ఒకర్నొకరు చూసుకున్నా, ఎవరూ మాట్లాడుకోలేదు. అది అంత బాధలో కూడా కనీసం 'అమ్మా' అనైనా అనలేదు.
    
    దానికే అంత పొగరుంటే నాకెంత వుండాలి?
    
    నేను కూడా మాట్లాడకుండా వచ్చేశాను.
    
    తిరిగి బెడ్ రూమ్లోనికి వస్తూంటే, అప్పుడు కనబడింది- హాల్లో-సోఫా పక్కన-
    
    వంద రూపాయల నోటు.
    
    పాలవాడి కిద్దామని తీసి కిటికీలో పెట్టిన సంగతి అప్పుడు గుర్తొచ్చింది!!
    
    ఒక నిముషంపాటు నోట మాటరాలేదు. చిత్తరువులా నిలబడి పోయాను. ఆ తరువాత సన్నగా కేకపెట్టి ఆయన దగ్గరకు పరుగెత్తాను.
    
    వందరూపాయల నోటు అక్కడ పెట్టి మర్చిపోయిన సంగతి ఆయనకు చెప్పాను. ఆయన విస్తుపోయి నావైపు చూశారు. ఆ చూపు.....క్షమించండి, దాన్ని వర్ణించటానికి నాకు మాటలు రావు. ఆ చూపు మాత్రం నా గుండెల్లోనుంచి బాణంలా దూసుకు పోయింది. ఇద్దరం సాహితి గదిలోకి వచ్చాం. "అమ్మా" అంటూ కూతుర్ని వళ్ళోకి తీసుకున్నారాయన. "ఈ డబ్బు నువ్వు తీయలేదని ఎందుకు చెప్పలేదు?"
    
    సాహితి జవాబు చెప్పలేదు.
    
    నేను దగ్గరికి వెళ్ళి "తీయలేదంటే, అబద్దం చెపుతున్నావని కొడతాననుకున్నావా?" లాలిస్తున్నట్టు అడిగాను.
    
    కాదన్నట్లు తలూపింది.
    
    "మరి?"
    
    మా పాప తలదించుకుని నెమ్మదిగా అంది. "అంతకు ముందు అయిదు రూపాయలు పోతే పాత పనిపిల్ల తీసిందని ఇన్ స్పెక్టరంకులుతో చెప్పి జైల్లో పెట్టించారుగా, మన దగ్గర కూడా మాన్పించేశారు".
    
    "అవును అయితే?"
    
    "అది తీయలేదట దేముడిమీద ఒట్టేసి ఏడుస్తూ చెప్పింది. మన దగ్గర పనిమానేశాక దానికి తిండికూడా లేదట. నిజం అలాగే ఇప్పుడు కొత్తపిల్ల వచ్చింది. అందుకని-"
    
    "ఊ, అందుకని?" ఏదో అనుమానంతో నా గొంతు ఒణికింది.
    
    "ఈ సారి ఇది తీసిందని దీన్నికూడా జైల్లో పెట్టిస్తావు.... పనిలోంచి తీసేస్తావు....దీనిక్కూడా తిండి వుండదని నేనే..."
    
    పాప మాటలు పూర్తికాలేదు.
    
    ఆయన ఏడుస్తూ ఉండగా నేనెప్పుడూ చూడలేదు. అలాంటిది ఆయన రుద్దకంఠంతో, "అమ్మా-సాహితీ" అంటూ కూతుర్ని కౌగిలించుకుని కంటనీరు పెట్టుకున్నారు. అయిదు నిమిషాల క్రితమే అన్నాను- 'మనుష్యుల మంచితనం మీద మీకున్నంత నమ్మకం నాకులేదు' అని నా కూతురే నా అభిప్రాయాలు తప్పని నిరూపించింది. నా నిర్ణయాల మీద తన దయాగుణంతో దారుణంగా దెబ్బకొట్టింది.
    
    ....వంటింట్లోకి వెళ్ళొచ్చాను.
    
    నేను వచ్చేసరికి ఆయన, సాహితి చేతుల మీద కొబ్బరినూనె వ్రాస్తున్నారు.
    
    "నేను రాస్తాను. మీరు పడుకోండి" అన్నాను క్లుప్తంగా.
    
    ఆయన్లో నాకు బాగా నచ్చే గుణం అదే. నా మనోభావాల్ని సరిగ్గా అర్ధం చేసుకుంటారు.
    
    మారు మాట్లాడకుండా లేచి గదిలోకి వెళ్ళిపోయారు.
    
    పాప పక్కన కూర్చుని, "నొప్పిగా వుందా తల్లీ" అని అడిగాను.
    
    అప్పుడేడ్చింది సాహితి. పాప, అంత వయసున్నది కూడా నా వళ్ళో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. మనసు పొరల్ని కదిలించటానికి చిన్న గుర్తింపు చాలు.
    
    నేను ఏడవలేదు.
    
    చేసిన తప్పులకి ఏడవటమే శిక్ష అయితే పాపుల్ని శిక్షించాలని ఇప్పటివరకూ నేను చేసిన వాదనే తప్పు. తప్పుచేసిన వాళ్ళందరూ ఒకసారి ఏడ్చేసి శిక్ష తప్పించుకుంటారు.
    
    పాప చేతులమీద తేలిన వాతలకి నూనె రాస్తూ ఉండి పోయాను.
    
    కొంచెం సేపటికి పాప నిద్రపోయింది.
    
    ఆ తరువాత వంటింట్లోకి వెళ్ళాను. అంతకు ముందు వచ్చినప్పుడే గరిటని నిప్పుల్లో పెట్టివచ్చాను.

 Previous Page Next Page