Read more!
 Previous Page Next Page 
వెన్నెల్లో గోదారి పేజి 2


    
    అందరికీ తెలియని విషయమేమిటంటే నేను గోదారివైపు వెళ్తూ వెళ్తూ బయట వసారాలో పడుకుని వున్న మా పాలేరుగారిని నిద్రంతా ఎగిరిపోయేలా రాయితో కొట్టి పరుగెత్తాననీ, దొంగ ననుకుని వాడు నా వెనుకనే పరుగెత్తుకొచ్చి, గోదార్లోంచి నన్ను రక్షించినందుకు అందరూ అభినందిస్తూంటే, ఆ గోలలో అసలు విషయం చాలా 'కన్వీనియెంట్' గా మర్చిపోయాడని...!
    
    అంతకన్నా మరో గొప్ప విషయం-నాకు ఈత బాగా వచ్చునన్నది! ఈ విషయం ప్రమద్వరకి తప్ప అక్కడున్న చాలా మందికి తెలీదు. అదొక్కటే ముసిముసిగా నవ్వుతూ, నా ఆత్మహత్య కార్యక్రమపు తరువాయి భాగాన్ని పరికించింది.
    
    అన్నట్టు మాప్రమద్వర గురించి చెప్పలేదు కదూ. అదో పిచ్చి మాలోకం. ఎప్పుడూ ఏదో బొమ్మలేస్తూ వుంటుంది. కాస్త ప్రకృతి గురించి పిచ్చికూడా వుంది. వసంతంలో కోకిలా... అని ఏదో పాడుతూ వుండేది. నాకేమో అది 'సంతలో కోడిలా' అన్నట్లు వినిపిస్తూ వుండేది. అయినా మేమిద్దరం మంచి స్నేహితులం. నాకెంత కోపం వున్నా ఎప్పటికప్పుడు దాన్ని క్షమిస్తూ వుండటంతో ఇది సాధ్యమయింది. అది చాలా మంచిపిల్ల అని అందరూ అంటూ ఉంటే నాకు నవ్వొస్తుంది. చిన్న గీత ప్రక్క నుంటేనే గదా పెద్దగీత విలువ తెలిసేది.
        
    దాన్ని పెద్దగీతని చేయటానికి నేను చిన్న గీతనయ్యే పద్దతులు కొన్ని అవలంబించేదాన్ని తోటలో దొంగతనంగా మామిడికాయలు కొట్టబోతే వద్దని వారించేది. తోటమాలి వస్తే కాయలు పరికిణీలో దాచుకుని పరుగెత్తేదాన్ని మధ్యలో వాడు పట్టుకున్న "మీరా అమ్మగారూ" అని వదిలేసే వాడనుకోండి. అది వేరే సంగతి. ఒకవేళ తప్పించుకుంటే మాత్రం మళ్ళీ అమ్మాయిలంతా ఆ పళ్ళకోసం ఎగబడేవారు. వద్దని వారించినందుకు ప్రమద్వర మంచమ్మాయి!! పళ్ళకి మాత్రం నేను! చెప్పానుగా ఈ జనం మనస్తత్వం నాకెప్పుడూ అర్ధంకాదు.
    
    మా ఆయన పేరు ఆనందరావు. ఆయన గురించే నేను గోదార్లో దూకింది. నేను చేసింది చాలా మంచిపని. చాలా ప్రేమ వివాహాలు విఫలమౌతాయని విన్నాను. మంచి మొగుడు దొరికాడు. ఆనందరావు నిజంగా మంచి మనిషి. ఒకే ఒకసారి నా చెంప బ్రద్దలు కొట్టాడు- అంతే.
    
    పెళ్ళయిన మొదట్లో ఏ భార్యభర్తలకైనా ఎడ్జస్టవటం కష్టం కదా ఈ ఇబ్బంది ప్రతీ కుటుంబంలోనూ వుంటుందనుకున్నాను. పోతే 'నాతో' కాబట్టి అది మరికాస్త ఎక్కువగా వుండేది. అయినా అదెంతో కాలం లేదులెండి. పెళ్ళయిన మొదటి తొమ్మిది నెలలు. ఆ తరువాత పాలూ నీళ్ళులా కలిసిపోయాం. మా ప్రేమకి రెండు ఉదాహరణలు. సాహితి, సాకేత. అన్నట్లు చెప్పటం మర్చిపోయాను. మా ఆయనక్కూడా కాస్త కవిత్వం పిచ్చివుంది. అందుకే ఇద్దరి కూతుళ్ళకీ ఆ పేర్లు పెట్టుకున్నారు.
    
    మనలో ఎంతమంది భార్యలు తమ జీవితకాలంలో ఒక్కసారైనా భర్తచేత చెంపదెబ్బ తిని వుంటారు? మీకేమైనా అంచనావుందా? ఇప్పుడు కొత్తగా పెళ్ళయిన జంటల గురించి కాదు నేను చెపుతోంది. ఇప్పటి భర్తలు భార్యల్ని బెల్లంముక్కల్లా చూసుకుంటున్నారు. నేను చెప్పేది ఇరవై సంవత్సరాల సంగతి. అప్పటి కాపురాలు అంత సవ్యంగా వుండేవికావు. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే, పెళ్ళయిన మొదటి తొమ్మిది నెలలూ గడిచాక మరి మా ఇద్దరిమధ్యా ఏ రకమైన పొరపొచ్చాలూ లేవు.
    
    ఈ తొమ్మిది నెలల్లో-ఆయన ఒక్కటంటే ఒక్కసారి, నా చెంప పగిలేలా కొట్టారు. అదీ ఎప్పుడో తెలుసా? మా మొదటి శోభనం రాత్రి తరువాత-ప్రొద్దున్న ఎనిమిదింటికి.
    
    ఎవరికీ ఇలాంటి అనుభవం జరిగి వుండదు కదూ అప్పుడంటే ఏడుపొచ్చింది కానీ ఇప్పుడు ఇన్నేళ్ళ తరువాత తల్చుకుంటే నవ్వొస్తూంది. ఇప్పటికీ మా అమ్మాయి లిద్దరికీ ఆ విషయం చెప్పి నవ్విస్తూ ఉంటాను. అంతే-శోభనం సంగతి చెప్పను. కొట్టిణ సంగతి చెప్పి ఆయన్ని ఏడిపిస్తూ వుంటాను. అప్పుడు మాత్రం ఆయన మొహం ఎర్రగా కందిపోతుంది. కొంచెం సేపటివరకూ మూడీగా ఉంటారు. తరువాత మళ్ళీ మామూలు మనిషి అయిపోతూ వుంటారు.
    
    అసలీ రచయిత లనేవాళ్ళు ఏ కలల ప్రపంచంలో వుండి వ్రాస్తారో నా కర్ధంకాదు. ముఖ్యంగా మొదటిరాత్రిని వాళ్ళు వర్ణించే తీరు చూడాలి. తెల్లవారుఝామున నాలుగింటికే లేచి పెళ్ళి కూతురు వెళ్ళి ఏ బామ్మపక్కలోనే సిగ్గుతో మొగ్గలా పడుకుంటుందట. నేనైతే శుభ్రంగా ఆ గదిలోనే నిద్రపోయాను. నన్ను లేపే ధైర్యం మా ఇంటిలో ఎవరికీ లేదులెండి. ఎనిమిదింటికి ఎందుకో పెద్దచప్పుడై మెలకువ వచ్చింది. ఆయన మంచానికి కట్టిన మల్లెపూలన్నీ తెంపి పారేస్తున్నాడు. బారెడు ప్రొద్దెక్కి లేచినందుకు కోపమేమో అనుకున్నాను. 'ఏమిటండీ ఏమైంది' అని అడిగాను. అదే విసురుతో వెనక్కి తిరిగి నా చెంప ఫెడీల్మనిపించాడు.
    
    అదే మొదటిదీ-చివరిదీ.
    
    ఆ తరువాత ఎప్పుడూ నేను ఐదు తరువాత నిద్రపోలేదు. నాలో వుండే గుణాల్లో అదొక్కటి ఉంది.....నా కిష్టమైన వాళ్ళు ఏంచెప్తే అది విని, వాళ్ళ కిష్టమైన రీతిలో మెలగటం. కానీ ఒకందుకే బాధేసేది. ఆయన ఇలా కొట్టకుండా కాస్త మర్యాదగా చెప్పినా ఆయన మాటనే వినేదాన్ని మరీ బొత్తిగా జీవితం నాశనమైపోయిన రీతిలో మల్లెదారాలు తెంపేసి, జుట్టు చెరిపేసుకుని, ఆలస్యంగా నిద్రలేచే భార్యపట్ల తన అసంతృప్తి వెల్లడి చేయనవసరం లేదుగా.
    
    అయినా అదీ ఒకందుకు మంచిదే.
    
    మీకు పెళ్లయిందా? అయినపక్షంలో మీ భర్తచేత గానీ, భార్యచేత గానీ ఒకసారి చేతిదెబ్బ రుచి చూడండి. తప్పు ఎవరిదైనా-కొట్టింది వాళ్ళు గాబట్టి మిమ్మల్ని బ్రతిమాలవలసిన బాధ్యత వాళ్ళమీదే పడుతుంది. మనం కొంచెం బింకంగా వుంటే, వాళ్ళు బ్రతిమాలుతున్నంతసేపూ మనకి హాయిగా వుంటుంది.
    
    ఆయన దగ్గిర్నుంచి అదే ఆశించాను. కొంచెం సేపటికి ఆయనే దిగి వచ్చారు.
    
    నా గుణాల్లో చాలామంది ఇష్టపడని గుణం ఒకటుంది. తప్పుచేసినవాళ్ళని క్షమించలేకపోవటం. ఆ తరువాత, వాళ్ళు తప్పు చేశామని వప్పుకున్నాసరే నేను క్షమించలేను. ఇది నిజంగా చెడ్డగుణం అంటారా? ఏమో నాకలా అనిపించదు. తప్పు చేయటమే ఒక తప్పు. దాన్ని ఒప్పుకోవటం వల్ల దాని ప్రభావంకానీ, పాపం గానీ, ఫలితంగానీ తగ్గదు కదా.
    
    మా ఇంట్లో ఒక పనిపిల్ల వుండేది. ఒకరోజు ఐదురూపాయలు కొట్టేసింది. బెదిరిస్తే తీశానని ఒప్పుకుంది. మీరైతే ఏం చేసేవారు? ముందు ముందు ఆ పిల్లకి డబ్బు అందకుండా జాగ్రత్త పడేవారు. లేదా దానిగుణం తెలిసింది కాబట్టి పన్లోంచి మాన్పించేవారు.
    
    నేనలా చేయలేదు. ఇన్ స్పెక్టర్ సత్యనారాయణ మా ఆయన ఫ్రెండు మూడ్రోజులు లాకప్పులో పెట్టించాను. ఆ తరువాత ఉద్యోగం లోంచి తొలగించాను.
    
    ఆ తరువాత కొన్ని రోజులకి మా ఇంట్లో వందరూపాయలు పోయాయి. తీసింది మా పెద్ద కూతురు సాహితి. ఇప్పుడు మీరేంచేస్తారు. నిజం చెప్పండి. మీ గారాబు కూతురు మీకు చెప్పకుండా పర్సులోంచి వంద కొట్టేస్తే ఏం చేస్తారు?

 Previous Page Next Page