Previous Page Next Page 
సూపర్ స్టార్ పేజి 3


    ఆఖరి కిరోసిన్ బొట్టు! అయిపోయేవరకు వెలిగిన స్టవ్ తన వత్తుల్ని తనే తినేయటం మొదలెట్టింది. నీళ్ళు మరిగాయి......మొత్తానికి కాఫీ కలర్ కే వచ్చాయి నీళ్ళు.

    "హమ్మయ్య! బెడ్ కాఫీ అయిపోయింది" అన్నాడు నారాయణ్ కొండంత ఆనందంతో.

    ఒరేయ్ అనిల్ ఇల్లు ఊడవరా. ఈ రోజువంతు నీదే కదా?" అన్నాడు టాగూర్ ఆఖరి చుక్కను నాలికపై వంపుకుంటూ.


                         *    *    *

    వెల్ కమ్ కింగ్ రిసార్ట్ సెంటర్ ఫస్ట్ ఫ్లోర్ లో నిలబడి బైనాక్యులర్ లో చూస్తున్న ఓ వ్యక్తి హంపి కెమేరా దూరంగానే ఉన్నా అభిముఖంగా ఉంది గనుక...... ఒక వేళ అనుకోకుండా జూమ్ తో ముందుకెళ్ళి ఉంటే.....? అమ్మో కొంప మునిగిపోతుంది.

    మరోసారి బైనాక్యులర్స్ లోంచి కెమెరా వైపుకు చూసాడు.

    ఒక యువతితోపాటు ఐదుగురు మగవాళ్లు కనిపించారు. ఎవరు వాళ్లు......? ఏం చేస్తున్నట్లు... పరిశీలించి చూస్తుంటే అదేదో టెలివిజన్ కెమెరాలా వుంది. ఒకవేళ వాళ్లు షూట్ చేసిన క్యాసెట్ ని టెలివిజన్ లో టెలికాస్ట్ చేస్తే.....?

    ఊహు......అలా జరగకూడదు.

    వార్ని చంపైనా వారినుంచి ఆ క్యాసెట్ ని వశం చేసుకోవాలి. తప్పదు.... కొన్నాళ్ళయినా ప్రశాంతంగా  ఉందామనుకున్నాడు. కాని పరిస్థితులు అలా ఉండనిచ్చేలా లేవు..... ఆలోచిస్తూనే బయటకు వచ్చేశాడు. ఇప్పుడతను వార్ని నీడలా వెంటాడే ప్రయత్నంలో ఉన్నాడు.

    అతని పేరు దాదాగంజ్.

    వయస్సు సుమారు 28 ఉంటాయి.

    జయధీర్ ఇండియా రాబోతున్నట్లు ముందుగా దాదాగంజ్ కే తెలుస్తుంది అదీ చిత్రమైన పద్దతిలో.

    న్యూయార్క్ లో జె ఎఫ్ కె ఎయిర్ పోర్ట్ ఇన్ గేట్ దగ్గర ఒక వ్యక్తి నిలబడతాడు.

    ఇండియాన్ అని అనిపించగానే ఈ వ్యక్తి ఎంతో వినయంగా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి "సార్! అర్జెంట్ లెటర్ ఒకటి ఇండియా చేరాలి. ఇక్కడ పోస్ట్ చేస్తే అది ఇండియా చేరడానికి వారం పైగా పడుతుంది. దయచేసి బొంబాయి ఎయిర్ పోర్ట్ లో పోస్ట్ చేస్తారా...... అని అడుగుతాడు.

    అతని చేతిలో ఓ కవర్ ఉంటుంది. దానిమీద ఇండియన్ పోస్టల్ స్టాంప్సే అతికించి ఉంటాయి. ఏ  ప్యాసింజరైనా అనుమానించడానికి పెద్దగా ఏం కనిపించదు.

    అతనలాగే అని దాన్ని తీసుకొని ప్యాకెట్ లో పెట్టుకుంటాడు. 24గంటల తర్వాత అది ఆటోమేటిగ్గాబొంబాయి ఎయిర్ పోర్ట్ లో పోస్ట్ అవుతుంది. అది మరో రెండు రోజులకు దాదాగంజ్ కి మరోవ్యక్తి  ద్వారా అందుతుంది.

    ఒక వేళ అది మరొకరి చేతిలో పడినా తెరిచి చూస్తే కాళికాదేవిని 14సార్లు ధ్యానించాలి. ఆ తరువాత మరో ఏడుగురికి ఇలాగే మీరు ఉత్తరాలు వ్రాయాలి. 16 మందికి సముద్రపోడ్డున అన్నదానం చేస్తే  మీకు  మేలు జరుగుతుంది. అని మాత్రమే ఉంటుంది. భక్తిముదిరి తలకెక్కిన భక్తుడు ఎవరో  వ్రాసిన పిచ్చి ఉత్తరంగానే కనిపిస్తుంది. కాని దాదాగంజ్ కి ఉత్తరంలోని మొదటి అంకెలు 14 పధ్నాల్గవ తారీకున అని- రెండవ అంకె '7' ఏడవ నెలలో అని తెలియజేస్తుంది. జయధీర్ బొంబాయి ఎయిర్ పోర్ట్ లో దిగితే సముద్రపోడ్డున అన్నదానం  అని వ్రాయడం జరుగుతుంది. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అయితే దేశరాజధాని వరకు నీ భక్తిరసం పొంగి పోరలాలి అని రాసుంటుంది ఉత్తరంలో.

    ఆ పద్ధతిలోనే నాలుగురోజుల క్రితం ఒక ఉత్తరం అందింది. దానిప్రకారమే జయధీర్ ఢిల్లీలో దిగాడు. ఆ తరువాత అక్కడినుండి ఫోన్ కాల్  ఒకటి  దాదాగంజ్ కి వస్తుంది. ఇండియాలో ఎక్కడ? ఎలా? కలుసుకోవాలన్న వివరాలు సైతం కోడ్ లో అందించబడతాయి ఆ ఫోన్ కాల్ లో.

    వర్షం క్రమంగా ఎక్కువైంది.

    సాయం సూర్యుడ్ని మేఘాల కమ్మేశాయి. వెలుతురు క్రమంగా తగ్గిపోతోంది. ఆమె కెమేరా ఆఫ్ చేసి భవానీకి అందించింది.

    వర్షం ఉధృతమైంది.

    'హంపి' కి వర్షంలో తడవటం సరదా.

    ఆమె అలాగే అక్కడే నుంచొని తలపైకి ఎత్తి నాలికను  బయటకు చాపి పైనుండి రాలిపడే చిరుచినుకుల్ని ఆర్తిగా సృజిస్తోంది. మిగతా వాళ్ళు కాటేజ్ లోకి వచ్చేశారు హడావుడిగా.

    దాదాగంజ్ కాటేజ్ ని గుర్తుపెట్టుకున్నాడు.

    ఆమె అలాగే తడిసి ముద్దయిపోయింది.

    అప్పుడప్పుడు విల్సన్ ఆలోచిస్తుంటాడు- ఏమిటి మేడమ్ కి ప్రకృతి అంటే అంతిష్టం........?. అని.

    వర్షం అన్నా..... పూలన్నా..... చిన్న పిల్లలన్నా తనూ చిన్నపిల్లలా మారిపోతుంది. తనో పడ్డ కెమేరా వుమన్ అనిగాని..... తను తలుచుకుంటే అద్భుతాల్ని సృష్టించగలదని గాని..... రోజుకి కొన్ని వేలు ఛార్జ్ చేసే గ్రేట్ ఇండియన్ క్రియేటర్ అనిగాని అప్పుడామెకు గుర్తుండదేమో?

    దూరదర్శన్ ప్రేక్షక ప్రపంచంలో ఆమెదో విశిష్టమైన స్థానం. స్పాన్సర్ల ప్రపంచంలో ఆమె అంటే అమితమైన క్రేజ్....... ఎడ్వర్ టైజింగ్ ఏజెన్సీవాళ్ళు ఆమె ఆఫీస్ ముందు పడిగాపులు గాస్తుంటారు.

    పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలు సైతం ఆమె టేకప్ చేసిన టెలివిజన్ ప్రోగ్రామ్స్ అంటే స్పాన్సర్ చేసేందుకు ఉత్సాహపడుతుంటాయి.

    అలాంటి అద్భుతమైన ఆమె..... ఇప్పుడు చిన్నపిల్లలా తడిసి కాటేజ్ కేసి వస్తోంది.

    "మిస్టర్ విల్సన్...... షూటింగ్ పార్ట్ పూర్తయినట్లేనా?" గోవా టూరిజమ్ పి.ఆర్.ఓ.అడిగాడు హంపీని అడిగేందుకు ధైర్యం లేక.

    "తెలీదు....మేడమ్ నే అడగండి" అన్నాడు కెమేరాను కిట్ లో సర్దుతూ.

    సరిగ్గా అప్పుడే దాదా ఓబరాయ్ రిసెప్షన్ కి ఫోన్ చేశాడు.

    "హలో....ప్రిన్సెస్ గెస్ట్ హౌస్ లో ఉన్నదెవరో చెప్పగలరా?"

    "విత్ ప్లజర్......కెమేరా వుమెన్ మిస్ హంపి....."

    "ఆ కాటేజ్  ఎవరి పేరుమీద బుక్ అయింది? ఎవరు బుక్ చేశారు?"

    "ఆమె  పేరుమీదే బుక్ అయింది. బుక్ చేసింది మాత్రం గోవా టూరిజమ్ పి.ఆర్.ఓ....."

    "థాంక్యూ" దాదా ఫోన్ పెట్టేశాడు.

    అంటే టూరిజమ్ డవలప్ మెంట్ వాళ్ళు యాత్రికుల్ని ఆకర్షించేందుకు ఏదో ప్రోగ్రామ్ షూట్ చేయిస్తుండాలి. ఆ క్యాసెట్ ని రాత్రికి రాత్రి లేపేయటం మంచిదా లేక అదెందుకు తయారుచేస్తున్నారో పూర్తిగా తెలుసుకొని అప్పుడు రంగంలోకి దిగడం మంచిదా?

    టూరిజమ్ డిపార్ట్ మెంట్ కి ఫోన్ చేశాడు వెంటనే.

    "గోవా టూరిస్ట్ ట్రాక్షన్స్ మీద వీడియో ఫిల్మ్ ఏదైనా తయారు చేస్తున్నారా?" దాదా కేజువల్ గా అడిగాడు.

    "ఎస్...  పూర్తి వివరాలు కావాలంటే పి.ఆర్. ఓ గార్నే కస్సల్ట్ చేయాలి. నేను ఆయన పి.ఏని. ఆ వైపు నుంచి వినిపించింది.

    "షెడ్యూల్ ఎన్నాళ్ళు?"

    'ఇంకో రెండురోజులుంటుంది" దాదా ఫోన్ పెట్టేశాడు.

    ప్రభు ఆ సాయంత్రమే ఢిల్లీ నుంచి గోవా  బయల్దేరాడు. ఆమెను కలిస్తే ఏదో గొప్ప ప్రయోజనం ఉంటుందని, జయధీర్ ని పట్టుకోవడం సులభం అవుతుందని అతనికేమాత్రం  ఆశలేదు. అయితే ఏదో  ఒక ఆధారం లేందే పరిశోధనలో ఒక అడుగైనా ముందుకేయడం కష్టం కానుక హంపీని కల్సేందుకు బయల్దేరాడు.

    ఇప్పుడు ఆమె దగ్గరున్న క్యాసెట్ ని దొంగిలించినా, లేదా మరేదైనా ప్రయత్నం చేసినా అనవసరమైన ప్రాముఖ్యం ఇచ్చినట్లై ఆమెకు అనుమానం వస్తే.....?

    ఏదైనా చాలా కేజువల్ గా జరిగిపోవాలి. లేదంటే మొత్తానికి వాళ్ళందర్ని లేపేయాలి. ఆమెకు జయధీర్ తెలీదు. అతనెలాటివాడో అంతకంటే తెలీదు  సో...... ఆమెనుంచి పెద్ద ప్రమాదం లేకపోవచ్చు. సీన్ రొమాంటిక్ గా కనిపించడంతో ఉత్సాహంగా షూట్ చేసివుండవచ్చు.

    అసలింతకీ ఆమె జయధీర్ సాబ్ ని. ఆమెను తన కెమేరాలోకి ఎక్స్ పోజ్ చేసుకుందీ లేనిదీ తెలియాలి. అప్పుడే తనేం చేయాలనేది నిర్ణయించుకోవచ్చు.

    అప్పుడు సమయం సాయంత్రం 5.30 అయింది.

    కాని చీకటి పడినట్లుగా ఉంది వాతావరణమంతా.

    జయధీర్ సాబ్ ఇంకా కాటేజ్ లోకి రాలేదు. అతను చురుగ్గా ఆలోచిస్తూ కారిడార్లో పచార్లు చేస్తున్నాడు.

   
                       *    *    *

    హైదరాబాద్ మహానగరంలో లైట్స్ వెలిగాయి.

    కాంతి ప్రవాహంలో నగర ప్రధాన రహదారులు వింత శోభను సంతరించుకున్నాయి.

    "ఫాస్టెన్ యువర్ సీట్ బెల్ట్స్" ఎయిర్  హొస్టెస్ కంఠం సున్నితంగా  వినిపించింది.

    దశరథ ఆలోచనల్నుంచి తేరుకొని నడుముకి బెల్ట్ బిగించుకున్నాడు.

    నలభై ఐదేండ్ల దశరథ టెలివిజన్ నిర్మాతల ప్రపంచంలో మకుటంలేని మహారాజు.

    ది ఆన్ క్రౌన్డ్ కింగ్ ఆఫ్ ఇండియన్ టెలివిజన్ వరల్డ్. ది నెంబర్ వన్  టెలీ సీరియల్ ప్రొడ్యూసర్.

    బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ఐ.సి 439 ఎయిర్ బస్ సున్నితంగా లాండ్  అయింది. 'సేఫ్ లాండింగ్' అనుకున్నాడు మనస్సులో దశరథ. తాను ఎ రంగంలోకి ప్రవేశించినా సేఫ్ గా లాండ్ అవ్వాలన్నదే దశరథ అభీష్టం.
    ఎయిర్ పోర్ట్ విజిటర్స్  లాంజ్ లో తన  కోసం  ఎదురుచూస్తున్న ప్రొడక్షన్ మేనేజర్ ని గుర్తించి చిరునవ్వు నవ్వాడు.

    కొందరు నవ్వితే చాలా బావుంటుంది. ఎదుటివాళ్ళు, అలాంటి వాళ్ళు నవ్వాలనే కోరుకుంటారు.

    డ్రైవర్  పరిగెత్తుకుంటూ వచ్చి సెల్యూట్ చేసి బ్యాగేజ్ స్లిప్స్ తీసుకొని కన్వేయర్ బెల్ట్ వైపుకు వెళ్ళాడు.

    దశరథ ముందు, ప్రొడక్షన్ మేనేజర్ వెనుకగా నడుస్తూ ఎయిర్ పోర్ట్  బయటకొచ్చి కారు దగ్గరకు నడిచారు. దశరథ కారులో కూర్చున్నాడు. అతను బయటే నించుని వివరాలందించసాగాడు.

    "అందరూ వస్తున్నారు సార్. కృష్ణా ఓబరాయ్ లో భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తిచేశాం సార్...."

    "అందర్నీ ఇన్ వైట్ చేశారా?"

    "చేశాం సార్"

    "ఎంతవుతుందేమిటి?"

 Previous Page Next Page