Previous Page Next Page 
సూపర్ స్టార్ పేజి 4


    "సుమారు పాతికవేలుదాకా కావచ్చు సార్"

    దశరథ తలవంకించాడు.

    కొద్ది క్షణాలు మౌనంగా ఉండి- "నెక్ట్స్ త్రీ ఎపిసోడ్స్ లో మనం ఆర్టిస్టులకు కాస్ట్యూమ్స్ కుట్టించడంలేదన్నమాట" అని నవ్వాడు చిన్నగా.

    అతను ఉలిక్కిపడ్డాడోక్షణం.

    "మన సీరియల్స్ ఇప్పటికే పూర్ గా ఉంటున్నాయని కంప్లైంట్స్ వస్తున్నాయి సార్...." అతను ఒకింత భయపడుతూనే అన్నాడు.

    'పూర్ ఆంధ్రప్రదేశ్ ఆడియన్స్....... సీరియల్స్ బాగుండకపోయినా తిట్టుకొంటూ చూస్తారు తప్ప...... మరేం చేయలేరు......' ధీమాగా అన్నాడు దశరథ.

    టి.వి. స్టేషన్ కి మన సీరియల్ బావుండటంలేదని చాలా లెటర్స్  వస్తున్నాయట సార్"

    "ఇందుకేనయ్య నిన్ను నా దగ్గరే ఉంచుకుంది. భయపడుతూనైనా వాస్తవాల్ని నా ముందుంచుతావు. పొగిడి నాశనం చేయవు. ఇక లెటర్స్ సంగతంటావా? బాగాలేదని ఎక్కువ లెటర్స్ వస్తే టీ.వీ. వాళ్ళను బాగా మేపితే పోలా? అయినా ఏం బావోలేదట?" తాపీగా అడిగాడు దశరథ.

    "తీసుకున్న సబ్జెక్టు టీనేజ్  లవ్. హీరో, హీరోయిన్ గా నటించే ఆర్టిస్టులకు నలభై, నలభై ఐదేళ్ళ వయస్సున్నట్లుగా ఉన్నారు. వారి సరసాలు. ప్రేమ సన్నివేశాలు ఎబ్బెట్టుగా ఉంటున్నాయని రాస్తున్నారట"

    "అనుభవం...... అనుభవం ఉండాలయ్యదేనికైనా. టీనేజర్స్ నే హీరో, హీరోయిన్లుగా పెట్టమనుకో చెలరేగిపోయి జీవించేస్తారు. అయినా తెలుగు సినిమా ప్రేక్షకులు అనవలసిన మాటేనా ఇది! సినిమాల్లో, యాభై అరవై ఏళ్ళ  హీరోలు పులకించిపోతూ అప్పుడే యవ్వనంలోకి అడగుపెట్టినట్లు తెగ నటించేస్తే, విరగబడి చూస్తారు. టీ.వీ. అనే సరికి ప్రతివాడికీ లోకువే...... వెనుకా ముందు ఎన్ని చూసుకోవాలి నేను? నా ఫ్రెండ్స్ ఉంటారు-నా బంధువులుంటారు-నన్ను పొగిడే వాళ్ళుంటారు. వాళ్ళందరికీ నటించాలని ఉంటుంది. వాళ్ళందరూ ఏమైపోవాలి?"

    "ప్రో.మే.కి ఏం మాట్లాడాలో వెంటనే తోచలేదు. ఆయన  చెప్పేది సబబుగానే ఉందనిపిస్తోంది.

    "నీకు తెలుసా......తెలుగులో ఎంతటి అసహ్యమైన బూతులున్నాయో? ఇప్పడవన్నీ తగ్గిపోయాయి. ఎవర్నన్నా తిట్టాలనుకో ఫోరా టి.వి. ఫోరా తెలుగుటీవీ సీరియల్ అంటే సరిపోతుంది. ఇంత వినసొంపుగా ఉండే బూతులు, తిట్లు ఎలా వచ్చాయంటావ్? ప్రతి దానికి ఒక ప్రయోజనం ఉంటుందయ్యా.... అర్థం చేసుకోలేకపోతే ఎలా? ఈ తెలుగు టెలివిజన్ ప్రేక్షకుల్ని బాగుచేయడం నావల్లకాదు" అన్నాడు దశరథ చిరాకుపడుతూ.

    హతోస్మి.......అనుకున్నాడు ప్రో.మే మనస్సులో.

    బ్యాగేజి వచ్చింది.

    కారు బయల్దేరింది.

    "సార్......మిస్...... హంపి పైలట్ పూర్తయిందట....."

    "ఎలా వచ్చిందట......?" ఇప్పుడు దశరథ ముఖం సీరియస్ గా ఉంది.

    "చాలా బాగా వచ్చిందట. దాన్ని టీవీ వాళ్ళు చూస్తే వెంటనే షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఉందట. స్పాన్సరర్స్ చూస్తే పోటీపడేలా ఉందట."

     "నీతో వచ్చిన చిక్కు అదేనయ్యా...... కొన్ని నిజాలు చెబుతావు. కొన్ని కడుపు మండే మాటలు చెబుతావు....."

    "నిజం చెబితేనే గదండి....మీకు మేలు జరిగేది"

    "నిజమేనోయ్ బ్రహ్మానందం" అతను ఉలిక్కిపడ్డాడు.

    "ఎందుకలా ఉలిక్కిపడ్డావ్?"

    "నాపేరు అదేనని నాకు గుర్తుచేసినందుకు సార్" బ్రహ్మానందం ఆనందంగా అన్నాడు.

    "ఇప్పుడు నాకు మేలు జరగాలి కదా?"

    "అవునుసార్"

    "అంటే ఎవరికో కీడు జరగాలన్న మాట."

    "మరేంతేగదాసర్.....మతలబు"

    "మిస్ హంపి...పైలట్......స్పాన్సరర్ ఇన్విటేషన్ ..... టీవీ అప్రిసియేషన్..... అంతా మిధ్య" చిన్నగా నవ్వాడు దశరథ.

    అతనో చిత్రమైన మనిషి.

    ప్రతి విషయాన్ని ఎంతో తేలిగ్గా తీసుకుంటాడు. అణుబాంబు పేలబో తోందంటే.....మనకన్నా ప్రమాదమా అణుబాంబంటూ తేలిగ్గా తీసిపారేస్తాడు.

    ప్రమాదం పైపైకి వస్తున్నా చిర్నవ్వుతో చిద్విలాసంగా కనిపిస్తాడు.

    "మంచి ఇన్ ఫర్మేషన్ అందించావు. ఒక టీవీ సెట్ బహుమతిగా తీసుకోవోయ్" దశరథ సరదాగా మాట్లాడుతున్నా ప్రమాదకరమైన పతకమొకటి అతని మనస్సులో క్రమంగా నిర్దుష్టమైన రూపాన్ని సంతరించుకుంటోంది.

    "వద్దండి...."

    "అదేం?"
    "పిల్లలు పాడైపోతారండి"

    "ఎన్నాళ్ళని పిల్లలు టీవీ చూడకుండా ఆపగలవ్?"

    "మా పనిమనిషి హీరోయిన్ వేషం అడుగుతుందేమోనని భయమండి"

    "అదా అసలు భయం"

    అవునండీ"

    "ఇస్తేపోలా?"

    "అవునండీ"

    "ఇస్తేపోలా?"

    "అవునండి. దానికా ఆత్మవిశ్వాసం పెరిగిపోతుందనే నా భయం"

    "ఎలా ఉంటుంది?"

    "హిడింబీలా ఉంటుందండి"

    "అంతేనా?" దశరథకి బ్రహ్మానందంతో అలా సరదాగా మాట్లాడటం చాలా ఇష్టం.

    "అంతేనా అంటే అంతేకాదండి తాటకిలా కూడా ఉంటుందండి"

    "ఎందుకోయ్ ఆ పురాణకాలపు తిట్లన్నీ?"

    "నిజమేనండి. తెలుగు టీవీలా ఉంటుందండి"

    "శెభాష్.....సరిగ్గా సరిపోతుంది" అన్నాడు దశరథ.

    కారు ఓబరాయ్ ముందు ఆగింది.

    ఓబరాయ్ హొటల్ మెయిన్ బిల్డింగ్ వెనుకగా ఉన్న స్పెషల్  డీలక్స్  సూట్ లో పార్టీ అరేంజ్ చేయబండింది.

    సూట్ ముందున్న లాన్ లో ఓ యాభై  కేన్ కుర్చీలు ఓ పెద్ద  టేబుల్  వేసి దశరథ ఆఫీస్ స్టాఫ్ ఎదురుచూస్తుండగా ముందుగా బ్రహ్మానందం పరిగెత్తుకుంటూ వచ్చి "బాస్ వస్తున్నారు అరేంజ్ మెంట్సన్నీ బాగా జరిగినట్లే గదా?" వగరుస్తూ అడిగాడు.

    "అన్నీ బాగానే జరిగాయి సార్. కొంతమంది గెస్ట్స్ కూడా వచ్చారు." ఒకతను ముందుకొచ్చి అన్నాడు.

    "సెభాష్....." అన్నాడు అప్పుడే అక్కడికొచ్చిన దశరథ.

    "ఇంకా పడి నిమిషాలుంది గదా? అప్పుడే ఎవరొచ్చుంటారు సార్....?" బ్రహ్మానందం ఆశ్చర్యపోతూ అడిగాడు.

    దశరథసూట్ లోకి వెళ్తూ "ఇంకెవరూ? టీ.వీ స్టాఫ్ వచ్చుంటారు. ఎఫ్. ఎస్.కి ముందుండేది వాళ్ళే గదా?" నవ్వుతూ ఆ మాట అన్న దశరథ డోర్ మీద చేయివేసి లోపలకు నెడుతూనే మర్యాదను మొఖానికి పులుకున్నాడు.

    లోపలున్న ఐదారుగురు అసహనంగా ఎదురుచూస్తూ కనిపించారు.

    "సారీ ఫ్రెండ్స్.....కొద్దిగా లేట్ అయింది కదా? ఏం చేయను.....మీ మినిష్టర్ ను, స్టాఫ్ ని కల్సుకోవటంలో లేటయిపోయింది. అందుకే మార్నింగ్ ప్లైట్ రావాల్సున్నా వీలుపడలేదు" అన్నాడు తనూ కూర్చుంటూ.

    వాళ్ళు భయభక్తులతో చూసారు దశరథవేపు. అదే అతని వే ఆఫ్ బిజినెస్.

    కొంతమందిని డబ్బుతో మరికొంతమందిని మందుతో, ఆ రెంటికి లొంగని వారిని పలుకుబడితో లొంగదీసుకుంటాడు.

    అతనితో శత్రుత్వం నష్టాలు తెచ్చి పెడుతుందని అతనితో మిత్రత్వం సుఖాలు, లాభాలు తచ్చి పెడుతుందని అతనంటే తెల్సిన అందరికీ తెలుసు.

    "అబ్బే...... పెద్ద లేటేం కాలేదు. అయినా ఇంకా పార్టీ టైమ్ కాలేదు గదా?" అన్నాడొకతను.

    గేస్ట్స్ ఒక్కొక్కరే రాసాగారు.

    సరిగ్గా ఎనిమిది గంటలకు పార్టీ మొదలయింది.

    అందరి దగ్గరకు వెళ్తూ, పలకరిస్తూ నేను మీ మనిషినే అన్న భావాన్ని వారిలో నాటుకొనేలా చేయటంలో దశరథ కృత కృత్యుడవుతున్నాడు.

    చిన్న చిన్న టీ.వీ ఆర్టిస్టుల దగ్గర్నుంచి కెమేరామెన్ వరకు అక్కడున్నారు. వివిధ కంపెనీలకు చెందిననలుగురైదుగురు మార్కెటింగ్ డైరెక్టర్స్, ఎడ్వటైజింగ్ ఏజెన్సీలకు చెందిన మీడియా ఎగ్జిక్యూటివ్స్ కూడా హాజరయిన ఆ పార్టీ  కళకళలాడిపోతోంది.

    దశరథ అప్పుడప్పుడు గేట్ కేసి చూస్తున్నాడు.

    అతను ఎక్స్ పెక్ట్ చేస్తున్నా ముగ్గురు వ్యక్తులూ ఇంకా రాలేదు.

    ఆబగా హాట్ ప్లేట్స్ లో ఉన్న నాన్ వెజిటేరియన్ పీసెస్ ను పళ్ళ మధ్య ఇరికించుకుంటూ ఫారెన్ స్కాచ్ ని కొద్దికొద్దిగా  గొంతులోకి వంపుకుంటున్నారు అక్కడున్న యాభైమంది అతిధులు.

    వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కోరకంగా ఒక్కో దశలో దశరథకు ఉపయోగపడుతున్నవారే.

    సరిగ్గా 8.20కి వచ్చాడతను.

    అతని వెనుకే ఆమె.....

    వాళ్ళిద్దర్ని చూస్తూనే దశరథ ఆనందంగా ఎదురెళ్ళి "రండి..... రండి......ఇంత లేటా?" అన్నాడు. వారు అంతవరకు రానందుకు నిరాశపడుతున్న భావాన్ని పలికిస్తూ.

    అతను ఒకడుగు ముందుకేసి దశరథ భుజం మీద చేయి వేస్తూ "కాస్త వెనుకా ముందు చూసుకొని రావాలిగదా?" అన్నాడు మర్మగర్భంగా.

    దశరథ మెల్లగా నవ్వుతూ "అవునవును" అన్నాడు ఆమె వేపు చూస్తూ.

    అతను 'చిత్రా' ఎడ్వటైజింగ్ ఏజెన్సీ అధిపతి, స్పాన్సరర్స్ ప్రపంచంలో అతని మాటకి తిరుగులేదు.

    అతను ఫలానా కంపెనీ వాళ్ళ స్క్రిప్ట్ బాగుంది. బాగా తీయగలరు-

    స్పాన్సర్ చేద్దాం అంటే చాలు ఆటోమాటిగ్గా ఏర్పాట్లన్నీ నిమిషాల్లో పూర్తయి పోతాయి. టెలీ సీరియల్ ప్రొడ్యూసర్ ఎంత గొప్ప స్క్రిప్ట్ వ్రాయించుకున్నా దాన్ని టి.వి వాళ్ళు అప్రూవ్ చేసినా దాన్ని స్పాన్సర్ చేసేందుకు స్పాన్సరర్  లేకపోతే స్క్రిప్ట్ కి గ్రహణం పడుతుంది. ఒకవేళ సదరు నిర్మాత ధైర్యంచేసి 'పైలట్' పూర్తి చేసినా (పైలట్: సీరియల్ స్క్రిప్ట్ టీ.వీ. వాళ్ళకు చూపిస్తారు. అది వాళ్ళకు సంతృప్తి కలిగిస్తేనే మిగతా భాగాల్ని షూట్ చేసుకొమ్మని గ్రీన్ సిగ్నల్ ఇస్తారు.....దాన్నే పైలట్ అంటారు. ఈ పైలట్ ని స్పాన్సరర్స్ కి చూపించాలి. వారికది నచ్చితే స్పాన్సర్ చేసేందుకు ముందుకు వస్తారు. అప్పుడే కొంత అడ్వాన్స్ ఇచ్చి ఎగ్రిమెంట్ లోకి వస్తారు) స్పాన్సరర్స్  దొరుకుతారన్న గ్యారంటీ లేదు. ఈ స్పాన్సరర్స్ ని కొద్దిమంది మీడియా కింగ్స్  తమ గుప్పిట్లో పెట్టుకొని టెలీ సీరియల్ ప్రొడ్యుసర్స్ ని ఒక ఆట  ఆడిస్తూంటారు. ఈ గేమ్ ఆడేది ఎడ్వర్టైజింగ్ ఏజెన్సీలే.

    అదిగో.....అలాంటి రింగ్ లీడరే ఈ సుశీల్ కుమార్.

    ఇక ఆమె పేరు నందిని. టీ.వీ సీరియల్స్ కి ప్రాముఖ్యం పోటీలేని రోజుల్లో అనుకోకుండా ఒక సీరియల్ లో హీరోయిన్ గా  బుక్ అయింది. సీరియల్  అంటే ఇలాగే ఉంటుందేమో అనే భ్రమలో ఉన్న తెలుగు టీ.వీ ప్రేక్షకులదృష్టిలో ఆమె పడింది. అంతే.... అంచెలంచేలుగా ఆమె ప్రముఖ హీరోయిన్ అయిపోయింది

 Previous Page Next Page