వయస్సు సుమారు ముప్ఫై ఉండవచ్చు.
అంతే..... అంతకుమించి అతనికి సంబంధించిన వివరాలేం తెలీదు.
* * *
ఓబరాయ్ ప్రిన్సెస్ గెస్ట్ హౌస్.....
గోవా సముద్రపు ఒడ్డున ఏటవాలుగా ఒరిగిన కొబ్బరిచెట్ల మధ్య ఇసుకలో నిర్మించిన సుందర స్వప్నం ఆ ప్రిన్సెస్.....లోపల రూములో కూర్చున్న హంపి కాటేజీకి ఓ వేపు అమర్చి ఉన్న గ్లాసెస్ లోంచి సముద్రానికేసే చూస్తోంది.
సమయం సాయంత్రం నాలుగు గంటలవుతోంది.
ఆకాశమంతా క్రమంగా మేఘావృతమవుతోంది. కొద్దిక్షణాల్లోనో...... నిమిషాల్లోనో........వర్షం వచ్చేలా ఉంది వాతావరణం.
ఆమె లేచింది....... లేచి గ్లాస్ వాల్ వద్దకు వచ్చింది.
కాటేజీ ముందు గదిలో అసోసియేట్ కెమేరా మేన్ విల్సన్ మరి కొద్ది నిమిషాల్లో షూట్ చేయబోయే షాట్స్ గురించి పేపర్ పై వ్రాసుకుంటున్నాడు.
ఎదురుగా గోవా టూరిజమ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్కెచెస్ ఉన్న ఆల్బమ్ ని తిరగేస్తున్నాడు.
అంతలో ఆమె బయటకు వచ్చింది. "మిస్టర్ విల్సన్.....గెట్ రడీ- అంటూ కాటేజ్ బయటకు నడిచింది.
విల్సన్ వెంటనే కిట్ లోంచి కెమేరా బయటకు తీసి హంపి ప్రక్కకు వచ్చి నిల్చున్నాడు. ఆమె ఆకాశానికేసి చూస్తూ కెమేరాని తీసుకొని కుడి భుజంమీద ఆనించుకుని కుడిచేత్తో హేండిల్ ని గట్టిగా పట్టుకొని ఎడంవేపు కన్నును మూసి కుడివేపు కంటితో కెమేరాలోంచి చూసిందో క్షణం.
ఆమె వెనుక విల్సన్, అసిస్టెంట్ కెమేరామెన్ భవాని, లైట్ బాయ్స్ ఇద్దరు నిశ్శబ్దంగా నించొని ఆమెకేసే చూస్తున్నారు.
అప్పుడే ఆకాశంలో ఓ మెరుపు మెరిసి అదృశ్యమైపోయింది.
ఆమె చరుక్కున ఓ కొబ్బరి ఆకుపైకి కెమేరాను జూమ్ చేసి ఎక్స్ ట్రీమ్ క్లోజప్ లోకి వెళ్ళి క్షణాల్ని లెక్కిస్తోంది.
ఆమె ఏదో అద్భుతమైన షాట్ ఒకటి తీయబోతోందని అక్కడున్న అందరికీ తెలుసు. ఫీల్డ్ లో ఉండి ఆమె షూట్ చేసేప్పుడు కెమేరా ముందున్న సబ్జెక్ట్ ని చూస్తె అదంత గొప్పషాట్ అని అనిపించదు.
ఆ తరువాత మూవీలో చూసేటపుడు గాని ఆ షాట్ ఎంత అద్భుత మైందో తెలిసిరాదు. ఆకాశం ఉరిమింది.
ఆమె స్టడీ అయింది.
ఆకాశం మరోసారి ఘర్జించింది.
ఆ వెంటనే తొలి వర్షపు చుక్క టప్పున రాలి కొబ్బరి ఆకుపై పడి జలజలా జారి ఇసుకలో పడి ఇంకిపోయింది క్షణాల్లో, ఆ అద్భుతమైన దృశ్యాన్ని కెమేరాలో నిక్షిప్తం చేసుకొని, కెమేరాని ఒకింత పైకి టిల్ట్ చేసి ఆ వాతావరణాన్ని, ఆ ప్రాంతాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు వైడ్ షాట్ ఫిక్స్ చేసుకొని, కొద్ది క్షణాల్లో షూట్ చేసింది. ఆ తరువాత క్రమంగా కెమేరా మూవ్ కాకుండా ఒక్కొక్క అడుగే స్టడీగా వేస్తూ తన ముందున్న చిన్న ఇసుక దిబ్బ ఎక్కి కెమేరాని క్రిందకి టిల్ట్ చేసి హై ఏంగిల్ షాట్ కి రడీ అవుతూ అద్భుతమైన కోణంలో వంగిన రెండు కొబ్బరి చెట్ల మీదకు తన దృష్టిని మరల్చింది. క్రమంగా కెమేరా జూమ్ చేస్తూ వెళ్ళి అక్కడ, అప్పుడు కనిపించిన దృశ్యాన్ని చూసి నిశ్శబ్దంగా నవ్వుకొని దాన్ని సయితం తన కెమేరాలోకి ఎక్కించుకుంది. అప్పుడక్కడ రెండు కొబ్బరిచెట్ల మానులకు ఒక నైలాన్ ఉయ్యాలకట్టి అందులో ఓ అందమైన అమ్మాయి బికిని డ్రస్ లో సముద్రకన్యలో పవళించి ఉంది. ఆమె మీదకు ఒకింతా వంగి ఓ యువకుడు ఆమెతో గుసగుసలాడుతున్నట్లుగా ఉన్న ఆ దృశ్యాన్ని పూర్తిగా షూట్ చేసింది.
అతనే ది గ్రేట్ జయధీర్...
ఢిల్లీ పాలం విమానాశ్రయంలో పోలీసుల కళ్ళుగప్పి పాదరసంలా తప్పించుకున్న యువకుడు.
* * *
ఉదయం ఆరుగంటల సమయం
పెద్ద స్టేజీ మీద తను...... తన ఎదురుగా వేలాది ప్రేక్షకులు కళ్ళార్పటం మానేసి తనకేసే చూస్తున్నారు......
ఊపిరి పీల్చడం మానేసి తను చెప్పే డైలాగ్స్ వింటున్నారు.
తను అప్పుడు ఓ జమీందారి......
తన క్రింద కొన్ని పదుల నౌకర్లు, చాకర్లు.....
తన ఆజ్ఞల కోసం ఎదురుచూస్తూ.....
నిద్రనుంచి లేస్తూ 'కాఫీ' అని అరిచాడు.
ఎదురు చూస్తున్న అనిల్ వీపుమీద రెండు కిలోల బరువు దెబ్బలు పడ్డాయి.
"ఏం నా నటన బావోలేదా?' అంటూ కళ్ళు తెరిచాడు.
ఎదురుగా యమకింకరుల్లా ఆ ఇద్దరు తనమీదకే వంగి, తనకేసి గుర్రుగా చూస్తూ కనిపించారు.
'నీ కలలతో మా నిద్రని మెదడును తినేస్తున్నావు గదరా' అన్నాడు నారాయణ్ తల పట్టుకుంటూ.
'కాఫీ కావాలా దొరగార్కి......? బళ్లారి రాఘవాచార్య నన్నుకుంటున్నావా? వేమూరి గగ్గయ్య ననుకున్తున్నావా? చంపేస్తాను ఇలాంటి కలలు కన్నావంటే......ఒకవేళ కళ ఏదైనా కన్నావే అనుకో.....వెధవది ఆ నోరూరించే కాఫీ, టీ, టిఫెన్లు పేర్లు ఉచ్ఛరించొద్దన్నామా?' చిరాగ్గా అన్నాడు ఠాగూర్.
అప్పటికి గాని అనిల్ కి తెలిసి రాలేదు- తను అంతవరకు జీవించింది కలలో అని.
చప్పున లేచేందుకు ప్రయత్నించి తల కేదో తగలడంతో 'అమ్మా- అని తలపట్టుకున్నాడు.
అప్పటివరకు చిరాకుపడిన ఆ ఇద్దరూ ఆదుర్దాగా అనిల్ నుదిటిని రుద్దారు.
'మనం ఉండేది రాజభవనం లోనో, నిజాం ప్యాలెస్ లోనో కాదు పాడుబడిన లేలేండ్ బస్సని తెలిసి కూడా అంత ధిలాసాగా లేవకపోతే ఏం.....?' అన్నాడు నారాయణ్ బాధగా.
అనిల్ కి తెలుసు..... తనంటే వారికి ప్రాణమని. కాని తను కలగంటూ..... ఆ కలలో అరిస్తే...... వారికి మెలుకువ వచ్చి ఆకలి గుర్తుకొస్తుందని...... అది వార్ని చిరాకు పెడుతుందని- అయినా తనను వదిలిపెట్టని కలలు....... రంగు..... రంగుల కలలు..... ఫాంటసీ వరల్డ్..... అది ఆకలి లేని ప్రపంచం..... ఆకలి అనే పదం ఆ ప్రపంచ నిఘంటువులలో ఎప్పుడో తొలగించారు.
ఓ సారి తల విదిలించి లేచికూర్చున్నాడు.
ఆ ముగ్గురూ నిరుద్యోగ యువకులు
అనిల్....
నారాయణ్.....
టాగూర్.....
ఎవరు ఎక్కడినుండి వచ్చారో ఒకరు ఇంకొకరికి ఎప్పుడూ చెప్పుకోలేదు. ఏ కులమో అనే ఆలోచన వారి దారిదాపుల్లోకి కూడారాలేదు. వారిని కలిపింది ఆకలి. ముడి వేసింది పేదరికం, విడదీయంది నిరుద్యోగం
ముగ్గురికీ కలిపి రెండు జత బట్టలు........
ముగ్గురికీ కలిపి ఒక జత చెప్పులు.....
ముగ్గురికీ కలిపి ఒక ఇల్లు.....స్క్రాప్ క్రింద తీసి పడేసిన కప్పు మాత్రం చెడని ఒక పాత బస్సు.
రెండు వరసల సీట్లమధ్యనే వారి పడక. వారికి అన్నీ తక్కువే - ఒకటి తప్ప.
ఆ ఒక్కటి..... ఆశల అంచుల్లో నిలబెట్టి భవిష్యత్ ను పంచ రంగుల్లో చూపించే కలలు..... అవి నిజమవుతాయా? నిద్రబోయే నిరాశా, నిస్పృహల్ని తట్టిలేపే ఆ సందేహమంటే వారికి భయం. అనిల్ కి గొప్ప టెలివిజన్ స్టార్ నై పోవాలనే కల....... నారాయణకి గొప్ప బిజినెస్ మెన్ అయిపోవాలనే కల.
టాగూర్ కి నిర్దుష్టమైన కలేదీ లేదు- ఏదైనా సుఖంగా బతగ్గల సౌకర్యా లుంటే చాలని.
అనిల్ తూర్పువేపుకు ఒరిగి విండోకి వేలాడుతున్న పట్టాను ఒకింత తప్పించి చూసాడు. అప్పుడే తెల తెలవారుతుంది.
'దాన్ని దింపేయ్......లేదంటే ఆకలి కన్పిస్తుంది' అన్నాడు నారాయణ్ గాబరాగా.
'ఆకలా?' టాగూర్ ఆశ్చర్యపోయాడు.
'ఆకలి అనిపిస్తుంది, కనిపించటమేమిటి?' అనిల్ ప్రశ్నించాడు తనూ ఆశ్చర్యపోతూ.
'తూరుపు ప్రొద్దున ఉదయించే సూర్యుడు ఎర్రగా, తనే ఓ ఆకలిగా ఆవురావురుమంటూ ప్రపంచంలోని సగంభాగం పైబడి ఆక్రోశిస్తాడు......'
ఆ ఇద్దరూ నిట్టూర్చారు.
'మనం కాఫీ తాగుదామా?' టాగూర్ అడిగాడు.
వాళ్ళిద్దరూ బిత్తరపోయారు.
'కంగారు పడకండి. ఇప్పుడే ఇలా వెళ్ళి అలా కాఫీ పొడి పట్టు..... కొస్తాను' అంటూ చకచకా బస్ లోంచి దిగి ప్రక్కనే ఉన్న ఓ ఇంటి పెరటిగోడ దగ్గరకు వెళ్ళాడు టాగూర్.
అప్పుడే ఆ ఇంటి పనిమనిషి అంట్లు తీసుకొని వచ్చి పెరటి బావి చప్టా దగ్గర కూర్చుంది.
'హలో' అన్నాడు.
ఆమె తలెత్తి టాగూర్ వేపు చూసింది. 'మరేం లేదు. అంట్లు తోముకోవాలి. వాడేసిన కాఫీ పొడి వుంటే కొద్దిగా ఇవ్వవా?'
ఆమె ఫిల్టర్ లో తడిసి అడుగున మిగిలివున్న కాఫీపొడి ముద్దను తీసుకొచ్చి టాగూర్ కి అందించింది.
'బూడిదతో తోముకోవచ్చుగదా?' అడిగిందామె చిరాగ్గా.
'తోముకోవచ్చు. కానీ అంట్లుంటే తోమేసుకుంటాంగదా?' అన్నాడు సిగ్గుతో తలవంచుకుంటూ.
ఆమె అతని పరిస్థితిని అర్థం చేసుకుంది....... 'సారీ ఫ్రెండ్.....' అందామె ఒకింత గిల్టీగా.
అతను ఆమెకేసి ఆశ్చర్యంగా చూసాడు.
"అవును డిగ్రీ చదివాను. కాని చెప్పుకోను. ఈ దేశంలో అన్నం పెట్టే అంట్లుతోమటానికి డిగ్రీలఖ్కర్లేదని పదిహేను వేలు అప్పుచేసి డిగ్రీ కాగితం తీసుకున్నాక గానీ తెలిసిరాలేదు. ఐకెన్ అండర్ స్టాండ్ యువర్ ప్రాబ్లమ్......మై డియార్ ఫ్రెండ్......యూ నీడ్ నాట్ ఫీల్ షై....
ది సొసైటీ....
ది నేషన్...... ది స్టుపిడ్
పొలిటిషియన్స్ షుడ్ ఫీల్' అంది అతని వేపు స్నేహపూర్వకంగా చూస్తూ.
అతని కళ్ళల్లో తడి.
కళ్ళతోనే కృతజ్ఞతలు చెప్పి బస్ కేసి నడిచాడు.
"బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిది" అంటూ తమ దగ్గరున్న సత్తుగిన్నెని స్టవ్ మీదపెట్టి కాసిని నీళ్ళుపోసి తను తెచ్చిన కాఫీపొడి సుద్దను అందులోవేసి స్టవ్ వెలిగించి "షుగర్ కంప్లైంట్ ఎందుకొస్తుందో తెలుసా అనిల్..... షుగర్ అదే పనిగా ప్రతి దానిలో ఉండబట్టి" ఆ ఇద్దరూ టాగూర్ మాటలకి నవ్వుకున్నారు.
ఆ ఇద్దర్ని చూసి తనూ నవ్వాడు.