Previous Page Next Page 
సినీ బేతాళం పేజి 28

                                 


                                     డైలాగ్ లేని సినిమా కథ

                         
    
    పట్టు విడువని నిర్మాత తిరిగి అర్ధరాత్రి కాగానే సెన్సార్ ఆఫీసు చేరుకుని ఫిలిమ్ బాక్స్ భుజాన వేసుకుని ఊరివేపు నడుస్తూ 'కథ చెప్పహ' అంటూ అరచాడు. అనగానే ఠకీమని కథ ప్రారంభించేసింది సెన్సార్.
    అనగనగా తెలుగు దేశంలో చిన్నయ్య అని ఒక వణిక్ ప్రముఖుడుండేవాడు. అతగాడు చింతపండు వ్యాపారం చేస్తూండేవాడు. ఆ వ్యాపారం కొంతకాలం బాగాసాగి, సాగి....ఆ తరువాత ఎంత ప్రయత్నించినా సాగడం మానేసింది. ఇలా సాగనిదాన్ని పట్టుకుని సాగదీస్తూ కూర్చోవడం కంటే బాగా సాగే మరో వ్యాపార మేదయినా చేపడితే బావుంటుందనిపించి వెంటనే అదే వ్యాపారం చేస్తున్న తన మిత్రులందరినీ చింతపండు గోడౌన్ లో సమావేశపరచాడు. అందరూ ఇంకా అర్జంటుగా లక్షలు సంపాదించే వ్యాపారం ఏదయినా చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఒకరు దొంగ నోట్ల వ్యాపారం చేద్దామన్నారు. ఇంకొకరు రాజకీయాల్లోకి దూకుతే దాన్ని మించిన లాభసాటి వ్యాపారం ఇంకోటి లేదన్నారు. మరొకరు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ అండదండలతో అతి వేగంగా అభివృద్ధి సాధించిన వ్యాపారం బ్రాందీ షాపులు కనుక అదే చేద్దామన్నారు. అన్నిటినీ ఎవరో ఒకరు వీటో చేయడంతో హఠాత్తుగా చిన్నయ్యకు ఉపాయం తట్టింది.
    "అర్జంటుగా లక్షలు సంపాదింలంటే సినిమా యాపారాన్ని మించిన యాపారం లేదు" అన్నాడు చిన్నయ్య.
    "అంటే సినిమాలు తీద్దామంటావా?" అడిగారు వాళ్ళు.
    "అంత తెలివితక్కువ మాట నేనెందుకంటాను? మనం మన జిల్లాకు మాంచి సినిమాను ఎన్నిక చేసి దాని హక్కులు కొనేద్దాం. మన ఊళ్ళోని మాంసం దుకాణం కసాయి ఏం చేశాడో మీకు తెలుసుగా! 'పొట్టేలు తులసమ్మ', 'మేకల మల్లయ్య' అనే సినిమాకు మన జిల్లా రైట్స్ కొన్నాడు. అంతే ఇప్పుడు మూడు లక్షలు సంపాదించాడా సినిమా మీద.
    "మనం కూడా మాంచి సినిమాలు కొని వ్యాపారం చేస్తే మూడు నెలలకు మూడు లక్షలు చొప్పున సంవత్సరానికి పన్నెండు లక్షల చొప్పున, ముప్పయ్ సంవత్సరాలకూ..."అంటూ లెక్కలు కట్టబోయే సరికి అందరూ ఆనందంతో స్పుహ తప్పారు. మళ్ళీ స్పృహలో కొచ్చాక చిన్నయ్యను తమ సిండికేట్ కి నాయకుడిగా నిర్ణయించి అతనిని మద్రాస్ పంపించారు. చిన్నయ్య సినిమాలు కొనడానికని రెండు ఖాళీ గోనె సంచులు వేసుకొచ్చాడు మద్రాస్ కి. అక్కడ పాండీ బజార్లోని ఓ హోటల్లో దిగాడు. ఆ హోటలంతా తనలాంటి జిల్లాల కొనుగోలు దార్లతోనే నిండిపోయి ఉంది. ఎవరి నోటి వెంబడి చూసినా సినిమాల గొడవే! ఏ సినిమా ఎలా ఉందీ. ఏదెంతలో కొనవచ్చు. ఏ సినిమా ఎన్ని రోజులాడేదీ, ఏదెంత లాభం వచ్చేదీ, ఎలాంటి ట్రిక్స్ చేస్తే ఎలా చౌకగా కొనవచ్చు-
    'అబ్బ! లోపాయికారీ వ్యవహారాలు చింతపండు వ్యాపారంలోనే ఉంటాయనుకున్నాను. సినిమాల్లో కూడా ఉంటాయన్నమాట' అనుకున్నాడు చిన్నయ్య.
    ఆ మధ్యాహ్నం గోనెసంచి తీసుకుని సినిమా కొనడానికి బయల్దేరాడతను. ఆ సినిమా వేసేచోట ఇంకా చాలామంది నిలబడి వున్నారు. కానీ వాళ్ళెవరి చేతుల్లోనూ గోనెసంచులు లేవు. ఒకవేళ ఈ సినిమా కొంటే మరి ఫిల్మ్ ఎందులో వేసుకెళ్తారో అర్ధం కాలేదతనికి.
    సినిమా ప్రారంభమయ్యే ముందు తన పక్కన కూర్చున్న వ్యక్తితో "సరుకు బాగుంటుందా?" అనడిగాడు చిన్నయ్య.
    "ఫస్ట్ క్లాసనుకో" అన్నాడతను.
    "బాగా గుజ్జుగా వుంటుందా?" అంటూ అలవాటు ప్రకారం అని నాలిక్కరచుకుని "యాక్టర్లు పెద్దోళ్ళున్నారా?" అనడిగాడు మళ్ళీ.
    "చాలా పెద్దోళ్ళున్నారు. ఒక్కొళ్ళకీ అరవై డెబ్బయ్ ఏళ్ళుంటాయ్! అసలు వాళ్ళ పేరుమీదే అయిదు వారాలు లాగేస్తుంది" అన్నాడతను.
    "అంటే అయిదు వారాలాడితే మన డబ్బు మనకొస్తుందా?"
    "సగం కూడా రాదు. పూర్తిగా రావాలంటే పది వారాలాడాలి. బిజినెస్ అంటే ఇక్కడే వుంది. పాకింగ్ ఎంత బాగా చేసినా సరుకు బావుండకపోతే ఎవ్వరూ కొనరు గదా! సినిమా కూడా అంతే కథలో దమ్ముండాలి. యాక్టర్లుంటే సాలదు" అన్నాడతను.
    సినిమా మొదలయింది.
    నటీనటులు హోరాహోరీగా నటిస్తున్నారు.
    కానీ వాళ్ళ డైలాగులు ఏమాత్రం వినబడడం లేదు. పిచ్చుకల కిచకిచలు, కాకుల కావుకావులు, బస్ లు, కార్ల హారన్, ఇంకేవేవో కేకలు ఇవే గట్టిగా వినబడుతున్నాయ్. ఇంచుమించుగా మొదటి నుంచీ చివరి వరకూ సినిమా డైలాగులు వినబడనేలేదు. ఇంత అధ్వాన్నపు సినిమా అయిదు వారలు కాదు గదా అయిదు రోజులు కూడా ఆడటం కష్టమని గోనెసంచి మడతెట్టుకుని మళ్ళీ తమ ఊరు చేరుకున్నాడతను.
    "ఏమయింది- సినిమా బావుందా, కొన్నావా?" అడిగారు సిండికేట్ వాళ్ళు.
    "ఛ ఛ! అదేం సినిమానో అర్ధం కాలేదు. నటీనటులది ఒక్కడైలాగయినా వినబడితేనా?' అన్నాడతను. "వచ్చే నెలలో ఇంకో సినిమా వేస్తున్నారు. అది చూద్దాం!"
    ఆ పై నెలలో మళ్ళీ మద్రాస్ వెళ్ళాడతను. ఆ సినిమా కూడా ఇలాగే ఉండడంతో మళ్ళీ వెనక్కువచ్చేక తప్పిందికాదు. ఇలా అయిదారు సినిమాలు చూసి "లాభం లేదు. ఒక్క సినిమా కూడా చక్కగా వినబడేట్లు తీయటమేలేదు. కనుక మనం ఈ వ్యాపారం మానేసి ఇంకోటి చూసుకుందాం" అన్నాతను తన సిండికేట్ వాళ్ళతో.
    ఈలోగా చిన్నయ్య చూసి తిరస్కరించిన సినిమాలన్నీ రిలీజయి విజయవంతంగా ప్రదర్శింపబడసాగినయ్. 'డైలాగులు వినబడడంలేదన్న వారే' కనిపించలేదతనికి.
    ఇంతవరకూ చెప్పి సెన్సార్ ఇలా అడిగింది.
    "నిర్మాతా! అలా మాటలు ఏమాత్రం వినిపించని విధంగా నిర్మాతలు ఎందుకు ఆ చిత్రాలు నిర్మించారు? మై మాటలేమీ వినబడకపోయినా ఆ చిత్రాలు ఎలా విజయవంతమయినాయ్? చిన్నయ్యకు వినిపించని మాటలు ప్రేక్షకులకు ఎలా వినిపించాయ్? ఈ ప్రశ్నలకు..."
    "ఆపాపు! చచ్చు ప్రశ్నలూ నువ్వూనూ! చిన్నయ్యకు అంతవరకూ చింతపండే సర్వస్వంగా ఉండేది. అంచేత సినిమాలు కొనడానికి వెళ్ళినప్పుడు అందులో మాటలు వినబడకపోవడం చూచి గాబరాపడ్డాడు. నిజానికి అతను చూసింది ఆ చిత్రం తాలూకు 'రషెస్' మాత్రమే అంటే అప్పటిదాకా డబ్బింగ్ వగైరాలు ఏవీ పూర్తిగాని స్టేజీలో ఉందన్నమాట. ఆ చిత్రం విషయాలేమీ తెలీక తను చూసిన సినిమాలన్నిటినీ వదులుకుని వెనక్కు వెళ్ళిపోయాడు చిన్నయ్య"
    ఈవిధంగా నిర్మాతకు మౌనభంగం కాగానే సెన్సార్ బాక్స్ తో సహా తన ఆఫీస్ వేపు ఎగిరిపోయింది.
    
                                                 * * *

 Previous Page Next Page