"అందరి మానవులకూ సమానమైన అవకాశాలను కల్పించాలనేది కూడా నీ దృష్టిలో అసంభవమేనా?" చంద్రం ప్రశ్నించాడు.
"అవును అదికూడా అసంభవమే. ఏ ఇద్దరు వ్యక్తులూ మానసికంగా, శారీరకంగా ఒకటిగా లేనప్పుడు ఒకేలాంటి అవకాశాలను అందరికీ కల్పించటంలో అర్ధంలేదు. కొందరు వ్యక్తుల బుర్రలు బొత్తిగా పనిచెయ్యవు. అలాంటివారు కాయకష్టానికే ఉపయోగపడతారు. ఒక మంచి ఇంజనీరు కాగల తెలివితేటలు కల్పించారనుకో - అప్పుడు ఆ అవకాశాన్ని ఇద్దరూ సమానంగా ఉపయోగించుకోగలరంటావా?"
"సమానావకాశాలంటే అది కాదని నా ఉద్దేశం. ప్రతి మనిషికీ తన అభిరుచికీ, బుద్దికౌశల్యానికి అనుకూలమైన అవకాశం అందుబాటులో వుండేలా చెయ్యమని."
"నేను చెబుతుందీ అదే. ప్రతి మనిషికీ జీవించడానికి కొన్ని కనీస అవసరాలు వుంటాయి. అవికూడా అందుబాటులో లేని మానవుడు జంతువులా బ్రతకటం మానవ సంఘానికి సిగ్గుచేటు. ఆ తరువాత వారివారి మానసిక స్థాయికీ, అభిరుచికీ అనుకూలమైన చదువూ, దానికితగ్గ పనులూ కల్పించాలి. వారివారి పనులను దృష్టిలో పెట్టుకుని వారివారి అవసరాలను గుర్తించాలి. ఒక భవన నిర్మాణం జరగాలంటే డిజైన్ వేసి, ప్లాన్ గీచి దానినెలా నిర్మించాలో నిర్ణయించే ఇంజనీయరూ వుండాలి. రాళ్ళు మోసేవాళ్ళూ వుండాలి. రాళ్ళు మోసేవారిచేత డిజైను, డిజైనువేసే వారిచేత రాళ్ళూ మోయించలేంగా? ఇంజనీరు ఒకేసారి దూరరూరంలో వున్న కొన్ని భవనాల పర్యవేక్షణ చెయ్యగలడు. కాని రాళ్ళుమోసేవాడు ఒక సమయంలో ఒకే చోట పనిచెయ్యగలడు. అందువల్ల ఇంజనీరుకు కారు అవసరం. కాని రాళ్ళుమోసేవాడికి అక్కరలేదు. అందుకే అందరికీ సమానావకాశాలు అనకుండా, అవసరమైన అవకాశాలు అంటే బాగుండేదేమో! దీనిని నువ్వు సోషలిజం అను లేక ఏ ఇజం అన్నా అను నా కభ్యంతరం లేదు."
"ఎంత సేపయింది బాబూ వచ్చి?" అంటూ ప్రవేశించింది రాజవ్వ. అంతలో ప్రకాశం వాక్ప్రవాహం ఆగిపోయింది.
"ఓ గంట అయింది. త్వరగా వంటచెయ్యి. ఇతను చంద్రం, నా చిన్ననాటి స్నేహితుడు. ఇతనుకూడా ఇకనుంచి ఇక్కడే వుంటాడు."
"అలాగే బాబూ!" అంటూ రాజవ్వ లోపలకు వెళ్ళిపోయింది. ప్రకాశానికి గౌరి నిద్రలేవలేదన్న విషయం జ్ఞాపక మొచ్చింది.
"అరె, మన మాటలలో గౌరిని మార్చేపోయాం. చూడు రాజవ్వా! ఆ అమ్మాయిని నిద్రలేపు" అన్నాడు ప్రకాశం.
గౌరి పేరు ఎత్తగానే మళ్ళీ చంద్రం ముఖంలో మార్పువచ్చింది. అది గమనించిన ప్రకాశం నవ్వుకున్నాడు.
"బాబూ, ఇలారండి." పెద్ద కేక పెట్టింది రాజవ్వ.
ఆ కేకకు ఇద్దరూ ఉలిక్కిపడి లేచి లోపలకు వెళ్ళారు ఆదుర్దాగా.
"వళ్ళు మంగలంలాగా మాడిపోతోంది. పలకటం లేదు," అంది రాజవ్వ.
చంద్రం గబుక్కున వంగి గౌరి నొసటిమీద చెయ్యి వేశాడు. వళ్ళు కాలిపోతోంది. ఆమెను కుదుపుతూ "గౌరీ! గౌరీ!" అంటూ పిలిచాడు ఆదుర్దాగా.
గౌరి చిన్నగా కళ్ళు తెరిచింది. కాని ఆ చూపులు ఎవర్నీ చూస్తున్నట్లు లేవు. వెర్రిగా ఎక్కడో దేన్నో చూస్తుంది. ఆ వెర్రిచూపుల వెనక నుండి ఏదో భయం తొంగిచూస్తోంది.
"నన్ను మళ్లీ ఈ నరకంలోకి పంపించవద్దు. మా పెద్దమ్మ నన్ను చంపేస్తుంది," ఆగిఆగి అస్పష్టంగా అన్న గౌరి మాటలకు చంద్రం, ప్రకాశం ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు. అంతలోనే గౌరి కళ్ళు మూతలుపడ్డాయి. ఈసారి ఎంత పిలిచినా పలకలేదు.
"నేను వెళ్ళి డాక్టర్ను తీసుకొస్తాను" అంటూ ప్రకాశం తుండు భుజాన వేసుకొని గబగబా బయటకు వెళ్ళిపోయాడు.
చంద్రం ఏదో పెద్ద తప్పు చేసినవాడిలా గౌరి పక్కనే కూర్చుని ఆలోచిస్తున్నాడు.
రాత్రి తను చాలా నిర్దయగా ప్రవర్తించాడు. గౌరికి తనమూలంగానే ఇలా ముంచుకొచ్చింది. ప్రకాశం అయితే అలా ప్రవర్తించి వుండేవాడా? తను సంస్కృతి గురించి పుస్తకంకూడా రాసి బహుమతిని పొందాడు.
చంద్రం గౌరి ముఖంలోకి చూశాడు. ఆమె ఆ పెద్ద పెద్ద కనురెప్పలు మూసుకొని అమాయకంగా నిద్రపోతున్నట్లుంది. ముంగురులు చెదరి ముఖంమీద చిందర వందరగా పడివున్నాయి.
చంద్రం యాంత్రికంగా ఆ ముంగురులను సర్దుతూ ముఖంలోకి జాలిగా చూస్తూ కూర్చున్నాడు. ప్రకాశం డాక్టరుతో ప్రవేశించాడు. ఇప్పుడే ఏ జ్వరం అయిందీ చెప్పలేనన్నాడు డాక్టరు. ఇన్ జెక్షన్ ఇచ్చి కొన్ని మందులు రాసి ఇచ్చి వెళ్ళిపోయాడు. డాక్టరు ఇచ్చిన చీటీని చేత్తో పట్టుకొని ఏదో ఆలోచిస్తున్న ప్రకాశాన్ని చూసి చంద్రం లేచాడు. పెట్టె తెరచి వెయ్యి రూపాయలు ఉన్న కవరు తీసి అందించబోయాడు.
"ఏమిటిది?"
"డబ్బు! నీ దగ్గిర వుంచి వాడు."
"ఎంత వుంది అందులో?"
"వెయ్యి రూపాయలు!"
"అంత డబ్బు నాకెందుకు? ఓ పదిరూపాయలు ఇవ్వు. ఇప్పుడు మందులకు సరిపోతుంది."
"నా దగ్గిర డబ్బు తీసుకోవటానికి సందేహిస్తున్నావా? ఈనాడు నేను ఇంతవాణ్ణి కావటానికీ, ఈ డబ్బు సంపాదించగలగటానికీ కారకుడు ఎవరు? నువ్వు. నీ ఋణం ఎంత డబ్బు ఇచ్చినా తీర్చుకోలేనిదని నాకు తెలుసు. కాని...." చంద్రం గొంతు బొంగురుపోయింది.
"అదుగో, మళ్ళీ మొదలుపెట్టావ్. మరోమారి కృతజ్ఞతా గితజ్ఞతా అను, చెబుతాను. నేను పరాయివాళ్ళకెవరికి సహాయం చేశాను? నా ప్రాణస్నేహితునికి సహాయం చేశాను. అందువల్ల నాకు సంతృప్తి లభించింది. అంటే, అందులో నా స్వార్థం వుందన్నమాట!"
"మరి అయితే నా దగ్గిర డబ్బు తీసుకోవటానికి సందేహిస్తావెందుకు?" రెట్టించాడు చంద్రం ఉద్రేకంగా.
"నీ దగ్గర నాకు సందేహం ఏమిటోయ్! ఇప్పుడు అంత డబ్బు ఎందుకన్నాను, అంతే," అంటూ ప్రకాశం చంద్రం చేతిలో కవరు అందుకున్నాడు. చంద్రం ముఖం వికసించింది.
"ఇంత సున్నితమైన మనస్సు పెట్టుకుని ఎలా బతగ్గలవో చంద్రం!" అని ప్రకాశం మనస్సులోనే అనుకున్నాడు.
ప్రకాశం, చంద్రం - ఇద్దరూ కలసి గౌరిని మంచంమీద పడుకోబెట్టారు.
14
గౌరి పూర్ణ ఆరోగ్యవంతురాలు కావటానికి పదిహేను రోజులు పట్టింది. ప్రకాశం, చంద్రం - ఇద్దరూ కూడా ఎంతో శ్రద్ధంగా ఆమెకు సేవలు చేశారు. మళ్ళీ తనను శరణాలయానికి పంపించరు అనే నమ్మకం కుదిరినాకనే ఆమె ఆరోగ్యం పుంజుకుంది. అది ప్రకాశం, చంద్రం, తెలుసుకోకపోలేదు.
చంద్రంకంటే ప్రకాశం దగ్గర గౌరికి చనువు ఎక్కువ. ముభావంగా కనుపించే చంద్రం అంటే ఆమెకు గుండెలో ఎక్కడో ఓ మూల భయం బిడాయించుకుని కూర్చుంది.
ఒకరోజు ప్రకాశం అడిగితే గౌరి శరణాలయ జీవితం గురించీ, ముఖ్యంగా ఆ రోజు తను గోడదూకి పారిపోవటం గురించీ చెప్పింది.
అక్కడ వాళ్ళకు పెట్టే తిండి, వాళ్ళయెడల అధికారులు చూపే నిరాదరణా, తిరస్కారం గురించీ ఆమెకు చాతనయిన ధోరణిలో చెప్పింది. ముఖ్యంగా గౌరి గోడదూకి పారిపోవటానికి కారణభూతమైన సంఘటన చంద్రాన్ని వేధించింది.
గౌరి జూనియర్ మెట్రిక్ లో వుంది. కొంచెం మొండిఘటం. అప్పుడప్పుడు ఎదురు తిరిగి మాట్లాడి మాట్రిన్ చేత, సూపర్నెంటుచేతా దెబ్బలు తినేది. అధికారులే కాకుండా, వయస్సులో వున్న కొందరు ఆడపిల్లలుకూడా చిన్నపిల్లలమీది అధికారం చేసేవారు.
ఆ రోజు పొద్దుట లేస్తూనే సూపర్నెంటు గౌరికోసం కబురు పెట్టింది. గౌరి భయపడుతూ సూపర్నెంటు గదికి వెళ్ళింది. గౌరి తను ప్రొద్దుటే చేసిన అపరాధం ఏమిటో అర్థంకాక బిక్కమొహం వేసింది. గౌరి వూహించినట్లు సూపర్నెంటు ఆమెను చూడగానే కళ్ళు వురమలేదు. ఆల్ సేషియన్ లా గుర్రుమనలేదు. కనీసం పిల్లిలా 'కస్ మని' కూడా అనలేదు. గౌరిని నవ్వుతూ దగ్గిరకు పిలిచింది. సూపర్నెంటు నవ్వు ముఖాన్ని గౌరి ఏనాడూ చూసి ఎరగదు. అది చూసిన గౌరికి ఆమె నవ్వకుండా వుంటే బాగుండుననిపించింది. భయపడుతూనే ముందుకు రెండడుగులు వేసింది.