Previous Page Next Page 
ఊగవే ఉయ్యాల పేజి 28


    "మధూ! నీ మనసెందుకు బాగోలేదో నాకు తెలీదు. కానీ నీకో విషయం చెప్పనా? నా మనసుకూడా బాగోలేదు."

 

    "నీ మనసా?" అంటూ పెద్ద జోక్ విన్నట్లు మాధవి నవ్వసాగింది.

 

    "ఏం? ఎందుకు నవ్వు?"

 

    "నీకు మనసంటూ వున్నదని ఇన్నాళ్ళూ నాకు తెలీదు. మొదటిసారిగా వింటున్నాను."

 

    అతను నవ్వడానికి ప్రయత్నించి విఫలుడై అసలే ఎర్రగా వుండే కళ్ళు మరికొంచెం ఎర్రబడగా మౌనంగా ఊరుకున్నాడు.

 

    "సారీ బావా! కోపమొచ్చినట్లుంది."

 

    అతనప్పటికీ ఏమీ మాట్లాడలేదు.

 

    "ఏం బావా! మాట్లాడవే? పోనీ నీ మనసెందుకు బాగోలేదో చెప్పు?"

 

    అతనేమీ జవాబు చెప్పలేదు.

 

    ఆమె అతని భుజంమీద చెయ్యివేసి సన్నగా గిచ్చుతూ, "ఏమ్మా! అంత కోపం? ఇప్పుడు అనరాని మాట ఏమన్నానేం?" అంది గారాబంగా.

 

    అతను కొంచెం మెత్తబడ్డాడు. "నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను" అన్నాడు పొడిగా.

 

    "సరిగ్గా అక్కయ్యకూడా ఇలాగే అందికానీ ఏమీ చెయ్యలేదు"

 

    "నేను మళ్లీ పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను" ప్రతాప్ చాలా సీరియస్ గా అన్నాడు.

 

    ఇంకోసారి పెద్ద జోక్ విన్నట్లు ఆమె మళ్లీ నవ్వసాగింది. చివరకు "ఫో బావా! ఇవేళ బలే నవ్విస్తున్నావు. అబ్బ! నాకు నిద్రవస్తోంది. పద, ఇక్కడ్నుంచి పోదాం" అంటూ అతన్ని చెయ్యిపట్టుకుని లాగి అక్కడ్నుంచి కదలదీసింది.


                                    * * *


    "అబ్బ నాకు నిద్రవస్తోంది" అన్న మాధవికి ఇంటికి వచ్చాక ఎంతకూ నిద్ర పట్టలేదు. రాజా ఏంచేస్తూ వుంటాడు? ఆ చీకట్లోపడి ఒంగోలు వెళ్ళిపోయి వుంటాడా?

 

    ఒకవేళ ఈ ఊళ్ళోనే వున్నాడేమో!

 

    ఉన్నా...ఎలా కనిపిస్తాడు?

 

    ఆమె గది మేడ పైభాగంలో వుంది. ఆమె అక్కా, బావా క్రిందవుంటారు. ఆమె ఒక్కతే పైన వుంటుంది. ఆమె లేనప్పుడు మేడమీది గదులన్నీ బోసిపోయినట్లుగా వుంటాయి.

 

    గది బయట ఏదో అలికిడి అయినట్లయింది.

 

    "ఎవరూ?" అంది.

 

    ఏమీ జవాబులేదు.

 

    కాసేపాగి మళ్ళీ అలికిడి.

 

    మనసులో ఏదో అనుమానం. ధైర్యం తెచ్చుకుని ప్రక్కమీదనుంచి లేచి వెళ్ళి తలుపు తీసింది. తృళ్లిపడింది.

 

    రాజా!

 

    బట్టలు నలిగివున్నాయి, ముఖం వడిలివుంది. అతన్నల్లా చూడటం ఎంత అద్భుతంగా వుంది! ఆ ముఖాన్ని తన గుండెలకు అదుముకోవాలని ఆమె అంతరంగం ఉవ్విళ్ళూరింది.

 

    "ఎలా వచ్చావు?"

 

    "ఎలా అయినా రాగలను."

 

    "ఎవరైనా చూశారా?"

 

    "ఏం చేస్తారు చూస్తే?"

 

    "అయినా..." అతన్ని చప్పున లోపలకు లాగి తలుపు గడియపెట్టింది.

 

    "రాజా! ఎందుకొచ్చావు?"

 

    "రాకుండా వుండలేకపోయాను."

 

    "రావొద్దన్నానుగా. నువ్వు పరీక్షలో ఓడిపోయావుగా!"

 

    "ఈ పరీక్షలు, పందేలూ నేను లెక్కచెయ్యను. నువ్వు నాదానివి. వింటున్నావా?"

 

    "కాదని నేనన్నానా?" అనుకుంటోంది లోలోపల.

 

    "ఏం?"

 

    ఇంత పెంకిపిల్ల, అల్లరి రాలుగాయి ఎందుకిలా సిగ్గుదొంతరలు చిందిస్తోంది?

 

    "మాధవీ!"

 

    "ఊఁ"

 

    "నువ్వు....నువ్వు....ఐ....ఐ....ఐ...."

 

    "ఐ నో."

 

    అతను చేతులు జాచాడు. ఆమె సందేహించలేదు. ఒక్క పరుగున వెళ్లి అతని చేతుల్లో వ్రాలింది.

 

    అది కౌగిలి.

 

    బిగి కౌగిలి.

 

    మధ్య మధ్య ఆమె వ్రేలిగోళ్ళు అతని వీపుమీద ఆడుకుంటూ చిన్నగా చురుక్కుమనిపిస్తున్నాయి.

 

    అది బిగి కౌగిలి.

 

    అయినా లేతగా, అమాయకంగా వుంది.

 

    అతని చేతివ్రేళ్లు ఆమె వీపుమీద పేర్లు రాస్తున్నాయి.

 

    అతని ముఖం ఆమెకు దగ్గరగా వచ్చింది. చప్పున తల వెనక్కి వంచింది.

 

    "వద్దు" అంది నవ్వుతూ.

 

    "మాధవీ! ఆకలేస్తోంది."

 

    అతన్ని వదిలి అల్మైరా దగ్గరకువెళ్లి అందులోంచి పళ్ళు, స్వీట్లు తీసుకొచ్చింది.

 

    "ఇలా రా!"

 

    "రాజా! స్నానం చేస్తావా? గీజర్ లో పదినిముషాల్లో నీళ్ళు వేడెక్కుతాయి.

 

    అతను తల ఊపాడు.

 

    కొంతసేపటికి అతనికి టవల్ అందించింది. బాత్ రూంలో స్నానంచేస్తుంటే బయట బాధపడుతూ నిల్చుంది. షాంపూవేసి తలంతా రుద్ది తానే చక్కగా తల స్నానం చేయించవచ్చుగా..."

 

    "ఇప్పుడు వెళ్ళి అడగనా?"

 

    కోరిక అదిమేసుకుంది.

 

    స్నానం పూర్తిచేసి టవల్ చుట్టుకొని వచ్చాడు.

 

    "ఇప్పుడెలా?"

 

    "ఏమిటి?"

 

    "బట్టలు"

 Previous Page Next Page