Previous Page Next Page 
వ్యూహం పేజి 28


    ప్రస్తుతం...

 

    భగవాన్... శక్తికి కంటికి మనిషిలా కూడా కనిపించడం లేదు.

 

    "ఇప్పటిదాకా... ఆయన్తోనే ఉన్నా... మూడు గంటలు... ఎపాయింట్ మెంట్లన్నీ కేన్సిల్ చేసుకున్నాడు. నన్ను చూసి...." అడ్డంగా కోసేసాడు శక్తి.

 

    "ఛై... ఛై... ఛైర్మన్ గారితో మూడు గంటలున్నావా? అంత టైమా? సి.ఎమ్.కే. మొన్నీ మధ్య అరగంట కంటే టైమివ్వలేదు. నీకు సారి- మీకు మూడు గంటలా? మీరు గొప్ప అదృష్టవంతులు బాసు" దిమ్మరపోయి అన్నాడు భగవాన్.

 

    "తన కంపెనీలో చేరమంటున్నాడు. నాకైతే ఇష్టంలేదు. చూస్తూ, చూస్తూ రిలెటివ్స్ దగ్గర పని చెయ్యలేం. నా పాలసీ అది" స్టయిల్ గా అన్నాడు శక్తి.

 

    ఇద్దరూ క్యాంటిన్ లోకి అడుగుపెట్టారు.

 

    "మిమ్మల్ని, మీ మేనమామగారు వదులుకోరులేండి..." అంత వరకూ ఉన్న ఏకవచనం, గౌరవ వచనంగా మారడం గమనించాడు శక్తి.

 

    వీడొక్కడిదేనా... రేపట్నుంచీ ఆ మెయిన్ గేటు దగ్గర రిసెప్షనిస్టు, ఆ పర్సనల్ అసిస్టెంట్లు, బిజినెస్ మేనేజర్, ఫ్యూన్లు, గూర్ఖాగాళ్ళు అందరూ తనను గౌరవించరూ? చచ్చినట్లు గౌరవిస్తారు.

 

    "కాఫీ కావాలా... బోర్నవిటా తాగుతారా" వినయంగా అడిగాడు భగవాన్.

 

    "క్యాంటిన్లో హార్లిక్స్ ఉండదా?"

 

    "ఎందుకుండదు. ఉంటుంది. హార్లిక్స్, ఓవల్టీన్, కాంప్లాన్... అన్నీ ఉంటాయి. హార్లిక్స్ తెస్తాను" పరుగు, పరుగున వెళ్ళాడు భగవాన్. క్షణాల్లో హార్లిక్స్ తో తిరిగొచ్చాడు.

 

    "మనుషుల్ని మొదటిచూపులోనే పోల్చడం నాకలవాటండి... అందుకే నిన్ననే మిమ్మల్ని, మీ గొప్పదనాన్నీ గుర్తు పట్టేసాను. రేపు ఛైర్మన్ గారు మీకు పెద్ద ఉద్యోగం ఇవ్వడం ఖాయం. ఒక స్నేహితుడిలా కాకపోయినా, మొట్టమొదట పరిచయమైన వ్యక్తిలాగైనా గుర్తుంచుకోండి."

 

    శక్తికి హార్లిక్స్ కప్పు ఇచ్చి, తను కాఫీ కప్పుని తీసుకుని తాగుతూ అన్నాడు వినయంగా.

 

    "భగవాన్ నిన్నెలా మర్చిపోతానయ్యా" పాపం- మంచోడు- అమాయకుడు- ఇతనికి తప్పకుండా ప్రమోషన్ ఇవ్వాలి. నిశ్చయించేసుకుని అన్నాడు శక్తి.

 

    "మర్చిపోయాను. మరి మీరు మాట్లాడుతున్నప్పుడు- ఛైర్మన్ గారి కూతురు- ఆవిడ లేరా- ఆవిడతో మాట్లాడారా- మీరు-" అడిగాడు భగవాన్ ఎక్సైట్ మెంట్ కి గురవుతూ.

 

    "ఆవిడ అక్కడెందుకుంటుందీ- పిచ్చివాడా-" అని నవ్వాడు శక్తి.

 

    "మరెక్కడుంటుందండీ?! ఆవిడ కూడా ఈ ఆఫీసులోనే పని చేస్తోందట. మూణ్ణెల్లయింది. అమెరికా నుండొచ్చి- ఎం.బి.ఏ. పూర్తిచేసి- హేడ్డాఫీసులో ఉన్నారని విన్నాను" చెప్పాడు భగవాన్.

 

    "లేదయ్యా- ఇప్పుడే బిజినెస్ మేనేజర్ కూడా చెప్పాడు. ఆవిడ ఇక్కడ పనిచెయ్యటం లేదని"

 

    "బిజినెస్ మేనేజర్ ని కూడా కలిసారన్న మాట- చచ్చింది గొర్రె- వాడు- వాడు- చాలా కిలాడీ అండి బాబూ- ప్రతివాడి మీద- పడనట్లు మాట్లాడుతాడు వాడు. అవతలి వ్యక్తి గురించి- మనమేమైనా మాట్లాడేమనుకోండి- అంతే సఫా- మీతో మాట్లాడితే, అ రామబ్రహ్మం గురించి మాట్లాడి ఉండాలి- అంతేనా"

 

    అంత టక్ న భగవాన్ అలా చెప్పేసరికి ఆశ్చర్యపోయాడు శక్తి.

 

    "నిజం- రామబ్రహ్మం గురించే మాట్లాడాడు."

 

    "చూసారా- మనుషుల్ని నేనెలా స్టడీ చేస్తానో- మీకు తెలుసా ఆ రామబ్రహ్మం వీడు ముందు మేట్సండీ బాబూ- జాగ్రత్త గుండండి. ఇంతకీ- ఆ ధర్మారావు- ఛైర్మన్ కూతురు ఇక్కడ లేదన్నాడు కదూ-"

 

    "అన్నాడు"

 

    "ఎందుకన్నాడో తెలుసా?"

 

    "తెలీదు"

 

    "ఛైర్మన్ కూతురు- ఇక్కడే వర్క్ చేస్తున్న మాట నిజం- కానీ ఆవిడ ఎలా ఉంటుందో, ఏ పోస్టులో ఉందో ఎవరికీ తెలీదు- చాలా అందగత్తెట- చాలా పొగరుబోతట- హై క్వాలిఫికేషన్ ఉంది. దానికి తోడు డబ్బు ఇక్కడ వున్నా ఛైర్మన్ కూతురు ఫలానా అని తనకు తెలీకపోతే పరువు పోతుందని ఇక్కడ పనిచేయటం లేదని చెప్పుంటాడు.

 

    "ఇవన్నీ నీకెవరు చెప్పారు" ఉద్వేగంతో దిగాడు శక్తి.

 

    "అనుకోవడమంటే బాబూ... చెప్తున్నవన్నీ విన్నవే- కన్నవి కాదు. రేపో, ఎల్లుండో మీరెలాగు వాళ్ళింటి కెళతారు. కలుస్తారు- అప్పుడు మీకే తెలుస్తుంది చూడండి. పొగరు బోతైనా, హైలీ జీనియస్సట. ఛైర్మన్ గారి సక్సెస్ వెనుక, ఆవిడ ఐడియాస్ వున్నాయని అందరూ అంటారు. ఎలాగూ మీకు తెలుస్తుందికదా."

 

    శక్తి మెదడు మొద్దుబారి పోయింది. మరికొన్ని కొత్త వివరాలు. బేబీ ఇక్కడే తన ఆఫీసులోనే పని చేస్తోంది. కాని ఆ బేబీ ఎవరన్నది ఎవరికీ తెలీదు. అదెలా సాధ్యం... ఓరి మేనమామ... నీ అసాధ్యంకూల- మీకెన్ని తెలివితేటలండీ? కూతుర్ని సి.ఐ.డి. క్రింద పెట్టాడన్న మాట.

 

    "ఏం పేరు ఆవిడ పేరు" ఉత్సాహంగా అడిగాడు శక్తి ఆలోచల్నుంచి తేరుకుంటూ.  

 

    "తెలీదు. కాని పేరు ఎస్ అక్షరంతో మొదలవుతుందని విన్నాను. పేరు, సెక్షనూ తెలిస్తే చెప్పనండీ. ఎన్నాళ్ళ నుంచో, ఛైర్మన్ కూతుర్ని చూడాలని ఈ ఆఫీసులో చాలామంది తహతాహలాడుతున్నారు. అమ్మాయిలైతే అసూయతో మరీను. ముగ్గురు నలుగురున్నారు అందమైనవాళ్ళు. వాళ్ళలో ఎవరో ఒకరు కావాలి. కానీ వాళ్ళెవరూ కేంటిన్ లోకి రారు. పబ్లిగ్గా తిరగరు. మారుతీకార్లోంచి సున్నితంగా దిగడం, సున్నితంగా పువ్వులు కూడా నలిగిపోతాయన్నట్లుగా లిఫ్టు దగ్గరకెళ్ళడం ఛాంబర్స్ లోకి దూరిపోవడం అంతే. డ్యూటీ అయిపోయాక వెళ్ళిపోవడం. అందుచేత... ఛైర్మన్ కూతురెవరో ఇప్పటికీ సస్పెన్సే. అది మీ ద్వారా తేలిపోతుంది కదండీ" సంబరపడిపోతూ అన్నాడు భగవాన్.

 

    శక్తి మాట్లాడలేదు ఆలోచిస్తున్నాడు.

 

    "అవునుగాని... మీ మేనమామ కూతురు పేరు మీకు తెలీక పోవడం ఆశ్చర్యంగా ఉందండి... నిజంగా మీకు తెలీదా? తెలుసులెండి గురూగారూ... నన్ను ఆట పట్టించాలని కదూ...?"

 

    శక్తి గొంతులో పనసకాయ పడినట్లయింది. కళ్లు చిట్లించి, భగవాన్ వేపు చూసాడు. తన పరువును కాపాడుకోవాలి. తప్పదనుకున్నాడు శక్తి.

 

    "నాకెందుకు తెలీదు? బాగా తెలుసు... చిన్నప్పుడు నేను మా మేనమామ దగ్గరే పెరిగాను. ఏదో పరిస్థితుల ప్రభావంవల్ల... ఎవరికయినా పరిస్థితులనేవి కామనేకదా... చిన్నప్పుడు బాగా జ్ఞాపకం... మేమిద్దరం కలిసి, ఆడుకునేవాళ్ళం, వాటర్ ఫాల్స్ దగ్గర కేరింతలు కొట్టేవాళ్ళం. చిన్నప్పుడు మాత్రం... బేబీ బుజ్జిముండ... అని ముద్దుగా పిలిచేవాళ్ళం... చిన్నప్పుడు కదా... చిన్నప్పుడు అలాగే పిల్చుకుంటారు కదా... మీకు తెలుసుకదా" అటూ ఇటూ చూస్తూ అన్నాడు శక్తి.

 Previous Page Next Page