Previous Page Next Page 
జాలిలేని జాబిలి పేజి 29


    "ఎందుకూ, యీ ఆరోగ్యములేని బ్రతుకు? అసహ్యంగా వుంది. నాకు బతకాలని లేదు. బ్రతకాలని లేదు" అని ఇందిర కన్నీళ్ళు కార్చింది.

    తాను కాస్త నలుపని మరో దిగులు ఆమెకు.


                                 *    *    *


    ఇందిర ఆలోచిస్తోంది కుర్చీలో కూర్చుని. తనకు పెళ్లి చెయ్యాలని చూస్తున్నారు తల్లిదండ్రులు. తండ్రిచేస్తోన్న ఉద్యోగం తప్ప, అక్కడెక్కడో పల్లెటూళ్ళో ఓ ఇల్లూ, ఐదెకరాల పోలంతప్ప వేరే ఆస్థిలేదు తమకు. తమ కులంలో ఆడపిల్లలకు  పెళ్లికావాలంటే కనీసం ముప్ఫయి నలభైవేలయినా కట్నం ఇవ్వాలి. ఎక్కడుంది తమదగ్గర అంత డబ్బు? అప్పుచేయాలి. అప్పుచేస్తే తమ కుటుంబ పరిస్థితి తల్లక్రిందులౌతుంది. అన్నల చదువు, తమ్ముళ్ళ భవిష్యత్తు అంతా గాలికి కొట్టుకుపోతుంది. తాను పెళ్లిచేసుకోకుండా చదువుకుని ఉద్యోగం చేస్తానాని తల్లితో అన్నది. ఆమె నవ్వి  'నీ మొహంలే' అని తనమాటను కొట్టిపారేసింది. ఈ పెద్దవాళ్ళు ఇంతే. తమ మూర్ఖత్వం వదలరు, వాళ్ళకర్థంకాదు తమ గొడవ.

    మధుబాబుతో పరిచయం గమ్మత్తుగా వుంది. ఒకసారి తనతో 'ఇంట్లో ఏమీ తోచటంలేదు' అంటే  "నన్నుగురించి ఆలోచిస్తూ వుండండి.....మంచి కాలక్షేపం" అన్నాడు. ఏముంది మిమ్మల్నిగురించి ఆలోచించటానికి?" అని తానప్పుడు దబాయించింది. కాని ఇప్పుడతని తలపురాకుండా ఒక్కనిముషము కూడా గడవటల్లేదు. అతనుకూడా తననిగురించి ఆలోచిస్తూ వుంటాడా? ఏమో, తనకీమధ్య బొత్తిగా పాఠాలమీద ధ్యాస వుండటంలేదు. జీవితమొక సురభిళసూనం కాదంటాడు మధుబాబు. తనకలా అనిపిస్తోంది. మళ్ళీ అంతలో పెనుగులాట.

    తాను అతన్ని ప్రేమిస్తున్నదా? అతడ్ని చూడటం  చాలా ఇష్టం. అతనితో  మాట్లాడటం, గడపటం చాలా ఇష్టం. రాత్రిళ్ళు చాలాసేపటివరకూ మేలుకుని అతనిగురించి ఆలోచిస్తూ వుంటుంది. అతని తలపులతో బ్రతుకుతోంది.మరి దీన్నేమిటంటారు? అతనితో ఎన్నో చెప్పాలి అని వుంటుంది. అతని ముఖం, అమాయకంగా చూసే ఆ చిన్నకళ్ళూ చూస్తూ ఏమీ చెప్పలేకపోతోంది. దీన్నేమిటంటారు?"

    అనవసరంగా తానతని జీవితంలో ప్రవేశిస్తున్నదేమో, అతన్ని బాధిస్తున్నదేమో, ఇందిర ఆలోచనలతో అలసిపోతోంది.

    "నేనే నీ పొజిషన్ లో వుంటే పరిస్థితుల్ని మరోవిధంగా ఉపయోగించుకుందును" అన్నాడు స్నేహితుడు.

    "ఎలా?" అనడిగాడు మధుబాబు.

    "ఆడపిల్లల్తో అందంగా మాట్లాడుతూ, కలలుగంటూ ఏమీ చేయకుండా విడిచిపెడతావెందుకు? అలా చూడటం గొప్ప అని నువ్వనుకోవచ్చుగాని అది వట్టి అసమర్థత. మనం యీ భూమ్మీదకొచ్చింది దిగుళ్ళు పడుతూ, రాత్రిళ్ళు మేలుకొని  కుములుతూ, కోరికల్ని చంపుకుంటూ నిర్జీవంగా బ్రతకటానికి కాదు. ఎంజాయ్ ఎండ్ లివ్ టేక్ ఎవ్విరిథింగ్ యిజీ ప్రిన్సిపల్. యవ్వనమంతా వృధాఅనుభూతులతో నింపుకుంటూ అనుభవాన్ని వదలుకుని ఎందుకీ చిత్రవధ?"

    "అలా ఎంతమందిని ఎంజాయ్ చేసి విడిచిపెడుతూ పోతుంటాం?"

    "విసుగు పుట్టేంతవరకూ. అవకాశం చేతికొస్తూంటే జారవిడుచుకుని, దానికి బంగారుమెరుగులు దిద్దటం పూలిష్ నెస్. నిత్యసమరం."

    "ఆ స్త్రీ అంటే ఇష్టం లేకపోతే?"

    "ఇష్టం, అయిష్టం సుఖానికేమీ అడ్డురాదు బ్రదర్"

    మధుబాబు ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇష్టంలేకుండా సుఖం ఎలా సాధ్యం? అంత యాంత్రికంగా జీవించగలదా మనిషి? చూస్తూ చూస్తూ మనకు యిష్టం  లేని కూరని బలవంతగానైనా మింగలేమే! ఇది ఎలా సాధ్యపడుతుంది? నిజమే! తనకెన్నో అవకాశాలున్నాయి, వచ్చాయి. కాని ప్రేమించని మనిషితో యీ అసహ్యాన్ని ఎలా భారించగలడు? వ్యభిచారుల్ని చూస్తే అందుకే అతనికి కోపం, రోత. ఏం బావుకుంటున్నారని? ఆత్మవంచన, అనుభూతి లేని అనుభవం, వట్టి భ్రమ.


                               *    *    *


    రత్నకుమారి ఊళ్ళోలేదు. మరో స్నేహితురాలు సులోచన వచ్చి ఇందిరను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. వాళ్లది చాలా పెద్దమేడ. సులోచన బలవంతంమీద తాను అప్పుడప్పుడూ వాళ్ళ ఇంటికి వెడుతూ వుంటుంది. ఈ సులోచనకు అన్నయ్య ఒకడున్నాడు, భాస్కరరావు, తనతో ఏదో  ఒకరూపంలో మాటలు  పొడిగిస్తూ వుంటాడు. తనకు అతనంటే ఇష్టం ఏమీలేదుగానీ, ఏముంటాయి మాటలు అతనితో?

    "ఇవేళ కారులో భీమిలి వెళదాం" అన్నాడు భాస్కరరావు ప్రపోజ్ చేస్తూ.

    "అవునన్నయ్యా చాలా కాలమయింది వెళ్లి. ఇక్కడే భోంచేసెయ్యవే ఇందూ, ముగ్గురం కలిసి వెళదాం" అంది సులోచన ఉత్సాహంగా.

    "నేను రాను" అంది ఇందిరా.

    భాస్కరరావు ముఖం వివర్ణమైంది. ప్రక్కకి త్రిప్పుకున్నాడు ఏమీ గమనించనట్లుగా.

    "ఎందుకు రావు?" అనడిగింది సులోచన నవ్వు తెచ్చుకుంటూ.

    "రానంతే."

    అన్నాచెల్లెళ్ళిద్దరూ తెలతెలబోతూ వూరుకున్నారు.

    ఇందరి వెళ్లిపోయాక "మొండిఘటం" అంది సులోచన అన్నతో. ఆమె కంఠంలో కసి, ఈర్ష్య ఏమీలేవు.

    ఇందిర యింటికి వస్తూ "అతనికేం? మగవాడు. యెంతమంది ఆడపిల్లలతోనైనా తిరగవచ్చు. కాని నా గతి యేమవుతుంది?" అనుకుంది.


                               *    *    *

    ప్రొద్దున నిద్రలేచినప్పట్నుంచీ అదోరకంగా వుంది మధుబాబుకు. వంట్లో నలతగా వున్నట్లుంది. కాలేజీకి పోదామనిపించలేదు. మానేశాడు. మధ్యాహ్నానికి జ్వరం వచ్చింది. ఎక్కడకూ కదల్లేకపోయాడు. పనిమనిషి వస్తే బజారునుంచి కాఫీ తెప్పించుకుని తాగాడు. సాయంత్రానికి మరీ నీరసంగా  వుంది. స్నేహితులుకూడా ఎవరూ రాలేదు. రాత్రంతా బాధా, ఆలోచన్లు.

    రెండురోజులు అలాగే జ్వరంతో బాధపడ్డాడు. మూడోనాడు కాస్త నెమ్మదించింది. కొంచెం ప్రశాంతంగా వుంది. సాయంత్రం అయిదవుతోంది. మంచం మీదనే పడుకుని ఆరోజు పేపరు చదువుతున్నాడు.

    దగ్గరగా వేసివున్న తలుపుల్ని తీసుకుని లోపలకు వచ్చింది ఇందిర. అతను తలత్రిప్పి చూశాడు.

    ఆమె ముఖం వెంటనే కళావిహీనమైంది. "ఇలా వున్నారేం?" అంది ఆతృతగా దగ్గరకు వస్తూ.

    "ఆ కుర్చీ  లాక్కుని కూర్చోండి.....కొంచెం ఫీవర్ వస్తోంది" అన్నాడు మధుబాబు నెమ్మదిగా.

    ఇందిర కుర్చీని అతని మంచానికి చేరువుగా లాగుకుని కూర్చుని "మరి నాకెందుకు కబురు చెయ్యలేదూ?" అంది ఖేదంగా.

    "ఎవరితో?" అన్నాడతను చిరునవ్వుతో.

    ఆమె ఉలికిపడింది. అతని ముఖంకేసి దీర్ఘంగా చూస్తూ కూర్చుంది. అందమైన, సుకుమారమైన అతని మొహం చిక్కిపోయి కళాహీనమైవుంది. అలా  చూస్తున్నాయి ఆ కళ్ళు. ఆమె దుఃఖం ఆపుకోలేకపోయింది. ఉద్రేకంతో, ఉద్వేగంతో "మధుబాబూ!" అంటూ అతని మంచంమీదకు వెళ్లి కూర్చుని అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి "మీరెంత కఠినులు? ఎంత పెంకివారు?" అన్నది కళ్ళలోకి చూసి.

    "ఎంతదయ మీకు నామీద?" అన్నాడు మధుబాబు తన సహజశాంత స్వరంతో.

    రెండునిముషాలు మౌనంగా గడిచాయి. ఇద్దరూ అలాగే ఒకరివంక ఒకరు చూసుకుంటూ గడిపాడు.

    "నువ్వెవరివి ఇందిరా నాకు?" అనడిగాడు మధుబాబు.

    'ఎవర్ని?' అని ప్రశ్నించుకుంది. ఆమె ఆలోచన వణికింది. ఏదో చెప్పబోయింది. పెదవి కంపించింది.

    ఎవర్ని? నేనెవర్ని?

    "చెప్పు ఇందిరా?"

    "నేను మీ  ప్రియ బంధవినికానా?" అనేసింది ఇందిర ఆవేశంతో వణుకుతూన్న కంఠంతో.

    అతను అప్రతిభుడయాడు. శరీరం గజగజ వణికింది. నిరుత్తరుడైనాడు.

    "చెప్పండి. కానా? కానా?" అంటోన్నది ఇందిర ఆదుర్దాగా.

    'ఏమని జవాబు చెప్పను?" అని ఆలోచిస్తున్నాడు మధుబాబు హఠాత్తుగా కనులు మూసుకుని.


                                                                 *    *    *

    దీపావళి వింతవింత కాంతులు! మధుబాబు రోడ్ మీద వంటరిగా  నడుస్తున్నాడు. ఎటుచూస్తే అటు వెలుగు, కళకళ. అందమైన అమ్మాయిలూ అన్నా చెల్లెళ్ళూ, తల్లీకూతుళ్ళూ, భార్యాభర్తలు దీపాలమధ్య చిరునవ్వుల్తో నిలబడి రంగులు వెదజల్లుతున్నారు.

    ఎంత సంతోషంగా వుంది ప్రపంచం?

    ఒకరికొకరు ఎంత తోడునీడ!!

    అతనికి ఇందిర జ్ఞాపకం వచ్చింది. ఏంచేస్తూ వుంటుంది? ఆనాడు వెళ్లిపోయి మళ్లీ ఇంతవరకూ  కనబడలేదు. కోపం వచ్చిందేమో? అంత  హఠాత్తుగా వేసిన ప్రశ్నకు జవాబు  చెప్పలేకపోయినాడు. నిశ్చేష్టురాలయి, నిశ్శబ్దంగా వెళ్లిపోయిందామె. తనని అపార్థం చేసుకుందేమో!

    తోడు కావాలి తనకు. ఆ తోడు.....

    "ఇందిర! ఇందిర!"

    అతను లోలోన వెర్రికేక వేశాడు. అడుగుల తడబడుతున్నాయి.

    పద్మజ రూపంలో తనకు లభించని తోడు ఇందిరరూపంలో లభిస్తోంది. ఎందుకానాడు తన పెదవులు మూతలుపడ్డాయి? "ఇందిరా! నువ్వు నా ప్రియబాంధవివే. నువ్వు నాకు కావాలి. నువ్వులేందే నేను బ్రతుకలేను" అని ఎందుకు చెప్పలేకపోయాడు?

    ఎక్కడ కనిపిస్తుంది ఇప్పుడామె? ఆమె కలిసేటంతటివరకూ ఎలా ఈ ఉద్వేగాన్ని భరించటం?

 Previous Page Next Page