ఎంత కష్టాన్నయినా ఎంతమందినయినా ఎదిరించి ఆమెని తనదాన్ని చేసుకుంటానని..... అయ్యో, ఎలా చెప్పటం ఆమెతో? ఎంతకాలం వేచి వుండాలి?
* * *
"ఏమి చేస్తున్నాడో యిప్పుడు మధుబాబు."
బయట పిల్లలు ఉత్సాహంగా టపాకాయలు కాలుస్తున్నారు. తల్లీ, తండ్రి దగ్గరవుండి కాల్పిస్తున్నారు. ఇందిర తనగదిలో కూర్చొని ప్రశ్న వేసుకొంది.
తాను పెదవిజారి మొన్న తొందరపడిందా? తానంటే అతనికేమీ లేదా? మరి ఎందుకు సరియైన సమాధానం చెప్పలేదు? అతను గొప్పవాడు. తనవంటి వాళ్ళు ఎంతమంది అతన్ని ఆరాధించారో? తానంటే ఎందుకు అతనికి ప్రత్యేకత వుండాలి?
ఇంతలో ఏదో తోచి ఆమెముఖం వెలవెలపోయింది.
"అవునంటే..... ఒకవేళ అతను అవునంటే తాను ఏమయేది?"
తాను అతన్నుంచి వాంఛించేదేమిటి? ఏమీలేదు. గ్రుడ్డిగా ఆరాధించింది. అవునంటే తనతని కేమి అందివ్వగలదు? పెళ్ళి చేసుకోగలదా? అమ్మో తన కులం కానివాడికి ఇవ్వటానికి తమ ఇంట్లో ఒప్పుకుంటారా? చస్తే ఒప్పుకోరు. ప్రేమించానని అతడ్ని వేధించటం తప్ప తానతనికేమీ చెయ్యలేదు. అతని ఇంట్లో ఒప్పుకోవద్దూ, ఇహ అందర్నీ విడిచిపెట్టి అతనితో ఎక్కడకో వెళ్ళి పోవాలి. అంత సాహసముందా తనకు? లేదు, లేదు. తాను చెయ్యలేదా పని. తనకు చేతకాదు, అతడ్ని మరిచిపోవాలి. తనవలన అతనికి కష్టం కలగకూడదు.
"ఎక్కడున్నావ్ ఇందూ" బయటనుంచి సులోచన గొంతు వినిపించింది.
ఆమె గాభరాపడి పమిటచెంగుతో కళ్ళు తుడుచుకుంది. కుదురుగా కూర్చుంది.
సులోచన లోపలకు వచ్చి- ఆశ్చర్యంగా "ఇదేమిటేవ్! బయటంతా సంతోషంగా కేరింతలు కొడుతూ వుంటే ఒక్కత్తివీ దిగాలుపడి ఇక్కడ కూర్చున్నావు? బలేదానివి పదపద" అంటూ దగ్గరకొచ్చి చెయ్యి పుచ్చుకుని లాగింది.
"ఎక్కడికి?" అంది ఇందిర తెల్లబోతూ.
"మా యింటికి. సరదాగా గడుపుదాము రావే మొద్దుమొహమా"
కాసేపు అలా పోయివస్తే మనశ్శాంతి లభిస్తుందనిపించింది ఇందిరకు. "పద" అని ముందుకు నడిచింది.
* * *
మధుబాబు పాకకొచ్చి "ప్రియబాంధవీ" అని మొదలుపెట్టి ఉత్తరం రాస్తున్నాడు.
* * *
"అన్నయ్యా, నువ్వూ మాట్లాడుతూ వుండండి. నేను ఇప్పుడే వస్తాను" అని వాళ్ళిద్దర్నీ మేడమీద వదిలిపెట్టి, ఇందిర "ఆగు సులోచనా" అంటూ పిలుస్తున్నా వినిపించుకోకుండా క్రిందకు దిగిపోయింది సులోచన.
ఇందిర ఇబ్బందిగా సోఫాలో కూర్చుని ఎట్లా?" అనుకుంటోంది. భాస్కరరావు రేడియో ఆఫ్ చేసి "ఎందుకు ఇందిరా నన్నుచూస్తే అట్లా బెదిరిపోతావు, నేను వన్యమృగాన్నా?" అన్నాడు యిటు తిరుగుతూ.
ఆమె గుండె గబగబా కొట్టుకుంది. తలవంచుకొని ఆలోచిస్తోంది.
"ఇట్లా ముఖం ఎత్తి నావంక చూడు ఇందిరా? నేను మనిషిగా కనబడటం లేదా?"
ఈ గొంతులో ఆర్థ్రతకు చకితయై ఆమెముఖం ఎత్తి అతనివంక విస్మయంగా చూసింది. అతనంటే తనకేం అయిష్టంలేదు. ఆకర్షణీయంగా వుండే మనిషే ఆత్మవిశ్వాసంగల మనిషిలాకూడా కన్పిస్తున్నాడు.
"నువ్వు లేనిదే నే బ్రతకలేను ఇందిరా" అతను లేచి ఆమెదగ్గరకు వస్తున్నాడు.
ఇందిరకు భయంగా వుంది.
అతనామె ప్రక్కకు వచ్చి కూర్చుని "నన్ను పెళ్ళి చేసుకోవూ" అన్నాడు జాలిగా.
ఆమె నమ్మలేనట్లుగా అతనిముఖంలోకి చూసింది.
"నిజం ఇందిరా. నిన్ను తప్ప నేనెవర్నీ పెళ్ళిచేసుకోను"
ఆమె గబగబా ఆలోచిస్తోంది. ధనికుడు, యువకుడు, విద్యాధికుడు, సాటికులస్థుడు. తనంతట తానువచ్చి అర్థిస్తున్నాడు. అనుకున్నవాడు కాక పోయాక... ఏం, తనని ప్రేమించే వ్యక్తి యితను. ఈ విధంగా తన తల్లిదండ్రుల బర్డెన్ తీర్చగలిగితే తన జన్మకింకేం సాఫల్యం కావాలి?"
"జవాబు చెప్పవేం ఇందిరా?"
ఆమె గొంతు పెగుల్చుకుని "నేను చాలా బీదదాన్ని. మీ రేటుకి తూగను" అని ముఖం ప్రక్కకి తిప్పుకుంది.
అతనికి బాధ కలిగింది. "ఏం మాట మాట్లాడావు ఇందిరా? నన్నంత అల్పుడుగా భావించావా? ఈ దీపావళి దీపాలవేళ నా మనస్సాక్షిగా చెబుతున్నాను. నాకు కావలసింది నువ్వు నీ ఆస్థికాదు" అని ఆమె చేతిని పట్టుకుని అందులో తనచేయి వుంచాడు.
ఇందిర నిట్టూర్చింది. తానిప్పుడు బంధితురాలు.
* * *
సూర్యాస్తమయం..... ఎర్రని కాంతుల్లో ఇందిర మధుబాబు కెదురుగా కూర్చుంది.
"మధుబాబూ!"
"ఏం పనిచేశావు ఇందిరా?"
"నన్ను క్షమించండి మధుబాబూ! వట్టి దుర్మార్గురాల్ని. మీ మనసు గాయ పరిచాను. నన్ను మరిచిపోండి మీరు" అన్నది ఆమె ఏడుస్తూ.
"ఎందుకు మరిచిపోవాలి ఇందిరా?" అన్నాడతను ఆవేశంగా.
"మిమ్మల్ని వంచించాను నేను. పాపిష్టిదాన్ని."
"ఎంత తొందరపడ్డావు? నీ కోసం నిన్ను కలుసుకోవటం కోసం ఎలా తపించాను? నీకోసం నా తల్లిదండ్రుల్నీ, యీ ప్రపంచాన్నీ, సర్వస్వం త్యాగం చేసేవాడ్ని. నీ భవిష్యత్ నంతా ఆ ఒక్కనిముషంమీద నిల్పావు. ఎంత చంచలురాలివి ఇందిరా?"
"లేదు మధుబాబూ లేదు. మీరు మౌనంగా వున్న ఆ ఒక్కనిముషంమీదే ఆధారపడలేదు. మీరు అంగీకరించినా, మీలో కరిగిపోయే సాహసం నాలో లేదని తెలుసుకున్నాను. మా కుటుంబాన్ని ఎదిరించేశక్తి నాకు లేదన్న నమ్మకంలోకి వచ్చాను. అందుకే యీ పనిచేశాను. మధుబాబూ, ఇహ నేను అస్వతంత్రురాలిని" జలజల కన్నీరు కారుస్తోంది.
"నువ్వు అసమర్థురాలివి. పిరికిదానివి. చదివిన చదువును సద్వినియోగం చేసుకోలేని పరమ మూర్ఖురాలివి" అన్నాడు మధుబాబు కసిగా.
ఆమెకు ఆనందం కలిగింది. "మీ ఇష్టం వచ్చినట్లు తిట్టండి మధుబాబూ! మీ తిట్లుకూడా మధురంగానే వున్నాయి....నేనేం చెయ్యను, నేనేం చెయ్యను?"
అతను విహ్వలదృష్టితో ఆమెను చూడసాగాడు.
ఆమె కొంచెం ముందుకు జరిగి "నేనంటే అసహ్యంగా వుందా? ఈ చదువుకున్న మూర్ఖురాలిని చూసి అసహ్యించుకుంటే ఎలా మధుబాబూ జాలి పడాలిగాని...."
అతని గుండె కళుక్కుమంది "వెళ్ళిపో ఇందిరా."
"మిమ్మల్ని ఎలా మరిచిపోయేది మధుబాబూ" అని ఆమె వెక్కివెక్కి ఏడవ సాగింది.
అతని హృదయం నిర్జీవమైంది. "మీకేం ఇందిరా, ఏదో ఒక రూపంలో మీ జీవితాలకు స్పష్టత, నిండుతనం ఏర్పడుతున్నాయి. సెటిల్ అయిపోతున్నారు. ఏమీలేకుండా మిగిలిపోయేది నేనే. మీరు వెళ్లిపోతారు. నేను బిక్క మొహం వేసి అటూ ఇటూ చూస్తాను. అంతా చీకటి, తడుముకుంటూ నడుస్తాను. దారి సరిగ్గా తెలియదు. అలాగే పడుతూ లేస్తూ పోతుంటాను ఒక్కడ్నే...."
కంఠం గడగడ ఒణికిపోతోంది.
"మధుబాబూ! మధుబాబూ!"
"చీకటి పడుతోంది. వెళ్లిరా ఇందిరా."
".....నన్ను క్షమించారా?"
"నేను చేసినపని సబబయితే..... తప్పకుండానూ."
"ఇహ కనబడరా?"
"కనబడను."
ఆమెగొంతు మళ్ళీ వినబడలేదు. నిశీథంలో ఆమెరూపం కనబడలేదు.
* * *
ఆమె అందకపోయాక విలువ మరీ ఎక్కువై అతన్ని అనుక్షణం వేధించసాగింది.
లైటు వెలిగించాడు. తోటలోకి వచ్చాడు. సన్నజాజులు గుభాళిస్తున్నాయి. అతని హృదయక్షేత్రంలో ఓ మెరుపు మెరిసింది.
ప్రపంచమంటే మితిలేని అసహ్యం కలిగితే నా దగ్గరకు వచ్చేయండి."
పద్మజ పిలుస్తోంది. వెయ్యి గొంతుకలతో ఎలుగెత్తి రమ్మని, రమ్మని.
29
మధుబాబు హైదరాబాద్ చేరుకొని, ఓ హొటల్లో దిగాడు. ఎంతోకాలంగా ఎదురు చూస్తోన్న కలయిక యిది. అతనికి చాలా భయంగా వుంది. చివరకు పద్మజను కలుసుకోబోతున్నాడు. ఎన్నోసార్లు తననక్కడకు రమ్మన్న పద్మజను, తన జీవితంతో పెనవేసుకుపోయిన పద్మజను. వచ్చేముందు ఉత్తరం రాశాడు. "పద్మా! నే వచ్చేస్తున్నాను చివరకు- నేను నీకు నచ్చినా, నచ్చకపోయినా నువ్వు నన్ను భరించాలి. నీ యిష్టం వచ్చినన్ని రోజులు అక్కడ నేను వుంటాను. ఏం చేస్తావో, యెక్కడకు తీసుకెడతావో అంతా నీకే వదలిపెడ్తున్నాను."