రచయిత్రీ దేవి కధ
పట్టు విడువని నిర్మాత మళ్ళీ సెన్సార్ ఆఫీస్ చేరుకొని తన ఫిలిం బాక్స్ భుజాన వేసుకుని ఊరి వేపు నడుస్తూ, "ఎప్పుడూ యాక్టర్ల, డైరెక్టర్ల మీద కజ్జేపుతున్నావ్ . ఇవాళ రచయిత మీద కధ చెప్పవా!" అన్నాడు . సెన్సార్ తో. అనడం ఆలస్యం సెన్సార్ కధ మొదలెట్టింది.
'అంధ్రప్రదేశపు రాజధానిలో ఓ రచయిత్రి ఉండేది. ఆవిడ అసలు పేరేదో ఉంది గాని తను రచయిత్రి అవాలన్న ఉద్దేశంతో తన పేరుని రచయిత్రిగా మార్చేసుకుంది. మార్చుకున్న వెంటనే రెండొందలు పెట్టి ఖరీదయిన బోర్డ్ కొని దాని మీద "ప్రముఖ సినీ రచయిత్రి రచయిత్రీ దేవి . ఎలాంటి సినిమా కధనయినా బహురుచుగా వండడం మా ప్రత్యేకత." అని రాయించి ఇంటి బయట తగిలించింది. ఆ తరువాత తను రాయబోతున్న ఇరవై మూడు నవలల టైటిల్స్ కాలెండర్ల మీద ప్రింట్ చేయించి కాలెండర్లు ఊరందరికీ పంచి పెట్టింది. ఆ ఇరవై మూడు నవలల ప్లాట్ల కోసం రాత్రింబవళ్ళు కష్టపడి అనేక భాషల పుస్తకాలు రిఫర్ చేయించి చదివించుకుని వాటి సారాంశం గ్రహించి ఎనిమిది కధా వస్తువులు సేకరించింది. ఆ తరువాత వాటిని ఫోటో స్టాట్ కాపీలు తీయించి ఇరవై ముగ్గురు ప్రొడ్యూసర్ల కి రిజిస్టర్ పోస్టులో పంపించింది. ఆరోజు నుంచి వీధి గేటు దగ్గరే కూర్చుని ఏకారు అటువేపు వచ్చినా ప్రొడ్యూసర్ కారేమోనని ఆత్రుతతో గేటు తెరచి పట్టుకునేది. ఎంతకాలానికి ప్రోద్యుసర్ల కార్లు గానీ, కనీసం వారి నుంచి కార్డు ముక్కలు గానీ రాకపోవడంతో రచయిత్రీదేవికి సినిమా ఫీల్డు మీద వళ్ళు మండిపోయింది. "అడ్డమైన ఇంగ్లీష్ నవలలూ, సినిమాల నూ , ఇతర భాషల చిత్రాలనూ కాపీ కొట్టి చస్తారు. మరి నా నవలలూ అలాగే ఎందుకు కొని చావటం లేదు?" అని కసికొద్దీ తనే మద్రాస్ వెళ్ళి టాక్సీ కట్టించుకుని కనబడ్డ ప్రొడ్యుసర్నల్లా పట్టుకుని బలవంతంగా తన కధలన్నీ వినిపించింది. వాళ్ళు వింటున్నట్లే వింటూండి మధ్యలో "ఎక్స్ క్యూజ్ మీ - ఇప్పుడే బాత్ రూమ్ కెళ్ళి వస్తాను." అని వినయంగా చెప్పి లోపలికెళ్ళి అక్కడి నుంచి వెంటి లెటర్ లో నుంచి పెరటి వేపు దూకి పారిపోయేవాళ్ళు. అది పద్దతి కాదని తెలిసిపోయి మళ్ళీ హైదరాబాద్ చేరుకొని అన్ని పేపర్లలోనూ తన దగ్గర ఇరవై మూడు అద్భుతమయిన సినిమా కధలున్నాయని , ఆ కధలు కోరువారు కింది చిరునామా తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపవలసిందనీ ప్రకటనలిచ్చింది.
అందరూ ప్రకటన చదివారు గానీ కింద చిరునామాతో మాత్రం ఉత్తర ప్రత్యుత్తరాలు జరపలేదు.
ఆమెకు సినీ ఫీల్డునంతా తగలబెట్టేయాలన్నంత కోపం వచ్చింది. కానీ ఆమె ఫ్రెండ్సందరూ "ఆ ఫీల్డు ఏనాడో చెత్త సినిమాలతో తగలబడి పోయిందనీ, ఇంకా అంతకంటే ఎవరూ ఏమీ తగలబెట్టలేరనీ " చెప్పేసరికి ఆ ప్రయత్నం విరమించ్భుకుని కధలన్నీ ముందేసుకుని దిగులుగా కూర్చుంది. అప్పుడే రేడియోలో 'అల్లరి చేసే వయసుండాలి - ఏమీ లేని బావా నీతో ఏమి చేయాలి - నేనేం చేయాలి?" అన్న పాట వినబడేసరికి ఆమెకు కళ్ళవెంబడి నీళ్ళు తిరిగాయ్. వెంటనే తను "ఈ కధలను కొనేవాడుండాలి - కొన్నాక సినిమా తీస్తుండాలి - ఏమీ లేని కధా నీతో ఏం చేయాలి? నేనేం చేయాలి " అంటూ పాడుకుంది. అలా పాడుతుంటే ఆమెకు హటాత్తుగా వాళ్ళ మామయ్య గుర్తుకొచ్చాడు. అతను పాత సామాను కొని కొత్త సామాను అమ్మే వ్యాపారం చేస్తుండేవాడు. ఆ వ్యాపారంలో సంపాదించిన అయిదు లక్షలు పెట్టి సినిమా తీయాలని అతని చిన్ననాటి కోరిక. వెంటనే అతని దగ్గరి కెళ్ళి ఓ నవలను తనే అతనికి అయిదు వేల రూపాయలిచ్చి అమ్మి వేసింది. అతను ఆ నవలను వారం రోజుల్లో సినిమా తీసి జనం మీద విసిరేశారు. జనం దాన్ని మళ్ళీ వారం రోజుల్లో అతని మీదకు విసిరేశారు. అతని వ్యాపారం ఎలాగూ పాత సామాను కొనడమే గనుక ఆ ఫిలిం ఉచితంగా వచ్చిందని సంతోషిస్తూ మళ్ళీ తనింటికి వెళ్ళిపోయాడు.
ఆ తరువాత ఇంకే చేయాలో తెలీలేదు. రచయిత్రీ దేవికి. తను ఫేమస్ సినీ రచయిత్రి అవాలనుకుంటుటే ఎవ్వరూ ఎందుకు ప్రోత్సాహం ఇవ్వడం లేదో అర్ధకాలేదామెకి. ఆ దిగులుతో రాత్రింబవళ్ళు అలోచిస్తుంటూ ఓరోజు బ్రహండమయిన ఉపాయం తట్టింది. మర్నాడు అన్ని పత్రికలలోనూ ప్రకటనలు వేయించింది.
"ప్రముఖ సినీ రచయిత్రి రచయిత్రీదేవి నిర్మించుచున్న మహత్తర సాంఘిక చిత్రంలో నటించుటకు నూతన నటీనటులు కావలెను. అంతేగాక ఆ చిత్రానికి సంభాషణా రచయితలు, స్క్రీన్ ప్లే రచయితలు, అసిస్టెంటు డైరక్టర్లు అసోసియేట్ డైరక్టర్లు , డైరక్టర్లు మొదలయిన వారందరూ కూడా ఎక్కువ సంఖ్యలో కావాలి. కొత్తవారికి ప్రాముఖ్యత ఇవ్వబడును. వివరాలకు కింది చిరునామాకు రావలసిందని ' ఆహ్వానించిందామె. ఆహ్వానించిన గంట లోపల ఆమె ఇంటి ముందు పెద్ద క్యూలు - ఆ క్యూ లను కంట్రోల్ చేస్తూ పోలీసులు కనిపించారు.
ఆవిడ ఆనందంతో పొంగిపోయింది. వెంటనే ముఖం అయినా కడుక్కోకుండానే ఇంటర్ వ్యూ ప్రారంభించింది. కొన్ని వేలమంది నూతన నటీనటుల్నీ ఓ పాతిక మంది సంభాషణ రచయితల్నీ, ఆ యాభయ్ మంది అసిస్టెంట్ డైరక్టర్లనీ, ఓ రెండొందల మంది అసోసియేట్ లనూ అరడజను మంది నూతన కధకులనూ ఇంటర్ వ్యూలో సెలక్ట్ చేసి పారేసింది. ఇది చూసి అంధ్రప్రదేశమంతా ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఆమె పేరు ప్రఖ్యాతులు నగరమంతా వ్యాపించి పోయినాయ్. ఎక్కడ సభలు జరిగినా ఆమె అధ్యక్షతన వహిస్తోంది. ఆవిడ గొప్ప సినీరచయిత్రి గా సన్మానాలు జరిగిపోతున్నాయ్. మిగిలిన ఇరవై రెండు నవలలు మరో రెండు నవలలు ఎవరో నిర్మాత కొనేశాడు. ఆమె ఇంటి దగ్గర సంవత్సరాల తరబడి సంభాషణా రచయితలు రాస్తూనే ఉన్నారు. నూతన నటీనటులు బేచ్ లుగా ఏర్పడి రిహార్సల్స్ చేస్తూనే ఉన్నారు. అసిస్టెంట్లు , అసోసియేట్లు, డైరక్టర్లు ఇతర టెక్నీషియన్స్ లోకేషన్స్ కోసం వెతుకుతూనే ఉన్నారు. ఎంత కాలమయినా ఆ చిత్ర నిర్మాణం ప్రారంభం కాలేదు గానీ మరో రెండు చిత్రాలు కూడా నిర్మించబోతున్నట్లు , వాటికి కూడా నూతన నటీనటూలు గాయనీ గాయకులూ సంభాషణ రచయిత్రీ రచయితలు, టెక్నీషియన్లు డైరక్టరీ డైరక్టర్లు కావాలని పేపర్లలో ప్రకటనలిచ్చింది."
ఇంతవరకూ చెప్పి సెన్సార్ ఇలా అంది.
"నిర్మాతా! రచయిత్రీదేవి చిత్ర నిర్మాతగా ఎందుకు మారింది? అన్ని వేలమందిని ఆ సినిమా కోసం ఎందుకు సెలక్ట్ చేసుకుంది! చిత్ర నిర్మాణం ప్రారంభించకుండానే ఆమె రెండు చిత్రాలు నిర్మించబోతున్నట్లు ఎలా ప్రకటనలిచ్చింది."
"ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసహ విను!' అన్నాడు నిర్మాత. సెన్సార్ ప్రశ్న పూర్తి కాకుండానే గుర్తింపబడడం ! అందుకే తన కధలు సినిమాలుగా రావాలని ఎన్నో విధాల ప్రయత్నించింది. అన్నీ విఫలమయ్యేసరికి తన వ్యూహం మార్చింది. తనే చిత్రం నిర్మించబోతున్నట్లు ప్రకటనలిచ్చింది. ఆ చిత్రంలో అవకాశం కోసం ఆంధ్రదేశం నలుమూలలనుంచీ అనేకమంది రావడం - చాలామందిని ఆమె సెలక్ట్ చేసుకోవడం ఇదంతా ఆమె తనకు ఓ గుర్తింపు ఏర్పరచుకోవడానికి పన్నిన ఉపాయం. అనుకున్నట్లుగానే జంట నగరాలలోని ఔత్సాహికులందరూ ఆమె చిత్రాలలో అవకాశం కోసం ఆమెనే తమ సభలకు అద్యక్షురాలిగా ఆహ్వానించడం, ఆమె మెప్పు సంపాదించడం కోసం సన్మానాలు చేయడం ప్రారంభమయింది. ఆమె పేరు ప్రతిష్టలూ, ఆమెను ప్రఖ్యాత సినీ రచయిత్రిగా ప్రకటిస్తోన్న పత్రికలూ ఇవన్నీ కలసి ఆమె రాసిన రెండు నవలలు సినిమాలుగా నిర్మించేందుకు ప్రోడ్యూసర్లను ప్రోత్సహించింది. కాని ఆమె ఎంతకాలానికీ చిత్రనిర్మాణం ప్రారంభించక పోయేసరికి ఆమె ఇంటర్ వ్యూలో సెలక్ట్ చేసుకున్న వారందరూ క్రమేపీ తమదారి తాము చూసుకోవడం మొదలుపెట్టి ఉంటారు. అందుకని సరికొత్త పబ్లిసిటీ కోసం మరో రెండు చిత్రాల నిర్మాణం గురించి పత్రికలలో ప్రకటించిందామె. ఆ సినిమాలు ఎప్పటికీ పూర్తవ్వవు అన్న విషయం ఆమె ఒక్కదానికే తెలుసు!"
ఈ విధంగా నిర్మాతకు మౌనభంగం కాగానే సెన్సార్ బాక్స్ తో సహా తన ఆఫీసు వేపు ఎగిరిపోయింది.
***