Previous Page Next Page 
మిస్ మేనక ఐ. పి. యస్. పేజి 28


     ఆ క్షణంలో ఆమె ఒక మామూలు పసిపిల్లలా ఆలోచిస్తూ పట్టలేని ఆవేశానికి లోనైపోయింది పర్యవసానం గురించి ఆమె పట్టించుకోలేదు. స్త్ర్రీ  సహజమైన నిస్సహాయతని విదిలించుకుంది ముందు. మరుక్షణంలో బలాన్ని కూడగట్టుకుని పైన బడుతున్న రణధీర్ గుండెపైన చాచితన్నింది.

 

    అంతే! సన్నని మూలుగు , వెనువెంటనే ముందుకు దూసుకొచ్చిన రణధీర్ అనుచరులు ఆమె  చేతుల్ని, కాళ్ళని బలంగా ఒడిసిపట్టుకున్నారు.

 

    రణధీర్ ఇప్పుడు గాయపడిన మృగంలా  మారిపోయాడు.

 

    మరో నిముషం గడిస్తే ఏమయ్యేదో!

 

    అంతలో  లోనికి దూసుకొచ్చారెవరో.

 

    ఆమె జరుగుతున్నది గ్రహించేలో గానే రణధీర్ ఓ మూల పడిపోయాడు.

 

    అతని అనుచరుల శరీరాలు గాలిలోకి  లేపి విసిరేసిన బొమ్మలా అటూ ఇటూ పడుతున్నాయి.హఠాత్తుగా రంగప్రవేశం చేసిన ప్రత్యర్థిని చూసి అవాక్కయిపోతూ కలియబడ్డారు.

 

    అబ్బురంగా చూస్తూంది మేనక.

 

    ఎలా తెలిసినా గాని, సమయానికి అక్కడుకు వచ్చిన విశ్వామిత్ర రోషాగ్నుల్ని వెదజల్లే శతఘ్నిలా కదులుతున్నాడు. కాలసర్పంలా  బుసకొడుతూ కంగారు పెడుతున్నాడు అందర్నీ.

 

    రెండు నిముషాల్లో పరుగు లంకించుకున్నారంతా.    

 

    హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది . ఓ ఉప్పెన తరువాత ఏర్పడిన ప్రశాంతతలాంటి చిత్రమైన స్తబ్దత.


    
     తురుకున్న   మేనక నేలపైకి జారిన రివాల్వర్ ని అందుకుంది. అప్పటికే శరీరాన్ని తడిపేసిన స్వేదంతో ఆమె మంచుబిందువుల భారానికి సడలిన గులాబీలా ఉంది.

 

    " థాంక్స్!" అంది తలవంచుకుని

 

    యథాలాపంగా చూశాడు " దేనికి!"

 

    "సమయానికి వచ్చి..... "

 

    " సినిమాల్లో లా నిన్ను కాపాడునందుకు.అవునా?"

 

    సూటిగా అతని కళ్ళల్లోకి చూడలేనట్టు తల మరెటో తిప్పుకుంది.

 

    " నేరస్థుల నుంచి చట్టానికి ప్రతినిదినని మురిసిపోయే ఓ పోలీసాఫీసర్ని  ఒక నేరస్థుడు రక్షించడం దురదృష్టంకదూ!"

 

     ఇలాంటి చర్చకాదు ఆమె ఆశించింది.


    
     "మూడు నెలల్లో నన్ను చట్టానికి పట్టించగలనని ప్రతిజ్ఞ చేసిన మిస్ మేనకా! నేను రావడం మరో మూడు నిముషాలు ఆలస్యమైతే  ఏం జరిగేది. ఆఫీసర్ గానే కాక, ఆడదానికా కూడా ఓడిపోయేదానివి కదూ?"

 

    అవహేళన భరించలేని ఉద్విగ్నతతో ఆమె పిడికిళ్ళు బిగుసుకున్నాయి.


    
     "అందుకే  మేనకా, నేర వ్యవస్థతో పోటీ పడక జాబ్ కు రిజైన్ చేయి."

 

    " నో!" రోషంతో రొప్పుతూందామె.

 

    " అంటే? ఊబిలో కూరుకుపోవడానికే ఇష్టపడుతున్నావన్నమాట!"

 

    "ఇక్కడ ఓ చిన్న అవకాశంతో నా  నిస్సహాయ స్థితిని తెలివిగా క్యాష్ చేసుకోవాలనుకుంటున్న మిష్టర్ మిత్రా, రణధీర్ ని విడిచి పెడతాననుకున్నావా?"

 

    "విడిచి పెట్టక ఏం చేస్తావు? నీమీద అఘాయిత్యం చేయబోయాడని  కంప్లేయింటిస్తావా?నీ ఇమేజ్ హఠాత్తుగా అధఃపాతాళానికి దిగజారిపోతుంది. నిన్ను ద్వేషించే నీ డిపార్ట్ మెంటులోని ఓ వర్గం  ఆ క్షణంనుంచి నిన్ను ఓ ఆడదానిగా చూడటం  ప్రారంభిస్తారు అంతే కాదు...."

 

       అవాక్కయి వింటూందామె.

 

     "రేపు కోర్టులో ...  నీమీద కక్షగట్టిన లాయర్లలో ఓ వ్యక్తి డిఫేన్స్  లాయర్ స్థానంలో నిలబడి, రణధీర్ చేయబోయిన అఘాయిత్యం ఏమిటి ఎంతదాకా కార్యక్రమాన్ని పూర్తిచేశాడు? ఎక్కడ నొక్కాడు? ఏస్థానంలో...."

 

     "స్టాపిట్!" అరిచింది.

 

     "ఇది అతిశయోక్తి కాదు మేనకా.చట్టానికి ప్రతినిధులయిన సోకాల్డు న్యాయవాదులు కోర్టులో బాహాటంగా ఆడదాని పరువునెలా తీయిగలరో, తీసే అవకాశముందో తెలిసి  చెబుతున్న సత్యాలివి. నువ్వు  నెగ్గలేవు కారణం రణధీర్ ని నేరస్థుడిగా నిరూపించే సాక్ష్యం లేదు కాబట్టి."

 

    " నువ్వు న్నావు."

 

    "కాని  నిన్న నన్నూ నేరస్థుడిగా నిలబెట్టావు."

 

    ఉలుక్కిపడింది- "అయితే మాత్రం?"

 

    "యూ సీ మిస్ మేనకా" ఆర్దోక్తిలా ఖండించాడు. " నేరవ్యవస్లలో నేనూ, రణధీర్ ప్రత్యర్ధులం కాబట్టి నీ కనుకూలంగా నేనిచ్చిన సాక్ష్యం  వగిపోతూంది."

 

     ఆమె చూస్తూంది విభ్రాంతిగా.

 

    "తెలివైన పోలీసాఫీసర్ లోతునవున్న వజ్రాలను శోధించాలి తప్ప నీటిమీద తేలే గడ్డిపరకల్ని వెంటాడి ప్రయోజనం లేదు." ఇక చెప్పాలనుకున్న దేమీ  లేనట్టు గిరుక్కున వెనక్కి తిరిగాడు.

 

    అసంకల్పితంగా అతని భుజంపై చేయివేసింది.    

 

     " నీ స్థానంలో వున్న ఓ ఆడపిల్లనయినా ఇలాగే రక్షిస్తానుతప్ప నీ మీదంటూ నాకు ప్రత్యేకమయిన ఆసక్తిలేదు మేనకా!"

 

    "అబద్ధం!" మొండిగా అంది. అదికాదు.అదే వాక్యాన్ని మిత్ర మరోసారి రిపీట్ చేస్తే ఆమె కళ్ళనుంచి  నీళ్ళు రాలేట్టున్నాయి. "నేను... నేను ఛాలెంజ్ చేశానని  నువ్విలా మాట్లాడుతున్నావు తప్ప నేనంటే నీకూ ఇష్టమే."

 

    నెమ్మదిగా పక్కకుతిరిగి  రెండడుగులు వెనక్కివేశాడు. " మేనకా!" ఇప్పుడు మిత్ర గొంతులో ఇందాకటి ప్రసన్నతలేదు. " ఒకనాడు నీ గెలుపు ని కోరుకున్నాను. నిజమే. కాని ఇప్పుడు నేను ఓటమికి సిద్ధంగా లేనివాడ్ని."

 

    " నా గెలుపు నీకూ గెలుపవుతుంది మిత్రా!"

 

    "మరి  నా ఓటమి నీకు ఓటమికాదా? కాదూ అని  నువ్వంటే అది ప్రేమెలా అవుతుంది?"

 

     రెండు దృక్కోణాల్లో చూస్తూ ఒకే సత్యం గురించి చెప్పుకుంటున్న రెండు  నిర్వచనాలవి.

 

    "నువ్వింతగా మారావని ఊహించలేకపోయాను" ఆమెకు కళ్ళనీళ్ళ పర్యంతమౌతూంది.
    


     "అదేమాట నేనూ అంటే?"

 

    "అహంతోకాదు, అప్పటి మిత్రగా చూడు."

 

    "సిద్ధాంతాల సంగతి క్షణం మరిచిపోదాం  మేనకా. ఓ యువకడు తనకు కాబోయే భార్యతో అరణ్యంలో నడుస్తున్నాడు. ఫియాన్సనిచూస్తుంటే మూడొచ్చిన ఆ వ్యక్తి  అమాంతం ఆమెను దగ్గరకు తీసుకుని మొత్తం కార్యక్రమం పూర్తిచేసాడట. అంతే.... అమ్మాయి ఏడవటం  మొదలుపెట్టింది.ఓదార్చబోయాడు. చేతుల్ని విసిరికొట్టింది. 'పెళ్లికి ముందే ఇలా ఓ అరణ్యంలో రెండుసార్లు పాడుపని చేసిన నిన్ను   నేనెలా క్షమించను'  అంది. కంగారుపడ్డాడు. 'అదేమిటి ఒకసారేగా' అంటూ నిజం చెప్పాడట. అంతే అమ్మాయి విరుచుకుపడింది. అంటే  ' ఇప్పుడిక రెండోసారి ఏం చేయవా' అంటూ ఇందులో జరిగిందానికి అమ్మాయి బాధపడుతుందా, లేదా అన్నది నువ్వు అనలిటెకల్ గా ఆలోచించి చెప్పగలవా?"

 Previous Page Next Page