Previous Page Next Page 
మిస్ మేనక ఐ. పి. యస్. పేజి 29


    ఇలాంటివి మాట్లాడగలడు గాని ఇంత పచ్చిగా అతను చెప్పడాన్ని భరించలేని  మేనక నిశ్శబ్దంగా జీపువైపు నడిచింది.


     వారించలేదు మిత్ర.

   
     ఆ తెల్లవారు జామున  నాలుగు గంటలకి రణధీర్ కి ఫోన్ చేశాడు మిత్ర.
    
    "....!" తిట్టుకున్నాడు రణదీర్.

   
     " రణధీర్...  మేనకకీ, నాకూ  మధ్య సర్ధలు రగిల్చావుతప్ప  ఇలా మేనకపైన పగతీర్చుకోలేవు. తీర్చుకోనివ్వను. అన్నట్టు ఇది ఇంతటితో ముగిసిపోదు."

 

    " ఎలా రాగలిగావక్కడికి?"

 

    " మంచి ప్రశ్న వేశావు" నవ్వాడు. మిత్ర. " నువ్వు నా మనిషిని కొని నన్ను దెబ్బతీశావు సరిగ్గా నేను అదే టెక్నిక్ వాడినీ అనుచరుడికీ ఖరీదు కట్టాను. విషయాన్ని తెలుసుకొని అక్కడికి వ్చచాను."


    ఆవలివేపు క్లిక్ మన్నచప్పుడు.    

 

    రిసీవర్ని క్రెడిల్ చేస్తూ పక్కకు తిరిగిన మిత్ర అవాక్కయ్యాడు.

 

     సమీపంలో నిలబడివున్న  వనిత రెప్పలార్చకుండా అతన్నే చూస్తూంది.

 

                         *    *    *    *


        
     సాయంకాలం నాలుగున్నర కావస్తూండగా మహిళామండలి భవనంలో కారు దిగింది మిస్ మేనక.

 

     ఆ కారు పంపింది మహిళామండలి మధ్యక్షురాలయిన రమాదేవి. ఆమె పెద్ద సివిల్ కాంట్రాక్టర్ భార్య.

 

     మహిళామండలి వార్షికోత్సవానికి ముఖ్య అతిధిగా ఆ రోజు ఆహ్వానితురాలయిన  మేనకని సాదరంగా రిసీవ్ చేసుకున్నారు గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్సంతా.

 

     వచ్చిన స్వల్పకాలంలోనే మేనక సంపాదించిన పేరు ప్రతిష్టలు స్త్రీజాతికి  గర్వ కారణమని సభ్యులంతా తీర్మానించుకున్నాక మేనకని పిలవాలని  అనుకున్నారంతా.

 

    మేనక ప్రతినమస్కారం చేస్తూ డయాస్ దగ్గరికి నడుస్తూంది.


    
     నీలం  ఆర్గండీ చీరలో ఉన్న మేనకని చూస్తూ  అది క్లబ్ సెక్రెట్రీ. "ఐ.పి.యస్. ఆఫీసరయ్యుండీ ఇంత సింపుల్ గా రావడం బాగోలేదు. దూరం నుంచి చూసి షి ఫాన్ శారీ  అనుకున్నాను."

 

    " మరేంలేదు  మేనకగారూ... పట్టణంలో ఉన్న పెద్ద బట్టలషాపు రెండూ ఈవిడ భర్తగారివే. అదీ బడాయి" మరో బాబ్ డ్ హెయిర్ స్త్ర్రీ వెంటనే అందుకుంది.

 

     " నీకేం తక్కువ?" క్లబ్ సెక్రెట్రీ వెంటనే జవాబిచ్చింది. "చింతపండు, మిరపకాయల హోల్ సేల్ వ్యాపారంలో మీవారుబాగానే సంపాదిస్తున్నరుగా?"

 

    "అయినా బట్టల్లో ఉన్నంత మార్జిన్ ఉండదుగా?"

 

    " డిసిప్లిన్ డిసిప్లిన్..." వడలిపోయిన పెదవులకి  లిప్ స్టిక్ ని దట్టించిన ఓ వృద్ధనారి గుర్తుచేసింది అక్కడ ఏ యువతీ పాటించని క్రమశిక్షణ గురించి. " అదేమిటో మేనకగారూ. నేను ఆదినుంచి అంతే, డిసిప్లిన్ అంటే పడిచస్తాను. ఉదాహరణకి మావారినే తీసుకోండి...."

 

    "ఆడాళ్ళమ్మగారి నస మొదలయింది. ఓ పట్టాన విడిచిపెట్టదు కదా!"మరో సభ్యురాలు విసుక్కుంది.

 

    ఇదంతా భరించడం కష్టంగా ఉన్నా, ఫంక్షను అయ్యేదాక ఉండాలనుకుంది మేనక.


 
    అది మహిళల ఉద్దరణకి ప్రత్యేకించిన మహిళా మండలిలా లేదు. వ్యక్తిగతమయిన బేషజాన్ని ప్రదర్శించుకోడానికి అనుకూలంగా మలుచుకున్న కేంద్రంలా అనిపించింది.

 

     సుమారు రెండువందలమంది దాకా సమావేశమయిన ఫంక్షనులో చాలా నిక్కచ్చిగా మాట్లాడింది మేనక.

 

    ఇరవైనాలుగు గంటలు గడుస్తున్నా ఇంకా ఆమె రాత్రి సంఘటనని జీర్ణించుకోలేకపోతూంది. అవమాన భారంతో మనసు మండిపోతూందికూడా.

 

     " ఇది తొలిసారి నేనిలాంటి ఫంక్షనుకు రావడం" మహిళాసభ్యుల్ని చూస్తూ తన ఉపన్యాసం ప్రారంభించింది మేనక. "నా జాతి మనుషులు మిమ్మల్ని కలవాలని, మీకంటూ ఏమన్నా ఆదర్సాలుంటే అని  తెలుసుకుని నా పరంగా అవసరమయితే సహకరించాలనీ అనుకున్నాను కాని. స్వల్ఫ వ్యవధిలో నేను గ్రహించింది ఒక్కటే.  మీరంతా ఇక్కడ సమావేశమయ్యేది ఏదో లక్ష్యంకోసం కాదు. ఫేషన్ పెరేడ్ కోసం. హఠాత్తుగా అక్కడ నిశ్శబద్దం ఆవరించింది."

 

    కొందరికేమిటి, ఇంచుమించు అందరికీ చురుక్కుమన్నా మాట్లాడుతున్నది ఓ పెద్ద పోలీసాఫీసరు కావడంతో చాలా కష్టంగా నిగ్రహించుకున్నారు.


    
     " కాదనను.ఆడదానికి అలంకరణ అవసరమే. వ్యక్తిగతమైన స్టేటస్ ని ప్రదర్శించుకోడానికి, నలుగురి మధ్య తన ఉనికిని స్పష్టంగా చెప్పుకోడానికి కట్టూ బొట్టూ నవ్వూ నడక విలక్షణంగా ఉండటం ముఖ్యమే. కాని వాటితో   నిబద్ధత కావాలి. ఓ స్త్ర్రీ గార్డెన్ వరేలీ చీర కట్టుకుంది కాబట్టి, మరో యువతి చాలా ఖరీదయిన విమల్ శారీ ఒంటికి చుట్టుకుంది. కాబట్టి, అలా ఖరీదయిన చీరలున్న వాళ్ళే ఆడవాళ్ళూ అంటే ఎంత బాధాకరమైన విషయం."

 

    క్షణం ఆగింది.

 

    "ఎందుకు మహిళా మండలిని ప్రారంభించినట్టూ? ఇవి చర్చించుకోవడానికా దానికోసం ఇల్లూ వదిలి రావాలా? మీరంతా ఏ సమస్యలు లేనివాళ్ళూ కావడం మీ అదృష్టంగా భావించండి. మీ  చుట్టూ ఉంటూ సమస్యల్లో నలిగిపోతున్న స్త్ర్రీ ల గురించి ఆలోచించండి.యూ థింక్ ఆఫ్ ద ఉమెన్ బీయింగ్ బాటర్డ్ హేరాన్డ్ కన్నవాళ్ళను  చేరలేక, కట్టుకున్న వాడి బాధపడలేక, పోలీసుల దగ్గరకి రాలేక చావులాంటి బ్రతుకుతో రాజీ పడుతున్న యువతులకి ఆసరాకండి. సంస్కరణాభిలాషతో కాకపోయినా , సాటి ఆడదానిగా  వాళ్ళ సమస్యల్లో మీరు జోక్యం చేసుకుని మీ ద్వారా అది ఆర్థికంగా చేయూత నివ్వండి . స్త్రీల సమస్యలు పరిష్కరించడానికి  ఈ మధ్య ప్రారంభమైన బాంబే బాహ్నాఘర్, ఢిల్లీ సహేలీ వుమెన్ రిసోర్స్ సెంటర్, బెంగుళూరు "విమోచన" సంస్థల్లా మీ  మహిళా  మండలిని ఓ పరమార్ధానికి ఉపయోగించండి ఆమెకి తెలీదు. చెప్పాల్సింది.

 

    చెప్పి బయటకు నడిచింది.

 

     "హల్లో!" పలకరించారెవరో.

 

     సమీపంలో నిలబడి ఉంది వనిత. " నా పేరు వనిత."

 

    "గుర్తుంది." మిత్ర పరిచయం చేసిన విషయం ఆమె మరిచిపోలేదు.

 

    "నేనూ ఈ సంస్థలో సభ్యురాలినే."

 

    మేనక నమ్మలేకపోయింది. భేపజంతో అందరిలా  తన ముందుకు రాని ఒక సంస్కారవంతురాలైన ఆమె మిగతా సభ్యురాళ్ళతో ఎలా ఇమడగలుగుతుందా అనుకుంది.

 

     " నేను మనుషుల్ని ప్రేమిస్తాను మేనకగారూ.... అందుకే బలహీనతల్ని పట్టించుకోను." మేనక మనోభావాల్ని చదివేసినట్టుగా అంది వనిత. "అలా అని మీరు ఇక్కడ ఆడవాళ్ళని  ద్వేషిస్తున్నారనడంలేదు నేను."

 Previous Page Next Page