Previous Page Next Page 
డా || వాసిరెడ్డి సీతాదేవి రచనలు - 4 పేజి 27

   
    అంతవరకూ ఆనందంగా ప్రకాశం మాటలను వింటూ కాఫీ తాగుతున్న చంద్రం చివర మాటలకు మిగిలివున్న కాఫీని ఒక్కసారి కషాయంలా మింగేశాడు.
    
    "మా మరదల్ని కూడా నిద్రలేపవోయ్! కాఫీ తాగుతుంది. ముఖ్యంగా మా చంద్రం భార్య ఎంత అందమైనదో చూడాలని నా మనస్సు తహతహలాడుతూంది."
    
    "ఊరుకోరా బాబూ! నీకు పుణ్యం వుంటుంది. ఆ అమ్మాయి వింటే ఏమయినా అనుకోగలదు."
    
    "అదేమిటి? అలా అంటున్నావు! అయితే ఆవిడ...." ప్రకాశం కంఠంలో సందేహం, ముఖంలో ఆశ్చర్యం కనిపించాయి.
    
    చంద్రం మనస్సు చివుక్కుమంది. అయితే ప్రకాశం కూడా తనను అనుమానిస్తున్నాడా? లేదు, ప్రకాశం అనుమానించడు! అనుమానించకూడదు. ప్రపంచంలో ఏ సన్నిహితుడూ అర్ధం చేసుకోలేని ఒక హృదయపు లోతుల్ని ఒక్క స్నేహితుడు మాత్రమే అర్ధం చేసుకోగలడు.
    
    "ఏమిటోయ్! అంత ఆలోచన? ఏ చిక్కుల్లోనైనా చిక్కుకున్న అబలకు ఆశ్రయం యిచ్చావా ఏమిటి?" నవ్వుతూ ప్రశ్నించాడు ప్రకాశం.
    
    కొంతవరకైనా ప్రకాశం తనను అర్ధం చేసుకున్నాడు; అంతే చాలునని సంతోషించాడు చంద్రం.
    
    తను గుంటూరు స్టేషన్ లో దిగినప్పటినుంచీ ప్రకాశం వచ్చి తలుపు కొట్టినంతవరకూ జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు చంద్రం.
    
    "అవును ఈ అనాధ శరణాలయాలలో జరిగే దారుణాలను గురించి చాలా చాలా విన్నాను. కొందరికి ఇదొక జీవనోపాధిగా ఉపయోగపడుతోంది. కొందరికి కీర్తిని సంపాదించి పెడుతోంది. దాతలనుంచి సేకరించే దానంతోపాటు ప్రభుత్వ గ్రాంటులుకూడా లభిస్తున్నాయి. ఇలాంటి శరణాలయాలకు అందులో చాలా భాగం అధికారుల జేబుల్లోకె పోతోంది. పైగా, కొందరు శరణాలయాధికారులు అందమైన ఆడపిల్లల ద్వారా పెద్ద పెద్ద ఆఫీసర్ల దగ్గరా, ధనవంతుల దగ్గిరా డబ్బూ, పరపతి సంపాదిస్తున్నారట! మేము ఈ విషయాలను గురించి కూడా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాము" అన్నాడు ప్రకాశం.
    
    "ఇంత దారుణమా?" తెల్లబోయి  ప్రశ్నించాడు చంద్రం.
    
    "నేను ఏదో టూకీగా చెప్పాను. దగ్గరకు పోయి చూస్తే అసలు విషయం తెలుస్తుంది. మరి నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు పారిపోయి వచ్చిందో అడిగావా?"    

    "అడగలేదు." సిగ్గుపడుతూనే జవాబు ఇచ్చాడు చంద్రం.
    
    "అడగలేదు, ఎందువల్ల? అలా అడిగితే ఆ అమ్మాయి బాధ్యత ఎక్కడ నీమీద పడుతుందోననే భయమేకదూ? చంద్రం! చదువూ, సంస్కారం కలిగి, రచయితగా సంఘంలో బాధ్యతగల వ్యక్తివి నీవే ఇలా ప్రవర్తిస్తే, ఇక మామూలు వారి విషయం ఏం చెప్పాలి? ఇలాంటి అనాధలు బాగుపడే రోజు ఏనాడైనా వస్తుందంటావా?"
    
    "నన్నేం చేయమంటావు ప్రకాశం? ఈ అమ్మాయివల్ల అన్నయ్య ఇంటిలో నాకు జరిగిన పరాభవం విన్నావుగా?"
    
    "అందుకని నీ బాధ్యతను నీవు విస్మరిస్తావా? వారి సంకుచిత భావాలకు ఒకనాడు వాళ్ళే సిగ్గుపడతారు."
    
    "అదెలా సాధ్యం ఇప్పుడు నేనేం చెప్పినా వాళ్ళు నమ్మరు," అన్నాడు చంద్రం.
    
    "అసలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? నిజం నిలకడమీద తెలుస్తుంది. తప్పు చెయ్యని నీవు బాధపడటం సిగ్గుపడటం అవసరం?" ఆవేశంగా అన్నాడు ప్రకాశం.
    
    "నా బాధంతా హేమ కూడా..."
    
    "ఆమె మాత్రం అంతకంటే ఎక్కువ ఏం ఆలోచిస్తుందంటావు? ఆ సభ్యతా, సంఘంలో అంతస్తూ, నాగరికతా, సంస్కృతీ ముసుగుల్లోనుంచి చూసేవారి చూపుకు వారు ఆశించినదానికీ, అభిరుచికీ భిన్నంగా వున్నదంతా హేయమయినదే."
    
    హేమను విమర్శించటం చంద్రం సహించలేకపోయాడు. "పోనియ్, ప్రకాశం! అదంతా నా దురదృష్టమే మానవుడు విధి చేతిలో కీలుబొమ్మ ఏమో! లేకపోతె చెయ్యని దొంగతనం నా మీద ఎందుకు పడాలి? ఇంత కాలానికి తిరిగివచ్చి, మళ్ళీ అందరూ నన్ను ఆప్యాయంగా స్వీకరిస్తారనీ నా అంత అదృష్టవంతుడు లేడనీ అనుకున్న మరుక్షణంలోనే నేను మళ్ళీ అందరికి దూరం కావలసిరావటం ఏమిటి? అందుకు నేను పెద్దగా విచారించటం లేదు.ళ్ అసలు నేను ఈ వూరు వచ్చింది నిన్నూ, నాన్నను చూసి నా కృతజ్ఞతలు చెప్పుకోవాలనే నా దురదృష్టం కొద్దీ నాన్నను చూసే యోగం లేకపోయింది. నిన్ను చూశాను. నేను వచ్చిన పని అయిపోయింది. రేపో మాపో నీ అనుమతి తీసుకొని వెళ్ళిపోతాను." చంద్రం ఉద్రేకంగా చెప్పుకుపోతున్నాడు.
    
    "ఒరేయ్! సెంటిమెంటల్ ఫూల్! ఇక ఆపు నీ మెట్ట వేదాంతం. కర్మ, విధి, అదృష్టం అనే పదాలజాడ్యం నీకూ పట్టుకుందీ? ఈ జాడ్యం మనవప్రయత్నానికె గొడ్డలిపెట్టు. ఈ జబ్బువల్ల నిలబడి స్థయిర్యంతో సాధించవలసిన కార్యాలను చూసి మానవుడు పలాయనం చిత్తగిస్తాడు. నువ్వూ అలాగే అందరినుంచీ దూరంగా పారిపోవటానికి మళ్ళీ ప్రయత్నిస్తున్నావు."
    
    "అదృష్టం - దురదృష్టం కాకపోతే నా జీవితంలో జరుగుతున్న సంఘటనలను ఏమంటావు?"
    
    "నేను దీన్నే జీవితం అంటాను. సంఘర్షణే జీవితం. జీవితంలో ఎన్నో సంఘటనలు తటస్థపడుతూంటాయి. అవి మనకు అనుకూలం అయినవిగా వుంటే అంతా మన ప్రయోజకత్వమే అనుకుంటాము. మనకూ మన సౌఖ్యానికీ అడ్డుతగిలే సంఘటనలయితే కర్మ విధి అంటూ వాటి నుంచి పారిపోవటానికి ప్రయత్నిస్తాము. కాని ఎదుర్కొని పరిష్కరించటానికి ప్రయత్నించము. జీవిత సమస్యల్ని ఎదుర్కోవటానికి సాహసం, ఆత్మబలం, బుద్దిబలంకూడా కావాలి. కేవలం కల్పనాశక్తిమాత్రం కలిగి అందమైన కలల్లో ఊహలతో విహరించే నీలాటివాళ్ళు బాహ్య సంఘర్షణనుంచి పారిపోయి అంతః సంఘర్షణ పడతారు. తమతో తామే పోరాడుతూ, తాము నిలబడ్డ భూమిని మర్చిపోయి ఆకాశంలో విహరిస్తున్నామనుకుంటారు. తన చుట్టూవున్న మానవులు తాము కల్పనాలోకంలో చిత్రించుకున్నవారికి భిన్నంగా కనిపించినప్పుడు ప్రపంచంనుంచి పలాయన మంత్రం పఠించటానికి ప్రయత్నిస్తారు."
    
    "విధి, కర్మ - అనేవి లేకపోతే ఆ పదాలు ఇంతకాలంగా మనవ హృదయాలను ఎలా శాసించగలుగు తున్నాయంటావు?"
    
    "దానికి కారణం కొందరు స్వార్ధపరులు. ఆ పదాలను జాగ్రత్తగా ఒక తరంనుంచి మరో తరంవారికి అందిస్తూ వస్తున్నారు. సంఘంలో తమ ఔన్నత్యాన్నీ, అధికారాన్నీ, అంతస్థునూ నిలబెట్టుకోవటానికి కొన్ని వర్గాలు ఈ పదాలను ఆయుధాలుగా ఉపయోగించుకుంటూ వస్తున్నాయి. పూర్వకాలంలో మత ప్రచారకులుగా, ఉన్నత వర్గంగా చలామణిలో వున్న బ్రాహ్మణవర్గం ఈ ఆపదలను ఉపయోగించి అధిక సంఖ్యాకులను అజ్ఞానులుగా చేసి తమ ఆధిక్యాన్ని నిలుపుకుంటూ వచ్చారు. ఆ తరవాత రాజులూ, మహారాజూలూ, జమీందారులూ, తమ అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు - ఈ పదాల ద్వారా ఈనాడు కష్టజీవుల కళ్ళు తెరవకుండా వుంచటానికి ఈ పదాలను సంఘంలో అంతస్థులు వున్నవారంతా వుపయోగిస్తున్నారు. పొద్దస్తమానం ఎముకలు పిండిచేసుకున్నా తన అర్ధ ఆకలికి కారణం తెలుసుకోవటానికి మానవున్ని ప్రయత్నించనివ్వకుండా చేస్తున్నాయి ఈ పదాలు."
    
    "ఏమిటి! కమ్యూనిస్టులా మాటలాడుతున్నావు?" నవ్వుతూ అన్నాడు చంద్రం - ప్రకాశం ధోరణిని మార్చాలనే ఉద్దేశంతో.
    
    "కమ్యూనిజమా? కమ్యూనిజం నా దృష్టిలో ఓ అందమైన ఆదర్శాలు కనే స్వప్నం మాత్రమే అది సాధ్యపడేది కాదు. కాకపోతే ఈ పేరుతో అధికారవర్గం మారుతుంది. అంతే! రష్యాలో ఇంతవరకూ కమ్యూనిజం స్తహపన జరగకపోవటానికి కారణం ఏమిటి? కమ్యూనిజమనేది ప్రకృతి నిజానికే విరుద్దం. కాకపోతే కమ్యూనిస్టులు ఉపయోగించే 'స్వాతంత్ర్యం, సమానత్వం' అనే నినాదాలు తఃమ హీనస్థితికి కారణాలు 'విధి, కర్మ' అనుకుంటూ అజ్ఞాన నిద్రలోవున్న కష్టజీవులకు మేలుకోలుపులా పనిచేస్తున్నాయి."
    
    "కమ్యూనిజం ప్రకృతి నిజానికి విరుద్దమని నేను అనుకోను."
    
    "స్వాతంత్ర్యం అంటే ఏమిటి? మానవుడు ఏనాడు సంఘజీవిగా మారాడో ఆనాడే కొంత స్వాతంత్ర్యాన్ని అరికట్టుకున్నాడన్నమాట! కొందరికి అసలు స్వతంత్రమే అక్కరలేదు. అది ఇచ్చినా దాంతో ఏం చెయ్యాలో వారికి తెలియదు. ఒకరిద్వారా శాసించబడటంలోనే వారికి ఆనందం లభిస్తుంది. ప్రేమపూర్వకమైన శాసనానికి మనవ హృదయం ఎప్పుడూ లొంగుతూనే వుంది. ఉదాహరణకు వాక్ స్వాతంత్ర్యాన్ని తీసుకుందాం. మనం అనుకున్నదంతా మాట్లాడగలుగుతున్నామా? ఒక వ్యక్తి తమాషా ముఖాకృతిని చూసి "నీ ముఖం బావురుకప్పలా వుంది." అని చెప్పాలనిపిస్తుంది. కాని చెప్పగలమా? స్వాతంత్ర్యం వుంది కదా అని రోడ్డుమీద ఇష్టం వచ్చినట్లు తిరగ్గలమా? ఇక మానవత్వం అంటావా ప్రకృతిలో ఏ రెండు ఆకులూ, ఏ రెండు పువ్వులూ, ఏ ఇద్దరు వ్యక్తులూ సమానంగా వుండరు. అందరి వ్యక్తుల్నీ మానసికంగా, శారీరకంగా సమానంగా పుట్టించగలిగిన యంత్రాన్ని దేన్నయినా కనిపెట్టినవాడు కమ్యూనిజం సంభవమేమో కాని, అంతవరకూ అది కేవలం కొందరి ఆదర్శాల స్వప్నం మాత్రమే."

 Previous Page Next Page