Previous Page Next Page 
ఊగవే ఉయ్యాల పేజి 27


    "ఎక్కడినుంచీ లేదు" అన్నది పొడిగా.

 

    "ఏమో! ఆ రాజా దగ్గరనుంచేమో అనుకున్నాను"

 

    "ఏం? రాజా దగ్గరనుంచయితే?"

 

    "అహ! అనుకున్నాను"

 

    "అవును, రాజా దగ్గరనుంచే. అయితే ఏమిటి?"

 

    అతని ముఖంలోని నవ్వు మాయమైపోయింది. స్కూటర్ రోడ్డుమీద ఆపి ఒక కాలు నేలమీద మోపి మాట్లాడుతున్నాడు. అంత రద్దీగా వున్న రోడ్డుమీద ఎవరూలేని ఏకాంత ప్రదేశంలో మాట్లాడినంత ఫ్రీగా మాట్లాడుతున్నాడు.

 

    "అసలు రాజా అంటే నీకంత యిది ఎందుకు?" అనడిగాడు.

 

    "నేనతనితో యిదిగా వుంటే నీకంత అది ఎందుకు?" అని మాధవి ఎదురు ప్రశ్న వేసింది.

 

    "అదా? అదంటే?"

 

    "ఇందాక నువ్వు యిది అంటే?"

 

    "ఆ యిది ఏమిటో నీ మనసుకు తెలుసు."

 

    "ఆ అదన్నా ఏమిటో నీ మనస్సుకూ తెలుసు."

 

    "మాటకు మాట చెబుతున్నావే?"

 

    "ఉన్నమాటే అంటున్నాను గానీ, నేనో ప్రశ్న అడుగుతాను నిజం చెప్పు? ఆనాడు కళ్యాణిమీద అఘాయిత్యం చేసింది ఎవరు? నువ్వే కదూ?" ఎప్పటినుంచో మనసులో వున్న అనుమానం- సూటిగా అడిగింది.

 

    సమాధానం కూడా అంత సూటిగానూ వచ్చింది.

 

    "అవును నేనే!"

 

    అతనంత వెంటనే ఒప్పుకుంటాడనుకోలేదు. ఆశ్చర్యంగా చూసింది.

 

    "అవును నేనే...కానీ ఎందుకు చేశాను? నీ కోసం. నీ ప్రేమ పొందటం కోసం. నీ మీద పిచ్చితో, రాజామీద నీకు అనురాగం ఏర్పడవచ్చునని గుర్తించి, అతని ఇమేజ్, అతనిమీద నీకు ఏర్పడబోయే ఇంప్రెషన్ ఛిన్నాభిన్నం చేయాలని, నిన్ను సాధించాలని......"

 

    "ఇక ఆపు" ఆవేశంగా అరిచింది మాధవి. అతనంటే ఆమెకు చెప్పలేనంత అసహ్యం వేసింది.

 

    "పాపం అనవసరంగా చాలా అవస్థలు పడ్డావు. రాజాను ఇంచుమించు మృత్యుముఖంవరకూ తీసుకెళ్లాం. కానీ నువ్వు వెయ్యి జన్మలెత్తినా నన్ను వశపరుచుకోలేవు. నీలాంటి నీచుడితో పరిచయం నా జీవితంలో ఒక పీడకల. ఇంకెప్పుడూ నా దగ్గరకు రావడానికి ప్రయత్నించకు. అంతేకాదు, మళ్లీ రాజా జోలికి వెళ్లావో! అతని వెనుక నేనున్నాను జాగ్రత్త!" అంటూ అక్కడినుంచి వేగంగా వెళ్ళిపోయింది.


                                    * * *


    "ఏమిటిక్కడ ఒంటరిగా వున్నావు?"

 

    భుజంమీద చెయ్యి పడితే ఉలిక్కిపడిందామె.

 

    ప్రతాప్!

 

    "ఏమీలేదు బావా!" అంది అతనికి కనిపించకుండా కళ్ళు తుడుచుకుంటూ.

 

    "సినిమాకు వెళదామన్నానుగా, ఇంకా భోజనం చెయ్యలేదేం?"

 

    "ఆకలిగా లేదు బావా"

 

    "అయితే సినిమా మానేద్దామా?"

 

    మాధవి ఒక్క ఆక్షణం ఆలోచించింది. "పద బావా వెళదాం"

 

    "బట్టలు మార్చుకోవా?"

 

    "అక్కర్లేదు"

 

    మరో పావుగంటలో ఇద్దరూ సినిమాహాల్లో వున్నారు. అది ఏ సినిమానో తెలీదు. అందులో ఎవరెవరు నటిస్తున్నారో, ఏమి కథ నడుస్తుందో తెలియదు.

 

    కళ్ళు మాత్రం ఎడతెగకుండా వర్షిస్తూనే వున్నాయి.

 

    తను ఎంత చిలిపిది! ఎందుకింత బేల అయిపోయింది?

 

    ఎంత అల్లరిది!

 

    ఎందుకింత గంభీర హృదయ అయిపోతోంది?

 

    ఎంత పసితనం తనది?

 

    ఎందుకంత పెద్దదానిలా అయిపోతోంది?

 

    భుజంమీద చేయి పడింది. ఉలిక్కిపడి మళ్లీ అంతలోనే సర్దుకుంది.

 

    "మధూ!"

 

    'ఊఁ'

 

    "సినిమా చూడట్లేదు కదూ?"

 

    "లేదు, చూస్తున్నాను"

 

    "కాదు, ఏదో పరధ్యానంగా వున్నావు."

 

    ఆమె ఏమీ జవాబు చెప్పలేదు.

 

    "ఇంటికి వెళ్ళిపోదామా?"

 

    "నీ ఇష్టం"

 

    "నా ఇష్టంకాదు, నీ ఇష్టం"

 

    ఆమెకేమి చెప్పాలో తోచలేదు.

 

    అయిదు నిముషాలాగి అతను "వెళ్లిపోదాం పద" అన్నాడు.

 

    ఆమె మౌనంగా లేచి నిలబడింది. ఇద్దరూ బయటకు వచ్చారు.

 

    కారులో కూర్చున్నాక "ఎటు పోదాం?" అనడిగాడు.

 

    "ఏం? ఇంటికే!"

 

    "నీకు మనసు బాగోలేదు. కొంతసేపు అలా తిరిగొస్తే ఏం?"

 

    ఆమె క్షణంసేపు ఆలోచించి-సరే అన్నట్లు తల ఊపింది.

 

    పది నిముషాలు గడిచాక కారు కృష్ణాబ్యారేజి సమీపించి, కొంతదూరం సాగి, అక్కడ ఆగింది. ఇద్దరూ దిగి ప్రక్కప్రక్కన నడవసాగారు.

 

    పన్నెండు కావస్తోంది. వాళ్ళిద్దరూ తప్ప ఇంచుమించు బ్యారేజంతా నిర్మానుష్యంగా వుంది. అప్పుడప్పుడూ ఓ కారో, లారీయో అటువైపుగా వెళుతోంది. బ్యారేజికి ఇరువైపులా వున్న లైట్లు క్రింద ప్రవహించే నీళ్ళమీద పడి అందంగా మెరుస్తున్నాయి.

 

    ఒకచోట ఆగారు. పేరపిట్ వాల్ కు ఆనుకుని నిలబడి క్రింద పెద్ద శబ్దంతో ప్రవహించే నీటిని చూస్తున్నారు.

 

    ఉన్నట్లుండి తలలో ఏదో మెదిలి మాధవి చప్పున వెనుతిరిగి దూరంగా వున్న కొండకేసి చూడటానికి ప్రయత్నించింది. ఇందాక తానూ, రాజా ఎక్కిన కొండ. ఇంచుమించు రాజా అంతిమ ఘడియల్ని చూసిన కొండ. కాని... చీకటి ముసుగులో దాక్కున్నట్లు ఏమీ కనబడలేదు.

 

    "ఏమిటి చూస్తున్నావు?"

 

    ఏదో పోగొట్టుకున్నట్లు తీవ్రమైన అసంతృప్తి. "ఏమీ లేదు" అని మళ్లీ అటువైపు తిరిగి మామూలుగా నిల్చున్నది.

 Previous Page Next Page