Previous Page Next Page 
వ్యూహం పేజి 27


    మరో పావుగంట గడిచింది.

 

    మళ్ళీ ప్యూనొచ్చాడు.

 

    వాడ్ని చూడగానే అక్కడ నుంచి కూడా వెళ్ళిపొమ్మంటాడేమో అనుకున్నాడు శక్తి.

 

    "మిమ్మల్ని పి.ఏ.గారు రమ్మంటున్నారు" అన్నాడు చిరాగ్గా.

 

    ఆ మాట వినడమే తరువాయి, ముందు కురికాడు. క్షణాల్లో పి.ఏ. కెదురుగా నిలబడ్డాడు.

 

    "మీరొకసారి బిజినెస్ మేనేజర్ని కలవండి."

 

    "బిజినెస్ మేనేజర్ తో నాకు పరిచయం లేదండీ" అమాయకంగా అన్నాడు శక్తి.

 

    "మరెవరితో పరిచయం?"

 

    "ఎవ్వరితోనూ పరిచయం లేదండి" తిక్కగా అన్నాడు శక్తి.

 

    "ఛైర్మన్ గారు మిమ్మల్ని బిజినెస్ మేనేజర్ని కలవమన్నారు."

 

    "ఆయనెక్కడుంటారండి?"

 

    "సిక్త్ ఫ్లోర్"

 

    ఇది తన మేనమామ ఆఫీసా? మాయాలోకమా? మిగొచ్చింది శక్తికి.

 

    వెనుదిరిగి మెట్లు దిగి...

 

    సిక్త్ ఫ్లోర్ కి అడుగుపెట్టాడు... బిజినెస్ మేనేజర్ దగ్గరకు వెళ్ళాడు.

 

    ఆయనకు దాదాపు అరవై ఏళ్ళుంటాయి.

 

    "కూర్చో...." అన్నాడాయన అసహనంగా. శక్తి కూర్చున్నాడు బెరుగ్గానే.

 

    "ఏం పేరు?"

 

    "శక్తిధర్..."

 

    "ఏ వూరు?"

 

    చెప్పాడు శక్తి.

 

    "ఏం చదువుకున్నావ్?"

 

    చెప్పలేకపోయాడు. ఏం చదువు చదివానని చెప్పుకోవాలి? చదువుకోనందుకు తొలిసారి సిగ్గుపడ్డాడు. తల్లి మాట విననందుకు బాధపడ్డాడు.

 

    తలెత్తి చూసి విరక్తిగా నవ్వి...

 

    "నా దగ్గర లక్షా తొంభై అప్లికేషన్ లున్నాయి. ఎమ్.బి.ఏ.లు, ఎమ్.ఎస్సీ, ఎమ్. కామ్... ఎమ్.ఏ.ల అప్లికేషన్లున్నాయి. వాళ్ళకే మేం జవాబులివ్వం. నీ సర్టిఫికెట్లు తెచ్చావా?" చిరాగ్గా ముఖంపెట్టి అడిగాడు బిజినెస్ మేనేజర్.

 

    "తెచ్చానండి."

 

    "ఇచ్చెయ్...." అనగానే తన చేతిలోని ఫైల్ ని ఆయన టేబుల్ మీద పెట్టేసి, చేతులు కట్టుకున్నాడు. ఆ ఫైల్ ని అందుకుని చిరాగ్గా తిరగేసి...

 

    "నీ సర్టిఫికెట్ వెరిఫై చెయ్యమని పెద్దాయన్నుంచి ఆర్డర్ వచ్చింది. అంటే... నీకు ఉద్యోగం ఇస్తారన్న మాట... అంతే రికమండేషన్ ల మీద ఉద్యోగాలివ్వొద్దని... ఎన్నిసార్లు చెప్పినా ఎందరితో చెప్పినా ఎవ్వడూ వినిపించుకోడు కదా... అంతే- ఇంతకీ... నిన్ను రికమండేషన్ చేసిన వాడెవడు బాబూ- ఆ రామబ్రహ్మంగాడేనా... నేననుకున్నాన్లే. మొత్తం వాడి వంశాన్నంతా తెచ్చి, అన్ని యూనిట్లోనూ పెట్టేస్తున్నాడు. అంతే" ఫైల్ మూసేసి పక్కన పడేసి-

 

    "ఇంకా ఎందుకు నిలబడ్డావు వెళ్ళిపో- వెళ్ళిపోయి- రేపో, ఎల్లుండో తగలడి, నీకిష్టమొచ్చిన సెక్షన్లో, ఇష్టమొచ్చిన ఉద్యోగంలో చేరిపో- అంతా ఆ రామబ్రహ్మంగాడి ఆటలైపోయాయి- ఇంతకీ నువ్వు ఆ బ్రహ్మంగాడి కేమవుతావ్"

 

    రామబ్రహ్మం అంటే ఎవరో చటుక్కున గుర్తుకొచ్చింది- బిజినెస్ మేనేజర్ మనస్తత్వం ఏమిటో కూడా అర్థమైంది.

 

    "కాదండి- రామబ్రహ్మం- ఎవరో నాకు తేలీదండి. ఛైర్మన్ గారు మా మేనమామ."

 

    ఆ మాటతో షాక్ తినేశాడు ముసలాయన- అర్థంగానట్టుగా చూసాడు.

 

    "మళ్ళెప్పుడు రమ్మంటారండి"

 

    "మళ్ళీనా... రేపురా... నువ్వు నిజంగా ఛైర్మన్ మేనల్లుడివో.... ఆ రామబ్రహ్మంగాడి అల్లుడివో తేలిపోతుంది కదా...!"

 

    ఈ రామబ్రహ్మంగాడి గోలేవిటిరా బాబూ... మనసులోనే అనుకుని, ఆయనకో నమస్కారం పడేసి ఆనందంగా మెట్లు దిగాడు.

 

    ఛైర్మన్ ఫైలు తీసుకోమన్నాడంటే, అమ్మ ఇచ్చిన ఉత్తరం చదివాడన్న మాట. తనని మేనల్లుడిగా గుర్తించాడన్న మాట... టైమ్ లేక తనతో మాట్లాడలేదు గానీ తీరికుంటే, తనని పిల్చి, బాతాఖానీ వెయ్యడు? రేపు, తనకి ఎపాయింట్ మెంట్ ఆర్డరిచ్చినప్పుడు మాట్లాడక ఛస్తాడా... ఇంతకీ తనకు ఏ ఉద్యోగం ఇస్తాడో... తనకి పెద్ద ఉద్యోగము ఇవ్వకపోతే... మావకే సిగ్గుచేటు... ప్రిస్టేజ్ క్వశ్చన్... మేనేజింగ్ డైరెక్టరో... ఎగ్జిక్యూటివ్ డైరెక్టరో ఇవ్వొచ్చు... ఇవ్వాలని ఉన్నా తనుండగా ఛైర్మన్ పోస్టెలా ఇస్తాడు? ఇవ్వలేడు పాపం.

 

    తనకి... గొప్ప ఉద్యోగం రావడం ఖాయం... కారు, బంగ్లా, ఏసీ... నౌకర్లు... చాకర్లు ప్రొవైడ్ చేయటం ఖాయం... లేదంటే తనకే షేమ్ కదా...? లేకపోతే....

 

    నీకే వుద్యోగంలో కావాలో నన్నే అడుగుతాడేమో... అలా అడిగితే ఏం చెయ్యాలి?

 

    అలా అడుగుతున్న టైమ్ లో కూతురు కూడా దగ్గరుంటుందేమో ఎమ్.బి.ఏ. అందాలరాశి... కోట్ల ఆస్తీ.... ఏకైక వారసురాలు... ఎలా ఉంటుందో? బాగుంటుందిలే... బావా అంటూ మీద పడుద్దెమో...? య్యా హూ... అలా మీద పడకుండా హుందాగా ఉండమని చెప్పాలి.

 

    నెమ్మదిగా బేబీని మంచి చేసుకుంటే... నా సామిరంగా... దానం మూలం మిదం జగత్ తో శక్తి... అదో జగత్తులో శక్తి.

 

    జైంట్ వీల్ ఎక్కి, ఆకాశంలోంచి కిందకు చూస్తున్నవాడిలా, అయోమయంగానూ, కించిత్తు అధికారంగాను అయిపోయింది శక్తిధర్ పరిస్థితి. ఆ ఆనందోద్వేగాన్ని తట్టుకోలేక.

 

    అదే సమయంలో భుజమ్మీద ఫట్ మంటే, తేరుకుని పక్కకు చూసాడు... అసహ్యంగా ముఖంపెట్టి.

 

    పక్కన భగవాన్.

 

    "సారీ బాసూ... నిన్న... నా లవ్వు ఎపాయింట్ మెంట్ ఫిక్స్ చేస్తే టర్నింగ్ పాయింట్ ఇంగ్లీషు సినిమా కెళ్ళిపోయాం... దాంతో నీ రూంకి రాలేకపోయాను... ఇంతకీ... ఏమైంది... ఆ సస్పెన్స్? ఛైర్మన్ గారిని కలిసావా? ఏ పుట్టలో ఏ పాముందో చెప్పు బాస్ త్వరగా..." ఆతృత కనబర్చాడు భగవాన్.

 

    "ఏ పుట్టలోనూ ఏ పామూ లేదు... అన్నీ నీలాంటి చీమలే ఉన్నాయి. ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేని వాడివి ఎలా, పైకొస్తావయ్యా? నిన్నెలా నేను పైకి తీసుకురాను"

 Previous Page Next Page