వినాయకుడు ఇంకేమీ మాట్లాడలేదు. ఆయనకు కోపం వచ్చిందని గ్రహించాడు డైరెక్టర్. అలా ప్రొడ్యూసర్లకు కోపం వస్తే ఒకోసారి ప్రోడక్షన్ కె ప్రమాదమని అనుభవం వల్ల తెలుసు గనుక మళ్ళీ వెంటనే రాజీ కొచ్చేశాడు.
"సరే - పోనీ ఓ పని చేయండి. మీకంతగా తెర మీద కనబడాలనుంటే టైటిల్స్ వేసే ముందు తెర మీద కొచ్చి ఈ సినిమా గురించి రెండు ముక్కలు మాట్లాడుదురుగాని! దీన్ని హిచ్ కాక్ టెక్నిక్ అంటారు - ఏమంటారు?"
"సరే" అన్నాడు వినాయకుడు ఇంకా అసంతృప్తిగానే.
ఇద్దరూ ప్రముఖ హీరో భీమారావ్ ని కలుసుకున్నారు.
"భక్తీ రస చిత్రమా!' అడిగాడాయన సిగిరెట్ యాష్ ని బ్రాందిలో కలుపుతూ.
'అవునండీ!" అన్నాడు డైరక్టరు.
"సరే. చేస్తాను! కానీ షూటింగు చికాగోలో పెట్టుకోవాలి!"అన్నాడు బ్రాందిలో రమ్ము కలుపుతూ.
"చికాగోలోనా! అక్కడెందుకు ?" అడిగాడు వినాయకుడు.
"మనసు చికాకుగా వున్నప్పుడల్లా చికాగోలో గడపడం నాకు అలవాటు ఆ టైమూ , ఖర్చు కలిసి రావాలంటే నా కాల్ షీట్స్ కోసం ఎదుర్చూస్తున్న ప్రొడ్యూసర్ సినిమా అక్కడ లాగించేయ్యడమే!' అన్నాడు హీరో బ్రాందీ రమ్ముల మిశ్రమంలో విస్కీ కలుపుతూ.
"కానీ మనది పౌరాణిక చిత్రం కదండీ! ఇండియాలో జరిగిందీ కధంతా!"
"నెక్ట్స్ " అన్నాడు హీరో మిశ్రమంలో జిన్ కలుపుతూ.
"ఏమిటి నెక్ట్స్" అడిగాడు వినాయకుడు.
"క్యూలో ఉన్న ఇంకో ప్రొడ్యూసర్ వచ్చి చికాగో కాల్ షీట్స్ కొనుక్కుంటాడు. మీరు వెళ్ళండి!"అన్నాడు హీరో మిశ్రమంలో బీర్ కలుపుతూ.
డైరక్టరు మాట్లాడకుండా పది లక్షలు అడ్వాన్స్ ఇచ్చేసి కాగితం మీద సంతకం తీసేసుకున్నాడు.
హీరో వినాయకుడిని చూసి నవ్వాడు.
"చూడండి గురూజీ! మీరంటే నాకు భక్తీ ఉంది. మీ ఫాదరన్నా, మదరన్నా మహాభక్తి నాకు! మా దేవుడి గదిలో మీ గ్రూప్ ఫోటో ఉంది. రోజూ దణ్ణం పెడతాను మీ ఫోటోకి! కానీ ఆ భక్తీ అంతా అమీరాగదిలో ఉన్నంత వరకే! ఇలా వ్యాపారంలో కొస్తే మాత్రం - అంతా వ్యాపారమే సారీ!" అన్నాడు మిశ్రమంలో వైన్ కలుపుతూ.
"కానీ మన సినిమాలో అమెరికా ఎలా చూపిస్తాం?" అడిగాడు వినాయకుడు డైరేక్తర్నీ.
"దాన్దేముంది గురూజీ! ఏ గంధర్వ కన్య డ్రీమ్ సాంగ్ లోనో లాగించేయవచ్చు కధంతా!" అన్నాడు హీరో మిశ్రమంలో మిరియాల కషాయం కలుపుతూ.
"అవునవును" అన్నాడు డైరెక్టర్.
"ఓ.కె. ఏ ప్లేస్ కి టికెట్స్ బుక్ చేయాలో, ఏ హోటల్లో రూమ్ బుక్ చేయాలో అన్నీ మా సెక్రటరీ చెప్తాడు రాసుకోండి. ఆ తరువాత నా ప్రియురాల కూడా ఖర్చులు మీరే భరించాలి. ప్రియురాలు అంటే నా భార్య అనుకునేరు. కన్ ఫ్యూజ్ అవకండి. ఆమె పేరు కూడా నా సెక్రటరీ చెప్తాడు. అంటూ మిశ్రమంలో నాటుసారా కలిపి గడగడ తాగేసి ధన్ మని సోఫా మీద పడిపోయాడు.
పడగానే డైరక్టర్, వినాయకుడూ బయటికొచ్చేశారు.
"ఇప్పుడెక్కడికి ?" అడిగాడు వినాయకుడు టాక్సీ ఎక్కాక.
"సెక్స్ డాన్స్ లు చేసే అమ్మాయిలదగ్గరికి!"
"అదేమిటి! వాళ్ళెందుకు?"
"మరి మన పిక్చర్లో రెండు సెమీ - న్యూడ్ డాన్స్ లుంటాయి కదా!"
వినాయకుడు రెండు చేతుల్తో తల పట్టుకున్నాడు.
"భక్తీ రస చిత్రంలో నగ్న నృత్యాలా? ఏమిటయ్యా నువ్ మాట్లాడేది?"
"అవును స్వామీ! భక్తీ రసం గానీ మరేం రసం గానీ - సెక్స్ రసం ;లేనిదే సినిమాలు సక్సెస్ కావు. ఇది ఫండమెంటల్ రూల్. తపస్సు చేస్తున్న రుషికి తపోభంగం చేయడానికి దేవేంద్రుడు ఈ నగ్న సుందరీమణులను పంపిస్తాడన్న మాట. సినిమా అన్నాక భక్తీ, రక్తి రెండూ ఉండాలండీ!"
ఇద్దరూ సెక్స్ డాన్సర్స్ ని కలుసుకున్నారు.
"భారీ చిత్రం , భక్తీ రస చిత్రం అంటే అయిదు లక్షలివ్వండి ...." అన్నారు వాళ్ళు.
"ఏమిటి? సెక్స్ డాన్స్ కి అయిదు లక్షలా?"
'అవునండీ! సోషల్ అయితే ఏదో ఒక్క సీన్ లోనే వంటి మీద బట్ట వుండదు. భక్తీ రసం , పౌరాణికం అయితే మొదట్నుంచీ చివరి వరకూ ఇంచుమించుగా వళ్ళంతా చూపిస్తూనే వుండాలి! అదీగాక మానభంగాలు కూడా ఉన్నాయంటున్నారు ఈ సినిమాలో."
"రెండే రెండు మానభంగాలు...... ' ఒప్పుకున్నాడు డైరక్టరు. వినాయకుడు అదిరిపడ్డాడు.
"ఏమిటిది ? దేవుడి సినిమాలో మనభంగాలా?"
"కధ మారుస్తున్నాంలెండు కొంచెం! ఋషి కన్య నీళ్ళు తేవడానికి కెళితే అక్కడ ఓ గందర్వుడు రేప్ చేస్తాడు. ఆ తరువాత ఓ దేవకన్యను రాక్షసరాజు రేప్ చేయడం ఒకటి. అవి లేకపోతె అసలు జనం మన సినిమా వేపు కూడా చూడరు."
వినాయకుడు "నాన్నా - నాన్నా ' అనుకోబోయి 'శివాశివా" అనుకున్నాడు. ఆ మర్నాడే మొత్తం యునిట్టంతా చికాగో వెళ్ళిపోయింది.
నాలుగురోజులు షూటింగ్ ఝూమ్మని జరిగి అయిదో రోజు నుంచీ జరగడం మానేసింది.
"ఏమిటి సంగతి?" అడిగాడు వినాయకుడు కోపంగా డైరక్టర్ ని.
"ఏముందీ? మద్రాసులో ప్రోహిబిషనుంది. తాగడానికి లేదు . ఇక్కడ తాగకుండా వుండటానికి వీల్లేదు. కనుక కెమెరామాన్, అసిస్టెంట్ తాగేసి అవుటయిపోయారు?"
ఆ మర్నాడు కెమెరామాన్ , అసిస్టెంటు వచ్చారు గానీ అసిస్టెంట్ డైరక్టరు , అసోషియేట్లూ. లైట్ బాయ్స్ తాగి పడిపోయారు చికాగో మధ్యలో.
ఆ మర్నాడు అందరూ వచ్చారు గానీ ప్రముఖ హీరో - అయన ప్రియురాలూ కలిసి ఓ నైట్ క్లబ్ లో పడిపోయారు. ఆ మర్నాడు విలన్ పేకాటలో పడిపోయాడు. ఆ మర్నాడు డైరెక్టర్ స్వీమ్మింగ్ పూల్లో పడిపోయాడు. ఇలా అందరూ పడుతుంటే చివరకు డబ్బూ అయిపోవచ్చింది. వినాయకుడికి ఒళ్ళు మండిపోయింది.
"దుర్మార్గులారా! ఈ ఫీల్డులో వాళ్ళందరూ ఎప్పుడూ ఈ తాగుడికీ, ప్రియురాళ్ళకి, పేకాటలకీ బానిసలయి మీ జీవితాల్నీ నాశనం చేసుకుందురు గాక!" అని శపించి పారేశాడు.
దాంతో అందరు వెళ్ళి వినాయకుడి కాళ్ళ మీద పడిపోయారు. రక్షించమని!
ఇంతవరకూ కధ చెప్పి సెన్సార్ ఇలా అడిగింది-
"నిర్మాతా! వినాయకుడు వాళ్ళ మీద జాలిపడి తన శాపాన్ని ఉపసంహరించుకుంటాడా? వినాయకుడి భక్తీ రస చిత్రం పూర్తవుతుందా/ ఆతరువాత వినాయకుడెం చేస్తాడు?"
"సమాధానాలు తెల్సులే. విను" మాటలకు అడ్డుపడుతూ అన్నాడు నిర్మాత.
"వునాయకుడికి మూడేసార్లు అతని మహిమ పని చేస్తుందని చెప్పింది పార్వతి మొదటి రెండు సార్లు అతని మహిమలు "కోట్లకే ఖర్చయిపోయాయ్. మిగిలిన మూడో దాన్ని సినీ ఫీల్డులో వున్న వాళ్ళందరికీ శాపం పెట్టి ఖర్చు చేసేసాడు గనుక ఇంక శాపం రద్దు చేసే మార్గమే లేదు. అందుకే ఆ రోజు నుంచీ ఈరోజు వరకూ ఫీల్డులో వున్నాళ్ళు ఆ శాపానికి గురి అవుతూనే వున్నారు. ఇక వినాయకుడు తలపెట్టిన భక్తీ రస చిత్రం ఎప్పటికీ పూర్తీ కానేకాదు. ఎందుకంటే వినాయకుడు సినీఫీల్డు గురించి ఏమాత్రం తెలీని కొత్త ప్రొడ్యూసర్ . కనుక ఎంత డబ్బు, మహిమలూ వున్నా ఆయనను అందరూ ఎంతో తేలిగ్గా ముంచేయగలరు. డబ్బు లేకపోయినా నిర్మాతగా అనుభవం వున్న వాడయితేనే సినిమా పూర్తి చేయగలడు. వినాయకుడికి ఇక మిగిలింది ఒక్కటే దారి. అదేమిటంటే వచ్చిన దారినే తిరిగి వెళ్ళి మబ్బుల మీద కూర్చుని వినాయకుడి అవస్తలు చూసి కడుపుబ్బ నవ్వుకుంటున్న నారదుడి వెంబడి పడడం."
ఈ విధంగా నిర్మాతకు మౌనభంగం కాగానే సెన్సార్ బాక్స్ తో సహా మళ్ళీ సెన్సార్ ఆఫీస్ వైపు ఎగిరిపోయింది.
***