నిర్మల అదోలా నవ్వింది. "బాధ..... బాధెందుకు డాడీ! బాబు మీద నా దృష్టి పడితే, వాడికేదన్నా జరిగితే? వదిన మాటలు నిజమేనేమో! కాకపోతే వూరికే ఎందుకంటారు అందరూ...... బాబుకి ఏం అవకూడదు. నేను ఎత్తుకోనులే డాడీ!" అంది.
శివశంకరంగారి గుండెలు ద్రవించాయి. చంటివాడితో ఆటలాడుతూ కాస్త దిగులు మర్చిపోయిన కూతురికి ఆ మాత్రం ఆనందం కూడా దక్కనీయకుండా చేసిన కోడలిని ఆ రోజు నుంచి ఆయన క్షమించలేకపోయారు. ఆ క్షణాన వెళ్ళి ఎడాపెడా వాయించి, ఇంట్లోంచి తరిమివెయ్యాలి వాళ్లని అన్నంత ఆవేశం వచ్చింది. కాని కన్నకొడుకు రక్తం పంచుకు పుట్టిన మనవడు ఓ పక్క, కూతురు ఓ పక్క - ఎవరిని కాదనుకునేటట్టు..... తెంచుకుందామన్నా రక్తపాశం తెంచుకోనిస్తుందా? ఆయన భారంగా అడుగులు వేస్తూ గదిలోంచి బయటికి నడిచారు, ఇంకేం అనాలో తెలియక.
తండ్రి వెళ్ళాక తలుపు లోపల్నించి గడియ పెట్టుకుని మంచం మీద వాలింది నిర్మల. ఏమిటో ఏడవాలన్నా కన్నీళ్ళు ఇంకిపోయి ఏడుపు రాలేదు. అదోరకం షాక్ తగిలినదానిలా నిర్లిప్తంగా అలా కళ్ళు మూసుకుపడుకుండిపోయింది నిర్మల.
గదిలోకి వెళ్ళాక మొదటిసారిగా రఘుకి భార్యమీద కోపం వచ్చింది. దివ్యా..... నీవు మాట్లాడే ముందు కాస్త వెనుక ముందు చూడవేం? నీరూని ఎందుకలా అన్నావు? అదెంత బాధపడుతుందో, అమ్మా నాన్నా ఏం అనుకుంటారోనన్నదయినా లేదా నీకు?" గట్టిగా అన్నాడు.
దివ్య కూడా అనేశాక నిర్మల మొహం చూసి, అత్తగారి మాటలకి మామగారు ఏం అనకుండా గంభీరంగా వుండిపోవడం చూసి మనసులో కాస్త బెదిరింది. ఆ మాట అనకపోవాల్సిందేమోననిపించింది. కాని ఎన్నడూ కోపగించని భర్త నిలేసేసరికి అహం అడ్డు వచ్చింది. "ఏం, నేనేం కానిమాట అన్నాను? మా అమ్మా వాళ్లంతా చెప్పారు. అలా వాళ్ళ కళ్ళుపడితే పిల్లాడు పాడయిపోతాడని, ఎత్తుకోనీయొద్దని చెప్పారు. మీ చెల్లెలు కంటే నాకు నా పిల్లాడు ఎక్కువ" అంది మొండిగా.
"దివ్యా..... అది బాబుని నీకంటే ఎక్కువగా చూసేది. కన్నతల్లిలా అసహ్యించుకోకుండా వాడి దొడ్లు, ఉచ్చాలు కూడా కడిగి ముద్దుగా చూసేది. దాన్ని అలా అనడానికి నోరెలా వచ్చింది? స్టుపిడ్ గా ఈ మాటలన్నీ నమ్ముతావా నీవూనూ. పాపం, దాని మొహం చూస్తే నాకెంత బాధ అన్పించిందో. వాడి మీదే ప్రాణాలు పెట్టుకున్నట్లుండేది. వాడి కోసం ఎన్ని బట్టలు, బొమ్మలు కొంది. నీవు హాయిగా నిద్రపోతుంటే, సినిమాలు, షికార్లు తిరుగుతుంటే ఆయాలా నీ కొడుకుని ఎత్తుకుని మోసింది. దాన్నిలా అనడం...." బాధగా అన్నాడు.
"ఆ..... ఆవిడగారు బట్టలు, బొమ్మలు కొనీయకపోతే మన బాబుకి మనం కొనుక్కోలేమా? ఇంట్లో ఉండి పనిపాటలేక బాబుని ఎత్తుకునేది కాలక్షేపానికి. ఆనికోసం పెద్ద పొగుడుతున్నారు ఆవిడని....." కోపంగా అంది.
"దివ్యా..... అమ్మా నాన్నల మొహం చూడు. అందులో అమ్మ ఒక్కరోజయినా నిన్ను ఏమన్నా అందా? నీరూ వచ్చి ఇన్నాళ్ళయినా దాన్ని ఏనాడూ సైడ్ చేయనిది ఈ రోజు ఇంత బాధపడి అలా అందంటే నీవు ఎంత మాటన్నావో. అది వాళ్ళకి ఎంత కష్టం కలిగించిందో ఊహించు. నీవు ఒకసారి నీరుకు క్షమాపణ చెప్పాలి. సారీ చెప్పేసిరా. వెళ్ళు" అన్నాడు.
భర్త అలా అనకపోతే క్షమాపణ కోరకపోయినా ఏదో మాటల్లో అన్నట్టు సారీ అనేదేమో నిర్మలతో కాని తన తప్పు ఎత్తి చూపి తలవంచమనే సరికి ఎక్కడలేని పౌరుషం వచ్చింది దివ్యకి. ఇంట్లో ఆడింది ఆటలా, గారాబంగా పెరిగిందేమో ఇంకొకరి ముందు తలవంచడం అలవాటులేని దివ్యకి అవమానం అన్పించింది.
"నేనేం చెప్పను..... నాకు నా పిల్లాడి కంటే మీ చెల్లెలు ఎక్కువ కాదు. నా బాబుని ముట్టుకోనీను, మీరేం చెప్పినా సరే. పైగా క్షమాపణ చెప్పాలట చచ్చినా చెప్పను!" అంది తెగేసినట్టు.
రఘు ముఖంలో రక్తం పొంగింది. విసురుగా ఏదో అనబోయేలోగా "నాయనా..... దాని గురించి మీరేం దెబ్బలాడుకోనక్కరలేదు. మీరంతా దాని ఖర్మానికి దాన్ని వదిలి హాయిగా ఉండండి. మీకు చేతులెత్తి నమస్కరిస్తాను. దాని జోలికి ఎవరూ వెళ్ళకండి. దాన్నలా వదిలేయండి" శారదాంబ ఏడుస్తూ అని వెళ్ళిపోయింది. రఘు తలదించుకున్నాడు.
ఆ రోజు ఇంట్లో ఎవరికీ తిళ్ళు తిప్పలు లేవు. నిర్మల మూసిన గదిలోంచి ఆ రోజల్లా బయటికి రాలేదు. బాబురాకతో ఆ ఇంట్లో వచ్చిన చైతన్యం ఆ సంఘటనతో హరించిపోయి, పూరపు స్థబ్దత అలుముకుంది ఇంట్లో.
మర్నాడు ఉదయం ఏం జరగనట్టే నిర్మల గదిలోంచి తయారయి వచ్చి భోంచేసి కాలేజీకి వెళ్ళిపోయింది. నిర్మల ఏం అనకపోయినా ఆమె అంతరంగ మథనం గుర్తించింది శివశంకరంగారు, శారదాంబే.
ఆ రోజు నుంచి నిర్మల బాబు వంక చూడ్డం కూడా మానుకుంది. ఆరునెలలుగా కన్నతల్లి కంటే ఎక్కువగా సాకి, ఆప్యాయత, అనుబంధం పెంచుకున్న కూతురు ఒక్కసారిగా ఆ బంధాన్ని తెంచుకోవడానికి ఎంత కష్టపడిందో, ఆమె మనసులో చెలరేగే తుఫానుని అర్థం చేసుకుని నిస్సహాయంగా నిట్టూర్చడం మినహా ఏం చెయ్యలేకపోయారు ఇద్దరూ. ఇంట్లో వాతావరణం చూసి రఘు నొచ్చుకుంటూ ఓ రోజు బాబుని తీసుకొచ్చి నిర్మలకి అందించబోయాడు. "నీరూ.... నీవెత్తుకోవడం మానేశావని బాబు బెంగ పెట్టుకున్నాడు. చూడు..... నీకోసం ఎలా దిక్కులు వెతుకుతున్నాడో!"
నిజంగానే తొమ్మిది నెలల బాబు నిర్మలని చూసి నవ్వుతూ చేతులందించాడు. "తీసుకో నీరూ..... దివ్య మాటలని పట్టించుకోకు. తనకీ ఇలాంటి సెంటిమెంట్స్ లేవు. వాళ్ళమ్మ ఏదో అన్నారని తనూ తెలివితక్కువగా అనేసింది. ప్లీజ్..... మామూలుగా వాణ్ని చూడు నీరూ!" అన్నాడు రఘు నొచ్చుకుంటూ.
నిర్మల అదోలా నవ్వింది. "వద్దన్నయ్యా! మళ్ళీ ఎందుకు అనవసరంగా నాకీ బంధం తగిలిస్తావు? ఈ వారం రోజులుగా వీడికి దూరంగా వుండటానికి నేనెంత కష్టపడుతున్నానో తెలుసా? ఇప్పుడిప్పుడే అలవాటు అవుతోంది. అనవసరంగా ఇంకొకరి పిల్లల మీద ఆశ పెట్టుకుంటే ఏనాటికన్నా ఆశాభంగం తప్పదు. వద్దు..... వాణ్ని నాకు చూపించకు. తీసుకెళ్ళిపో, వాడి ముద్దుమొహం చూస్తే నేను కంట్రోలు చేసుకోలేను. గాద్గదికంగా అంటుంటే కళ్ళనీళ్ళు చిమ్మాయి.