రఘు మనసు ద్రవించింది. "నీరూ.... వాణ్ని ఇదివరకులాగా నీ వెత్తుకోకపోతే నా మీద ఒట్టే, దివ్య తరపున నేను క్షమాపణ చెపుతున్నాను" అంటూ బాబుని నిర్మల చేతిలో బలవంతంగా పెట్టి మొహం తిప్పుకుని వెళ్ళిపోయాడు.
బాబుని ఎత్తుకుని నిస్సహాయంగా చూస్తూ కాసేపు నిలబడిపోయి, తరువాత గదిలోకి వెళ్ళి బాబుని గుండెలకి హత్తుకుని వారం రోజులుగా బిగపట్టిన బాధని కరువు తీరా ఏడ్చి కరిగించుకుంది.
దివ్య భర్తే తీసుకెళ్ళి ఆడపడుచు చేతిలో పిల్లాణ్ని పెట్టాక ఏం అనలేక వూరుకుంది. ఆమెకీ మనస్సులో ఏమూలో పశ్చాత్తాపం లాంటిది కలిగి 'చ..... ఈ కాలంలోనూ ఇలాంటి పిచ్చి నమ్మకాలేమిటి స్టుపిడ్ గా' అనుకుని సర్దుకుని వూరుకుంది.
మనుష్యుల మధ్య భేదాభిప్రాయాలు సర్దుకున్నా, తరువాత పదిహేను రోజులకే బాబుకి మూసిన కన్ను తెరవనంత జ్వరం వచ్చింది. ముందు ఒకటి రెండురోజులు ఏ అజీర్ణమో ఏదో అనుకున్నారంతా. మూడో రోజున నూట నాలుగు డిగ్రీల జ్వరం ముంచుకొచ్చేసరికి అంతా గాభరాపడిపోయారు. డాక్టరు వచ్చాడు. మందులిచ్చాడు. తగ్గుమొహం పట్టలేదు. మందులు మార్చారు. గుణం కనపడలేదు. ఐదు రోజులుగా కన్ను తెరవకుండా వళ్ళెరగకుండాపడుకున్న బాబుని చూస్తుంటే అందరూ బెంబేలు పడిపోయారు. నిర్మలయితే రాత్రింబవళ్ళు వాడి పక్కనే అంటిపెట్టుకుని వుండిపోయింది.
"ఏమిటో ఈ జ్వరం అంతుపట్టడం లేదు" అంటూ డాక్టర్ గాబరాపడ్డారు. ఇంకా ఏవేవో టెస్టులు చేయించాలని మర్నాడు స్పెషలిస్టులని రప్పించాలని అనుకుంటూండగానే, రాత్రికి రాత్రి బలవంతంగా పట్టిన కాసిన పాలు కక్కుకొని అలాగే బిగుసుకుపోయాడు బాబు. ఇక లేడన్న నిజం మరో ఐదు నిమిషాలకిగాని ఎవరికీ తట్టలేదు. నిర్మల వెర్రిదానిలా అలా గుడ్లప్పగించి చూస్తూ వుండిపోయింది. శివశంకరంగారు బాబు మంచం పక్కన కుర్చీలో కూలబడి మొహం కప్పుకున్నారు. శారదాంబ ముద్దుల మనవడి అచేతన శరీరాన్ని తీసుకుని గోలుగొలున ఏడ్చింది. రఘు ఇంకా నమ్మలేనట్టు నోటమాటరాక చూస్తుండిపోయాడు. దివ్య అయితే ఐదు నిమిషాలు అలా తెల్లపోయినట్లు వుండిపోయి, తరువాత ఏం తోచిందో శివంగిలా లేచి నిర్మల మీద విరుచుకు పడింది.
"చూశారా...... నే చెపితే నా మాట నమ్మలేదు. ఈవిడ కళ్ళుపడే, దిష్టి తగిలి బంతిలాంటి నా బాబు పోయాడు. మా అమ్మ చెప్పింది నిజమే అయింది. చూశారా..... మీరంతా నన్ను తిట్టారు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అంతా వచ్చి నా బాబుని తెచ్సివ్వండి. రాక్షసీ..... నీవే నా బాబుని చంపావు. నీవల్లే వాడు చచ్చిపోయాడు" అంటూ నిర్మల మీదకి వెళ్ళి జుట్టుపట్టుకుంది.
"నీవు శనివి, శనిగ్రహానివి. ఈ ఇంటికి పట్టిన దరిద్రానివి. మేం సుఖంగా ఉంటే చూడలేవు. అందుకే కళ్ళల్లో నిప్పులు పోసుకుని నా బాబుని పొట్టన పెట్టుకున్నావు. వాణ్ణి ముద్దు చేసినట్టే చేసి వాడినేదో చేసి చంపావు. మీరంతా కల్సి నా బాబుని దానికి అప్పగించి దానిచేత చంపించారు. నా బాబుని తెండి..... ఎలా తెస్తారో తెండి." దివ్య పూనకం వచ్చినదానిలా వూగిపోతూ అరిచింది.
నిర్మల బిక్క చచ్చిపోయింది. శివశంకరంగారు తేరుకుని లేచి దివ్యచేతిలోంచి నిర్మల జుట్టు వదిలించి "దివ్యా! నీకేం మతిపోయిందా? బాబుని అదెందుకు చంపుతుంది? బాబంటే దానికి ప్రాణం. ఏమిటా మతిలేని మాటలు. బాబు అంటే అందరికీ ప్రాణమే. మేం కావాలని వాణ్ణి చంపుతామా? రఘూ..... దివ్యని లోపలికి తీసుకెళ్ళు. జాగ్రత్త ఇవతలికి రానీయకు కాసేపు. దుఃఖంతో ఏం చేస్తున్నదీ ఆమెకి తెలియడం లేదు" అన్నారు.
"ఊహు - నే వెళ్ళను. దీన్ని చంపిగాని వెళ్ళను. నా బాబుని తెచ్చి ఇస్తే గాని వదలను" అంటూ మళ్ళీ నిర్మల మీదకి వెళ్ళింది దివ్య.
రఘు బలవంతంగా దివ్యని పట్టుకున్నాడు. శివశంకరంగారు పిచ్చిదానిలా చూస్తున్న నిర్మలని "నీరూ.... నీవు గదిలోకి వెళ్ళిపో" అని అన్నారు. నిర్మల కలలో మాదిరి లేచి నడిచింది.
"అయిందా..... మీ అందరి కళ్ళు ఇప్పుడు చల్లబడ్డాయా? అందరూ కల్సి ఆవిడకి నా బాబుని అప్పగించి చంపించారు. ఇప్పుడింక హాయిగా వుండండి. నేను చచ్చినా ఇంక మీ మొహాలు చూడను" అంటూ ఏడుస్తున్న దివ్యని లాక్కెళ్ళినట్టే గదిలోకి తీసుకెళ్ళాడు రఘు.
కబురు తెలిసి దివ్య పుట్టింటి వాళ్ళు వచ్చారు. "అమ్మా.... నీవు చెబితే వినలేదు....." అంటూ మరింత ఏడ్చింది దివ్య.
బాబు చచ్చిపోయిన దుఃఖానికి తోడు కూతురు గురయిన అపనిందకి, కోడలు, వియ్యాలవారి మాటలతో శివశంకరంగారు, శారదాంబ మరింత దుఃఖపడ్డారు. నిర్మలయితే రెండురోజుల వరకు గదిలోంచి రాలేదు. తల్లి కాఫీ తెచ్చినా, ఫలహారం తెచ్చినా ముట్టుకోలేదు.
"అమ్మా..... నేనే చంపానా బాబుని?" అనేది వెర్రిదానిలా చూస్తూ. "డాడీ..... బాబు నిజంగా అందుకే చచ్చిపోయాడా?" అంటూ తడిలేని కళ్ళతో, శూన్యంలోకి చూస్తున్నట్టు చూసేది.
కూతురి వాలకానికి వాళ్ళు మరింత గాభరాపడ్డారు. ఎంత చెప్పినా రెండు రోజులు పచ్చి మంచినీళ్ళు ముట్టుకోలేదు నిర్మల.
మూడోరోజు నిర్మల గదిలోంచి ఏదో పడ్డ చప్పుడై శివశంకరంగారు ఏదో అనుమానం తోచి పరుగెత్తి కిటికీలోంచి చూశారు. నిర్మల పైకి వేలాడుతున్న ఫేనుకి ఉరివేసుకుని అప్పుడే కింద స్టూలు తన్నింది. "నీరూ!" శివశంకరంగారు గావు కేకపెట్టారు. ఆ కేకకి అందరూ పరుగెత్తి వచ్చారు. కిటికీలోంచి చూసి రఘు చటుక్కున గుర్తువచ్చి అవతలివైపు తలుపు తండ్రి గదిలోంచి గడియ తీసి వుండడం గుర్తువచ్చి, పరిగెత్తి అటు తలుపు తీసి నిర్మల కాళ్ళు పైకెత్తి పట్టుకున్నాడు. అందరూ పరుగున గదిలో చొరపడ్డారు.
అప్పటికి ముడి ఇంకా గట్టిగా బిగవలేదు. బల్ల వేసుకుని తాడుకోసి నిర్మలని కిందకి తెచ్చారు. భయంతో, షాక్ తో తెలివి తప్పింది. ఇంకో రెండు నిమిషాలు ఆలస్యం అయితే ఏం జరిగేదో అందరూ గుర్తించారు. కూతురింత పని చేస్తుందని ఎదురుచూడని శివశంకరంగారికి ఇది పెద్ద షాక్. ఆ షాక్ తో ఆయన గుండెనొప్పి తెరలా వచ్చి కూలబడిపోయారు గుండెలు పట్టుకుని. నిర్మల మొహం మీద నీళ్ళు చల్లాక తెలివి వచ్చింది. డాక్టరు వచ్చి ఇంజక్షన్ ఇచ్చాక కాస్త నొప్పి సర్ధుకుంది శివశంకరంగారికి. మూడు రోజుల కిందట పసివాడి చావు, ఈ రోజు ఇలా. 'ఈ కొంపకి ఏదో శని పట్టుకుంది రా బాబూ!' అంటూ కొడుకుని పట్టుకుని ఏడ్చింది శారదాంబ. "నన్నెందుకు చావనీయలేదు మీరు? నేను ఎందుకు బతకాలి? చావనయినా చావనీయరా నన్ను?" అంటూ హిస్టీరియా వచ్చినదానిలా ఆ రోజంతా ఏడుస్తూనే వుంది నిర్మల.