అయితే మాత్రం తృప్తి, ఆనందం కూడా నిర్మలకి ఎంతోకాలం దక్కలేదు. దివ్య హఠాత్తుగా మారిపోయింది. నిర్మల బాబుని ఎత్తుకుంటే మొహం చిట్లించి "బాబుకి పాలు పట్టాలి" అంటూ లాక్కునేది, పౌడరు వేస్తుంటే..... "నేను వేస్తాను. ఇలా ఇవ్వు" అని గుంజుకున్నట్టు బాబుని తీసుకుపోయేది. ఏదన్నా చెయ్యబోతుంటే" అక్కరలేదు నీవు వెళ్ళు, నేను చేసుకోగలను" అనేది కతినంగా. బాబుని నిర్మల దగ్గరకి వెళ్లకుండా చెయ్యడానికి గదిలోకి తీసుకెళ్లిపోవడం మొదలుపెట్టింది. హఠాత్తుగా దివ్య ఎందుకిలా మారిపోయిందో తెలియక, అలవాటయిన బాబు దూరమవగానే తల్లడిల్లిపోయింది నిర్మల. ఆరునెలలుగా వాడి ఆలనాపాలనా చూస్తూ, కన్నతల్లిలా సాకిన నిర్మల చేతులు ఖాళీ అయిపోయి పిచ్చెక్కినట్లుండేది.
అత్తని గుర్తుపట్టి బోసినవ్వులు నవ్వే బాబుని చూసి ఆరాటంగా చేతులు చాపేది. దివ్య అది చూడనట్లు బాబుని తీసుకుని మేడ ఎక్కిపోతుంటే గిలగిలలాడిపోయేది నిర్మల. శారదాంబ కోడలి వ్యవహారం చూసి అర్థం కాక, ఆవిడా నోచ్చుకునేది నిర్మల మొహం చూసి. కాని కోడలిని ఏమంటే ఏం తంటానోనని, ఎలా అడగడం అని ఆవిడ ఆలోచించేది. బిక్కమొహం వేసుకుని తిరిగే కూతురిని చూసి ఆవిడ గుండె ద్రవించేది.
ఒకరోజు బాబు గదిలో ఏడుస్తున్నాడు. నిద్రపోతున్న దివ్య బాబుని కసిరి పిర్ర మీద ఒకటి అంటించింది. బాబు గుక్కపట్టాడు. పక్క గది నుంచి వింటున్న నిర్మల ఇంక ఆగలేక చప్పున గదిలోకి వచ్చి బాబుని ఎత్తుకుని గదిలోంచి బయటికి తీసుకొచ్చి ఆడించసాగింది. దివ్య నిద్రమత్తులో వుంది వూరుకుంది. నిద్రపోయి గంట తర్వాత సావకాశంగా దిగి వచ్చింది. బాబుని ఆడిస్తూ నవ్వుతున్న నిర్మలని చూసేసరికి తిక్కరేగినట్టు చటుక్కున వచ్చి "బాబుని నిన్నెవడు తీసుకు రమ్మన్నాడు?" అంది కసిరినట్టు.
"వాడు ఏడుస్తున్నాడు. నీవు నిద్రపోతున్నావని....." చిన్నపిల్లలా భయపడ్తూ సంజాయిషీ ఇచ్చింది నిర్మల.
"ఏడుస్తున్నా సరే నీవెప్పుడూ ఎత్తుకోకు వాడిని. నీకిదే చెప్పడం." అంది కఠినంగా.
శారదాంబ వింటూ వూరుకోలేకపోయింది. "దివ్యా! ఏమిటా మాటలు? అదేం చేసింది? ఏడుస్తున్నపిల్లాడిని ఎత్తుకోవడం తప్పా? అయినా ఇంట్లో ఉన్నాక, పిల్లాడు ఏడిస్తే ఎలా వూరుకుంటారు? ఇంతకీ అదెందుకు ఎత్తుకోకూడదు వాడిని? నెలరోజుల నుంచి చూస్తున్నాను, దాన్ని వాడి దగ్గరకు రానీయడం లేదు. ఆరునెలలు నీ కొడుకు ఉచ్చలు, పీతుళ్ళు ఎత్తి, నీవు సినిమాలు, షికార్లు తిరుగుతుంటే అత్తకాబట్టి వాడిని సాకింది. ఇన్నాళ్ళూ పనికి వచ్చిందా అది? ఇప్పుడు ఏం వచ్చింది నీకు?" తీక్షణంగానే అడిగింది శారదాంబ - ఈసారి మాత్రం నల్లబడిన కూతురి మొహం చూస్తుంటే ఆవిడ కడుపులో దేవినట్లయి మొదటిసారిగా నిర్మల తరపున మాట్లాడి కోడలిని నిలేసింది.
అత్తగారు ఎప్పుడూ అలా కోపంగా మాట్లాడటం చూడని దివ్య ఒక్క క్షణం బెదిరింది. అయినా అందరిముందు ఓడిపోవడం ఇష్టం లేనట్టు సూటిగా అత్తగారి వంక చూసింది.
"నలుగురు పిల్లల్ని కన్న మీకు తెలియదా నేను ఎందుకు ఎత్తుకోనీయడం లేదో?" సవాల్ చేసినట్లడిగింది.
శారదాంబ అర్థంకాక తెల్లపోయింది.
"ఎందుకు, ఏమయింది?"
"మా అమ్మ చెప్పింది..... గొడ్రాలి చేతిలో బిడ్డ దక్కదని. గొడ్రాలి కళ్ళుపడితే నల్లరాయన్నా పగిలిపోతుందిట. పిల్లా పాపా లేని వాళ్ళ దిష్టి బాబుకి తగులుతుందిట" అంది ఆరిందాలా.
శారదాంబ తెల్లబోయింది. నిర్మల మొహం గుర్తుపట్టలేనట్టు నల్లబడిపోయింది. అలా అచేతనంగా చేష్టలుడిగిన దానిలా చూస్తూ ఉండిపోయింది. శారదాంబ మాతృ హృదయం కూతురికి జరిగిన అవమానానికి తట్టుకోలేకపోయింది. "ఏమిటి..... నా కూతురు గొడ్రాలా? దాని కళ్ళు పడితే నీ బిడ్డ దక్కదని మీ అమ్మ చెప్పిందా? నా కూతురు గొడ్రాలు కాదే! దాని ఖర్మ కాలి దాని కాపురం ఇలా తగలబడి - పిల్లలకి మొహం వాచినట్లు నీ కొడుకుని అపురూపంగా, కన్నతల్లి కంటే ఎక్కువగా చూస్తుందే. నీలా అది కాపురం చేస్తుందే. నీలా అది కాపురం చేస్తుంటే నల్గుర్ని కనేది ఈపాటికి.
దాని అదృష్టం ఇలా తగలబడి, కడుపున పడిన బిడ్డని దక్కించుకోలేక, నీ పిల్లల కోసం దేవుళ్ళాడే స్థితికి వచ్చిందే! పిల్లల్ని కన్న మీ అమ్మ ఇంకో ఆడదాని గురించి ఇలా మాట్లాడుతుందా? ఆవిడ చెప్పినా నీవు చదువులు వెలగబెట్టిన దానివి, అన్నింట్లోనూ అంత మోడర్న్ గా వుంటావు. ఈ విషయంలో అమ్మ మాటలు నమ్మి ఆడబిడ్డని అయినా ఆలోచించకుండా ఇలా అంటావా? జాగ్రత్త! దాన్నొక్క మాట అంటే నేనూరుకోను. వెళ్ళు, నీ కొడుకుని ఎవరికంటా పడకుండా మేడమీద దాచుకో. వెళ్ళు. పో, తీసుకుపో! నిర్మలా..... పాపిష్టి దానా! నీకెంత ఖర్మ పట్టిందో చూశావా? ఈ దేశంలో మొగుణ్ణి వదిలినదాని గతింతేనే. నీ కర్మ. అందరి చేత మాటలు పడు. అందరి చేత ఉమ్మేయించుకో. ఈసారి వాణ్ని ముట్టుకో, నీ చేతులు విరగ్గొడ్తాను."
శారదాంబ పూనకం వచ్చినదానిలా ఎన్నడూ చూడని వీరావేశంలో అరిచి కింద కూలబడి ఏడవసాగింది. నిర్మల పిచ్చిదానిలా నిలువు గుడ్లు పెట్టుకుని చూస్తూ ఉండిపోయింది. మధ్యాహ్నం నిద్రపోతున్న శివశంకరంగారు. మేడ మీద గదిలోంచి రఘు ఈ కేకలకి, గలభాకి అక్కడికి వచ్చారు. నిర్మల లాగే ఆయనా చేష్టలుడిగి నిల్చుండిపోయారు. రఘు తప్పుచేసిన వాడిలా తలదించుకుని ఎవరికీ మొహం చూపలేనట్టు మళ్ళీ మేడమీదికి వెళ్ళిపోయాడు.
కాసేపటికి శివశంకరంగారు తేరుకుని, స్థాణువులా నిలబడ్డ నిర్మల భుజం చుట్టూ చేయి వేసి లాలింపుగా "పదమ్మా..... నీ గదిలోకి వెళ్ళి కాసేపు పడుకో..... పద....." అన్నారు ఏం జరగనట్టు. తండ్రి తీసుకెడ్తుంటే బుద్ధిమంతురాలిలా ఆయనతో నడిచింది.
'ఏడుస్తుంది. గుండెలు పగిలేలా దుఃఖిస్తుంది..... కూతురు' అని అనుకున్న ఆయనకి నిర్మల ఏ భావం వ్యక్తపరచకుండా అలా కామ్ గా ఉండిపోవడం ఆశ్చర్యం కలిగించింది. నిర్మల మనసు మొద్దుబారేటంతగట్టి దెబ్బ తగిలిందని ఆయన ఊహించలేకపోయారు. గదిలోకి వెళ్ళాక శివశంకరంగారు కూతురి భుజంచుట్టూ చెయ్యివేసి దగ్గరకు లాక్కుని..... మూర్ఖులనే మాటలు పట్టించుకోకూడదమ్మా! ఏం చెప్పినా వదిన పరాయింటిదే గదా, నీమీద అభిమానం ఎక్కడ నుంచి వస్తుంది? మాటలు వినీ విననట్లు వదిలేయాలి మనం. నీవు ఏం బాధపడనని ప్రామిస్ చెయ్యి నాకు...." అన్నాడు చెయ్యి చాచి.