Previous Page Next Page 
డా || వాసిరెడ్డి సీతాదేవి రచనలు - 4 పేజి 26


    ఎందుకు ఆలోచించాలి? ఆ పిల్ల ఎవరూ? తనెవరూ? తనను గురించి ఎవరు బాధపడుతున్నారు? అలా జాలిపడేగా ఇప్పుడు ఇంత అవాంతరం కొనితెచ్చుకున్నాడు.
    
    గౌరి వెక్కిళ్ళు అంతకంతకూ తారాస్థాయి నందుకొంటున్నాయి. చంద్రం మనస్సులో చెయ్యిపెట్టి కలచినట్లయింది. టవల్ తీసి గట్టిగా చెవులుమీదగా తలకు చుట్టుకున్నాడు-ఆలోచనలను కట్టిపెట్టి నిద్రపోవటానికి ప్రయత్నించాడు.
    
    తనను విధి ఎందుకు ఆడిస్తోంది? ఒక గంట క్రితం తనకన్నీ ఉన్నాయని, ప్రపంచంలో తన అంత అదృష్టవంతుడు లేడనీ అనుకున్నాడు. కాని అంతలోనే విధి తన అంత దురదృష్టవంతుడు లేడని రుజువు చేసింది. మానవుణ్ణి ఆడించే సూత్రాలు విధి చేతిలో వుంటాయా? మానవుడు కేవలం నిమిత్తమాత్రుడేనా? తనకు తెలిసి తను ఎలాటి పాపమూ చెయ్యలేదే? మరి తనకు ఈ శిక్ష ఏమిటి? తన అదృష్టంలో తన వాళ్ళనే వారిదగ్గర వుండే రాత లేదా?
    
    ఈ గౌరి ఎవరు? ఎక్కడ పుట్టిందో? ఎక్కడ పెరిగిందో? తన జీవితంలోకి అకస్మాత్తుగా సుడిగాలిలా ఎందుకు ప్రవేశించాలి?
    
    తన అన్నా - వదినా తనవంక ఎలా చూశారు? వదినె ముఖంలోని ఆ నవ్వును తన జన్మలో మరచిపోలేడు. అంతవరకూ ఆమె చూపిన ఆదరణ కేవలం నటన మాత్రమేనా? తన అన్న అవమానంతో, అభిమనంతో తల దించుకున్నాడు. తను అంత అవమానకరమైన పని ఏం చేశాడు? ప్రసాదరావు చూపుల్లో ఎంత తిరస్కారం?
    
    హేమ కూడా తనను అనుమానించింది. ఆ రోజు కూడా ఇలాగే తనను దొంగగా అనుమానించింది. ఆమె హృదయ సంస్కారం అంతేనా?
    
    వాళ్ళనెందుకు నిందించాలి? ఆ పరిస్థితులు అలా వచ్చాయి.
    
    తను ఎంత పొరపాటు పని చేశాడు? హేమను పరీక్షించటానికి తను మరో అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నట్లు చెప్పాడు. పైగా ఆ పిల్లను, గౌరిని దృష్టిలో పెట్టుకొని, వర్ణించాడు. అంతలోనే గౌరి అక్కడకు రావటం, హేమలో అనుమానం ప్రవేశించటంలో ఆశ్చర్యం లేదు. మళ్ళీ హేమకు తన ముఖం ఎలా చూపించగలడు? ఇక తనను వారెవరూ నమ్మలేరు. తన ఆశలన్నీ  అడియాశలయ్యాయి. ప్రకాశాన్ని చూసి తను శాశ్వతంగా ఆంద్రదేశం నుంచి వెళ్ళిపోతాడు! ఎక్కడకు?
    
    ఇక ముందుకు ఆలోచించలేకపోయాడు. లేచి టైం చూశాడు. మూడు అయింది. బయట ఎలాటి అలికిడీ లేదు. గౌరీ వెళ్ళిపోయి వుంటుందా? ఈ రాత్రిపూట ఎక్కడకు వెళ్ళి వుంటుంది?
    
    కుతూహలంకొద్దీ తలుపు తీసుకొని బయటకు వచ్చాడు. బయట గుడిసెముందు వసారాలో ఒకమూల ముడుచుకొని వుంది గౌరి. వెన్నెల ముఖంమీద పడుతూంది. కన్నీళ్ళతో తడిసిన ముంగురులు చెంపలకు అతుక్కుని వున్నాయి. పెదవులమీద చిరునవ్వు, మంచి నిద్రలో వున్న ఆమె ముఖం అమాయకత్వానికి ప్రతిబింబంలా కనిపిస్తూంది.
    
    నిద్రలో నవ్వుతూంది. "బహుశా ఈ ప్రపంచంలో ఆశించి అందని వస్తువేదో ఆమెకు స్వప్నంలో అందుతున్నట్లు కనిపిస్తోందేమో!" అనుకున్నాడు చంద్రం.
    
    అలా వంటరిగా చలిలో నిద్రపోతున్న గౌరిమీద చంద్రానికి జాలి వేసింది. తను చాలా కఠినంగా ప్రవర్తించానని బాధపడ్డాడు.
    
    వంగి - గౌరిని కుదుపుతూ లేపాడు. ఉలిక్కిపడి లేచి కూర్చుంది గౌరి ఎదట నిల్చున్న చంద్రాన్ని చూచింది భయంగా.
    
    "లే లోపలకివచ్చి పడుకో రేపు తెల్లవారగానే వెళ్ళిపో," అంటూ లోపలకు వెళ్ళాడు చంద్రం.
    
    గౌరి నిద్రమత్తులోనే పెట్టెతీసుకుని లోనికి వెళ్ళింది.
    
                                        13
    
    తలుపుమీద ఎవరో దబదబా బాదుతున్నారు. మంచి నిద్రలో ఉన్న చంద్రం ఉలిక్కిపడి లేచాడు. కిటికీనుంచి లోపల పడుతున్న కిరణాలు చంద్రం ముఖంమీద చురుగగా పడ్డాయి. దిగ్గున లేచి కూర్చున్నాడు. తలుపు ఎవరోకాని చాలా గట్టిగానే కొడుతున్నారు. ఎవరైతే మాత్రం అంత గట్టిగా, ఊపిరి తీసుకోనివ్వకుండా కొట్టాలా ఏం? విసుగ్గా వెళ్ళి తలుపు తెరిచాడు చంద్రం.
    
    అంత పొట్టీ - పొడుగూకాని ఓ యువకుడు ఎదురుగా కనిపించాడు. ఆ యువకుడు లావు కాకపోయినా చంద్రం అంత సన్నగా, నాజూకుగా మాత్రం లేడు. ఆ వచ్చిన యువకుడు చంద్రంవైపు ఆశ్చర్యంగా చూశాడు.
    
    "ఎవరు కావాలండీ? ప్రకాశం ఊళ్ళో లేడు" - నిద్రమత్తు ఇంకా వదలని చంద్రం బలవంతంగా వున్నా కనురెప్పల్ని పైకి ఎత్తటానికి ప్రయత్నిస్తూ అన్నాడు. ఆగంతకుడ్ని సరిగా చూడకుండానే వెనక్కు తిరిగాడు.
    
    "తమరెవరండీ?" అంటూ ఆ ఆగంతకుడు లోపలకు వచ్చి, చేతిసంచిని టేబిల్ మీద వుంచి, బెడ్డింగును ఒక కుర్చీమీద పెట్టాడు. అంత చనువుగా బెడ్డింగుతోసహా లోపలకు వచ్చిన వ్యక్తిని చూస్తున్న చంద్రానికి నిద్రమత్తు కాస్తా వదిలింది. ఆ వచ్చిన యువకుడు చంద్రం కళ్ళల్లోకి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. కళ్ళు చిన్నవే అయినా చూపు మాత్రం చాలా చురుగ్గా వుంది. దువ్వెనపళ్ళలా నితాఉర్గా వుండే జుట్టు చాలా దగ్గిరగా కత్తిరించి వుంది. ఆ జుట్టూ!..... ఆ నల్లని చురుకైన కనుపాపలు....
    
    అదే సమయంలో అగంతకుని దృష్టి సన్నగా, అందంగా వుండే చంద్రం మెడమీద పుట్టుమచ్చమీద పడింది. అ పుట్టుమచ్చ! తీర్చి దిద్దినట్లుండే ఆ కన్ను, ముక్కుతీరు!
    
    'ప్రకాశ్!' చంద్రం నోటినుంచి పూర్తిగా వెలువడిందో లేదో, 'ఒరేయ్ చంద్రం!' అంటూ ప్రకాశం చంద్రాన్ని చుట్టేశాడు. ఆ క్షణంలో ఆ స్నేహితులిద్దరూ అనుభవించైనా ఆ అపూర్వ అనుభూతి - స్నేహమే సాక్షాత్తు సాకార రూపంలో వచ్చినా వ్యక్తం చెయ్యలేదేమో! అలా ఎంతసేపు వుండిపోయారో వారికే తెలియదు. ప్రకాశం భుజంమీద పడిన కన్నీటి బొట్లు అతణ్ణి ఈ లోకంలోకి తెచ్చాయి.
    
    "అరే చంద్రం! ఏమిటిది? మొత్తంమీద రచయిత వనిపించావోయ్!" అంటూ ప్రకాశం, చంద్రం రెండు భుజాలమీద చేతులు వేసి పక్కనే వున్న కుర్చీమీద కూర్చోపెట్టాడు.
    
    చంద్రం కళ్ళు తుడుచుకుంటూ నిండుగా నవ్వాడు. తన చిన్న చిన్న చురుకైన కళ్ళను వీలయినంత పెద్దవి చేస్తూ చంద్రం ముఖంలోకి రెప్పవాల్చకుండా తమాషాగా చూడసాగాడు.
    
    "ఏమిటలా చూస్తున్నావ్?"
    
    "రచయితవు - కాబోలు చెప్పు చూద్దాం?"
    
    "బాగుంది, నాకేం తెలుసు? నువ్వేచెప్పు!"
    
    "ఓస్ ఇంతేనా? నీ అందాన్ని చూస్తున్నాను. మగవాడికి ఇంత అందం పనికిరాదు. ఎందుకో తెలుసా? నేనే ఆడపిల్లనైతే ఎంత బాగుండేది అని అనుకుంటున్నాను. అలాంటప్పుడు నిన్ను చూసిన ఆ ఆడపిల్లల గతేంకాను?"
    
    "ఎంత మాట్లాడుతున్నావురా ప్రకాశం! నీలో చాలా మార్పువుంది. ఉండు ముఖం కడుక్కొస్తాను- తరవతః మాట్లాడుకుందాం," అంటూ లేచి చంద్రం దొడ్లోకి వెళ్ళిపోయాడు.
    
    ప్రకాశం ఉత్సాహంగా లేచి పక్కగదిలోకి వెళ్ళబోయి వాకిట్లోనే ఆగిపోయాడు. కింద జంపఖానామీద ఒత్తిగిలి పడుకొని వున్న గౌరిని చూసి గిర్రున వెనక్కు తిరిగాడు. అయితే, చంద్రం భార్యనుకూడా వెంటబెట్టుకొని వచ్చాడన్నమాట! గట్టివాడే! నవ్వుకున్నాడు తనలో తానే ప్రకాశం.
    
    పళ్ళు  తోముకుంటూ కూర్చున్న చంద్రానికి బుర్రలో చిన్నప్పటి స్మృతులు గిర్రున తిరగసాగాయి. శరీరంలోని ప్రతీ జీవాణువూ కొత్త జీవం పోసుకున్నట్టనిపిస్తోంది. ఇద్దరి వ్యక్తులమధ్య వుండే పవిత్రమైన స్నేహబంధాన్ని మించి స్వార్ధరహితమైనది మరో సంబంధం ప్రపంచంలో లేదేమో!
    
    ఒకప్పుడు బక్కపలచగా, పీలగా, భయస్తుదిలా కనిపించే ప్రకాశమేనా ఈ ప్రకాశం! కత్తిలా దూసుకుపోయే స్వభావాన్ని ఎలా అలవరచుకున్నాడో!
    
    "ఒరేయ్ చంద్రం! ఎంతసేపురా పళ్ళు తోముతావు?" ప్రకాశం కేకతో ఆలోచనలనుంచి బయటపడ్డాడు చంద్రం. గబగబా ముఖం కడుక్కుని భుజంమీద వున్న తుండుతో ముఖం తుడుచుకుంటూ లోపలకు వస్తున్న చంద్రానికి ఎదురుగా చేతిలో కాఫీ గ్లాసుతో, పెదవులమీద చిరునవ్వుతో ప్రత్యక్షం అయ్యాడు ప్రకాశం.
    
    "కాఫీ!" ఆశ్చర్యంగా ఏదో అడగబోతున్న చంద్రం మాటలకు మధ్యలోనే అడ్డువచ్చి "అవును, కాఫీ! నేనే చేశాను. తాగిచూడు మా మరదలు తయారుచేసిన కాఫీకన్నా గూడా బాగుంటుందో లేదో!" అంటూన్న ప్రకాశం చేతినుంచి చంద్రం కాఫీగ్లాసు అందుకున్నాడు.
    
    "అవును కాని, మా మరదల్ని కూడా వెంటబెట్టుకొచ్చినవాడివి మాటమాత్రం అన్నావా? ఇందాక ఏమేమో వాగేశాను," అన్నాడు ప్రకాశం, స్వరం తగ్గించి చంద్రాన్ని ఉడికించే ధోరణిలో.

 Previous Page Next Page