Previous Page Next Page 
వ్యూహం పేజి 26


    "అయితే రేపు మళ్ళీ మీరొస్తారన్నమాట. ఈ లోపల ఛైర్మన్ గారి అడ్రస్ పట్టుకుంటాను. ఎక్కడుంటున్నారు మీరు..."

 

    "ప్రకాష్ కేఫ్.. చామరాజ్ పేట... నియర్ మింటోస్ ఐ హాస్పిటల్" చెప్పటానికి ఒకింత సిగ్గుపడ్డాడు శక్తి.

 

    "మీరిప్పుడు రూంకే వెళతారు గదా- నేను కూడా అకేలే ఆవారాగాడ్నే లెండి. మీ కభ్యంతరం లేకపోతే మీ రూం కొస్తాను. సాయంత్రం ఉంటారు కదా... ఏదో కాసేపు మే మాటల్లో స్టిల్ బర్గ్... విఠలాచార్య సినిమాలు చూసినట్లుంటుందని, మరోలా అనుకోకండి. మీతో మాట్లాడిన దగ్గర్నుంచి నా కాళ్ళు నేలమీద ఆనటం లేదు. బిర్ల నాకు తాతయినట్లు... టాటా నీకు వేలు విడిచిన మేనమామయినట్లు, రామోజీరావు బాబాయి అయినట్లు ఫీలయి పోతున్నాను. కలగంటానికి కానీ ఖర్చులేదుగా అందుకని"

 

    "ఊరు కొత్తగదా.... ఎక్కడికెళతాను- రండి మీకోసం వెయిట్ చేస్తుంటాను..." అన్నాడు శక్తి లోపల పళ్ళు నూరుతూ.

 

    భగవాన్ లిఫ్ట్ వేపు వెళ్ళిపోయాడు.

 

    శక్తి తలదించుకుని విక్రమార్కుడిలా వి.వి.ఎన్. ఎస్టేట్స్ లోంచి బయటికొచ్చేసాడు. కలలెంత కమ్మగా ఉంటాయో- వాస్తవాలెంత కఠినాముగా ఉంటాయో తొలిసారి అనుభవంలో కొచ్చింది శక్తికి. అందుకే చిరాకు పడిపోయాడు. కాసేపు తల్లిని తిట్టుకున్నాడు. ఆ పైన కాళ్ళీడ్చుకుంటూ ప్రకాష్ కేఫ్ కేసి బయలుదేరాడు.

 

                                *    *    *    *

 

    స్పెషల్ పి.ఎ. రాంబ్రహ్మం, శక్తిని చూడగానే కళ్ళెగరేసి "మీ లెటర్ని నిన్ననే ఛైర్మన్ గారికి పంపించాను. సెవెన్త్ ఫ్లోర్ లో కెళ్ళండి. ఛైర్మన్, ఆపరేషన్స్ పి.ఎ. ఉంటారు కలవండి" పి.ఏ.లో పదిరకాలా? విసుక్కుంటూ మెట్లెక్కాడు శక్తి.

 

    సెవెన్త్ ఫ్లోర్ లో...

 

    విశాలమైన రెండుగదులు... మిగతా అంతా హాలు-

 

    అద్భుతమైన ఇంటీరియర్ డెకరేషన్ ఉన్న ఆ హాల్ ని చూడగానే నోరెళ్ళబెట్టాడు శక్తి. ఆ హాల్ ని అమ్మితే నందిగామని కొనేయచ్చేమో... ఎంత ఆదాయముంటే అంత అద్భుతంగా మెయిన్ టెయిన్ చేస్తారు? సినిమాల్లో సెట్టింగులా వుందది.

 

    బిక్కు బిక్కుమంటూ నిల్చొని చుట్టూ చూసి వరసగ వున్న గ్లాస్ మ్యాబిక్స్ లో మధ్యలో ఉన్న ఓ క్యూబిక్ వేపు నడిచాడు.

 

    దానిమీద పి.ఎ.టు ఛైర్మన్ (ఆపరేషన్స్) అని వుంది. ఎదురుగా నిలబడిన ఆకారాన్ని చూస్తూ అప్పుడే మోగిన ఇంటర్ కమ్ ని ఎత్తి పట్టుకొని ఏదో మాట్లాడి...

 

    "అలాగేలెండి... వచ్చాడు... ఎదురుగా నిలబడ్డాడు... చూద్దాం సీయూ" అని ఫోన్ కట్ చేసి- ఎగాదిగా శక్తివేపు చూసాడు పి.ఏ.

 

    కూర్చోమంటాడనుకున్నాడు...

 

    కూర్చోమనలేదు.

 

    "ఛైర్మన్ గారికి ఏదో పర్సనల్ లెటర్ ఇచ్చారట. మీరేనా..." సూటిగా చూస్తున్న ఆయన కళ్ళవేపు ఎందుకో చూడలేకపోయాడు శక్తి.

 

    "అవునండీ..."

 

    "ఎవరు పంపించారు...?"

 

    దానికేం జవాబు చెప్పాలో అర్థం కాలేదు శక్తికి.

 

    "మా అమ్మ..." కంగారుగా అన్నాడు.

 

    ఆ మాటకు ఆయన చిన్న మందస్మితం చేసాడు.

 

    "తిరుపతిలో మావాడొకడు బోడిగుండు చేసుకునుంటాడు... వాడ్ని తీసుకురా... అని వెనకటికి నీలాంటివాడే ఒకడన్నాట్ట... అలా ఉందయ్యా నీ వ్యవహారం... మీ మదరంటే... ఆవిడేం... సెంట్రల్ మినిస్టరా... స్టేట్ మినిస్టరా...." కసురుకున్నారు పి.ఏ.

 

    శక్తికి గొంతులో తడారిపోయింది. కాళ్ళలో వణుకొచ్చేసింది.

 

    జవాబు కోసం వెతుకుతున్నాడు. మరో కల భళ్ళున బ్రద్దలయి పోయింది.

 

    "మా అమ్మంటే.... ఛైర్మన్ గారి చెల్లెలు... ఛైర్మన్ గారు మా మేనమామండి" నీళ్ళు నముల్తూ చెప్పాడు శక్తి... నమ్మడని తెలిసినా.

 

    "ఛైర్మన్... ఛైర్మన్... మీ మేనమామ" పి.ఏ. నమ్మలేదు. ఏ ఊరు మంది అన్నట్టుగా చూసాడు.

 

    "లెటర్ ఇందాకే పంపించాను... అక్కడ వెయిట్ చెయ్యి..." అని ఏదో ఫైల్ తీసాడు- ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నట్టుగా.

 

    అక్కడ నుంచి బయటకొచ్చి ఎక్కడ కూర్చోవాలో తెలీక అటూ ఇటూ చూసాడు.

 

    ఉన్న రెండు సోఫాల్లోనూ సూట్లూ, బూట్లతో చాలామంది కూర్చున్నారు.

 

    ఆ గదిలోంచి బయటికొచ్చి....

 

    పూలకుండీల పక్కనున్న గోడకానుకుని నించున్నాడు. ఖరీదైన మనుషులు వెళుతున్నారు... వస్తున్నారు... రకరకాల మనుషులు.... పొలిటీషియన్స్... బిజినెస్ మెన్... ఎవరో... ఎవరో... ఫారినర్స్. చూస్తుండగానే గడిచిపోయి రెండుగంటలయింది. తనకు తెలీని ప్రపంచం తనూహించని ప్రపంచం... వేగాన్ని ప్రధాన సూత్రంగా మలచుకున్న సరికొత్త అద్భుత ప్రపంచం... కళ్ళు బైర్లు కమ్మినట్లయింది శక్తికి,

 

    కూర్చోవడానికెక్కడా ప్లేస్ లేదు. నించోవడానికి ఓపిక లేదు. టూ, ఇటూ తిరుగుతున్న ప్యూన్ ని పిలిచి అడుగుదామనుకుని, తన స్టేటస్ ఎక్కడ దెబ్బ తింటుందోనని ఊరుకున్నాడు. అవునూ... ఇంతకీ తనకున్న స్టేటస్ ఏమిటి? చదువా? పేరు ప్రతిష్ఠలా? పలుకుబడా? పాపులారిటీనా? ఏమీ లేవు. తనకున్న ఒకే ఒక ఆధారం బంధుత్వం. అది స్టేటస్ అవుతుందా? తొలిసారి శక్తిలో ఆలోచన, పరిశీలన మొదలయ్యింది.

 

    అరగంట తర్వాత ఒక ఫ్యూన్ తనవేపే రావడం చూసి ఆశగా అతనివేపే చూసి పలకరింపుగా నవ్వాడు.

 

    వాడు శక్తి కెదురుగా వచ్చి నిల్చుని సీరియస్ గా చూస్తూ-

 

    "డోర్ కి అడ్డంగా నిలబడకండి. కొంచెం అటైనా, ఇటైనా నిలబడండి" అని ఓ ఉచిత సలహా పారేసి వెళ్ళిపోయాడు.

 

    హమ్మనీ... అసలు నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా... చూడు... నేనుద్యోగంలో చేరగానే నిన్ను, ఆ రిసెప్షనిస్ట్ ను ఇద్దర్నీ ముందు ఇంటికి పంపించేస్తాను చూడు... పాపం ఆ భగవాన్ గాడికి వీలయితే ప్రమోషన్ ఇవ్వాలి... కానీ వాడు... నిన్న వాడు రూమ్ కి వస్తానని చెప్పి రాలేదు... చెప్దాం... చూద్దాం... అని మనస్సులోనే అనుకుని....

 

    డోర్ కి ఎడం ప్రక్కన గ్రిల్స్ దగ్గర నిలబడ్డాడు.

 Previous Page Next Page