Previous Page Next Page 
జాలిలేని జాబిలి పేజి 27


    ఆమె చప్పున స్నేహితురాల్ని ముందుకు లాగుతూ "ఈ రాణీగారిపేరు ఇందిర. మీ పుస్తకాలంటే పడి చస్తుందిట. కలుసుకోవాలని ఊరికినే తహతహ లాడ్తోంది. ఊఁ మాట్లాడవే" అంది దబాయిస్తూ.

    ఇందిరకు వల్లమాలిన కోపం, సిగ్గూ రెండూ కలిగాయి. ఉడుకుమోత్తనం కూడా వచ్చింది. కాని యేం చేస్తుంది? వణుకుతూన్న చేతుల్తో నమస్కారం పెట్టి, రెప్పలు క్రిందకువాల్చి నేలచూపులు చూస్తూ ఊరుకుంది.

    మధుబాబుకూడా చేతులు జోడించి నమస్కారం చేశాడు.

    "ఇంకేం మాటల్లేవా? అయిపోయిందన్నమాట. సరే పద. వస్తామండీ, ఇది వట్టి మూగది. మాటలురావు" అంటూ  ఇందరి చెయ్యి పుచ్చుకుని కదిలింది ఆ అమ్మాయి.

    "మరి  మీపేరు  చెప్పారు కాదేం?" అన్నాడు మధుబాబు స్నేహితుడు కొంటెగా.

    "నా పేరా? మనిషిలాగే కొంచెం ఘాటుగా వుంటుంది....." అంటూ ఆమె వెళ్ళిపోయింది.

   
                                                                  *    *    *

    ఆదివారం మధ్యాహ్నం పనిమనిషి తెచ్చిన క్యారియర్ తో భోజనం  చేసి క్లాసుపుర్తకం చదువుకుంటూ కూర్చున్నాడు మధుబాబు. ఇట్లా వంటరిగా  కూర్చొని భోజనం  చెయ్యటం దారుణమైన సన్నివేశం. ఎవరో చాటునుంచి పొంచి చూస్తున్నట్లూ, సానుభూతి ప్రదర్శిస్తున్నట్లూ వుంటుంది. నోట్లోకి ముద్ద పోదు. ఒంటరితనం. చాలాకాలం వృధా ఆలోచన్లతో వ్యర్థం అయిపోతూ వుంటుంది. అర్థంలేని జాలి మనమీద మనకు.

    మెల్లగా మూడయింది. కాసేపు  నిద్రపోదామనిపించింది మభుబాబుకు. ఈ మధ్యాహ్నం నిద్రకన్నా విషాదకరమైన సంఘటనలేదు. పట్టీపట్టనిస్థితి, ఉలిక్కిపడి లేచికూర్చుండటం, తీరా టైంచూస్తే ఎక్కువ గడవకపోవటం.

    బయట అడుగుల చప్పుడయినాయి. యీ సమయంలో ఎవరూ  రారే  సాధారణంగా. తలుపు కొడతారేమోనని ఎదురు చూస్తున్నాడు. ఏదో  కంఠస్వరం "మధుబాబుగారూ" అతను ఉలిక్కిపడ్డాడు. స్త్రీ కంఠం.

    మధుబాబు అప్పుడు పైజమా, లాల్చీ వేసుకుని వున్నాడు. లేచివెళ్లి తలుపు తీశాడు.

    ఆనాడు బజారులో కనిపించిన అమ్మాయిలు.

    తడబడుతూ "లోపలకు రండి" అన్నాడు.

    ఇందిర పాపం లజ్జితురాలై సంకోచిస్తోంది. "పదవే, ఇక్కడదాకా వచ్చాక సిగ్గుపడతావెందుకు?" అని ప్రక్క అమ్మాయి బలవంతంగా లోపలకు తీసుకొచ్చింది.

    గదిలో రెండే కుర్చీలున్నాయి. వాటిమీద వాళ్లని కూర్చోమని చెప్పి తాను మంచంమీద కూర్చున్నాడు. ఓ నిముషం ఏం మాట్లాడాలో తోచక ముగ్గురూ మౌనంగా వూరుకున్నారు. మధుబాబుకు ఇద్దరి ఆడవాళ్ళమధ్య తన స్థితి. కొంచెం ఇబ్బందిగా వుంది.

    "ఇల్లు ఎలా తెలిసింది?" అనడిగాడు ఏదో అనాలని.

    "ఇంత మహా రచయిత చిరునామా తెలియకనే పోతుందా? మా ఇంటి దగ్గర మీ హాస్పిటల్ నర్స్ వుంది. ఆమెని ఎంక్వయిరీ చేశాము" అందా అమ్మాయి నవ్వి. ఇందిర ముసిముసిగానవ్వి మరింత తలవంచుకు కూర్చుంది.

    మధుబాబుకు సిగ్గువేసింది. ఓ క్షణం ఆగి "పాపం శ్రమపడి ఇంతదూరం యీ పూరిల్లు వెతుక్కుంటూ వచ్చారు. ఈ బీదవాడిమీద ఎంత దయ" అన్నాడు.

    "ఇదిగో దయా? అదంతా యీ నంగనాచిలా కూర్చుందే యీ దొరసానిది. ఇక్కడకు వచ్చేదాకా ప్రాణం తోడేసింది. ఇప్పుడేమీ తెలియనిదానిలా ఫోజువేసి కూర్చుంటుంది. కొత్తవారు కాబట్టి మీముందు ముంగిలా కూర్చుందిగాని, అమ్మా. బయట  దీని  ప్రతాపం  చూడాలి. మాట్లాడవే."

    ఇందిర స్నేహితురాలిని మోచేతిలో పొడిచి "ఊరుకొనే రత్నా! నీకు  పుణ్యముంటుంది" అంది మందలింపుగా అతి సన్నని స్వరంతో.

    కాని ఈ మాటలు మధుబాబు చెవిన పడినై. "ఐతే ఘాటైన మీ పేరు  రత్న అన్నమాట" అన్నాడు.

    "రత్నకుమారి."

    "ఇక్కడ కాలేజీలో చదువుతున్నారా?" అని ప్రశ్నించాడు మధుబాబు.

    "అవునండీ. బి.ఏ. మొదటిఏడు చదువుతున్నాం. ఇద్దరం క్లాస్ మేట్స్ ము" అంది రత్నకుమారి.

    అతను ఇందిరవైపు అనాలోచితంగా చూశాడు. పదిహేడు, పద్దెనిదేళ్ళకంటే ఎక్కువ వుండవు. చామనఛాయగా వుంది. నిండుగా సుకుమారంగా, సహజ సుందరంగా వుంది. అతను తనవైపు చూడటం కనిపెట్టి తన పెద్ద పెద్ద కళ్ళని క్రిందకు వాల్చుకుని నేలచూపులు చూడసాగింది.

    "అంత సిగ్గుపడేవారు ఇక్కడకు ఎందుకు వచ్చారు?" అన్నాడు మధుబాబు.

    "అలా అడగండి" అన్నది రత్నకుమారి.

    నిజానికి ఇద్దరు ఆడపిల్లలు ఓ యువకుడ్ని.... కారణం ఏమైనాకాని, వెతుక్కుంటూ అతని ఇంటికి రావటం కొంచెం సాహసంతో కూడినపనే. మనసులో గాఢమైన సంచలనం  వుంటేనేగాని సాధారణంగా ఇలా జరగదు.

    రత్నకుమారి వాళ్ళది అసలు విశాఖపట్నమే. ఇందిర తండ్రి ఇంజనీరు. క్రితం ఏడాదే అక్కడకు ట్రాన్స్ ఫరై వచ్చాడు. క్లాసుమేట్సు అయినాక ఇద్దరకూ బాగా మైత్రి కలిసిపోయింది. ఈ విషయాలు చెప్పింది రత్నకుమారి.

    "అబ్బ! ఊరికి దూరంగా, యీ ఆశ్రమ  వాతావరణంలో ఎలా వుంటున్నా రండీ, విసుగ్గా వుండదూ, భయం వెయ్యదూ?" అంది.

    మధుబాబు ఏదో జవాబు చెప్పబోతున్నాడు. ఇంతలో ఇందిర అనుకోకుండా కల్పించుకుంది. "నాకయితే ఇలాగే బాగుంటుంది. ఎంత ఏకాంతము.... ఏమీ గొడవలు లేకుండా" అనేసింది. తరువాత  నాలిక కొరుక్కుంది.

    రత్నకుమారి కిలకిలమని నవ్వి మాట్లాడేసింది. "ఇందిరకి మీ పుస్తకాలు బాగా వంటబట్టినాయండి. ఎప్పుడూ ఏకాంతం, ఫెసిమిజం, సెన్సిటివ్ నెస్ ఇవే గొడవలు. ఏ సరోవరతీరాల్లోనో, ప్రకృతి సీమల్లోనో వంటరిగా తిరుగుతూ గడపక ఈ చదువూ , సమస్యలూ ఇవన్నీ  యెందుకంటుంది. ఏమోనబ్బా! నాకయితే యీ విపరీత ప్రకృతులు నచ్చవు. హాయిగా  తినటం, చదువు కోవటం, సినిమాలు చూడటం, నిద్దరోవటం.....

    "పెళ్ళి చేసుకోవటం....." అన్నాడు మధుబాబు అర్థోక్తిలో.

    "పిల్లల్ని కనటం" అని పూర్తిచేసింది ఇందిర.

    రత్నకుమారి కోపం వచ్చినట్లు ముఖంపెట్టి "అదిగో..... అక్కడే రచయిత గారూ, పాఠకురాలూ ఏకమైపోయారు. అలా ఐతే  నేను వెళ్ళిపోతాను" అంటూ లేవబోయింది.

    ఇందిర ఆమెచెయ్యి పట్టుకుని  విడిచిపెట్టకుండా "పిల్లల్ని కనవద్దులే. వెళ్లకు" అంది.

    మధుబాబుకి నవ్వు వచ్చి పకపకమని నవ్వాడు. ఇందిర సిగ్గుపడింది.

    అతిథులకు ఏమైనా అల్పాహారం ఇవ్వాలని తోచి అతను బయటకు వెళ్లి  పనిమనిషి ఎక్కడైనా కనిపిస్తుందేమోనని చూశాడు. ఎక్కడా  జాడలేదు. లోపలకు  వచ్చి "ఇప్పుడే వస్తాన" ని చెప్పి లోపల గదిలోకి వెళ్ళాడు. ఫ్లాస్కులో పాలువున్నాయి. రోజూ అతను స్టవ్ మీద కాఫీ స్వంతంగా కాచుకుని తాగుతున్నాడు. ఓ గిన్నెలో నీళ్ళుపోసి స్టవ్ మీద పెట్టాడు.

    "ఏమిటండోయ్! లోపల  గిన్నెలూ అవీ  చప్పుడు  చేస్తున్నారు. కాఫీ ప్రయత్నమా ఏమిటీ?" అంది బయటినుంచి రత్నకుమారి.

    "మరి కాఫీ వేళయింది కదా" అని మధుబాబు సమాధానం  చెప్పాడు.

    "అదేమో నిజమే. కాని  మరి మాకోసం మీరిలా శ్రమపడటం అదోరకంగా వుంటుందండీ మాకు."

    "ఉండనివ్వండి ఫర్వాలేదు. ఏమీలేకుండా  ఊరుకుంటే నాకూ అదోరకంగా వుంటుంది."

    ఇందిర తనలో తాను నవ్వుకుంటూ గదంతా శ్రద్ధగా కలయజూసింది. గదైతే అందంగా  వున్నదిగాని, అందులో వున్న సామాగ్రిమాత్రం నిర్లక్ష్యంగా, కలగాపులగంగా వదిలివేయబడి వుంది. గోడకు ఓ వైపు పెద్ద రేక్ నిండా పుస్తకాలు  వున్నాయి. ఇంగ్లీషువీ, తెలుగువీ, క్లాస్ పుస్తకాలూ అన్నీ కలగూర గంపలా వున్నాయి. ఆమె లేచి  వెళ్లి ఆ పుస్తకాలమీద ఒక్కొక్కదానిపేరు చూస్తూ తనకు తోచినట్లు ఓ క్రమంలో వుంచసాగింది రత్నకుకుమారి ఆమె చేసేపనిని ఆసక్తితో చూస్తూ మౌనంగా ఊరుకుంది. ఇంతలో మధుబాబు ఏదో  వెతుక్కుంటూ గదిలోకి వచ్చాడు.  ఇందిర కొంచెం జంకి ఇవతలకు జరిగింది. అతను అన్వేషిస్తున్న నేత్రాలతో అటూ ఇటూ  చూడసాగాడు. "ఏమిటది" అంది రత్నకుమారి. "స్పూన్" అన్నాడతను కొంచెం సిగ్గుపడుతూ. మంచం పరుపుక్రిందా, దిండుక్రిందా చూశాడు. మళ్ళీ ఆ పుస్తకాలన్నీ కలగాపులగంగా చేశాడు. ఏమైంది? ఇందాక ఇక్కడే ఎక్కడో పెట్టాను అని గొణుక్కున్నాడు. రత్నకుమారిని ఓసారి కుర్చీలోంచి లేవమని ఆ కుర్చీ అంతా వెతికాడు. మళ్లీ ఓసారి  పుస్తకాలు  అటునుంచి ఇటూ ఇటునుంచి అటూ గజిబిజి చేశాడు. "అదేమిటక్కడ తెల్లగా మెరుస్తోంది?" అంది రత్నకుమారి తలుపుమూల చూపిస్తూ. మధుబాబు అటు తీక్షణంగా చూసి "యస్, ఇక్కడ వుంది" అంటూ  తీసుకుని లోపలకు  పోయాడు. ఇందిర ఆ పుస్తకాలన్నీ మళ్లీ చచ్చీ చెడీ  సర్దసాగింది. ఓ ఘడియపోయాక మధుబాబు  ఇవతలకు వచ్చాడు. చూపులతో  ఏదో వెదుకుతున్నాడు. "ఏమిటది "రత్నకుమారి అంది. "కాఫీపౌడర్ డబ్బా" అంటూ మళ్ళీ  పుస్తకాల దగ్గరకు  పోతున్నాడు. ఇందిర ఉస్సురని నిట్టూర్చి దూరంగా జరిగి నిల్చుంది. "ఇంతలోనే అతనికి యేదో స్ఫురించి ఈ  మంచంక్రింద వుండాలే" అంటూ  దానిక్రిందకు ఒంగి లోపలికి ప్రాకి  ఓ  డబ్బాను బయటకు  తీసుకొచ్చాడు. వాళ్లవంక ఓసారి చూసి "కాఫీపొడి" అంటూ నవ్వి లోపలకు  పోయాడు. స్నేహితురాళ్లిద్దరూ ఒకరి మొహమువంక ఒకరు తెల్లబోయి చూసుకుని గప్ చుప్ గా వూరుకున్నారు. మళ్ళీ  ఇందిర మిగిలిన పుస్తకాలు సర్దటంలో నిమగ్నురాలయింది.

    పదినిముషాల్లో కాఫీ తయారయింది. కప్పుల్లోపోసి ఇద్దరకూ తెచ్చి ఇచ్చాడు మధుబాబు. తనూ ఓ కప్పులో తెచ్చుకున్నాడు.

    కాఫీ చాలా బాగా కుదిరింది. ఆడపిల్లలిద్దరూ కూడా అదేమాట అన్నారు.

    ఇందిరకు ఇప్పుడు కాస్త ధైర్యం వచ్చింది. కాఫీకప్పు క్రిందపెడుతూ "ఇప్పుడు ఏమీ రాయటంలేదా?" అనడిగింది అతనివంకగాక, ప్రక్కకి ఎటో చూస్తూ.

 Previous Page Next Page