Previous Page Next Page 
జాలిలేని జాబిలి పేజి 26


    ఆమెని గురించి నీ  ఇంప్రెషన్."

    "చాలా గొప్పది. ఈ భూమ్మీద అలాంటి వ్యక్తులు అరుదుగా వుంటారు."

    "మరి ఎందుకు పెళ్లి చేసుకోలేదు?"

    "ఖర్మ. ఆమెకు అంతకుముందే పెళ్ళయిపోయింది."

    శైలజ నిట్టూర్పు విడిచింది. "అందుకనే నీ రచనలంత మధురంగా  వున్నాయి" అంది.

    "అందుకనేనా..... కాబోలు" అన్నాడు మధుబాబు  అన్యమనస్కంగా.

    "నీకు చాలా  చెప్పాలని వుంది. ఏమీ  చెప్పలేకపోతున్నాను" అంది శైలజ.

    "నాకు తెలుసు."

    "కారణమేమిటంటావు?"

    మధుబాబు అనుకోకుండా చిన్న మందహాసం చేశాడు. "మనం ప్రతిదానికీ కారణం చెప్పలేం శైలజా. కారణం తెలీకుండా నన్నిక్కడకు రమ్మన్నారు. కారణం తెలీకుండానే నేన్నిక్కడకు వచ్చాను. ఇద్దరిమధ్యా తెలియని ఆందోళన వుంది. మళ్ళీ నేనుపోయాక మీరు బాధపడతారు. నేనూ పడతాను. ఏదయితే ఇక్కడ గుప్తంగా వున్నదో అదే సత్యం" అన్నాడు.

    శైలజ  ఆలోచిస్తూ కూర్చుంది. ఇద్దరూ  చాలాసేపటిదాకా  మౌనంగా వూరుకున్నారు. హఠాత్తుగా  ఆమెముఖం ఎత్తి డగ్గుత్తికతో "ఈ జీవితం  బరువు  మొయ్యలేకుండా వున్నాను. నేను  కొద్దిరోజులలో ఏమయినా  అయిపోవచ్చు. గతమూ, ప్రస్తుతమూ, భవిష్యత్తూకూడా అసహ్యంగా  అస్తవ్యస్తంగా కన్పిస్తోంది. కాని వీటన్నిటినుంచి  తప్పించుకునే ధైర్యం, త్యాగం లేవు..... ఒకవేళ యెప్పటికైనా  ఆపదలో నీ దగ్గరకు వస్తే సహాయం చేస్తావా?" అంది జాలిగా.

    మధుబాబు అప్రతిభుడైపోయాడు. "తప్పకుండా" అన్నాడు వ్యతీతమైన కంఠంతో.

    శైలజ లేచి నిలబడి "ఇహ పడుకుని నిద్రపో నాగురించి అట్టే ఆలోచించకు. వస్తా" అంటూ అక్కడ్నుంచి గబగబా వెళ్ళిపోయింది.

    ఆమె గొంతులోని వ్యధను గమనించి అతను విచలితుడయాడు. లేచి కిటికీదగ్గరకు వచ్చి నిల్చున్నాడు. క్రింది తోటలోంచి రకరకాల పువ్వుల పరిమళం హాయిహాయిగా ఎగజిమ్ముతోంది. ఈ డబ్బు,సౌఖ్యం, యవ్వనం, కీర్తి అన్నీ వుండి.... ఏమిటో!

    అతను తల ఎత్తి ఆకాశంలోకి చూశాడు. జాబిలి మబ్బుచాటుకు జరుగుతున్నాడు.

                                *    *    *

    మరునాడుకూడా అక్కడే గడిపి, ఆ మరుసటిరోజు అక్కడనుంచి వచ్చేశాడు మధుబాబు. పోస్టుమేన్ తో చెప్పటంవలన పాత ఎడ్రస్ కి వచ్చిన ఉత్తరాలు కూడా ఇక్కడే ఇచ్చిపోతున్నాడు. తలుపుతీసి ఇంట్లోకి ప్రవేశించగానే నేలమీద  కవరొకటి పడివుంది. దస్తూరి గుర్తుపట్టి అతని గుండె గబగబ కొట్టుకుంది.

    "ఒట్టి అడవిమనిషికి,

    ఈమధ్య నీ కొత్తపుస్తకం చదివాను. నాకేమీ బాగాలేదు. వింటున్నావా? ఏమీ బాగాలేదు. అబ్బ! అయినా రానురానూ అంత విషాదజీవిగా తయారౌతున్నావేమిటి? ఎప్పటికైనా సరే యీ ప్రపంచంమీద మితిలేని అసహ్యం కలిగినప్పుడు  నా దగ్గరకు  వచ్చెయ్యి, ఏం?

   
                                                                                                                        పద్మజ"

    అతనిగుండెలో ఏదో కెలికినట్లయింది. దిగాలుపడి కూర్చున్నాడు.


   
                                             26

    ఒక దశలో మానవుడు మానసికంగా పెరగటం ఆగిపోతాడు. ఎవ్వరూ  ఎల్లకాలం పెరుగుతూపోరు. ఎక్కడో నిలిచిపోయి శూన్యంలోకి చూస్తూ వూరుకుంటారు. అయితే ఇది స్థిరత్వంకాదు. జడత్వం అంతకంటే  కాదు. తాత్కాలికమైన జుగుప్పా అంటే అదీ  చెప్పలేము. మళ్ళీ భావిలో జీవితం కొత్త చిగుళ్ళు తొడగవచ్చు. మానసిక పరిణామం రావచ్చు. కాని ఈ స్థబ్ధమైన దశ అనుభవించకుండా మాత్రం  ఎవ్వరూ ముందుకు పోలేరు.

    మధుబాబు ప్రస్తుతం యీ దశలో వున్నాడు. ఫైనల్ ఇయర్ లోకి వచ్చాడు. యాంత్రికంగా హాస్పిటల్ కి పోయివస్తున్నాడు. పాఠాలు శ్రద్ధగా చదువుతున్నాడు. సాహిత్య ఉత్పత్తి ఏమీ చెయ్యలేదు. మత్తుగా, మౌనంగా వున్నాడు.

    కాని ఆ వయస్సుకి అతను రాసిన రచనలు ఎక్కువ. అసూయాపరులు ద్వేషాన్ని వెలిగ్రక్కేస్థితికి అతడెన్నడో చేరుకున్నాడు. పాఠకుల్లో పేరుపెరిగే కొలదీ విమర్శకులు మరీ తప్పులెంచసాగారు. ఎంతపైకి వచ్చినా "ఫర్వాలేదు. పైకి  వస్తాడనే" స్లోగన్ పత్రికలవాళ్ళు వదలటల్లేదు.

    అతివాదాలంటే అతనికీ మధ్య మరీ చికాకు హెచ్చింది. ఈ మానసికమైన చిత్రవధను అతనింక అనుభవించదల్చుకోలేదు. ఈ మధ్య  రైల్లో  పోతూంటే  ఓ రచయిత్రి కనిపించింది. విప్లవ వనితలా గోచరించింది. ప్రేమ వేరు  వివాహం  వేరు  అన్నది. నిజమే. అంగీకరించవచ్చు కాని ప్రేమకూ, వివాహానికీ  బొత్తిగా, సంబంధం వుండనక్కరలేదంది. స్త్రీ  హృదయం  పుష్పక  విమానమంది. ఎంతమందికైనా అందులో చోటు  వుంటుందని ఆమెవాదం. నిజమే  కావచ్చు ననుకున్నాడు మధుబాబు. ఒకరిలో కొన్ని గుణాలు చూసి ఇద్దర్నీ సమానంగా  ప్రేమించటానికి అవకాశాలున్నాయి. ఈ మధ్య ప్రతివాడూ 'ఉద్ధరింపు' అనేమాట  విరివిగా ప్రయోగించటం ఫ్యాషన్ అయిపోయింది. ఉద్ధరింపుకు విపరీత  అర్దాలూ  తీయటం  జరుగుతోంది. జీవితంలో అనుభవశూన్యులూ, ఏదో కొద్ది దారుణ  సంఘటనలు చూసి  అవే ప్రపంచ సత్యాలని అపోహపడే వాళ్ళే, ఏదో  ఓ కోణంలో వ్యక్తిగత కారణాలచేత  దగాపడిన వాళ్ళూ అవే  విశ్వజనీనం  చేసి తాత్కాలిక ఉద్రేకంతో పొలికేకలు వేయటంవలన ఉద్ధరింపు జరగదు. మనలో లేని సంస్కారాన్ని ప్రజలకు  పంచిపెడుతున్నాం. మనలోని  బలహీనతల్ని ప్రజలమీద రుద్ది మనక్షేమంకోసం విశ్వవ్యాప్తం చేస్తున్నాము. మన వ్యక్తిగత  జీవితమంతా బూజు, ఒట్టి  ఆర్భాటం, పిరికితనం, కొన్ని  సుఖాలకు  కరువాచిపోయి, వాపి తీరక అతివాదాలు లేవదీస్తున్నాము. ఇలా తరుచుకుంటూ పోతే నిజాయితీ ఎక్కడ?

    "స్త్రీని" ఎంతోమంది కన్నా ఎక్కువగానే సానుభూతిగా చూశాడు మధుబాబు. ఆ అసహ్యం, అవివేకం, బానిసత్వం (ఇప్పటికి), ఆత్యాచారాలు, అమానుషాలు తలచుకుని కన్నీరు కార్చాడు. ఆవేశపడ్డాడు. నిజమే. మన సంఘం  కుళ్ళికుళ్ళి దరిద్రంగా, ముదనష్టంగా తయారౌతోంది. కాని ఈ కంఠశోషలూ, తీవ్ర వాదాలూ  విని సంస్కారానికి సరైన నిర్వచనం చెప్పుకుంటున్నదెంతమంది? అతను నిత్యం కాలేజీలో  అంతమంది అమ్మాయిల్ని చూస్తున్నాడు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ఎమ్.బి.బి.యస్. చదువూ, అన్నీ పొంది సంస్కారం అంటే  అర్థం తెలీక ప్రేమశూన్యులయి, అసహ్యపు ముద్దల్లా తయారౌతున్న వీళ్ళని చూస్తుంటే అతనికి మతిపోతోంది. స్వేచ్ఛపొంది వీళ్ళు  నిర్వహిస్తోన్నదేమిటి? ఊరగాయల గూళ్ళలోంచి, కూరల, పచ్చళ్ల లోకాభిరామాయణం నుంచి  బయటకు  వచ్చిన నవీనస్త్రీ సినిమా  కబుర్లూ, మిత్రుల  శీలాన్ని గురించి మాట్లాడుతోందని, ఆదర్శంకోసం అలమటించిన మహావ్యక్తులే  నిరాశ  చెందుతున్నారు. స్వేచ్ఛకు అర్థం  చెప్పుకోలేని వ్యక్తులు భూమిమీద  గుంపులు గుంపులుగా పోరపడుతూంటే  ఆదర్శానికి ఆనకట్టలెందుకు? అది పిచ్చెక్కినట్లు పొంగి ప్రవహించేది! ఎక్కడ పల్లం  వుంటే అటుకేసి  జరజర పోతుంది. చివరకు మిగిలేది అరిచి, అరిచి జీవితాన్ని  అంకితం  చేసుకున్న  మహనీయుల  వినిపించీ వినిపించని వ్యర్థ ఘోషలు.


                                 *    *    *


    ఒకరోజు సాయంత్రం ఓ స్నేహితుడితో  కలిసి బజారు వెంట నడుస్తున్నాడు మధుబాబు. ఆ స్నేహితుడు కాలేజీ గొడవలేవో చెబుతున్నాడు. అతను  వింటున్నాడు.

    ఇంతలో ఇద్దరు యువతులు వాళ్ళ కెదురుగా వచ్చారు. మధుబాబువంక యధాలాపంగా చూసిన ఓ  అమ్మాయి  చప్పున  చకితురలై, స్నేహితురాల్ని మోచేతిమీద పొడిచి "అటుచూడు అటుచూడు" అన్నది ఆతృతగా.

    "ఏమిటే?" అంది స్నేహితురాలు.

    "అతన్నెక్కడో చూసినట్లుగా వుంది.... ఆఁ, నవలలు రాసే మధుబాబు. అవునతనే" అంది మొదటి అమ్మాయి ఉత్సాహంగా.

    "అయితే అయాడులే, ఏమిటా గాభరా?"

    మధుబాబుకి యీ మాటలు లీలగా వినిపించాయి. పులకితుడయాడు. నవ్వుకుంటూ ముందుకు నడిచాడు.

    స్నేహితుడు కాఫీ త్రాగుదామన్నాడు. ఇద్దరూ కలసి ప్రక్కనున్న కాఫీ హొటల్ కి వెళ్ళారు.

    "అతనిక్కడే ఎమ్.బి.బి.యస్. చదువుతూన్నట్లు పుస్తకాల వెనక చూశాను. అతని రచనలంటే నాకెంతో ఇష్టం. కలుసుకుంటే బాగుండేది" అంది మొదటి అమ్మాయి విచారంగా.

    "మరి అతన్ని నిలబెట్టి మాట్లాడలేకపోయావా?" అన్నది రెండో అమ్మాయి ఎగతాళిగా.

    "అమ్మబాబోయ్. రోడ్డుమీదనా? అందులోనూ నేనా? మొగవాళ్ళతో మాట్లాడాలంటే నాకు చచ్చేభయం బాబూ."

    "అయితే ఇహ దిగులెందుకు? పోదాం పద" అని రెండో అమ్మాయి ఆమెచెయ్యి పట్టుకులాగింది.

    "ఉండు ఉండు. కాసిని పూవ్వులు  కొనుక్కుపోదాం. ఎంత బాగున్నాయో చూడు ఆ తెల్లని మల్లెలు. తెల్లని మల్లెలన్నా, చల్లని వెన్నెలన్నా ఎంతో ఇష్టం నాకు" ఇద్దరూ రోడ్డుప్రక్కనున్న పూల అంగడికి వెళ్ళారు.

    పువ్వులు బేరం చేస్తున్నారుగాని..... స్నేహితురాలి చూపులన్నీ హొటలు గుమ్మంమీదేనని కనిపెట్టింది రెండో అమ్మాయి. లోలోపల నవ్వుకుంది. స్నేహితురాలి సాహిత్యపుపిచ్చి ఆమెకు తెలుసు. మరో పదినిముషాలవరకూ ఇద్దరూ పువ్వులు కొంటూనే వున్నారు. మధుబాబు స్నేహితుడితో కలిసి  బయటకు  వచ్చాడు. రెండో అమ్మాయి హఠాత్తుగా స్నేహితురాలి చెయ్యి పట్టుకుని గబగబ వాళ్లకు ఎదురుగా వెళ్లి "నమస్కారమండీ. మీరు ప్రఖ్యాత  రచయిత మధుబాబుగారు కదూ" అన్నది చొరవగా. మొదటి అమ్మాయి గుండె గబగబ కొట్టుకుంది. నేస్తురాలు చేసిన పనికి కోపంవచ్చింది. ఏమంటాడోనని ఎదురు చూస్తోంది.

    "కాదే" అన్నాడు మధుబాబు.

    "కాకపోవటమేమిటి, మీ మొహం చెప్పటల్లా? ఏమండీ మీరు చెప్పండి. ఆయన పేరదే కదూ?" అన్నది  ప్రక్కవాడికేసి తిరిగి తొణక్కుండా, బెణక్కుండా.

    స్నేహితుడు కాస్త మాటకారే. మీరన్న ప్రఖ్యతుడూ, ఈయనా ఒకటి అవునో కాదోగాని.... యీయన పేరు మధుబాబే. రచయిత అయినమాట వాస్తవమే" అన్నాడు.  

 Previous Page Next Page