Previous Page Next Page 
విరిజల్లు పేజి 26


    గదిలో మంచంమీద కూచోపెడుతూ అంది. "నే వస్తా రంగా! మళ్ళీ రేపు ఇదే వేళకి_అక్కయ్యతో చెప్పు. ఆమె పనిమీద వున్నట్టుంది.
    ఆమె చేతిని అందుకుని అన్నాడు. "అక్కా! ఓ దిక్కులేని తమ్ముడు నీకోసం కన్నులు లేకున్నా మనసంతా కళ్ళు చేసుకుని చూస్తూ ఉంటాడని, అతడికి మరో ఆధారం లేదని, మరచి పోవద్దక్కా."
    నిట్టూర్చటంకంటే పేద మనసులు ప్రపంచంలో చేయ గలిగింది లేదు.
    మెట్లుదిగి గార్డెన్ దాటి బయటకు వస్తుంటే గేటు వద్దే ఎదురయ్యాడు వేణు.
    "విరజా"
    అతన్ని చూస్తూనే ఆమె ముఖం ఒక విధంగా అయింది. గాబరాపడుతూ అడిగాడు.
    "ఏమైంది విరజా? అలా ఉన్నావ్! చెప్పు! చెప్పవేం విరజా! అలా ఉన్నావేమిటి?
    నిర్లిప్తంగా అంది ఏమీ లేదు వేణూ! రంగా వెంట గార్డెన్ లో కూర్చొని ఇప్పుడే అతన్ని వదిలేసి వస్తున్నా అంతే!"
    "కానీ నీ ముఖంలో యెందుకో దుఃఖం కనిపిస్తుంది. చెప్పు విరజా ఏమిటది?"
    "ఏమీ లేదు నా మాట నమ్ము!"
    "సరే! అలా వెడదాంరా! మరికొంచెంసేపు కూర్చొని వెడుదువు గానీ!"
    "రాలేను వేణూ! వెళ్ళాలి. చాలా ఆలస్యమైంది. యెంతో పనుంది...."
    ఆశ్చర్యపోయి అన్నాడు. ఒక్క క్షణం! ప్లీజ్!"
    "వద్దు వేణూ! ఇప్పుడేం బలవంతం చేయొద్దు. నన్ను వెళ్ళనీ ఒక్క మాట మీరు మనసులో ఏమీ అనుకోకుండా ఈ ఉత్తరం తీసుకోండి!"
    హఠాత్తుగా ఉత్తరం అతని చేతిలో వుంచి గబగబా వెళ్ళిపోయింది. ఏమీ అర్ధంకాక నిర్ఘాంతపోయి అలాగే నిల్చుండి పోయాడు కొన్ని క్షణాలు!


                                                              18

    వేణూ!

    నీకు ఉత్తరం వ్రాయవలసి వస్తుందని కాని, వ్రాసినా యిలా వ్రాయాల్సొస్తుందని కానీ కలలోనైనా లీలగా తెలిసి వుంటే నాకీ జన్మే వద్దని భగవంతుడిని ప్రార్ధించి వుండేదాన్ని.
    అయితే యెప్పుడేది యెందుకు జరుగుతుందో ఎవరూ తెలుసుకోలేరు. చెప్పలేరు. ఇక నాలాంటి సామాన్యురాలికి ఆ భౌతిక విషయాలు యెలా తెలుస్తాయి.
    నన్ను మన్నిస్తావని ఈ ఉత్తరాన్ని నిదానంగా ప్రశాంత చిత్తంతో చదువుకుని అర్ధం చేసుకుంటావని ఆశిస్తున్నాను. నా ఆశ నిరాశ కాకూడదని భగవంతుని మళ్ళీ ప్రార్ధిస్తున్నాను.
    ప్రపంచంలో ఏ పరిస్థితులలోనైనా నన్ను అర్ధం చేసుకోగలవు.చేసుకోవాలి, ఆచరించాలి. అభిమానించాలి. అదే నాకు కావలసింది. అంతే అది తప్పమరేమీ అక్కరలేదు నాకు.
    నిండు మనస్సుతో నా మనస్సులో వున్న భావాలని నీ ముందు బయట పెట్టుకుంటున్నాను. అవి నీకు సంతోషాన్ని కలిగిస్తాయో దుఃఖాన్నే కలిగిస్తాయో నాకు తెలియదు. నేనేం చేయను నేనూ నీతోపాటు సమానంగా బాధపడుతున్నప్పుడు. కానీ యిప్పుడు నేనంతగా నాలో నేనే కుమిలిపోతున్నానో నాకే తెలియటం లేదు.
    నిజంగా నేను మతాంతరంగా ఎందుకు జన్మించానా అని ఎప్పుడూ బాధపడుతూ వుంటాను. నీకూ నాకు ఎన్నడూ మతాలు అడ్డు రాకున్నా అది సంఘానికి కావాలి. నిన్నూ నన్నూ విడదీసి వేరు చేసిన ఈ మతాన్ని ఏం చేసినా తప్పు లేదు. కానీ ఈ భారతదేశంలో పుట్టేక ఈ మట్టిలో పెరిగేక ఇక్కడి సంప్రదాయాల్ని, ఆచారాల్ని ఇష్టంవున్నా లేకున్నా గౌరవించాలి. గౌరవించి తీరాలి_అది తప్పదు.
    ఒకరికి కష్టాన్ని కలిగిస్తుందనో నష్టాన్ని కలిగిస్తుందనో సుఖాన్ని ప్రసాదిస్తుందనో సంప్రదాయాల్ని, ఆచారాల్ని, అనుక్షణమూ మారుస్తూ వుంటే మానవుడికి సుఖమే దక్కదు.
    పదిమందికి సుఖాన్నిచ్చేది ఎలాగూ కొందరికి దుఃఖాన్నిస్తుంది. అందరికీ సుఖాన్ని యిచ్చేది ఏదీ వుండదేమో? ఒకవేళ ఏదన్నా వుందంటే అది బహుశ ఒక్క మరణనేమో. సమవర్తి అనదగినవాడు ఆయనొక్కడేనేమో బహుశ.
    భగవానుడే వెలుగునీ, వెన్నెలనీ, నింగినీ, నీటినీ, అందరికీ సమానంగా యివ్వటం లేదు. ఇహ సమానత్వమెక్కడ? సమభాగత్వమెక్కడ? సమానత్వమని వాదించేదంతా అర్ధంలేని వాదనే అవుతుంది చివరికి. పోనీలే ఈ అర్ధంలేని వేదాంతం ఎందుకు?
    నేను నిన్ను పదేళ్ళుగా పలుకరిస్తూ ఊహకి మాత్రమే అంతా తెలియని నీ మూర్తిని ఆరాధిస్తూ ఎక్కడున్నావో కూడా తెలియని నిన్ను అనుక్షణమూ ఆహ్వానిస్తూ పిలుపుకి కూడా అందనంత దూరంలో వున్న నిన్ను మనసారా పిలుస్తూ ఆహ్వానిస్తూ నీకోసం తపిస్తూ తపస్సు చేస్తూ బ్రతికాను.
    కాని తపఃఫలం ఒక్కోసారి ఈ జన్మలో కాకున్నా పై జన్మలో నయినా లభ్యమౌతుందనే అంటుంటారు పెద్దలు. నా విషయంలో అలాగే అయ్యేట్టుంది.
    నిన్ను వెదుకుతూ వచ్చాను. కనిపించావు. కలలోకూడా కనిపించవనుకున్న నిన్ను కనులారా కాంచగలిగాను. కానీ నీవు గృహస్థుడివి అయ్యావు అని తెలిసింది. తెలిశాక ఏదో తెలియని బాధ ఎదలో రగిలింది. వేదన ఉప్పొంగింది.
    అయినా మనస్సుని నిగ్రహించుకున్నాను. కఠినమయిన పరీక్ష పెట్టుకున్నాను. నీ మనస్సు తెల్సుకున్నాను చాలు, పదేళ్ళు అమ్మాయిగా ఉన్నప్పుడు నీ విరజ అంటే నీకెంత ఇష్టమో యిరవై ఏళ్ళు నిండిన నీ విరజ అంటే కూడా అంతే యిష్టమని పైగా నాపై అనురాగం ద్విగుణీకృత మయినదని తెలిసినా మనసు ఎంతగా గంతులు వేసిందో నేను చెప్పలేకున్నా, నీవు తెలుసుకోగలవు.
    కానీ ప్రతీ సారీ నీవు మా ఇంట్లో వుండవా అన్నప్పుడల్లా బాధ అయ్యేది, ఏమని ఉండను, ఎవరని ఉండను, యెలా ఉండను? ఇది ప్రపంచం. సభ్య మానవ సంఘంలో ఉన్నాం. మనం మనిద్దరమే కాదు జీవించే కళ్ళూ చెవులూ అవసరం కొద్దీ ఉపయోగించుకుని నోరు చేసుకునే మనసులేని సంఘం కూడా బ్రతికే ఉంది.
    లోకులు కాకుల్లా చీవాట్లు వేస్తోంటే భరించుకోలేం మనం. ఆ బాధ ముందు మనం కలిసి జీవించే సుఖం ఏ పాటిది?
    నీతో చెబితే బాధ పడతానని నీతో చెప్పలేదు. యిప్పుడిక తప్పదు. ఇప్పుడయినా చెప్పకపోతే నీవు అర్ధం చేసుకోలేవని ఆ తర్వాత కలిగే అనర్ధాల్ని గ్రహించుకోలేవని....
    నా మౌనంలో వున్న వేదనని గ్రహించుకోలేక అంగీకారంగా తీసుకున్నావ్. యెలా విడమరిచి చెప్పను!
    అందుకే ప్రతి పర్యాయం నేను వచ్చే జన్మలో నీ దానిగా పుడతానని చెప్పేదాన్ని. నీవు అడిగినపుడల్లా తప్పక పుడతానని చెప్పేదాన్ని.
    నిజం వేణు! తప్పక పుడతాను. వచ్చే జమ అనేదే వుంటే అందులో యే జన్మ అయినా సరే నేను నీలోనే వుంటాను. జడ భరతుడిలో ఎప్పుడూ అదే ద్యాసతో మరణిస్తే అదే సిద్ధించి తీరుతుంది. అందులో నాకు ఏమాత్రం సందేహంలేదు!
    వెనుకటి జన్మలో బహుశా మనిద్దరం కలిసే వుండి వుంటాం. నిజం. నాకు ఏదో అభౌతికమయిన ఊహా తీతమయిన శక్తి ఉద్భోదిస్తూ వుంది. కలిసి మెలిసి ఉన్నాం ఒక శరీరంగా వున్నాం. లేకపోతే ఈ జన్మలో యింతటి అనురాగం సిద్ధించదు. ఆ జన్మతో నేను మనసారా ఏదో దోషం ఆచరించి వుంటాను. అందుకే నాకీ శిక్ష నిజం వేణూ! అవును నేను నీ దానిగా ఉండి ఉంటాను అవును నీదాన్నే.
    అయినా నీవిప్పుడిలా ప్రవర్తించడం నాకు యిష్టంలేదు. మనోవ్యధకి కూడా కారణం అవుతుంది.
    నేను కావాలి అని కోరుతున్నావు. నన్ను నీవు కావాలి అని కోరేవరకూ నేను నీదాన్ని కాకుండా వుండటం అది నా దురదృష్టమే వేణూ! ఈ జీవితానికి అంతకంటే శిక్షే లేదు.
    భగవంతుడు ఒకసారి గాదు అన్నదాన్ని వేరు మార్గాన్ని తీర్చుకోదలచటం మనలాంటి వాళ్ళకు తగదు.
    ప్రతిసారీ నీవు నన్ను కోరుతున్నప్పుడు నేనెంతగానో బాధపడుతున్నా నిన్ను బాధ పెట్టాల్సి వస్తుందనే మౌనంగా బొమ్మలా వుండేదాన్ని అంతే వేణూ! మరేం లేదు. నీ బాధని భరించలేకే అలా ఉండేదాన్ని.
    నా శరీరంలోని ఏ ఒక్క అణువైనా నీకు వ్యతిరేకంగా జవాబు చెప్పటానికి సాహసించదు వేణూ! అది నా అదృష్టమనుకోనా!

 Previous Page Next Page