Previous Page Next Page 
విరిజల్లు పేజి 25


    ఎదలో మెదిలిన మహదానందం యిద్దర్నీ మౌనుల్ని చేసింది.


                                                               17


    "రంగా!"
    "రా అక్కా!"
    పొంగుతున్న సంతోషంతో పిలిచాడు.
    అతని ముఖంలో తాండవిస్తున్న ఆనందానికి మురిసిపోయింది విరజా. ఆమెకి ఆశ్చర్యం వేసింది తననెలా గుర్తించాడా అని.
    మంచం మీద కూర్చుని ఆప్యాయంగా తల నిమురుతూ అడిగింది.
    "నన్నెలా గుర్తు పట్టేవు బాబూ!"
    నిట్టూర్చాడు అయిదారు సెకన్ లు గడిచాక భారంగా అన్నాడు "భగవంతుడు నాకు లోపంచేసింది ఒక్క కనులే అక్కా, నీ కంఠస్వరం గుర్తించే శక్తి వుంది యింకా. అంతేకాదు నీవు పిలువకముందే నీవు వస్తున్నావని నీ గాజుల రవళే వినిపించి ఇదుగో మీ విరజ అక్క వస్తోంది అని చెప్పింది. యింతకంటే యింకేం కావాలక్కా."
    భుజం నిండుగా చేతులువేసి దగ్గరకు లాక్కుని మెల్లిగా అతని క్రాపును వేళ్ళతో దువ్వుతూ అంది." ఒక్కోసారి మానవులు అనుకోకుండా బాధ కలిగిస్తూ ఉంటారు నన్ను మన్నించు."
    ఆమె నోటిని మృదువైన తన చేత్తో మూస్తూ అన్నాడు బాధగా. "ఏమిటక్కా అది? యింత చదువు చదివినావే చిన్నవాళ్ళని మన్నించమని అడగటం తప్పు కాదా? నాకు ఆయుక్షీణం కాదా అది, ఏమిటక్కా అలా చేశావు. నీవు అన్నమాటకు నాకు బాధ కలిగిందనుకున్నావా? నా శక్తి చెడితే అది బాధ అనుకున్నావా? కాదక్కా బాధతోకాదు. గర్వంతో అన్నాను. దానికంటే మన్నించమనే నీ మాటే బాధ కలిగించేదక్కా."
    అమృతమైన అనురాగం వెల్లి విరుస్తున్న గొంతుకతో "యింక అననులే రంగా! అయినా అనుకోకుండా పొరపాటు జరుగుతూ ఉంటాయ్. వాటిని వదిలించుకోవటం సాధ్యం కాకుండా ఉంది. నోరు ఎలా తిరిగితే అలా అనేస్తూ ఉంటాను ఒక్కోసారి. అక్కడే యిబ్బంది వస్తోంది. నీలాంటి వారికి వాజ్నాయమము అంత సులభ సాధ్యం కాదులే రంగా. అది ఎన్ని జన్మల సంస్కారంతోనే సిద్ధించాలి. కానీ యత్నంమాత్రం మానలేదు."
    ఏమీ జవాబు చెప్పకుండా నిశ్శబ్దంగా ఆమె భుజంమీద తలవాల్చుకుని ఆమె చెప్పేది వింటున్నాడు. అయిదారు నిమిషాలయ్యాక అన్నాడు గోముగా.
    "అలా గార్డెన్ లోకి తీసికెడతావా అక్కా!"
    ఏమీ అనకుండా మెల్లగా అతన్ని నడిపించుకుంటూ వెళ్ళింది. గడప దిగబోతూ కాలు పట్టుకుని పడబోయాడు. పడిపోకుండా పట్టుకుంది. ఏమీ అనకుండా గడప దిగి అయిదారు అడుగులు వేశాక అన్నాడు. అతని కంఠంలో ఓ విధమైన గర్వమూ తృప్తి కనిపిస్తున్నాయ్.
    "అక్కా! ఇదే మా సావిత్రి అక్కయ్య అయితే ఏమనేదో తెలుసా? ఛీ ఛీ.... చేతకాదని తెలిసికూడా ఎందుకింత ఆశ రంగా! శుభ్రంగా మంచంమీద పడుకోక ఒకవేళ ఎవరయినా కదిలించినా మెల్లిగా రావు.... ఏదో తొందర, ఏం బావుకుందామని అంత తొందర. మన శక్తి తెలుసుకుని మెలగాలి అనేది."
    ఆమె ఏమీ జవాబు చెప్పలేదు. గార్డెన్ లో ప్రవేశిస్తూ అన్నాడు. "నిజంగా మా బావ అన్నట్టు నీవు దేవతవే అక్కా."
    భగవానుడు అతని అందమయిన కళ్ళకి ఆ లోపమే చేయకుంటే ఆ సమయంలో ఆ మాటలు ఉచ్చరించిన ఆ వేళలో అతనికళ్ళు ఆనందంతో మిలమిలా మెరిసేవి.
    "మీ బావగారికి నన్ను గురించి గొప్పగా చెప్పుకోవటంకంటే మరో పని వుండదు. ఎప్పుడూ విరజా! అంటూ ఉండడం, నీవు దేవత అబ్బ ఎంత గొప్పదానివి యెంత డీసెన్సీ! యెంత డెలికసీ! నీ తత్వమే వేరు. అందరూ ఆడాళ్ళు ఒకటి.... నీవొక్కదానివి ఒకటి.... ఎంత సున్నిత మనస్థత్వం నీది. నీవు బంగారువి! యివే కదా ఆయనకి నచ్చేది."
    ఆమె అతనికి కోపం రాకున్నా కోపం వచ్చినట్టు నటించటం గ్రహించి నవ్వుకుంటూ అన్నాడు.
    "అక్కా! అక్కా! ఏది, ఏది మళ్ళీ మా బావ యెలా అంటారో మళ్ళీ వినిపిద్దూ. ఎంతబాగా ఇమిటేట్ చేశావక్కా! మా సావిత్రి యిలా ఒక్కరోజైనా మాట్లాడగలదా? నిజం అక్కా. అందుకే బావకి నీవంటే అంత యిష్టం. నిజం, స్నేహితులంటే అలాగే ఉండాలి...."
    కొన్ని క్షణాలు ఆగాడు బహుశా ఏదో గుర్తు చేసుకుంటూ వుండొచ్చు.... ఆర్ద్రమయిన కంఠంతో లిపిచాడు. బహుశా ఆ స్మృతి అలా చేసి ఉండొచ్చు.
    "అక్కా! నాకు ఓ ఫ్రెండ్ వుండేది. మేరీ! ఎంత అందంగా వుండేదని? అబ్బ! తలచుకుంటే కన్నీళ్ళు తిరుగుతున్నాయ్. పెద్ద పెద్ద కళ్ళతో, విశాలమైన నుదురుతో గొప్ప చెంపలతో బాబ్డ్ హెయిర్ తో నల్లగా వున్నా_అసలు నలుపు కాదక్కా అది! అదేదో చిత్రమైనరంగు. నీలిమేఘచ్చాయ అనే వాడిని నేను. నవ్వి కాదు నలుపు అనేది తను_ పోట్లాడేవాణ్ని_ అచ్చంగా చీకటి అలుముకోక ముందు సంధ్యారాగచ్చాయలు తొలిగిపోయే వేళ గగనాంగనా అంగరాగాన్ని పుణికి పుచ్చుకున్నట్టుండేది....యెప్పుడూ గలగలా నవ్వేది.... నీ నవ్వులాగా ధ్వనించేది ఆమె నవ్వు.... యెలా నవ్వేదని.... ఆ నవ్వు మరెక్కడా వినలేదక్కా! నవ్వేటప్పుడు ఆ కంఠ శృతిలో ధ్వనించే ఓ విధమైన గంభీరత, శ్రావ్యత ఇంకెక్కడా నేను వినలేదక్కా__"
    ఆగేడు.... ఆతురతతో ప్రశ్నించింది__మరి ఇప్పుడేమైంది రంగా ఆమెకి...."
    "అబ్బే! ఏమీ కాలేదక్కా! వాళ్ళంతా క్రిష్టియానిటీ తీసుకున్నారు కదా అందుకని వాళ్ళ నాన్నకి ఏదో ఫారిన్ లో మంచి పోస్టు వచ్చింది. అంతా వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు తన స్మృతికి నాకో రోల్డ్ గోల్డ్ శిలువ.... ఓ రోల్డ్ గోల్డ్ కవరులో కవరుతో బైబిల్ యిచ్చి వెళ్ళింది_"
    ఓ విధమైన గర్వంతో ప్రశ్నించాడో క్షణం ఆగి "ఆ కలరే ప్రజెంట్ చేసింది ఎందుకో తెలుసా అక్కా!"
    నవ్వుతూ అంది "చెప్పు రంగా! వింటే తెలుస్తుంది."
    తనూ హాయిగా నవ్వేస్తూ అన్నాడు. "మాట్లాడితే నీవే మాట్లాడాలంటాడు బావ. అది నిజమేనక్కా! ఎందుకో చెప్పనా? అలా మాట్లాడగలిగేశక్తి నీకొక్క దానికే వుంది. సరి! మేరీ అలా ఎందుకిచ్చిందో చెప్పనా? మెరిసేదంతా బంగారంకాదు. రంగుని చూసి భ్రమించకు, ఆ రంగు క్రింద దాక్కున్న గుణాన్ని మనస్సుని చూడు అని అట. ఆ మాటే బైబిల్ లో రాసిచ్చింది" గర్వంగా చెప్పాడు.
    అతను ప్రేమగా పెంచుతున్న మల్లెచెట్టు క్రింద కూర్చున్నారు వాళ్ళిద్దరూ.
    మెల్ల మెల్లగా గాలి లేస్తూంటే ఆ మల్లె రెమ్మలతో వారిని స్పృశిస్తోంది. చందన చర్చలా వున్న ఆ స్పర్శ వాళ్ళని పులకితం చేస్తుంది.
    "అక్కా! ఈ మల్లె అంటే ఎందుకో నాకు అమితమైన ప్రేమ. ఎంత యిష్టమో చెప్పలేను. భగవంతుడు నన్ను శపించటానికి పూర్వం నేను దీన్ని రోజుకి కనీసం రెండుసార్లయినా ముట్టుకుని, ముద్దు పెట్టుకుని వెళ్ళందే మనస్సు శాంతించేది కాదు. అయినా ఈ రోజుల్లో ఆ మల్లెని చూడలేకున్నాను.   
    "అబ్బ! భగవంతుడు నిజంగా నిర్ధయుడు రంగా! మనసున్న మనుషులకి మమతల శాశ్వతం కాకుండా మనువులు వేరు చేస్తాడు. కోరుకున్న వారికి కోరుకున్నది దక్కనివ్వడు బహుశా ఆయనని మరిచిపోతారేమోనని యిలా చేస్తాడేమో? ఏమిటో అర్ధంకాని విషయం రంగా ఆయన లీలలు!"
    "ఇక వెడదామా రంగా! సూర్యాస్తమయం కాబోతుంది.
    మెల్లగా సాయంకాలపు గాలులు వీస్తున్నాయి. మత్తుగా మందంగా మల్లె పొదిరింటి మీదుగా వీస్తోందా చల్లని గాలి. కవులకీ, కళాకారులకీ ఉత్తేజాన్ని కలిగించే వాతావరణం.
    సంతోషాంతరంగం ప్రతిబింబించేట్టుగా అన్నాడు. సూర్యాస్తమయం అవుతోందక్కా! ఎలా ఉందో చెప్పనా? ఎర్రగా వున్న ఆ సూర్యబింబం కోపగించుకున్నప్పుడు ప్రియురాలి నేత్రంగా ఉంది. ఆమె ఆనందంగా నవ్వినప్పటి ఆమె అధరంలా ఉంది. చుట్టూ కమ్ముకున్న మేఘాలు ఆ కాంతి సోకి సంధ్యాదేవి గులాబి రేకులతో ఆయనకి పూజ చేసినట్లున్నాయ్_కదక్కా?"
    అతని పాలభాగాన్ని చుంబించడంకంటే అతన్ని మరో విధంగా మెచ్చుకోలేకపోయింది. అప్పటి ఆమె తృప్తితో మెరిసే కళ్ళను చూసే భాగ్యం లేకపోయింది అతడికి!
    నుదురు తుడుచుకుంటూ అన్నాడు. "సరే పదక్కా వెడదాం."   
    మెల్లిగా అతన్ని లేవదీసి దారంటే నడిపించుకుంటూ వచ్చింది. దారంట అతను ప్రతి మొక్కని స్పృశిస్తూ పొందుతున్న పరవశత్వాన్ని గమనించి తృప్తిగా నిట్టూర్చింది. భగవాన్, నీ దృష్టికి చేతనైనంత సేవ చేస్తున్నాను. నాకు దక్కిన భాగ్యమిదే!

 Previous Page Next Page