Previous Page Next Page 
సినీ బేతాళం పేజి 25


    "అంటే నా సినిమాకి కూడా నువ్వే డైరక్టర్ గా ఉంటావా?"
    "మీరడిగారు గనుక వప్పుకుంటున్నాను. కానీ నేను కొంచెం ఖరీదయని డైరక్టర్నీ లెండి! అందుకే నా జోలికి ఎవరూ రావడం లేదు. మీ దగ్గర బీడీ ఉందా? లేపోతే పోనీండి ఫరవాలేదు. సాధారణంగా పిక్చర్ కి మూడు వేల నాలుగందలు తీసుకుంటాను. కానీ మీరు నా ఫేవరేట్ దేవుడు కాబట్టి కన్సెషనిస్తాను ఏమంటారు?"
    "కానీ....."
    "పోనీ రెండు వేల రెండొందలు నలభయి ఇవ్వండి చాలు!"
    "నేను...."
    "పోనీ పదమూడు వందల ముప్పయ్ నాలుగు రూపాయలివ్వండి. చాలా సెంటిమెంటున్న ఫిగర్ అది. కాదనకండి పిల్లలు కలవాడిని...."
    "నేననేది వినిపించుకోవయ్యా బాబూ! నాకీ డబ్బు గొడవలేమీ తెలీదు. ఎంత కావాలంటే అంత తీసుకో! ఎంత ఖర్చయితే అంత ఖర్చవనీ! కానీ సినిమా మాత్రం అందరికీ బాగా నచ్చాలి"
    "అలాగాండీ! మరి చెప్పారు కారెం? అలాగయితే నాకు కనీసం పధ్నాలుగు వేలయినా ఇవ్వాల్సి ఉంటుందండీ మీరు?"
    "తీసుకోవయ్యా ! నేను వద్దన్నానా?"
    "అంటే ఉట్టి పధ్నాలుగు వేలు కాదండీ! లక్షా పధ్నాలుగు వేలు! ఎందుకంటే నాకు అవతల బోలెడు పిక్చర్లకు ఆఫర్లున్నాయి. అవన్నీ వదిలేసుకోవాలి కదా మరి!"
    "సరేనన్నాను కదయ్యా!"
    "అయితే మొత్తం నాకు రెండు లక్షలివ్వడానికి ఒప్పుకున్నట్లేనన్నమాట!"
    'అవునయ్యా!"
    "అయితే ఇక రంగంలోకి దిగిపోదాం. ముందు నాకో యాభై వేలు ఎడ్వాన్స్ కొట్టండి!"
    వినాయకుడు ఆలోచించాడు.
    తన మూడు మహిమల్లో ఒకటి డబ్బు కోసం య్పయోగించాల్సిందే! తనంటే ఎంత భక్తీ ఉన్నా డబ్బు లేందే ఎవడూ మాట వినేటట్లు లేడు.
    "సరే - మొత్తం మన సినిమా పూర్తవడానికి ఎంత డబ్బు కావాలో చెప్పు" అన్నాడు వినాయకుడు.
    డైరక్టర్ గాలిలో లెక్కలు వేశాడు కాసేపు.
    "తొంభయ్ లక్షలు" అన్నాడు చాలా తేలికగా.
    "ఇంతేనా!" అన్నాడు వినాయకుడు.
    "అబ్బే తొంభయ్ అంటే మరీ తొంభయ్ కాదు- ఇంకొంచెం ఎక్కువే ఉండడం మంచిది. అంటే - పోనీ రెండు కోట్లు . ఊహు ..... మూడు ..... నాలుగు కోట్లు తీసుకోండి. చాలు - గారంటీగా సరిపోతుంది."
    వినాయకుడు కళ్ళు మూసుకుని "నాలుగు కోట్లు" అన్నాడు. వెంటనే అతని చేతిలో ఓ ప్లాస్టిక్ సంచీ, దాంట్లో నాలుగు టెరీకాటన్ కోట్లు ఉన్నాయ్.
    "అయ్యో కోట్లంటే ఈ కోట్లు కాదు వినాయకా! కరెన్సీ! కాష్ కావాలి!" అన్నాడు డైరక్టర్ నెత్తీ నోరు కొట్టుకుంటూ.
    వినాయకుడు చేసిది లేక తన రెండో మహిమ ఉపయోగించి మరో ప్లాస్టిక్ సంచీ నిండా నోట్లకట్టలు తెప్పించాడు.
    వెంటనే ఓ కట్ట తీసుకుని జేబులో వేసుకున్నాడు డైరక్టర్,
    "ఇప్పుడు మనమేం చేయాలి?" అడిగాడు వినాయకుడు.
    "ముందు మాటల రచయిత, పాటల రచయితల దగ్గర కెళ్ళాలి" అన్నాడతను.
    "వాళ్ళెవరో ఎందుకూ? అవన్నీ నేను రాయగలను కదా?" అన్నాడు వినాయకుడు.
    "ఛీ ఛీ! మీరా! మీలాంటి దేవుళ్ళు అసహ్యంగా బూతు అర్ధాలు వచ్చే మాటలు, పాటలు రాస్తారా! నో నో నో ! అలాంటి అసహ్యకరమయిన సాహిత్యం సినిమా రైటర్స్ రాయగలరు. లేదా రౌడీ వెధవలు , చదువు సంధ్యా లేని జులాయి గాళ్ళు , రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాత్రమే ఉత్పత్తి చేయగలరు. అంతేగాని మీరూ నేను పనికి రాము" అంటూ టాక్సీ పిలిచాడతను.
    మరుక్షణంలో ఇద్దరూ పాటల - మాటల రచయితలను కల్సుకున్నారు.
    "మాంచి భక్తీ రసమయిన చిత్రం. ఫస్ట్ క్లాస్ డైలాగ్స్, సాంగ్స్ ఉండాలి" అన్నాడు డైరక్టర్ వాళ్ళతో.
    "నాకు రెండు లక్షలిప్పించండి " అన్నాడు డైలాగ్ రైటర్.
    "నాకూ లక్షన్నర" అన్నాడు పాటల రచయిత.
    "అదేమిటి? అంత రేటా?" ఆశ్చర్యంగా అడిగాడు డైరక్టర్.
    "చూడండి ! సోషలంటే అయిదు వేలకయినా సరే రాస్తాం! కానీ భక్తీ రసం అంటే అందులోకి 'బూతు' చొప్పించడం కొంచెం శ్రమతో కూడిన పని."
    "సరే - అలాగే కానీండి!' అంటూ ఇద్దరికీ అడ్వాన్స్ ఇచ్చేసి మళ్ళీ టాక్సీ ఎక్కారు వాళ్ళు.
    "మళ్ళీ ఎక్కడికి?" అడిగాడు వినాయకుడు.
    "ప్రముఖ హీరో భీమారావ్ గారింటికి!"
    'ఆయనెందుకు?"
    "ఎందుకేమిటండీ! మరి మన పిక్చర్లో హీరోగా ఎవరిస్తారు?"
    "ఎవరేమిటి ? నేను వేయకూడదా? ముఖ్యంగా కధంతా వినాయకుడి చుట్టుతా తిరుగుతుంది కదా?"
    "తెలుసు స్వామీ! అయినా వినాయకుడి పాత్ర భీమారావ్ గారే వేయాలి. పౌరాణిక పాత్రల్లో ఆయనకాయనే సాటి! మీరు పనికిరారు! మీకు పాపురాలిటీ లేదు. ఇమేజ్ లేదు. ఓ పేనింగ్స్ రావు. మీకు స్టేజ్ అనుభవం లేదు. ఎక్స్ ప్రేషన్స్ లేవు. ఇంకా నాకు తెలీని బోలెడు లేవు మీకు . అంచేత మీరు వేషం వేయకండి. ఇలా ప్రొడ్యూసర్లే ముచ్చటపడి హీరోగా నటించిన సినిమాలు రెండు వందల పదహారు అలా పూర్తయి పద్దెనిమిదేళ్ళ నుంచీ రిలీజవకుండా నిలబడి పోయినాయ్."

 Previous Page Next Page